ఏకే 47.. ఇంత నిర్లక్ష్యమా.?

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో గన్‌ కల్చర్‌ సర్వసాధారణం. అత్యాధునికమైన ఆయుధాలు సామాన్యుల చేతుల్లోకి వెళ్తుంటాయి. కొందరు ఉన్మాదులు వాటితో విచక్షణా రహితంగా సామాన్యుల్ని కాల్చి పారేస్తుంటారు. అమెరికాలో కాల్పులు.. అన్న వార్త…

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో గన్‌ కల్చర్‌ సర్వసాధారణం. అత్యాధునికమైన ఆయుధాలు సామాన్యుల చేతుల్లోకి వెళ్తుంటాయి. కొందరు ఉన్మాదులు వాటితో విచక్షణా రహితంగా సామాన్యుల్ని కాల్చి పారేస్తుంటారు. అమెరికాలో కాల్పులు.. అన్న వార్త ఎప్పటికప్పుడు చూస్తూనే వుంటాం.

హైద్రాబాద్‌లో ఏకే 47తో ఓ ఆగంతకుడు హల్‌చల్‌చేశాడన్న వార్త సహజంగానే అందరినీ కలవరపాటుకు గురిచేసింది. హైద్రాబాద్‌లో సామాన్యుడి భద్రతపై అనుమానాల్ని రేకెత్తించింది. ఓ పారిశ్రామికవేత్తను చంపడానికో, కిడ్నాప్‌ చేయడానికో దుండగుడు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. 

కానీ, వెపన్‌ అత్యంత ప్రమాదకరమైనది. ఓ కానిస్టేబుల్‌ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానిస్టేబుల్‌ కావొచ్చు, మావోయిస్ట్‌ కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు.. ఏకే47 లాంటి అతి ప్రమాదకరమైన వెపన్‌తో దాడి చేయాలన్న ఆలోచన రావడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. భద్రత విషయంలో పాలకులు, పోలీసులు రాజీపడ్డంతోనే ఇదంతా జరిగిందా.? అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కిడ్నాప్‌ చేయడానికొచ్చాడు కాబట్టి సరిపోయింది.. అదే ఆ వ్యక్తి ఉన్మాదిగా మారి వుంటే.. ఎంతమంది ప్రాణాలు పోయేవో ఊహించడమే కష్టం.

కత్తులతో నరికేయడం, తుపాకీలతో కాల్చడం.. ఇవి కూడా తీవ్రమైన నేరాలే అయినప్పటికీ, ఏకే47 దొంగదారిన జనంపై దాడులకు తెగబడే పరిస్థితి వచ్చిందంటే అది మరింత ప్రమాదకరమైనది. అది సమాజంలో పౌరుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. 

ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం.. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం.. వంటి రొటీన్‌ స్టేట్‌మెంట్లతో సరిపెడితే ఉపయోగం లేదు. ఇంకోసారి ఇలాంటి వెపన్స్‌ అక్రమంగా బయటకు వచ్చే అవకాశం లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి వుంది.