సినిమా రివ్యూ: లింగ

రివ్యూ: లింగ రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. తారాగణం: రజనీకాంత్‌, సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి, జగపతిబాబు, కె. విశ్వనాధ్‌, సంతానం, రాధా రవి తదితరులు రచన: పొన్‌ కుమరన్‌, కె.ఎస్‌.…

రివ్యూ: లింగ
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.
తారాగణం: రజనీకాంత్‌, సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి, జగపతిబాబు, కె. విశ్వనాధ్‌, సంతానం, రాధా రవి తదితరులు
రచన: పొన్‌ కుమరన్‌, కె.ఎస్‌. రవికుమార్‌
కళ: సాబు సిరిల్‌
సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌
కూర్పు: సంజిత్‌ ఎంహెచ్‌డి
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాత: రాక్‌లైన్‌ వెంకటేష్‌
దర్శకత్వం: కె.ఎస్‌. రవికుమార్‌
విడుదల తేదీ: డిసెంబర్‌ 12, 2014

రజనీకాంత్‌ని తెరపై చూసి నాలుగేళ్లు దాటింది. ‘రోబో’గా బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేసిన రజనీ అనారోగ్య సమస్యలతో చాలా కాలం షూటింగ్స్‌కి దూరమయ్యారు. చంద్రముఖి, శివాజీ, రోబో తర్వాత రజనీ సినిమా అంటే అదే లెవల్లో ఉంటుందని, ఉండాలని అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. రజనీ సినిమాలో ఏమి ఉన్నా లేకున్నా రజనీకాంత్‌ మార్కు విన్యాసాలు ఉంటే విజిల్స్‌ కొట్టేస్తారు. కానీ ‘లింగ’లో రజనీ మార్క్‌ పూర్తిగా మిస్‌ అయింది. ‘లింగ’లో రజనీకాంత్‌ ఉన్నాడు కానీ మనకి నచ్చిన, మనం మెచ్చిన రజనీ మాత్రం 
లేడు!

కథేంటి?

లింగా (రజనీకాంత్‌) ఓ దొంగ. ఒక నెక్లెస్‌ అపహరించి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా… అతడిని లక్ష్మి (అనుష్క) తమ ఊరికి తీసుకెళుతుంది. ఓ పెద్దాయన లింగాని కలిసి అతని తాత గురించి చెప్తాడు. ఆ ఊరు కరువుతో కటకటలాడుతున్న సమయంలో అక్కడికి కలెక్టర్‌గా వచ్చిన రాజా లింగేశ్వర (రజనీకాంత్‌) అక్కడ డ్యామ్‌ కట్టించాడని, అతని వల్లే ఇప్పుడు ఆ ఊరు పచ్చగా ఉందని లింగా తెలుసుకుంటాడు. అక్కడ కొత్త డ్యామ్‌ కాంట్రాక్ట్‌ కోసమని పాత డ్యామ్‌ని డ్యామేజ్‌ చేయాలని చూస్తున్న ఎంపీ (జగపతిబాబు) నుంచి లింగా ఆ ఊరిని కాపాడతాడు. 

కళాకారుల పనితీరు:

ముందే చెప్పినట్టు రజనీకాంత్‌ ముద్ర ఇందులో కనిపించలేదు. ఆయనకి మాత్రమే సాధ్యమైన స్టయిల్స్‌, మేనరిజమ్స్‌ ఇందులో లేవు. విలన్స్‌ ఉన్నా కానీ హీరోయిజమ్‌ ఎలివేట్‌ అయ్యే సందర్భాలు లేవు. ఒకటీ అరా డైలాగులు మినహా ఇందులో రజనీకాంత్‌ మార్క్‌ పూర్తిగా మిస్సింగ్‌. అరవై నాలుగేళ్ల వయసులో కూడా ఆయన చలాకీగానే నటించారు. తన వరకు ఈ చిత్రానికి చేయగలిగింది చేసారు. 

Video: Watch Lingaa Movie Public Talk

సోనాక్షి సిన్హా, అనుష్క ఇద్దరూ వయసులో రజనీ కంటే చాలా చిన్న వాళ్లయినా కానీ ఆయన సరసన బాగానే సూట్‌ అయిపోయారు. అనుష్కతో పోలిస్తే సోనాక్షికే కాస్త గుర్తింపు దక్కే పాత్ర లభించింది. ఆమె నటన ఫర్వాలేదు. కానీ తెలుగే సరిగ్గా రాని చిన్మయితో కర్నూలు యాసలో డబ్బింగ్‌ చెప్పించడం మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది.

జగపతిబాబు స్టయిలింగ్‌ బాగుంది. అంతకుమించి తన గురించి చెప్పుకోడానికి ఏమీ లేని పాత్ర ఇది. కె. విశ్వనాధ్‌ ఇప్పటికి ఈ తరహా పాత్ర తనకే గుర్తులేనన్ని సార్లు చేసేసి ఉండాలి. సంతానం పాత్రని మొదటి అరగంటకే పరిమితం చేసేయడం వల్ల కామెడీకి స్కోప్‌ లేకుండా పోయింది. రాధా రవికి కూడా ఇలాంటి పాత్రలు కొత్త కాదు. బ్రిటిష్‌ కలెక్టర్‌ పాత్ర చేయాల్సిన నటుడికి భాష రాకపోవడం ఓకే కానీ నటన కూడా చేత కాలేదు. చాలా ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌కి వీక్‌ ఆర్టిస్ట్‌ని తీసుకున్నారు. 

సాంకేతిక వర్గం పనితీరు:    

ఏ.ఆర్‌. రెహమాన్‌ చేసిన ఆల్బమ్స్‌లో రేర్‌ ఫెయిల్యూర్‌ ఇది. ఇంతకుమించి పాటలు స్కోర్‌ చేసే అవకాశం లేకపోవడం వల్లో లేక ఇంతకంటే చేయించుకోలేకపోయారో కానీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సహా రెహమాన్‌ డిజప్పాయింట్‌ చేసాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అసలు కంటెంట్‌ లేని సినిమాని ఇన్ని గంటల పాటు సాగదీయడమేంటో అర్థం కాదు. అనవసరమైన దానిని చాలా వరకు ఎడిటర్‌ ఫైనల్‌ కట్‌లో ఉంచేసాడు. ఇక దానిని థియేటర్లలో ఎడిట్‌ చేసుకుంటారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అతి పెద్ద ప్లస్‌ పాయింట్‌. సినిమా ఎంత నస పెడుతున్నా కానీ చివరి వరకు చూడగలుగుతామంటే అది రజనీకాంత్‌ ప్లస్‌ రత్నవేలు విజువల్స్‌ వల్లే. భారీగా సెట్స్‌ నిర్మించారు. మంచి లొకేషన్స్‌ ఎంచుకున్నారు. ప్రొడక్షన్‌ పరంగా ఈ చిత్రం చాలా హై క్వాలిటీతో రూపొందింది. రజనీకాంత్‌ సినిమాకి ఉండాల్సిన కళ అయితే కనిపించింది. 

కె.ఎస్‌. రవికుమార్‌ అప్పట్లో చాలా విజయాలు అందించినా కానీ ఈమధ్య ఆయన చాలా డిజప్పాయింటింగ్‌ మూవీస్‌ తీస్తున్నారు. ‘లింగ’ చిత్రంతో బౌన్స్‌ బ్యాక్‌ అవుతారేమో… ఆయనకి రజనీకాంత్‌ హెల్పవుతారేమో అనుకుంటే… రజనీకాంత్‌నే వీక్‌గా ప్రెజెంట్‌ చేసి ఇప్పుడు తానెంత అవుటాఫ్‌ ఫామ్‌ ఉన్నాడనేది ఆయన చూపించుకున్నారు. దర్శకుడిగా ఆయన స్టార్ట్‌ టు ఎండ్‌ ఫెయిలవడమే కాకుండా రజనీ, రహమాన్‌లాంటి లెజెండ్స్‌ టాలెంట్‌ కూడా ఉపయోగించుకోలేదు. రత్నవేలు అంత మంచి అవుట్‌పుట్‌ ఇచ్చినా కానీ దానిని క్యాష్‌ చేసుకోలేదు. 

హైలైట్స్‌:

  • రజనీకాంత్‌
  • సినిమాటోగ్రఫీ
  • ప్రొడక్షన్‌ వేల్యూస్‌

డ్రాబ్యాక్స్‌:

  • కె.ఎస్‌. రవికుమార్‌
  • సాంగ్స్‌
  • సిల్లీ క్లయిమాక్స్‌

విశ్లేషణ:

రజనీకాంత్‌ అటు తన స్టార్‌డమ్‌కి న్యాయం చేస్తూనే మరోవైపు వైవిధ్యం ఉన్న కథల్నే ఈమధ్య ఎంచుకుంటున్నారు. చంద్రముఖి, శివాజీ, రోబో అన్నిట్లోను కొత్త రజనీకాంత్‌ కనిపించారు. ఆ పాత్రలకి తన స్టయిల్‌ జోడించి ఆయన ఈ తరం ప్రేక్షకుల్ని కూడా ఉర్రూతలూగించారు. అయితే కె.ఎస్‌. రవికుమార్‌ ఆయనని మళ్లీ ఇరవై ఏళ్లు వెనక్కి లాక్కుపోయారు. మరోసారి అప్పట్లో చేసిన ‘ముత్తు’లాంటి సబ్జెక్ట్‌కే పీరియడ్‌ డ్రామా కలర్‌ ఇచ్చి ఆకట్టుకోవాలని చూసారు. కష్టాల్లో ఉన్న ఊరి కోసం ఉన్నదంతా ఊడ్చిచ్చే హీరో… అతడిని అపార్ధం చేసుకుని ఊరి నుంచి పంపేస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాథాస్‌ సాంగ్‌. అతని స్థానంలో తిరిగి అతనో, అతని కొడుకో, లేక మనవడో వచ్చి ఆ ఊరికి మంచి చేయడం ఎన్ని సినిమాల్లో చూడలేదు? అసలు రజనీనే ఎన్ని సినిమాల్లో ఇది చేయలేదు? 

ఇలాంటి ముతక కథని తీసుకుని కోట్లు ఖర్చు పెట్టించిన కె.ఎస్‌. రవికుమార్‌ కనీసం తన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని అయినా వాడుకోలేదు. రజనీకాంత్‌ వెళ్లి విలన్స్‌కి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చే సీన్‌ కానీ… ఆయన హీరోయిజం ఎలివేట్‌ అయ్యే సందర్భం కానీ ఇందులో లేదు. రెండు పాత్రలు చేసినా కానీ ఎక్కడా రజనీకాంత్‌ మార్క్‌ కనిపించలేదు. అవన్నీ ఎందుకు… జస్ట్‌ రజనీ అలా నడిచి వస్తూ ఉంటేనే అభిమానులు పరవశంతో పిచ్చెత్తిపోతారు. కనీసం అలాంటి స్టయిలిష్‌ షాట్‌ కూడా లేదు. రజనీకాంత్‌ దొంగగా, కలెక్టర్‌గా, రాజుగా.. ఇలా రకరకాలుగా ఎంట్రీ ఇస్తుంటాడు కానీ ఒక్కసారి అయినా ‘తలైవా’ అని అరవడానికి తగ్గ ఎలివేషన్‌ ఇవ్వలేదు. 

పోనీ రజనీ ముద్ర లేకపోయినా, కథ ఎంత నాసి రకంగా ఉన్నా ఫర్వాలేదు. కనీసం వినోదాత్మకంగా అయినా ఉంటే లేని వాటి గురించి ఆలోచించక్కర్లేదు. లింగలో వినోదానికి చోటివ్వలేదు. అదీ వదిలేసి కనీసం డ్రామా అయినా రంజుగా సాగితే ఏమి లేకపోయినా ఆసక్తిగా చూడొచ్చుననుకుంటే అదీ జరగలేదు. రజనీకాంత్‌ డేట్స్‌ ఇచ్చారు. ఆయనతో ఏదో ఒక సినిమా తీసేయాలి అన్నట్టు తీసేసినట్టే ఉంది కానీ ఎక్కడా మనసు పెట్టి చేసిన సినిమాలా లేదు. రజనీకాంత్‌ ఎంత కష్టపడి దీనిని మోద్దామని చూసినా కానీ ఆయన చేతులు కూడా కట్టి పడేసారు. ఇంతా చేసి రజనీకాంత్‌పై ప్రచారంలో ఉన్న జోకులకి మరింత ఊతమిచ్చే సిల్లీ క్లయిమాక్స్‌ సీన్‌ మాత్రం తీసారు. ఇంత కాస్ట్‌లీ చిత్రానికి, ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్న చిత్రానికి ఇలాంటి క్లయిమాక్స్‌ పెట్టవచ్చుననే థాట్‌ వచ్చినందుకు అయినా డైరెక్టర్‌కి సన్మానం చేయాలి. రజనీకాంత్‌ తెరపై కనిపిస్తే చాలు… ఇంకేమీ అక్కర్లేదు అనుకునేంత అభిమానం ఉంటే తప్ప ‘లింగ’ని భరించడం కష్టమని చెప్పాలి.

బోటమ్‌ లైన్‌: రజనీకాంత్‌ సైతం మోయలేని లింగం!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

Video: Watch Lingaa Movie Public Talk