మొన్న స్వామి నిత్యానంద.. ఇప్పుడు స్వామి రాంపాల్.. గతంలో ఎందరో.. భవిష్యత్తులోనూ ఇంకెందరో బాబాలు తెరపైకి వస్తూనే వుంటారు.. వివాదాల్లో ఇరుక్కుంటుంటారు.. అయినా బాబాల్ని నమ్ముతున్న భక్తుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఎందుకిలా.? ఎవరికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.
నోట్లోంచి శివలింగాన్ని బయటకు తీస్తే చాలు పడీ పడీ దండాలు పెట్టేస్తాం ఎవరికైనా. తాయెత్తు కడితే చాలు.. ఫకీర్బాబా అనేస్తాం.. కొబ్బరి నూనెతో నుదుటి మీద ‘శిలువ గుర్తు’ వేస్తే, ఇక దేవుని దూత.. అని నమ్మేస్తాం. అమాయకుల బలహీనత అది. మోసం చేయడానికి మతంతో సంబంధం లేదు. ఆ మతం ఈ మతం అన్న తేడాల్లేకుండా మత విశ్వాసాల పేరిట, మూఢ విశ్వాసాల్ని ప్రచారం చేసే బాబాలు, ఫకీర్లు, స్వామీజీలు రోజురోజుకీ పెరిగిపోతున్నారు.
పదికో, పాతికకో ఆశపడే ఫకీర్లు, బాబాల వ్యవహారం ఒకలా వుంటే, కోట్లకు పడగలెత్తుతోన్న స్వామీజీల వ్యవహారం మరీ దారుణం. బెంజ్ కార్లలో తిరుగుతుంటారు ఈ స్వామీజీలు. అయ్యగారు కోరాలేగానీ, గొంతెమ్మ కోర్కెల్ని సైతం తీర్చడానికి భక్తులు రెడీగా వుంటారు. ఆశ్రమాల పేరట, వాటిల్లో అసాంఫీుక కార్యక్రమాలు కొనసాగిస్తున్నా అడిగే దిక్కు వుండదు.
‘నేను మగాడ్ని కాదు..’ అని నిస్సిగ్గుగా నిత్యానంద స్వామీజీ చెప్పేసుకున్నారు.. ఆశ్రమంలో లైంగిక కార్యకలాపాల వ్యవహారం వెలుగు చూశాక. ఇప్పుడు తాజాగా స్వామీజీ రాంపాల్ బండారం బయటపడిరది. ఒక్క స్వామీజీ బాగోతం వెలుగులోకొచ్చాక, అప్రమత్తమవ్వాలి ఎవరైనా. ఇంకో స్వామీజీని నమ్మాలంటే ఆలోచించాలి. కానీ, అమాయకత్వం.. జీవితంలో ఎదుర్కొంటోన్న వివిధ రకాలైన సమస్యలు.. ఇవన్నీ స్వామీజీలపట్ల ప్రజలు ఆకర్షితులవడానికి దోహదం చేస్తున్నాయి. అదే దురదృష్టకరం.
విచిత్రమేంటంటే, అధికారంలో వున్నవారు సైతం దొంగ స్వామీజీలకు భక్తులు కావడం. వారి కారణంగానే దొంగ స్వామీజీలకు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజానికి తమ బోధనలతో ఎంతోకొంత మేలు చేసే స్వామీజీలూ లేకపోలేదు.
దొంగ స్వామీజీల పుణ్యమా అని, స్వామీజీ అన్న పదానికే అర్థం మారిపోయింది.. స్వామీజీ అన్నా, బాబా అన్నా అదో బూతుపదమైపోతోన్న రోజులివి. బాబా బోగస్.. అంతా బోగస్.. అన్పిస్తోంది దొంగ స్వామీజీలు, దొంగ బాబాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన ప్రతిసారీ. ఆ తర్వాత షరామామూలే.