Advertisement

Advertisement


Home > Politics - Opinion

వైకాపాని కెలకడమెందుకు కేసీయార్?

వైకాపాని కెలకడమెందుకు కేసీయార్?

అమాయకత్వం వల్ల కానీ, అతి ఆత్మవిశ్వాసం వల్ల కానీ ఎంత పెద్ద నాయకులైనా ఒక్కోసారి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఉంటారు. 

తెలంగాణా ఎన్నికలు మరో నాలుగువారాల్లో ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట ఓటర్ల మనసుల మీద ప్రభావం చూపించే అవకాశమెక్కువ. ఇంతకీ తెలంగాణాలో ఆంధ్ర సెటిలర్స్ ఒక్క హైదరాబాదులోనే కాదు, అటు నల్గొండ, ఖమ్మం, నిజామాబాదుల్లో కూడా గణనీయంగా ఉన్నారు.

వాళ్లల్లో ఒక్క సామాజిక వర్గం తప్పించి మిగిలిన వాళ్లల్లో అధికశాతం బీఆరెస్ పట్ల సానుకూల వైఖరితో ఉంటారనడంలో ఏమీ సందేహం లేదు... ఎందుకంటే బీఆరెస్ పార్టీ అధినేతలు, ఆధ్రాలోని వైకాపా అధినేతతో స్నేహపూర్వకంగా మెలుగుతుంటారని! 

దానివల్ల వైకాపా సోషల్ మెడియా సైన్యం కూడా తెలంగాణాలో బీఆరెస్ గెలెవడానికే మొగ్గు చూపుతుంటారు.

ఇలాంటి నేపథ్యంలో వైకాపా ప్రభుత్వాన్ని వెక్కిరిస్తే ఏమౌతుంది? 

తాజాగా కేసీయార్ అన్న మాటమేమిటంటే..."ఆంధ్రాలో అయితే సింగిల్ రోడ్డు, తెలంగాణాలో అయితే డబుల్ రోడ్లు..ఎక్కడ అభివృద్ధి ఉందో చూడండి" అని!

అనవసరంగా కెలికి వైకాపా సోషల్ మీడియా వాళ్లతో తద్దినం పెట్టిచ్చుకోవడానికి తప్ప ఈ స్టేట్మెంట్ దేనికి పనికొస్తుంది? 

దీనివల్ల ఒక్క ఓటైనా కొత్తగా పడుతుందా? 

బీఆరెస్ పట్ల సానుకూలత చూపిస్తున్న వాళ్లు కూడా "కేసీయార్ కి ఎక్కువయ్యింది" అనుకుని ఏ బీజేపీకో ఓటేసే అవకాశం లేకపోలేదు కదా!

కొన్ని నెలల క్రితం కేటీయార్ కూడా ఇలానే ఎవరో తన మిత్రుదు చెప్పాడంటూ ఆంధ్రా రోడ్లను ఎద్దేవా చేసాడు. తర్వాత మళ్లీ సంజాయిషీ కూడా చెప్పుకున్నాడు. 

అసలు బీఆరెస్ కి ప్రత్యర్థి కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కి, ఆంధ్రాలో వైకాపా కి ఎటువంటి స్నేహం కానీ పొత్తు కానీ లేవు. అలాంటప్పుడు వైకాపా ప్రభుత్వాన్ని వెక్కిరిస్తే ఏమొస్తుంది? 

స్వాగతించదగిన పరిణామం కాకపోయినా ఆంధ్రాలో ఓటర్స్ కమ్మవారు, కమ్మేతరులు అన్నట్టుగా విడిపోయి కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి 2019 ఎన్నికల నాటికే ఉన్నా ఇప్పుడు అదింకా పెరిగింది. అదే డివిజన్ తెలంగాణాలోని ఆంధ్రా సెటిలర్స్ మధ్యన కూడా ఉంది. 

ఈ వర్గంలోనూ, ఆ వర్గంలోనూ కొంత మంది ఎక్సెప్షన్ అనుకున్నా అధిక శాతం మంది మాత్రం ఆ డివిజన్లో ఉన్నారు.

ఏదో అనవసర కామెంట్ చేసి అల్ప సంఖ్యలో ఉన్న ఆంధ్రా సెటిలర్స్ ని ఆనందపెట్టి అధిక సంఖ్యలో ఉన్న వారిని దూరం చేసుకోవడం అమాయకత్వమే అనిపిస్తుంది. 

ఇదంతా ఒకెత్తైతే ఈ మధ్యన కేసీయార్ మరొక లాజిక్ లేని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 

అదేంటంటే, రాబోయే ఎన్నికల్లో బీఆరెస్ ని ఎన్నుకోకపోతే తనకేమీ సమస్య ఉండదట...నష్టపోయేది ప్రజలే అన్నాడు. 

ఇలాంటి డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదూ! అవును ...2019 ఎన్నికలప్పుడు చంద్రబాబు కూడా సరిగా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు. తాను ఓడితే హాయిగా ఇంటికెళ్లి రెష్ట్ తీసుకుని మనవడితో ఆడుకుంటానని..కష్టాలపాలయ్యేది మాత్రం ప్రజలే అని చెప్పాడు. 

కానీ ఏం జరిగింది? చంద్రబాబు రెష్ట్ తీసుకోగలిగాడా? మనవడితో ఆడుకోగలిగాడా? ఎన్ని అవమానాలు? ఎన్ని ఏడ్పులు? ఎన్ని కేసులు? ఎలాంటి జైలు జీవితం?...ఇవన్నీ చూడలేదు. 

పదవి పోతే ఐదేళ్లు యాభై ఏళ్లంత బరువుగా అనిపిస్తాయి. అది చంద్రబాబుకైనా, కేసీయారుకైనా ఎవరికైనా సరే! 

ప్రజలని ఎప్పుడూ ఏ పార్టీ ఇబ్బంది పెట్టదు. ఇచ్చే స్కీములేవో ఇస్తూ ఉంటారు..పని జరుగుతూ ఉంటుంది. ఎటొచ్చీ నష్టపోయేది, కష్టాలపాలయ్యేది ఓడిన పార్టీ అధినేతలు, వాళ్ల కుటుంబ సభ్యులే.

కేసీయార్ పరంగా జరుగుతున్న ఇంకో భయంకరమైన తప్పిదమేంటంటే...బీఆరెస్, బీజేపీ పార్టీలు లోపాయికారి పొత్తులో ఉన్నాయని. 

ఎందుకంటే కెజ్రీవాల్ ని సైతం ఈడీ కేసులో లోపలేయడానికి సిద్ధపడుతోంది కేంద్ర భాజపా ప్రభుత్వం. 

నిజమెంతో తెలీదు కానీ చంద్రబాబు అరెష్టు వెనుక కూడా కేంద్రం హస్తం ఉందన్న ప్రచారం ఉంది. 

అలాంటప్పుడు లిక్కర్ స్కాములో ఇరుక్కున్న కవితకి ఇబ్బంది ఎందుకు తలత్తట్లేదు? 

అలాగే తెలంగాణా భాజపా సారధిగా దూకుడుగా ఉన్న బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టింది కేంద్ర భాజపా. ఒకరకంగా ఇది బీఆరెస్ ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని తీసుకున్న నిర్ణయంలా ఉంది తప్ప ఇక దేనికీ పనికొచ్చేలా అనిపించదు. బీజేపీకి తెలంగాణాలో ఎలాగో గెలిచే సీను లేదని తెలుసు కాబట్టి తమకి అనుకూలంగా ఉనన్ బీఆరెస్ కి వెసులుబాటు కల్పించే నిర్ణయంలా ఉందిది. 

అందుకే బీఆరెస్ పార్టీ భాజపాకి సామంత పార్టీ ఏమో అనే అనుమానాలు కలుగుతున్నాయి ఓటర్స్ కి. 

ఈ అభిప్రాయం తెలంగాణా ముస్లిం ఓటర్స్ కి కలిగితే అంతకంటే ప్రమాదం మరొకటి ఉండదు బీఆరెస్ కి. హైద్రాబాద్ ఓల్డ్ సిటీ ముస్లింస్ ఎం.ఐ.ఎం కి విశ్వాసపాత్రులుగా ఉన్నా, తక్కిన జిల్లాల్లో ఉన్న ముస్లింస్ బీఆరెస్, కాంగ్రెస్ పట్లే సానుకూలంగా ఉంటారు. ఒకవేళ బీఆరెస్, భాజపా ఒకే జట్టు అని వాళ్లు అనుకున్నారో, బీఆరెస్ కత గల్లంతయినట్టే. ఆ ఓట్లన్నీ కాంగ్రెసుకే పడతాయి.  

ఇన్ని తప్పులు జరుగుతుంటే...వీటికి దిద్దుబాటు చర్యలు చేసుకోకపోగా స్వవర్గంలా ఉండే వైకాపా సానుభూతిపరుల మనోభావాలని కెలకడం కేసీయార్ కి అనవసరం!

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?