అసలే తెలంగాణలో రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. టీఆర్ఎస్‌కు ప్రత్యర్థి తామంటే తామని కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రకటించుకున్నాయి. ఇంత కాలం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ముందు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మెతక వైఖరి తేలిపోతూ వచ్చింది. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత… టీఆర్ఎస్, బీజేపీలతో కాంగ్రెస్ పార్టీ ఢీ అంటే ఢీ అని చెలరేగిపోతోంది.
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఎన్నిక ప్రకటన రాకముందే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కత్తులు దూసుకుంటున్నారు. విమర్శలకు పదును పెట్టాయి. ఇప్పటికే హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం కూడా మొదలైంది. పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి.
బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ ఖరారైందని అందరూ అనుకుంటున్న తరుణంలో, ఆయన భార్య జమున బాంబు పేల్చారు. హుజారాబాద్‌లో పోటీపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ పోటీలో తాను ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈటల రాజేందరైనా, తాను పోటీ చేసినా ఒక్కటేనని ఆమె చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ ఎన్నికలో పోటీకి ఈటల రాజేందర్ దూరంగా ఉంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జమున వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో రాజేందర్ వెంటే తాను ఉన్నానని ఆమె గుర్తు చేశారు. ఎవరు పోటీ చేయాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జమున చెప్పడం గమనార్హం. బీజేపీ తమిద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తే వారు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆమె తెలిపారు. దీంతో ఈటల పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారంలో వాస్తవం ఉందని తెలుస్తోంది.
ఎందుకంటే ఎవరు పోటీ చేయాలో నిర్ణయించుకోలేదని జమున చెప్పడం… ఆ ప్రచారానికి మరింత బలం కలిగిస్తోంది. అసలు తాను పోటీకి దూరంగా ఉండాలని ఈటల ఎందుకు ఆలోచిస్తున్నారో అనే విషయమై తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.