‘సిండికేట్’ కు మరో బలి

దిల్ రాజు నాయకత్వంలో ఏర్పడిన నిర్మాతల సిండికేట్ పుణ్యమా అని మరో సినిమా బలైపోయింది. గొప్ప సినిమా కాదు..ఆ సినిమా పేరు టిప్పు. నిర్మాత వైజాగ్ రాజు. సినిమా రంగంలో ఆయనకున్న పరిచయాలు ఎక్కువే.…

దిల్ రాజు నాయకత్వంలో ఏర్పడిన నిర్మాతల సిండికేట్ పుణ్యమా అని మరో సినిమా బలైపోయింది. గొప్ప సినిమా కాదు..ఆ సినిమా పేరు టిప్పు. నిర్మాత వైజాగ్ రాజు. సినిమా రంగంలో ఆయనకున్న పరిచయాలు ఎక్కువే. అయితే నిర్మాత కేఎస్ రామారావుతో సాన్నిహిత్యం ఎక్కువని అంటారు. దాంతో ఆయన ఈ సిండికేట్ కేసి మొగ్గారు. సిండికేట్ నిర్ణయించిన మీడియాకే ప్రకటనలు ఇచ్చారు. మిగిలిన వాటికి ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి వారు డైరక్ట్ గా ప్రకటనలు అడిగారు. ఇవ్వలేదు. ఫలితం నెగిటివ్ సమీక్ష. సినిమా బాగులేకుంటే నెగిటివ్ సమీక్ష ఎలాగూ తప్పదు. అయితే ఇక్కడ సినిమా అంత గొప్పగా లేదు. పైగా ప్రకటనలివ్వలేదు..దాంతో నెగిటివ్ కాదు..వీర నెగిటివ్ సమీక్ష వచ్చింది. 

తెరవెనుక పెద్దలు

టిప్పు హీరో దర్శకుడు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రజ్యోతి ఇలా చేయడాన్ని నిలదీసారు. దీని వెనుక కొందరు సిండికేట్ పెద్దలు వున్నట్లు తెలుస్తోంది. వారే నిర్మాత రాజును రెచ్చగొట్టి, వెళ్లి పబ్లిక్ గా చెప్పమని ఎంకరేజ్ చేసినట్లు తెలుస్తోంది. మరి సిండికేట్ అయినపుడు వారు అందరూ కలిసి కట్టుగా పరిస్థితులను ఎదిరించవచ్చు కదా. అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టవచ్చుగా..అబ్బే అలా మాత్రం చేయరు. తెరవెనక మంతనాలు మాత్రం సాగిస్తారు. 

దిల్ రాజు డబుల్ రోల్

సిండికేట్ కు సారథ్యం వహిస్తున్న దిల్ రాజు డబుల్ రోల్ పోషిస్తున్నారని నిర్మాతల నుంచి కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఆయన అందరినీ మీడియాకు వ్యతిరేకంగా నడిపిస్తూ, తాను తన సినిమా కేరింత కోసం మాత్రం ఆంధ్ర జ్యోతికి ఏబిఎన్ కు ప్రకటనలు ఇవ్వడాన్ని వారు తప్పు పడుతున్నారు. మళ్లీ ఇప్పట్లో ఆయన సినిమా ఏదీ లేదు కనుక, మళ్లీ సిండికేట్, నిబంధనలు అంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పడు సిండికేట్ లో మరో కీలక సభ్యులయిన రంజిత్ మూవీస్, తేజ కలిపి తీసిన హోరా హోరీ విడుదలకు రెడీ అవుతోంది. మరో రెండు నెలలో వస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఎబిఎన్ కు ప్రకటనలు ఇస్తారో, సిండికేట్ అని ఊరుకుంటారో? 

స్టార్ లపై మళ్లీ వార్?

స్టార్ రేటింగ్ లు ఇచ్చే వెబ్ సైట్ లకు వేటికీ ప్రకటనలు ఇవ్వరాదనీ, అలాగే వాటి ప్రతినిధులను సినిమా కార్యక్రమాలకు పిలవరాదనీ ఇప్పుడు సిండికేట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది అమలు అయితే వ్యవహారం మరీ రాజుకునే అవకాశం వుంది. తెలుగు సినిమాలకు సంబంధించి వందకు పైగానే వెబ్ సైట్లువున్నాయి. వీటిలో తొంభై అయిదు శాతం సినిమా ప్రకటనలపైనే ఆధారపడి నడుస్తున్నాయి. మరి ఏమవుతుంతో చూడాలి.