ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు – 11

ఇందులో ఇంకో అంశం కూడా వుంది. కథ పరంగా కూడా చూస్తే యిలాటి సినిమాల్లో కథ ఎక్కువ వుండదు కాబట్టి, వున్నా సూటిగా, చిక్కులు లేకుండా వుంటుంది కాబట్టి రసాస్వాదనకు ఇబ్బంది వుండదు. భారీ…

ఇందులో ఇంకో అంశం కూడా వుంది. కథ పరంగా కూడా చూస్తే యిలాటి సినిమాల్లో కథ ఎక్కువ వుండదు కాబట్టి, వున్నా సూటిగా, చిక్కులు లేకుండా వుంటుంది కాబట్టి రసాస్వాదనకు ఇబ్బంది వుండదు. భారీ ఉర్దూ డైలాగులతో ఓ సినిమా వచ్చిందనుకోండి, మనం బిక్కమొహం వేస్తాం. అదే మాటలు తక్కువ, డాన్సులు ఎక్కువ, స్టంట్సు మరీ ఎక్కువ సినిమా వుందనుకోండి. డబ్బింగు చేయకపోయినా స్ట్రెయిట్‌ సినిమా కూడా చూసేస్తాం. ఫక్తు జానపద సినిమాలే కాదు, నాడియా టైపు 'హంటర్‌వాలీకీ బేటీ' సినిమాలు కూడా తెలుగునాట హిట్‌ కావడానికి యిదే కారణం. ఇంగ్లీషు సినిమాలు కూడా చూడండి. డైలాగ్సు ఎక్కువున్న '12 యాంగ్రీమన్‌' లాటి సినిమా చూపిస్తే 'అసుకు గురూ' అంటారు. హస్క్‌, అంటే ఊకదంపుడు సంభాషణలు ఎక్కువ అని అర్థం. అదే జేమ్స్‌బాండ్‌ టైపులో ఓ తుపాకీ తీసుకుని ఓ వందమందిని పిట్టల్లా రాల్చేస్తే 'సూపర్‌ సినిమా గురూ' అంటారు. 

సినిమాలకు సెక్స్‌ ఒక ౖప్రధానమైన సెల్లింగ్‌ పాయింట్‌. కన్విన్సింగ్‌గా సెక్స్‌ చూపిస్తే సినిమా హాయిగా ఆడేస్తుంది. జానపద సినిమాల్లో కథాపరంగా దేవకన్యలు పుష్కలంగా వుంటారు. నిజమైన దేవకన్యలు తొమ్మిది గజాల కంచి పట్టుచీరలో వుంటారో లేదో మనం ఎవ్వరూ చూడలేదు. కానీ సినిమా సూత్రం ప్రకారం వాళ్లు ఉల్లిపొర దుస్తుల్లో తిరుగాడుతూంటారు. ఛాతీమీద ఓ గుడ్డ కట్టుకోవడం తప్ప జాకెట్టు గట్రా తొడుక్కోరు. నడుం విస్తారంగా చూపిస్తారు. సెన్సారు వాళ్లు గట్టిగా అడగలేరు. పోను పోను ఈ డ్రస్సు రాకుమార్తెలకు కూడా వ్యాపించింది. కొన్ని సినిమాల్లో బొత్తిగా తువ్వాలు కట్టుకుని తిరుగుతున్నట్టు చూపించేశారు. అదే సాంఘిక సినిమా అయితే అలా చూపిస్తే అల్లరయిపోతుంది. మన జానపద సంప్రదాయం పేర సెక్స్‌ను కూడా సుబ్బరంగా మార్కెట్‌ చేసుకున్నారు మన సినీ నిర్మాతలు. అందువల్ల డబ్బింగ్‌లో కూడా యివి ఎంతో డబ్బు చేసుకున్నాయి. మీకో తమాషా చెప్పనా? నాకు కలిసిన ఇతర రాష్ట్రాలవాళ్లకు తెలుగు సినిమా హీరోల్లో కాంతారావు ఒక్కరే తెలుసు. ఎందుకంటే జానపద సినిమాలే వాళ్ల భాషలో డబ్‌ అయ్యాయి. రామారావు, నాగేశ్వరరావు అంటే ఎవరు వారు? అన్నారు. తర్వాత కౌబాయ్‌ సినిమాలు ఉధృతంగా వచ్చినపుడు ఇదే వరస! 'మొనగాడొస్తున్నాడు జాగ్రత్త' సినిమా తమిళంలో డబ్‌ చేస్తే మద్రాసులో సెఫైర్‌ వంటి ప్రీమియర్‌ థియేటర్లో నూరు రోజులాడింది. దాన్ని హిందీలో కూడా చేశారు. అందువల్ల వాళ్లకు కృష్ణ పేరు కూడా తెలుసు. ఎటొచ్చీ కృష్ణారావు అని అంటారు వాళ్లు. తెలుగువాళ్లందరికీ 'రావు' రావడం కంపల్సరీ అని వాళ్ల భావన!

సెక్స్‌తో బాటు భక్తి కూడా మార్కెటబుల్‌ కమోడిటీయే! నార్త్‌ యిండియన్‌ సినిమాల్లో భక్తి సినిమాల్లో అగ్రశ్రేణి తారలు నటించరు. అందువల్ల అన్నీ బి గ్రేడ్‌ సినిమాలే! సెకండ్‌ క్లాసు యాక్టర్లే! చవకబారు సెట్టింగ్సే! మన తెలుగులో భారీగా తీస్తాం కదా! అందువల్ల డబ్‌ చేస్తే అక్కడ బాగా ఆడతాయి. 'పాండవ వనవాసం' బెంగాలీలో డబ్‌ చేస్తే 100 రోజులాడింది. అక్కడ వాళ్లకు రామారావు తెలియదు, రంగారావు తెలియదు. అయినా సినిమా భారీతనం బట్టి, కథ బట్టి చూశారు. అలాగే కృష్ణ  'కురుక్షేత్రం' తెలుగులో బాగా ఆడకపోయినా, హిందీ డబ్బింగ్‌ నూరు రోజులాడింది. బాపు 'సంపూర్ణ రామాయణం' అయితే సిల్వర్‌ జూబిలీ… 25 వారాలాడింది. అంటే అక్కడివాళ్లు భక్తి సినిమాలకు మొహం వాచి వుంటారు. అందుకే రామాయణ్‌, మహాభారత్‌ టీవీ సీరియల్స్‌ వస్తే వెర్రెత్తినట్టు చూశారు. టీవీలకు హారతులిచ్చేశారు. ఇలాటి పరిస్థితుల్లో భక్తి, ఇందాకా చెప్పినట్టు రక్తి జోడించి సినిమా వదిలితే ఎలా ఆడి వుంటుందో ఊహించుకోండి. అసలు మన జానపదాలే హిందీ వెర్షన్లు బాగా ఆడాయి. చంద్రలేఖ, నిశాన్‌, మంగళా, చండీరాణి – యివన్నీ బాగా ఆడాయి. యాక్టర్లు దిలీప్‌కుమార్లు, మధుబాలలూ కాదు, మన రంజన్‌, భానుమతి – వీళ్లే! 'సువర్ణసుందరి' వంటి భక్తి రంగరించిన జానపద సినిమా హిందీ వెర్షన్‌ అయితే మరీనూ. నాగేశ్వరరావు, అంజలి అక్కడ సేలబుల్‌ నేమ్స్‌ కాదు కదా! అయినా సిల్వర్‌ జూబిలీ ఆడేసింది. 

ఇంత మార్కెట్‌ వున్న భక్తిప్రధానమైన జానపద చిత్రాల లక్షణాలు ఏమిటో చూద్దాం. ఇంతకుముందు కబుర్లలో శక్తి ప్రధానమైన సినిమాల గురించి చెప్పాను. కథానాయకుడు తన భుజబలంతో ఒక అసాధారణమైన కార్యాన్ని సాధించడం, ఒక అపూర్వమైన వస్తువుని పట్టుకురావడం వాటిలో కథాంశం. యుక్తి ప్రధానమైన సినిమాల్లో బలవంతుడైన శత్రువుని యుక్తితో, బుద్ధిబలంతో జయించడం కథాంశం. వీటిలో శారీరక బలం కంటె నేర్పు ముఖ్యం. కథలో ఒక చిక్కుముడి పడిపోయినప్పుడు దాన్ని హీరో గానీ, అతని చెలికాడు గానీ బుద్ధివిశేషంతో ఛేదించడం కథకు ప్రాణం. అయితే మనిషి శక్తికి, యుక్తికి పరిమితులుంటాయి. అది అందరికీ తెలుసు. ప్రతికూల పరిస్థితులు ఎదురయినపుడు శక్తి, యుక్తి నిష్ఫలమవుతాయి. అప్పుడు కథానాయకుణ్ని కాపాడేది భక్తి ఒక్కటే! ఆ దైవికశక్తిని ఎదిరించినవాడికి బుద్ధి గరపడం జరుగుతుంది. ఇప్పుడు 'నవగ్రహ పూజా మహిమ' వుంది. అందులో కాంతారావు హీరో. ఓ దేశానికి రాజు. తన భుజబలంపై అపారమైన నమ్మకం. నవగ్రహాల అనుగ్రహం లేకపోతే నువ్వెందుకూ పనికిరావు అంటే అతను వినిపించుకోడు. దాంతో శని అతనిమీద పగబట్టి నానా కష్టాల పాలు చేస్తాడు. ఎంత కష్టాలంటే మనకు దేవుడిమీద కోపం వచ్చేస్తుంది. మరీ యింత యిదిగా పగబట్టాలా? అని. అదే హీరోకూడా ఏడుస్తాడు 'ఎవరో ఎందుకీ రీతి సాధింతురు? ఏల పగబూని..' అని. రాజుగా వుండవలసినవాడు చివరికి నువ్వుల గానుగ ఆడించే స్థితికి వస్తాడు. చివరికి ఎంత దారుణం అంటే యితనికి ఆశ్రయం యిచ్చినవాళ్ల పిల్లాడు ఆ గానుగలో పడి నలిగి చచ్చిపోతాడు. అబ్బ అనిపిస్తుంది. దటీజ్‌ లాస్ట్‌ స్ట్రా ఆన్‌ ది కామెల్స్‌ బాక్‌ అన్నట్టన్నమాట. హీరో నవగ్రహాల మహిమను అంగీకరిస్తాడు. ఈ గానుగ ఆడడంలో నూనె వెళ్లి శని విగ్రహం మీద ఆటోమెటిక్‌గా పడి ఆయనకు తైలాభిషేకం అయిపోతుందన్నమాట. అందువల్ల ఆయనకూడా ప్రసన్నుడై చిటికలో సమస్యలన్నీ పరిష్కరించేస్తాడు. చచ్చిపోయిన పిల్లవాడు బతికి వచ్చేస్తాడు. పోయిన రాజ్యం చేతికి వచ్చేస్తుంది. 

ఇలాటి కథల్లో ప్రేక్షకులు లీనం అయిపోతారు. 'రామదాసు' చూడండి. అతను పన్నెండేళ్లపాటు జైల్లో పడివున్నా, అంతా చూస్తూ రాముడు పట్టించుకోకుండా వున్నా ప్రేక్షకులు రాముణ్ని తప్పుపట్టలేదు. పూర్వజన్మపరిపాకం. అనుభవించాలి కదా! అనుకుని సర్దిచెప్పుకుంటారు.  ఈ తరహాలో క్షౖేత్ర మహిమల మీద అనేక సినిమాలు వచ్చాయి. సింహాచల క్షేత్ర మహిమ, కాళహస్తి మహాత్మ్యం పేర తిన్నడి కథ వచ్చింది. తర్వాత భక్త కన్నప్ప పేర రీమేక్‌ అయి అనేక మార్పులు చేయించుకుంది. తిరుపతి క్షేత్ర మహాత్మ్యం అని ఓ సినిమా వచ్చింది. మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవం,  ఇలా అనేక సినిమాలకు పురాణాల్లో ఆధారాలు లేకపోయినా ఏవో పుక్కిటి పురాణాలపై ఆధారపడి సినిమాలు వచ్చేశాయి. భూకైలాస్‌, శ్రీ కృష్ణ గారడీ లాటివి. వాటిని జానపదాలనడమే సబబు. వ్రతాలు, పూజలు చేస్తే ఎంత మంచిదో చెప్పడానికి మీద సినిమాలు వచ్చాయి. నాగుల చవితి శ్రీ గౌరీ మహాత్మ్యం, కనకదుర్గ పూజా మహిమ, వరలక్ష్మీ వ్రతం, సోమవార వ్రతమహాత్మ్యం, మహేశ్వరి మహాత్మ్యం, వేంకటేశ్వర వ్రత మహాత్మ్యం, సంతోషిమాత వ్రత మహాత్మ్యం, సుబ్రహ్మణ్య స్వామి వ్రత మహిమ…'వెంకటేశ్వర మహాత్మ్యం' సినిమాలో చూడండి. సగం దాకానే వెంకటేశ్వరుడి కథ. తర్వాత ఆయన మహాత్మ్యం గురించి చెప్పడానికి కొన్ని జానపద గాథలు జోడించారు. అదే ఫక్కీలో అనేక సినిమాలు వచ్చాయి. నిజానికి మనం యింట్లో చేసుకునే సత్యనారాయణ వ్రతంలో కూడా చూడండి. సగం దాకానే మంత్రాలు. తర్వాత భాగమంతా వ్రతం చేస్తే ఏం లాభముందో, విస్మరిస్తే ఏం నష్టముందో చెప్పే కథలన్నీ జానపద గాథలే కదా! 'పాండురంగ మహాత్మ్యం'  సినిమా కూడా చూడండి. పుండరీకుడి కథ అంటూ వేశ్యతో సరసాలూ, భార్యతో పేచీలు అన్నీ సరదాగా చూపిస్తారు. చివర్లో భక్తి అంటూ ఓ రెండు పాటలు పెట్టేసరికి సినిమా సూపర్‌ హిట్‌ అయింది. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)

[email protected]

Click Here For Archives