లేని రోగానికి, మందు కనిపెట్టిన యోగి!

అవును. మనం పెరిగిపోతున్నాం. మన పిల్లల సంఖ్య పెరిగిపోతోంది. మన వోటర్ల సంఖ్య పెరిగిపోతోంది. నియోజక వర్గాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రజాప్రతినిథుల సంఖ్యా పెరిగిపోతోంది. అలా పెరిగిపోయాక, లోక్ సభలోనూ, రాజ్యసభలోనూ సరిపడా సీట్లు…

అవును. మనం పెరిగిపోతున్నాం. మన పిల్లల సంఖ్య పెరిగిపోతోంది. మన వోటర్ల సంఖ్య పెరిగిపోతోంది. నియోజక వర్గాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రజాప్రతినిథుల సంఖ్యా పెరిగిపోతోంది. అలా పెరిగిపోయాక, లోక్ సభలోనూ, రాజ్యసభలోనూ సరిపడా సీట్లు లేక పోతే ఎలా? అందుకే కదా, ‘సెంట్రల్ విస్తా’ సిధ్ధం చేస్తోంది.

పెరగటంలోనూ వేగం వుంటుంది కదా! ఇంతకుముందు పెరిగినంత వేగంగా పెరుగుతున్నామా? వేగం మందగించిందా? అనుమానం లేదు మందగించింది. మనం చెప్పటం కాదు, ప్రపంచమే చెబుతోంది. విశ్వప్రాచుర్యం పొందిన వైద్య పత్రిక ‘ది లాన్సెట్’ 2017ఈ ‘పెరుగుదల వేగం’ మీదనే ఒక అధ్యయనం కూడా చేసింది. 

ఇండియాలో జనాభా పెరుగుదల వేగం భవిష్యత్తులో మరింత మందగిస్తుందని. అనుమానం లేదు, అత్యధికంగా భారతీయ జనాభా 204 నాటికి 160 కోట్లు అవుతుంది. 2100 నాటికి ప్రపంచ జనాభాలో ఇండియాయే నెంబర్ వన్ అయితీరాలి. కానీ కాదు. 204 నాటికి 32 శాతం తగ్గుదల వుంటుందని లెక్కగట్టింది.

కానీ ఉన్నట్టుండి ఇప్పటికప్పుడు, కొన్ని రాష్ట్రాల నేతలకు జనాభా పెరుగుదల మీద ఒక్క సారిగా దిగులు పట్టుకుంది. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ బెంగ విపరీతంగా వుంది. ముందుగా అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మకు వచ్చింది. తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు వచ్చిపడింది. అదే దారిలో కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు కూడా వున్నాయి. ఒక్కొక్క మాతృమూర్తికీ ఇద్దరి మించి పిల్లలు వుండకూడదని పంతం పట్టుకుని కూర్చున్నారు. ఆ మేరకు నిర్ణయాలు చేసేశారు కూడా. అవి చట్ట రూపం కూడా దాల్చేశాయి.

అయితే అసోంలో ఎన్నికలయ్యాక ఈ పని చేస్తే, ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పని చేస్తున్నారు. అందుకే ఉత్తరప్రదేశ్ నిర్ణయం పై అనుమానాలు ఎక్కువయ్యాయి. వోట్ల కోసమే ఈ పాట్లు పడుతున్నారని ప్రతిపక్షనేతలు యోగిని తప్పుపడుతున్నారు. యోగి ఈ చర్యను ‘జనాభా విధానం202130’ గా చూపిస్తున్నారు. అంటే దాదాపు పదేళ్ళ ముందు చూపు. ఈ విధానంలో మాతా, శిశు మరణాలను తగ్గించటమే ప్రధాన ధ్యేయంగా చూపించారు. కానీ దృష్టిఅంతా ‘సంపూర్ణ సంతానసాఫల్య రేటు’(టీఎఫ్‌ఆర్) మీదనే. 

ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ప్రతీ మాతృమూర్తికీ సగటున 2,7 మంది పిల్లలు వున్నారు. ఈ రేటును 2026 నాటికి 2.1గానూ, 2030 నాటికి 1.7 గానూ తగ్గించాలన్నది లక్ష్యం. ఇదే ప్రధాన లక్ష్యం కూడా. అయితే ప్రసవసమయంలో తల్లుల మరణాలనూ, పిల్లల మరణాలనూ తగ్గించాలన్నవి కూడా లక్ష్యాలుగా వున్నాయి. కానీ అవి అంత ప్రధానం కావని, యోగి  ప్రభుత్వం ప్రటించిన చర్యలను బట్టి అర్థమవుతోంది. 

ఇందు నిమిత్తమే యూపీ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు 2021ను ఆయన సిధ్ధం చేశారు. ఇందులో ‘ఇద్దరుపిల్లల’తో ఆగిపోయిన వారికి ప్రోత్సాహకాలు, ఆగని వారిపై చర్యలూ ప్రకటించారు ప్రోత్సాహకాల్లో ప్రభుత్వ ప్రథకాల్లో ప్రాధాన్యం, పన్నుల్లో తగ్గింపు, రుణాల జారీ, నగదు బహుమతులూ ప్రకటించారు. చర్యలుగా, సబ్సిడీల నిరాకరణా, ప్రభుత్వోద్యోగాలకు అనర్హతా, ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి అనర్హతా వున్నాయి. అంతకు ముందు అసోంలో కూడా హేమంత్ బిశ్వాస్ శర్మకూడా ఇదే పని చేశారు. 

దాదాపు, ఇవే ప్రోత్సాకాలూ, ఇవే చర్యలూ అక్కడా కనిపించాయి. కాకపోతే ఇద్దరు పిల్లలు దాటిన కుటుంబాలకు సంక్షేమ పథకాల రద్దును మాత్రం ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు, టీ తోటల్లో పనిచేసే కార్మికులనూ మినహాయించారు. అసలీ బెంగంతా జనాభా పెరుగుతందనేనా? అది నిజమైతే పెరుగుదల వేగం తగ్గింది. టీఎఫ్‌ఆర్ దేశవ్యాపితంగా 20052006 లో 2.7 శాతం వుంటే, 201516 నాటికి వచ్చేసరికి, 2.2 అయ్యింది. మరి ఎందుకీ ఆందోళన.

ఈ ఆందోళనా పార్టీ పరంగా బీజేపీకీ, సర్కారుల పరంగా బీజేపీ పాలిత రాష్రాల ముఖ్యముంత్రులకూ కలగక ముందే, ఆ పార్టీకి సైధ్ధాంతిక భూమికగా వున్న రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్.ఎస్.ఎస్)కు కలిగింది. ఆర్.ఎస్,ఎస్ లో జనాభా గురించిన ఆందోళన కొత్తది కాకపోవచ్చు కానీ, గత అయదేళ్ళుగా ఈ ఆందోళన అధికమయ్యింది. 2015లో ఆర్.ఎస్.ఎస్ ఒక తీర్మానం చేసింది. 

అది కూడా 2011 జనాభా లెక్కలు చూశాక. ‘దేశంలో జనాభా వృధ్ధి రేటులో వివిధ మత సమూహల మధ్య బాగా వ్యత్యాసాలున్నాయనీ, అది దేశసమైక్యతకు విఘాతం కలిగిస్తుందనీ, దేశ సాంస్కృతిక అస్తిత్వానికి భంగవాటిల్లుతుందనీ’ ఆ తీర్మాన సారాంశం. అలాగే 201లో అసంస్థ అధిపతి మోహన్ భగవత్ కూడా ‘జనాభామార్పులు తూకం తప్పుతున్నాయనీ, ఒక ఉమ్మడి చట్టం అవసరం వుందనీ’ పిలుపు నిచ్చేశారు.

దాంతో రాష్ట్రం తర్వాత రాష్ట్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ పిలుపు నందుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పిలుపులోని సారాంశం ఒక్కటే, జనాభా పెరుగుదల రేటు హిందువులలో కన్నా, ముస్లింలో ఎక్కువగా వుంటుందని. కానీ వారు గ్రహించని, గ్రహించటానికి ఇష్టపడని సత్యం ఒకటి వుంది. ముస్లిం కుటుంబాలలో కూడా టీఎఫ్‌ఆర్ (ప్రతీ తల్లీకీ వుండే బిడ్డలు) గత రెండు దశాబ్దాలుగా తగ్గుతూ వస్తున్నారు. 

ఒక్క అసోంనే తీసుకుంటే, ముస్లిం కుటుంబాలలో టీఎఫ్‌ఆర్ 20052006లో 3.6 వుంటే, 201516 నాటికి 2.9, 201920 నాటికి 2.4గా తగ్గుతూ వచ్చింది. ఈ తగ్గుదల భారీగా వుంది. మరి ముస్లింల జనాభా పెరిగిపోతుందన్న ఆందోళన దేనికి?

ముస్లింలపై మెజారిటీ హిందూ వోటర్ల మెదళ్ళ మీద ఇప్పటికే వున్న ఒక అనుమానాన్నీ, ఆ కారణంగా ఏర్పడ్డ అసహనాన్నీ పెద్దది చేసి, వారిని దెబ్బతీసినట్లు ఒక చర్య చెయ్యటం అనేది బీజేపీ ఇటీవల కాలంలో రచిస్తున్న ఎన్నికల వ్యూహం. ముస్లిం యువకులు, హిందూ స్త్రీలను ప్రేమ పేరు మీద వలపన్ని మతమార్పిడీ చేస్తారు. ఇది ‘లవ్ జిహాద్’. దీనిని అరికట్టటానికి ఒక చట్టం. అలాగే ముస్లిం కుటుంబ నియంత్రణ పాటించరు. దానిని కట్టడి చెయ్యటానికి జనాభా నియంత్రణ చట్టం.

సామాజిక, ఆర్థిక కోణాల్లోంచి చూడాల్సిన అంశాలని ఇలా ఎన్నికలతో ముడిపెట్టి చూడటం వల్ల పార్టీ పరంగా తాత్కాలిక విజయాలు సాధించ వచ్చు కానీ, దేశ క్షేమానికి తోడ్పడక పోవచ్చు, సరికదా, విఘాతం కూడా కలగ వచ్చు.

-స‌తీష్ చంద‌ర్‌