గబ్బర్ సింగ్ 2 మొదలు పెట్టిన కొత్తలో జనసేన పార్టీ పుట్టుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇతరత్రా బిజీ అయిపోయి, ఆ సినిమా అలా పక్కనపడిపోయింది. ఇంతలో ఇప్పుడు గోపాల గోపాల పూర్తయింది. మళ్లీ సరి కొత్త డైరక్టర్ తో గబ్బర్ సింగ్ 2 మొదలవుతుంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు జనసేనకు రాజకీయ పార్టీగా గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనుమతి ఇవ్వమని కోరుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
అంటే మదిలో విశాఖ, హైదరాబాద్ లాంటి ప్రెస్టీజియస్ కార్పొరేషన్ ఎన్నికలు వుండివుండొచ్చు. త్వరలో విశాఖ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిపే ఉద్దేశంతోనే వుంది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యలోని ఆంధ్ర ప్రభుత్వం. జనసేన అందులో పోటీకి దిగుతుంది అన్న ఉప్పు అందితే చాలు ఇక పోటీ చేయాలనుకుంటున్నవారు ఆ పార్టీ కార్యాలయానికి క్యూ కడతారు.
కార్పోరేటర్ అభ్యర్థులు, మేయర్ అభ్యర్థులు ఇలా ఒకరేమిటి? మరోపక్క సభ్యత్వాలు, నాయకులు చేరడాలు సందడే సందడి. మరి ఈ పనులు ఒకసారి ఊపు అందుకుంటే, పవన్ గబ్బర్ సింగ్ 2 పరిస్థితి ఏమిటో?