Advertisement

Advertisement


Home > Politics - Political News

మెట్టు దిగిన ఉద్యోగులు...ఏమౌతుందో!

మెట్టు దిగిన ఉద్యోగులు...ఏమౌతుందో!

అస‌లు చ‌ర్చ‌ల ప్ర‌సక్తే లేద‌ని భీష్మించిన ఉద్యోగులు కాస్త ప‌ట్టువిడుపుల ధోర‌ణిలో ఆలోచించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో ఉద్యోగులు ఒక మెట్టు దిగార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నూత‌న పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ ఉద్యోగులు ఉద్య‌మ‌బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ నెల 7నుంచి పూర్తిగా స‌మ్మెకు దిగాల‌ని ప్ర‌భుత్వానికి నోటీసు కూడా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఉద్యోగులు కూడా ప్ర‌భుత్వంలో భాగ‌మే అని, వారితో ఘ‌ర్ష‌ణ‌కు దిగాల‌ని భావించ‌డం లేద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ పెద్ద‌లు చెబుతూ వ‌స్తున్నారు. చ‌ర్చ‌ల‌కు వ‌స్తే నూత‌న పీఆర్సీపై అనుమానాల‌ను నివృత్తి చేస్తామ‌ని మంత్రులు, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో కూడిన ప్ర‌భుత్వ క‌మిటీ చెబుతోంది. అయితే పాత జీతాలు వేయ‌డం, కొత్త పీఆర్సీ జీవోల‌ను ర‌ద్దు చేస్తేనే చ‌ర్చ‌ల విష‌యం ఆలోచిస్తామ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు త‌మ అభిప్రాయాల్ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఉద్యోగులు, ప్ర‌భుత్వం మ‌ధ్య ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల నుంచి సానుకూల స్పంద‌న రావ‌డం శుభ‌ప‌రిణామం. మంత్రుల క‌మిటీ నుంచి రాత‌పూర్వ‌కంగా ఆహ్వానం వ‌స్తే చ‌ర్చ‌ల‌కు వెళ‌తామ‌ని పీఆర్సీ సాధ‌న స‌మితి నాయ‌కులు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేత‌ల నుంచి సానుకూల ప్ర‌క‌ట‌న రాగానే, ప్ర‌భుత్వం వెంట‌నే అదే స్పీడ్‌తో అనుకూల ప్ర‌క‌ట‌న చేసింది.  

మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని మంత్రుల కమిటీ తరఫున జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆహ్వానించారు. పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కె. వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేవీ శివారెడ్డి, సీహెచ్‌ కృష్ణమూర్తి తదితర 20 మంది పేర్లను లేఖలో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాకు ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్‌ హాలులో ఇవాళ కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

ఈ చ‌ర్చ‌ల‌ను ఇరువైపుల వాళ్లు సానుకూల వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించి రాష్ట్రంలో అసౌక‌ర్యాన్ని త‌ప్పించే నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇరువైపులా ప‌ట్టువిడుపుల ధోర‌ణితో చ‌ర్చిస్తే ఖ‌చ్చితంగా మంచి ఫ‌లితాలే వ‌స్తాయ‌నే ఆశ లేక‌పోలేదు. కావున ఆ దిశ‌గా చ‌ర్చ‌లు సాగేందుకు ప్ర‌భుత్వ‌మే చొర‌వ చూపాల్సి వుంటుంది. అలాగే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు అందుకు త‌గ్గ‌ట్టు డిమాండ్ల విష‌యంలో పున‌రాలోచ‌న చేస్తే మంచిది. ఏది ఏమైనా చ‌ర్చ‌ల విష‌యంలో ముంద‌డుగు ప‌డ‌డం ప్ర‌భుత్వానికి ఊర‌ట క‌లిగించే అంశ‌మ‌ని చెప్పొచ్చు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?