Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్ర‌శాంత్ కిషోర్ ఆధ్వ‌ర్యంలో.. కాంగ్రెస్ 2.0!

ప్ర‌శాంత్ కిషోర్ ఆధ్వ‌ర్యంలో.. కాంగ్రెస్ 2.0!

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డం లాంఛ‌న‌మే అని తెలుస్తోంది. గ‌త కొన్నాళ్లుగా జాతీయ స్థాయి రాజ‌కీయాల గురించి ర‌క‌ర‌కాల ప్ర‌ణాళిక‌లు, వ్యూహాల‌ను అమ‌లు చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న పీకే అంతిమంగా కాంగ్రెస్ లో చేర‌డం ఖాయ‌మ‌నే అని ఢిల్లీ స‌మాచారం. 

పీకే కాంగ్రెస్ లో చేర‌బోతున్నాడ‌నే ప్ర‌చారం ఇది వ‌ర‌కే జ‌రిగింది. అయితే కాంగ్రెస్ తో ప్ర‌యోజ‌నం లేద‌నుకుని పీకే మూడో కూట‌మికి బండి క‌ట్టే ప్ర‌య‌త్నం కొన్నాళ్ల పాటు చేశారు. అయితే అదంత తేలిక కాద‌ని ప్ర‌శాంత్ కిషోర్ కు తేలిక‌గానే అర్థం అయిన‌ట్టుగా ఉంది.

కాంగ్రెస్ ర‌హితం అంటే.. అది మూడో కూటమి అయినా నాలుగో కూట‌మి అయినా సాధ్యం కాద‌ని పీకే వంటి వ్యూహ‌క‌ర్త‌కు అర్థం కావ‌డానికి పెద్ద స‌మ‌యం అక్క‌ర్లేదు. సామాన్యుడికే అది సులువుగా అర్థం అవుతుంది మ‌రి! ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో డైరెక్టుగా కాంగ్రెస్ లో చేరి.. ఆ పార్టీని పున‌రుత్తేజం, పున‌ర్నిర్మాణం చేసేందుకు పీకే న‌డుం క‌డుతున్నాడ‌నేది స‌మాచారం.

సోనియాగాంధీతో వ‌ర‌స స‌మావేశాల్లో పీకే త‌న ప్ర‌ణాళిక‌ల పూర్తి వివ‌రాల‌ను అందించార‌ట‌. కాంగ్రెస్ జాతీయాధ్య‌క్ష హోదాలో సోనియా లేదా రాహుల్ ఉన్నా..  జాతీయ స్థాయిలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ను మాత్రం నాన్ గాంధీనే నియ‌మించాల‌నేది పీకే చేసిన ప్ర‌ధాన సూచ‌న‌గా తెలుస్తోంది. 

సోనియా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్య‌క్షురాలిగా కొన‌సాగుతూ, రాహుల్ కావాలంటే పార్ల‌మెంట‌రీ నాయ‌కుడిగా ఉంటూ.. జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో గాంధీ కుటుంబేత‌ర నేత‌ను నియ‌మించాల‌ని పీకే స్ప‌ష్టం చేశార‌ట‌.

అలాగే కాంగ్రెస్ పార్టీ పున‌రుత్తేజానికి ప‌లు సూచ‌న‌లు చేసిన పీకే ఒక కుటుంబానికి ఒక టికెట్ వంటి సూచ‌న‌లు కూడా చేసిన‌ట్టుగా స‌మాచారం. మిత్ర‌ప‌క్ష పార్టీల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం, పార్టీ ఆర్గ‌నైజేష‌న్ ను రీ క‌న్ స్ట్ర‌క్ట్ చేసుకోవ‌డం, ప్ర‌తి ప‌ద‌వీకీ ఒక ప‌ద‌వీ కాలం, దాంతో పాటు ఒక వ్య‌క్తి ఎన్ని సార్లు ఆ ప‌ద‌విని అధిష్టించ‌వ‌చ్చు అనే రూల్స్ ను సెట్ చేసుకోవ‌డం, దేశ వ్యాప్తంగా ప‌దిహేను వేల మంది గ్రాస్ రూట్ లీడ‌ర్స్ ను గుర్తించ‌డం, కోటి మంది కార్య‌క‌ర్త‌ల బ‌లంతో ముందుకు సాగాల‌నే.. ప్ర‌ణాళిక‌ల‌ను సోనియా ముందుంచార‌ట ప్ర‌శాంత్ కిషోర్. 

త‌న చాతుర్యంతో బీజేపీకి గ‌తంలో సాయ‌ప‌డ్డ ప్ర‌శాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో చేరి, ఆ పార్టీ నేత హోదాలో దాన్ని అధికారంలోకి తీసుకురావ‌డానికి ఈ ర‌కంగా కంక‌ణం క‌ట్టుకుంటున్నాడ‌నేది ఢిల్లీ టాక్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?