చిన్న సినిమాతోనే మంచి హీరో అనిపించుకున్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడు మూడు సినిమాలు చేతిలో వున్నాయి. అది కూడా అన్నీ ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇందులో కుమారి 21ఎఫ్ ఒకటి. హీరోకేమో ఇది రెండోసినిమా. పైగా ఏ బ్యాకింగ్ లేని హీరో. పోనీ నాన్న భారీ ప్రొడ్యూసర్ లేకుంటే టాప్ హీరో అనుకోవడానికీ లేదు. కానీ ఆ సినిమాకు కథ సుకుమార్, సంగీతం దేవీశ్రీప్రసాద్, కేమేరా రత్నవేలు. ఇదీ టెక్నికల్ ప్యాడింగ్.
ఏంటీ కథా..అంటే సుకుమార్ కథే అని తెలిసింది. సుకుమార్ స్వయంగా కథ ఇవ్వడమే కాకుండా, ఈ టెక్నకల్ ఫ్యాడింగ్ కూడా తానే సెట్ చేసాడట. ఇదిలా వుంటే ఇదే రాజ్ తరుణ్ పై ఆదిలో ఆటిట్యూడ్ వార్తలు వినిపించాయి. కోటి రూపాయిలు అడుగుతున్నాడని. దానిపై చిత్రమైన సంగతి బయటకు వచ్చింది. ఉయ్యాల జంపాల హిట్ కాగానే ఓ పెద్ద నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ కబురు చేసాడట. 'నువ్వొద్దు నేనెళ్లి మాట్లాడతాలే' అని ఓ పెద్దాయిన వకాల్తా తీసుకువెళ్లాడట.
అలా వెళ్లి, మా హీరో కోటికి తక్కువ రాడని చెప్పాడట. దాంతో ఆ నిర్మాత వెనక్కు తగ్గారు. అదే వార్తల్లోకి వచ్చి, రాజ్ తరుణ్ కోటి రూపాయిల హీరో అని టాక్ పుట్టేసింది. దీంతో రాజ్ తరుణ్ కు సినిమాలోకం వ్యవహారాలు ఎలా వుంటాయో అర్థమై, డ్యామేజ్ కంట్రోలుకి దిగి, ఓ మాంచి మేనేజర్ ను సెట్ చేసుకున్నాడట. దాంతో ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలు పట్టాలకెక్కాయి.