ఎయు లో ‘గంట’కు రీ సౌండ్

హుద్ హుద్ నష్టాలను క్యాష్ చేసుకోవాలనుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం రచ్చకెక్కుతోంది. మొన్నటికి మొన్న హుద్ హుద్ వచ్చి వెళ్లిన కొన్నాళ్లకి ఎయు ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించేసారు గంటా..అబ్బో ఏమి దాతృత్వం…

హుద్ హుద్ నష్టాలను క్యాష్ చేసుకోవాలనుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం రచ్చకెక్కుతోంది. మొన్నటికి మొన్న హుద్ హుద్ వచ్చి వెళ్లిన కొన్నాళ్లకి ఎయు ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించేసారు గంటా..అబ్బో ఏమి దాతృత్వం అనుకున్నారంతా. ప్రభుత్వ లైబ్రరీ స్థలం లీజు పేరుతో తీసుకుని, భవనం పడగొట్టేసి, జనాలకు అందుబాటులో వున్న గ్రంధాలయాన్ని లేకుండా చేసిన చరిత్ర ను విశాఖ జనం మరిచిపోలేదు. మరి అలాంటిది ఇంత దాతృత్వమేమిటా అనుకున్నారు. పనిలో పనిగా వర్సిటీ వైస్ చాన్సలర్ 230 కోట్ల మేరకు వర్సిటీకి నష్టం వాటిల్లిందని ప్రకటించేసారు. అప్పుడే అంతా అబ్బుర పడ్డారు. 

ఎందుకంటే వర్సిటీలోని భవనాలన్నీ, ఇప్పుడు కొత్తగా కట్టినా కూడా అంతే అవుతుంది. లోపల సామగ్రి సంగతి వదిలేయండి. కేవలం భవనాలు కట్టాలంటే ఎంత అయిపోతుంది. ప్రభుత్వ ఇంజనీర్ల లెక్కలు పక్కన పెట్టండి. ఇళ్లు కట్టుకోవడం వచ్చినవారు ఎవరైనా లెక్కలేస్తే,. ఆ 230 కోట్లు లేదా మరో 70 కలిపి మూడు వందల కోట్లు ఖర్చు చేస్తే, వర్సిటీ ప్రధాన భవనాలు అన్నీ కట్టేయచ్చనే అంటారు. మరి అంత నష్టం వర్సిటీకి ఏం వచ్చినట్లు? వర్సిటీకి వచ్చిన ప్రధాన నష్టం. దాంట్లో అపారంగా వున్న చెట్లు పాడైపోవడం. అది కూడా పాడైపోలేదు. పెద్ద చెట్లు కొమ్మలు బాగా పోయాయి. ఇప్పుడు ఈ పదిహేను రోజుల్లో మళ్లీ  చాలా వరకు చిగుర్లు పట్టాయి. చిన్నవి పడిపోయాయి. వాటి స్థానంలో కొత్త మొక్కలు వేయాలి. ప్రభుత్వం మొక్కలు ఇవ్వాలే కానీ వర్సిటీ విద్యార్ధులే స్వయంగా వాటిని నాటతారు. ఇంక మిగిలిన ఇంకో నష్టం..అక్కడక్కడ షెడ్ లు, వాటిపైరేకులు, చాలా భవనాల అద్దాలు. వాటికి 230 కోట్లు ఖర్చు అవుతుందని ఎలా అంచనా వేసారు..ఎవరు అంచనా వేసారు..దానికున్న శాస్త్రీయత ఏమిటి? ఇంత తక్కువ టైమ్ లో ఎలా అంచనా వేసి, విసి దాన్ని ప్రకటించేసారు? ఇవన్నీ అనుమానాలు

అయితే ఈ వ్యవహారం అంతటి వెనుక మంత్రి గంటా వున్నారుట. వర్సిటీని దత్తత తీసుకోవడం ద్వారా తన కంట్రోల్ లోకి తెచ్చుకుని, ఆపై 230 కోట్ల నష్టం చూపించి, నిధులు తెచ్చుకుని తన ఇష్టానికి ఖర్చు చేయించవచ్చన్నది గంటా ప్లాన్ గా ఇప్పుడు బయటకు వచ్చింది. ఎయు కు చెందిన వివిధ విభాగాధిపతులు ఈ వ్వవహారంపై ధ్వజమెత్తినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ పరీక్షల నిర్వహణకు డిపార్ట్ మెంట్ హెడ్ ల సమావేశం నిర్వహించినపుడు ఈ వైనం బయటకు వచ్చిందట. అసలు 'గంటా'ఎందుకు ఎయు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి అని నిలదీసారట. విసి, రిజిస్టార్ గంటాకు వంత పాడుతున్నారని, 230 కోట్లు నష్టం అని ఎలా అంచనా వేసారని, వస్తు సాయం చేస్తానన్నవారిని వదిలేసి, అందర్నీ డబ్బు సాయమే చేయమని ఎందుకు అడుగుతున్నారని నిలదీసారట. 

అంటే గంట దత్తత వెనుక వున్న కథ ఇదన్న మాట. భారీగా నష్టం అంచనా వేయించి, నిధులు మంజూరు చేయించి, ఖర్చు చేసే పనిపై అదుపు వుండడం కోసం దత్తత అన్న భారీ ప్రణాళిక వేసారన్నమాట. ఎయు లో ఉద్యోగులు అంటే బదిలీలు అలాంటివి వుండవు..ఎప్పుడో విసి చాన్స్ తప్ప, అది కూడా గవర్నర్ దే పెత్తనం. అందుకే ధైర్యంగా గొంతు విప్పి వుంటారు. మిగిలిన విభాగాల్లో ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో,. అక్కడ గొంతులు లేవవు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ల దే కదా.

'చిత్ర'గుప్త