మోడీ సర్కార్ అంటే బీజేపీ కంటే ఎక్కువ వినయవిధేయతలను వైసీపీ ప్రదర్శిస్తుందని తెలిసిందే. అలాంటి పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం అంటే సహజంగానే ఆశ్చర్యం కలుగుతోంది. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వంపై కాస్తంత కఠినంగా మాట్లాడ్డం …ఇది కలా? నిజమా? అనే అనుమానం కలిగిస్తోంది.
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ అన్ని పక్షాలను కోరింది. ఈ సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో తేల్చి చెప్పినట్టు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సింది పోయి వాటిని అందినకాడికి అమ్మేయడం ఏంటని విజయసాయిరెడ్డి ప్రశ్నించడం గమనార్హం. అలాగే పోలవరం నిర్వాసితుల పరిహారానికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయలేదని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి అని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఒక వైపు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెబుతూనే, మరోవైపు పుదుచ్చేరికి ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయమై కేంద్రాన్ని నిలదీసినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరామన్నారు.
సీఆర్‌డీఏ, ఫైబర్‌నెట్, అంతర్వేది రథం దగ్ధం ఘటనలపై సీబీఐ దర్యాప్తు కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టంపై కేంద్రం వైఖరి దుర్మార్గమని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. శరద్ యాదవ్‌కు నోటీసు ఇచ్చి వారంలోనే అనర్హత వేటు వేశారని గుర్తు చేశారు. కానీ రఘురామకృష్ణంరాజుపై తాము అనర్హత పిటిషన్ ఇచ్చి 11 నెలలైనా కాలయాపన చేయడం ఏంటని ఆయన నిలదీయడం విశేషం.
ఇలా అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ విజయసాయిరెడ్డి మాట్లాడ్డం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఏపీ ప్రజావ్యతిరేక విధానాలను వైసీపీ ఈ స్థాయిలో ఎప్పుడూ నిలదీసిన సందర్భాలు లేవని చెబుతున్నారు.