Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇదే ఇప్పుడు మాడ్ర‌న్ లైఫ్

ఇదే ఇప్పుడు మాడ్ర‌న్ లైఫ్

ఓటు విలువైంది. ఫ్యామిలీలో ఐదు ఓట్లు వుంటే రూ.20 వేలు గ్యారెంటీ. ఓటును అమ్ముకోవ‌ద్దూ అంటారు. విన‌డానికి బాగుంటుంది. అయితే అమ్ముకోకుండా వేస్తే స‌జ్జ‌నులు , ఉత్త‌ములు ఏమైనా గెలుస్తారా? పులినో, సింహాన్నో ఎన్నుకోవాలి. రెండూ భ‌క్షిస్తాయి. కాక‌పోతే సింహం వేగంగా తినొచ్చు. పులి నెమ్మ‌దిగా తినొచ్చు. ఎవ‌డొచ్చినా మ‌న‌ల్ని తింటాడు. మ‌న‌మూ రెండు రోజులు క‌డుపు నిండా తిందాం, తాగుదాం. ఇది ఓట‌రు ఆలోచ‌న‌.

నువ్వు రూ.2 వేల‌కి ఓటు అమ్మితే, అత‌ను ఐదేళ్ల‌లో రూ.2 వేల కోట్లు సంపాదిస్తాడు. నిజ‌మే ఫ్రీగా ఓటు వేస్తే మాత్రం సంపాయించ‌డం మానుతాడా? మాన‌డు. అందుకే మ‌న వాటా మ‌న‌ది, వాళ్ల వాటా వాళ్ల‌ది.

రాజ‌కీయమూ, వ్యాపారమూ విస్కీ సోడాలా క‌లిసిపోయి చాలా కాల‌మైంది. ఎవ‌రికీ ఎలాంటి భ్ర‌మ‌లూ, భ్రాంతులూ లేవు. కాయిన్స్ విసిరి, నోట్లు ఏరుకుంటార‌ని జ‌నానికి తెలుసు. నాయ‌కులు విలువ‌ల గురించి మాట్లాడితే ముసిముసి న‌వ్వులు న‌వ్వుకుంటారు.

పులి అహింస గురించి మాట్లాడిన‌ట్టు, తోడేలు ధ‌ర్మం గురించి ఉప‌దేశించిన‌ట్ , పాము త‌న‌లో అమృతం వుంద‌ని చెప్పిన‌ట్టు వుంటాయి మ‌న నాయ‌కుల మాట‌లు. గ‌తంలో వ్యాపారులు రాజ‌కీయ నాయ‌కుల‌కి డ‌బ్బులిచ్చే వాళ్లు. ఇప్పుడు ఇన్‌డైరెక్ట్ స్పీచ్ లేదు. అంతా డైరెక్టే. వ్యాపారులే నాయ‌కులు, నాయ‌కులే వ్యాపారులు.

ఒక‌సారి జ‌నాన్ని కొంటే, ఐదేళ్లు అమ్ముకోవ‌చ్చు. అంద‌రూ దొంగ‌లైతే మ‌రి జనానికి ఆప్ష‌న్‌? సింపుల్‌. మంచి దొంగ‌ని వెతుక్కోవ‌డ‌మే. చావు త‌ప్ప‌నిస‌రి అయిన‌ప్పుడు నొప్పి త‌క్కువుండే చావుని ఎంచుకోవాలి.

వెనుక‌టికి ఒక న‌క్క‌కి రాజ‌కీయాల్లో చేరాల‌నే కోరిక పుట్టింది. ఒక నాయ‌కుడి ద‌గ్గ‌రికెళ్లి పార్టీలో చేరుతాన‌ని చెప్పింది. నీకు చ‌దువుందా? అని అడిగాడు. లేదు. బుద్ధుందా? లేదు. మ‌రి ఏముంది?

నోట్లో కోర‌లు, బుర్ర‌లో కుట్ర‌లు...వెంట‌నే చేరిపొమ్మ‌న్నాడు. చేరిన త‌ర్వాత అర్థ‌మైంది. మొత్తం త‌మ జాతితోనే రాజ‌కీయాలు నిండిపోయాయ‌ని, మ‌నుషుల్లా మేక‌ప్ వేసుకుని కూచున్నాయ‌ని. నిజానికి సినిమాల్లో కంటే రాజ‌కీయాల్లోనే మేక‌ప్ సామ‌గ్రికి డిమాండ్ ఎక్కువ‌.

అప్పుడ‌ప్పుడు  పొట్టేళ్ల‌కి జ్ఞానోద‌య‌మై త‌మ‌కి కొమ్ములున్నాయ‌ని, పొడుస్తామ‌ని బెదిరిస్తాయి. నాయ‌కులు బుజ్జ‌గించి మెడ నిమిరి, గొర్రె చ‌ర్మంతో చేసిన శాలువా క‌ప్పుతారు. త‌మ జాతిని గౌర‌విస్తున్నార‌ని పొట్టేలు సంబ‌ర‌ప‌డుతుంది. త‌ర్వాత దాని మెడ‌లో ప‌ట్టీ వేసి గంట క‌డ‌తారు. ఆ పిచ్చిది అదేదో ప‌ద‌వి అనుకుంటుంది. హాయిగా మేయనిస్తారు. బ‌లుస్తుంది. ఒక‌రోజు అమ్మోరికి బ‌లిచ్చి బిర్యాని వండుకుంటారు. పొట్టేలు జీవిత ల‌క్ష్యం - భ‌క్ష్యంగా మార‌డ‌మే.

మ‌ట‌న్ షాపులో పొట్టేలు త‌ల‌కాయ‌లుంటాయి. వాటి క‌ళ్లు గ‌మ‌నించండి. న‌మ్మిన వాడు న‌రుకుతున్న‌ప్పుడు క‌నిపించే ఎక్స్‌ప్రెష‌న్ అది. ప్ర‌తి త‌ల‌కూ ఒక వెల వుంటుంది.

చిన్న‌ప్పుడు అమ్మ‌కం, కొనుగోళ్లు లెక్క‌లు స‌రిగా అర్థ‌మ‌య్యేవి కాదు. పెద్ద‌య్యాక ఈ ప్ర‌పంచం దాని మీద ఆధార‌ప‌డి వుంద‌ని అర్థ‌మైంది. ఇప్పుడు క్వ‌శ్చ‌న్ పేప‌ర్లో లెక్క‌లు అడిగే వాళ్లు లేరు. ఎవ‌డి లెక్క‌లు వాడికున్న‌ప్పుడు పుస్త‌కాల్లో లెక్క‌లు అస‌లు ప‌నికిరావు. ఎవ‌రి ద‌గ్గ‌రున్న‌ది వాడు అమ్ముకుంటాడు. ఎవ‌డికి కావాల్సింది వాడు కొనుక్కుంటాడు. ఒక్కోసారి త‌మ ద‌గ్గ‌ర లేనివి కూడా అమ్ముతారు. రాజ‌కీయాల‌కి మొద‌టి అర్హ‌త ఇది.

దీపావ‌ళికి ట‌పాసుల అంగ‌ళ్లు పెట్టిన‌ట్టు, ఎన్నిక‌ల టైమ్‌కి క‌ల‌ల ఫ్యాక్ట‌రీలు వెలుస్తాయి. రంగురంగుల క‌ల‌లు ఉచితంగా ఇస్తారు.  క‌ళ‌లు స‌రిగా అమ్ముడుపోవు గానీ, క‌ల‌ల‌కి ఆల్‌టైమ్ డిమాండ్. క‌ల‌ల్ని జేబులో పెట్టుకుని పొదుగుతాయ‌ని ఎదురు చూడ్డ‌మే. ఐదేళ్ల‌కి గానీ తెలియ‌దు. అది మురిగిపోయిన గుడ్డు అని. క‌ల‌ల లేటెస్ట్ వెర్ష‌న్ చూసుకుంటూ మ‌ళ్లీ జీవించ‌డం.

ర‌చ‌యిత‌లు, క‌ళాకారులు మీరెటు వైపు? గతంలో మ్యాక్జిం గోర్కి అడిగాడు. అది ఎర్రి కాలం కాబ‌ట్టి అడిగాడు. ఇపుడు ఎవ‌రికీ ఆ అనుమానం రాదు. ర‌చ‌యిత‌లు, క‌ళాకారుల ఒరిజిన‌ల్ బ్రీడ్ అంత‌రించి చాలా కాల‌మైంది. ఇప్పుడంతా బ్రాయిల‌ర్‌. తిన్నంత కాలం దాణా తిన‌డం, ఒక‌రోజు బిర్యాని ప్లేట్‌లో లెగ్ పీస్‌గా మార‌డం.

ఆలోచించ‌కుండా జీవించ‌డ‌మే మాడ్ర‌న్ లైఫ్ స్టైల్‌. దాన్నే ఆర్టీఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అంటారు. అదే భ‌విష్య‌త్‌. ఆధునిక ఉప‌నిష‌త్‌.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?