దేశమంతా ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే నల్ల కుబేరుల వ్యవహారం. మన దేశంలో అడ్డగోలుగా సంపాదించి, దాన్ని విదేశాల్లో జాగ్రత్తగా దాచుకోవడం.. నల్ల కుబేరులు చేసే పని. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నది ఆర్థిక నిపుణుల వాదన. మన దేశంలోనే సంపాదించి, మన దేశంలోనే దాన్ని దాచుకోవాలంటే అనేకానేక సమస్యలు. ఆదాయపు పన్ను శాఖకి సక్రమంగా పన్నులు చెల్లించాలి.. అలా చేయాలంటే సంపాదించినదాంట్లో చాలామొత్తం కోల్పోవాల్సి వస్తుంది. అదే ‘కుబేరుల’ ఆవేదన. అందుకే, ఎంచక్కా విదేశీ బ్యాంకుల్లో మన సొమ్ముల్ని భద్రంగా దాచేసుకుంటారు.
ఓ యాభై వేల మంది అక్రమంగా విదేశీ బ్యాంకుల్లో నల్ల ధనాన్ని దాచారనేది ఓ అంచనా. వారి లిస్ట్ అంతా కేంద్రం వద్ద వుందో లేదోగానీ, కొందరి పేర్లతో కూడిన లిస్ట్ అయితే కేంద్రం వద్ద వుంది. దాంట్లో కొంత భాగాన్ని ఇప్పటికే కేంద్రం, సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ రోజు మరో లిస్ట్‌ను కేంద్రం, సుప్రీం ముందుంచనుంది. ఈ రోజు సుప్రీంకి సమర్పించే లిస్ట్‌లో 600 మంది పేర్లు వున్నాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
అసలు నల్ల కుబేరులందర్నీ దొంగలుగా పేర్కొనాలా.? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సామాన్యుల్లో చాలామంది ‘అవును.. వారు దొంగలే’ అనేస్తున్నారు. కొందరు మాత్రం, రాజకీయ నాయకులతో పోల్చితే వారి దొంగతనం పెద్దదేమీ కాదు.. తొలుత రాజకీయ నాయకుల బండారం బయటపెట్టే దిశగా ప్రభుత్వాలైనా, కోర్టులైనా వ్యవహరిస్తే మంచిదని అంటున్నారు. ఈ నల్ల కుబేరుల్లో ఎక్కువమంది రాజకీయ నాయకులే వుంటారనుకోండి.. అది వేరే విషయం.
ఓ సాధారణ రాజకీయ నాయకుడ్నే తీసుకుందాం.. ఆయనగారికి సొంత కారు వుండదు.. కానీ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కోట్లు వచ్చేస్తాయి. ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయాలంటేనే పదో పాతికో కోట్లు వుండాలిప్పుడు. దేశంలో ఏ నియోజకవర్గంలో అయినా పరిస్థితి ఇదే. ఎన్నికల కమిషన్‌కి ఇచ్చే అఫిడవిట్‌లో మాత్రం, పదివేలో పాతిక వేలో సొమ్ములు, లక్షో, పది లక్షలో ఆస్తులు వున్నట్లు చూపిస్తారు. కోటి, రెండు కోట్లు చూపించినా.. వాటితో సమానంగా అప్పులు చూపేవారే ఎక్కువమంది. రాజకీయాల్లోకి వెళితే ఎవరైనా కుబేరులవ్వాల్సిందే.. అన్న అభిప్రాయం జనంలో బలంగా నాటుకుపోయింది. కార్పొరేటర్ నుంచి ఎంపీ దాకా.. కోటీశ్వరులే తప్ప, లక్షాధికారులు లేని రోజులివి. కానీ, ఎన్నికల కమిషన్ అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లను ఎలా నమ్ముతోంది.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
వ్యవస్థలో మార్పు రావాల్సిందే. దానికి నల్ల కుబేరుల్ని ఏరివేయడం అనేది తొలిమెట్టు అయితే అంతకన్నా కావాల్సిందేముంటుంది.! రాజకీయ పార్టీలకు పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇస్తుంటారు. ఎందుకూ.? అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు అనుకూలంగా వ్యవహరించాలన్న కోణంలో. అందుకే, పారిశ్రామిక వేత్తల విరాళాలు అన్ని పార్టీలకూ వెళుతుంటాయి. ‘లంచం’ అనకుండా, విరాళం.. అనే గొప్ప పేరు పెడ్తుంటారని సామాన్యుల్లో ఓ బలమైన అభిప్రాయం వుండనే వుంది.
ముగ్గురో ఆరొందల మందో.. యాభై వేల మందో.. లెక్కలంటూ తేలాలి.. వారి వెనుక వున్న రాజకీయమూ తెరపైకి రావాలి. అప్పుడే దేశాన్ని పట్టి పీడిస్తున్న ‘నల్లజాడ్యం’ నుంచి భారతదేశానికి విముక్తి లభిస్తుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్తుంది. ఆ రోజు అతి త్వరలో రావాలని ఆశిద్దాం