డిజాస్టర్ దిశగా శంకర్ సినిమా

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. కంటెంట్ పై భారీ నమ్మకం. అందుకే నిడివి కూడా తగ్గించలేదు. పైపెచ్చు టికెట్ రేట్లు కూడా పెంచుకున్నారు. కానీ భారతీయుడు-2 సినిమాపై శంకర్ పెట్టుకున్న నమ్మకం నిలబడలేదు. కమల్…

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. కంటెంట్ పై భారీ నమ్మకం. అందుకే నిడివి కూడా తగ్గించలేదు. పైపెచ్చు టికెట్ రేట్లు కూడా పెంచుకున్నారు. కానీ భారతీయుడు-2 సినిమాపై శంకర్ పెట్టుకున్న నమ్మకం నిలబడలేదు. కమల్ హాసన్, సిద్దార్థ్ కలిసి నటించిన ఈ సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.

రిలీజైన మొదటి రోజే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీనికితోడు రన్ టైమ్ సమస్య. అందుకే వెంటనే మేకర్స్ మేల్కొన్నారు. యుద్ధప్రాతిపదికన సినిమాను ట్రిమ్ చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

ఇక పెంచిన టికెట్ రేట్లు కూడా కొన్ని చోట్ల అనధికారికంగా తగ్గించేశారు. చాలా సింగిల్ స్క్రీన్స్ లో వెసులుబాటు ఉన్నప్పటికీ టికెట్ రేట్లను సాధారణంగా ఉంచారు. అయినప్పటికీ ఆక్యుపెన్సీ కనిపించలేదు. మొదటి వారాంతం ముగియడంతో ఈ సినిమా ఇక కోలుకోవడం కష్టమని తేలిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు-2 వసూళ్లు, ఆక్యుపెన్సీ పేలవంగా ఉన్నాయి. రిలీజ్ కు ముందు ఉన్న బజ్ కు, రిలీజ్ తర్వాత వస్తున్న కలెక్షన్లకు పొంతన కనిపించడం లేదు. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర మినహాయిస్తే.. ఎక్కడా కోటి మార్క్ దాటలేదు ఈ మూవీ.

ఇప్పట్లో గేమ్ ఛేంజర్ రిలీజ్ వద్దు..

మొన్నటివరకు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించాలంటూ డిమాండ్ చేసిన మెగా ఫ్యాన్స్, ఇప్పుడు స్వరం మార్చారు. ఇప్పట్లో గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి కారణం భారతీయుడు-2 ఎఫెక్ట్.

శంకర్ కెరీర్ లోనే నాసిరకం వర్క్ ఇదంటూ ట్రోలింగ్ నడుస్తోంది. ఇతడి కెరీర్ లో బాగా ట్రోలింగ్ జరిగిన సినిమా నాంబన్. త్రీ-ఇడియట్స్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను సరిగ్గా తీయలేదంటూ శంకర్ పై విమర్శలు చెలరేగాయి. పుష్కరం కిందటొచ్చిన ఆ సినిమాను, ఇప్పుడు భారతీయుడు-2 ఆక్రమించిందంటూ కామెంట్స్ పడుతున్నాయి.

ఇలాంటి టైమ్ లో గేమ్ ఛేంజర్ పై ఎలాంటి ప్రకటన చేసినా మొదటికే మోసం వస్తుందని, కొన్నాళ్లు ఆ సినిమా గురించి మాట్లాడొద్దంటూ యూనిట్ కు విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్యాన్స్.