కెసిఆర్ దారి…రహదారి

ఎవరెంత అడ్డం పడ్డా సరే కెసిఆర్ దారి రహదారి, ఒక్క సారి డిసైడ్ అయితే తిరుగేలేదు… అన్నట్టుగా తెలంగాణలోని అధికారపార్టీ సిద్ధమయిపోతోంది. ఒకవైపు టీడీపీ రగిలిపోతున్నా.. మరోవైపు బీజేపీ భగభగమంటున్నా… ఇంకోవైపు కాంగ్రెస్ కయ్యానికి…

ఎవరెంత అడ్డం పడ్డా సరే కెసిఆర్ దారి రహదారి, ఒక్క సారి డిసైడ్ అయితే తిరుగేలేదు… అన్నట్టుగా తెలంగాణలోని అధికారపార్టీ సిద్ధమయిపోతోంది. ఒకవైపు టీడీపీ రగిలిపోతున్నా.. మరోవైపు బీజేపీ భగభగమంటున్నా… ఇంకోవైపు కాంగ్రెస్ కయ్యానికి సిద్ధమవుతున్నా… కేసీఆర్ సర్కార్ మాత్రం సై సై అంటోంది. విపక్షాల అస్త్రాలను తిప్పికొట్టేందుకు గులాబీ దళపతి వ్యూహాలు రచించారు. 

అందులో భాగంగానే  అసెంబ్లీకి కీలక బిల్లులు తెచ్చేందుకు రెడీ అయింది అధికార పక్షం. ఈమేరకు కీలక అంశాలపై తెలంగాణ కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించింది. పలు బిల్లులకు ఆమోదముద్ర వేసింది. ఆ విధంగా తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలో ఆమోదించాల్సిన బిల్లులకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుమారు 23 తీర్మానాలకు ఆమోద ముద్ర వేసింది. 

నూతన పారిశ్రామిక విధానం, హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన, ఆసరా పథకం, మహిళల భద్రత, సాంస్కృతిక వారధిపై కేసీఆర్ టీం స్పీడ్ పెంచింది. రాయితీలు, ప్రోత్సహకాలను కల్పిస్తూ రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పాలసీ రూపొందించింది. 

ఇందులో అర్హత గల సంస్ధ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతుల కోసం. తిరిగి వేసారకుండా నేరుగా సచివాలయంలో ఒక్కచోటే అన్ని రకాల అనుమతులు పొందేలా సింగిల్ విండో పాలసీకి సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ పాలసీకి ప్రభుత్వం టీ-పాస్‌గా నామకరణం చేసింది.

రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పూనం మాలకొండయ్య కమిటీ రూపొందించిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు సర్కార్ నడుం బిగించింది. తక్షణమే 100 కోట్ల రూపాయల్ని విడుదలకు ఆమోద ముద్ర వేసింది. రాబోయే ఐదేళ్లలో గ్రామగ్రామానికి చెరువులు, కుంటలు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది. 

ఇక రోడ్ల మరమ్మతులపైనా సీరియస్‌గా దృష్టి సారించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని, అన్ని పార్టీలను అభివృద్ధి విషయంలో కలుపుకుని ముందుకెళ్లాలని నిర్ణయించారు. 

తెలంగాణలోని ఉన్నతాధికారుల కొరత అంశమూ కేబినెట్ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. తక్షణమే తెలంగాణ స్టేట్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఛైర్మన్‌, సభ్యుల్ని నియమించాలని, అంతేకాకుండా పలు విశ్వవిద్యాలయాలు, సంస్థల పేర్లను మార్చాలని తెలంగాణ కేబినేట్ నిర్ణయించింది.

ప్రభుత్వం పలు సందర్భాల్లో ప్రకటించిన పథకాలు, వాటి అమలుతీరు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపైనా కేబినెట్ భేటీలో చర్చించినట్లు తెలిసింది. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు కొంతమంది మంత్రులకు కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. సభలో వాటిని సమర్థవంతంగా పాస్ చేయించగలరా… లేక అడ్డదారుల్లోనే అన్నింటిని ఒకే చేయించుకుని ముందుకుపోతారా అన్నది తేలాల్సి ఉంది. 

వీటిలో వేటిని విపక్షాలు అడ్డుకుంటాయి, ఏకతాటిపై నిలిచి అధికార పక్షాన్ని ఎదుర్కుంటాయా.. లేక ఎప్పటి లాగే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు అసలు విషయాలు పక్కన బెట్టి అనవసర విషయాలతో రాద్దాంతం చేసి ముగించేస్తారా అన్న అనుమానాలూ లేకపోలేదు. అందుకే ఎవరేమన్నా… మన దారి రహదారే అన్న ధీమా కేసిఆర్ లో కనిపిస్తోంది.