సినిమా రివ్యూ: జంప్‌ జిలాని

రివ్యూ: జంప్‌ జిలాని రేటింగ్‌: 2/5 బ్యానర్‌: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వెంకటేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ తారాగణం: అల్లరి నరేష్‌ (ద్విపాత్రాభినయం), ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్‌, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, కొట శ్రీనివాసరావు, రావు…

రివ్యూ: జంప్‌ జిలాని
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వెంకటేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: అల్లరి నరేష్‌ (ద్విపాత్రాభినయం), ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్‌, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, కొట శ్రీనివాసరావు, రావు రమేష్‌ తదితరులు
మాటలు: క్రాంతిరెడ్డి సకినాల
సంగీతం: విజయ్‌ ఎబెంజర్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
నిర్మాతలు: అంబికా రాజా, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
విడుదల తేదీ: జూన్‌ 12, 2014

మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌ కొంతకాలంగా డీసెంట్‌గా ఉందనిపించే సినిమా చేయలేక సతమతమవుతున్నాడు. వరుస పెట్టి ఫ్లాపులతో దంచి కొడుతోన్న అల్లరి నరేష్‌ సక్సెస్‌ కోసం మరోసారి ఇ. సత్తిబాబుతో జత కట్టాడు. గతంలో కొన్ని చెప్పుకోతగ్గ కామెడీ సినిమాలు తీసిన సత్తిబాబు ఈసారి నరేష్‌తో ద్విపాత్రాభినయం చేయించాడు. ఇద్దరు నరేష్‌లుంటే కామెడీ ఖచ్చితంగా వర్కవుట్‌ అయి ఉంటుందని ఆశించి వెళితే జంప్‌ జిలానితో నిరాశ తప్పదు. 

కథేంటి?

తరతరాలుగా తమ కుటుంబం నడుపుతోన్న హోటల్‌నే భారంగా నడుపుతోన్న సత్తిబాబు (అల్లరి నరేష్‌) ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ మాధవితో (ఇషా చావ్లా) ప్రేమలో పడతాడు. అతని కవల సోదరుడు రాంబాబు (అల్లరి నరేష్‌) పెద్ద దొంగ. పైగా పేకాట పిచ్చి. సత్తిబాబు హోటల్‌ ఉండే సైట్‌ మీద కన్నేస్తాడో ఎస్సై (భరత్‌). రాంబాబుని పేకాటలో ఓడించి హోటల్‌లో వాటా రాయించేసుకుంటాడు. మరోవైపు మాధవికి ఫ్యాక్షనిస్ట్‌ ఉగ్రనరసింహారెడ్డితో (పోసాని) నిశ్చితార్ధం జరిగితే ఆమెని తనతో తీసుకురావడానికి పులివెందుల వెళతాడు సత్తిబాబు. మాధవిని అతను అక్కడ్నుంచి ఎలా తీసుకొస్తాడు.. తన హోటల్‌ని ఎలా కాపాడుకుంటాడు?

కళాకారుల పనితీరు:

అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయం అయితే చేసాడు కానీ అతని పాత్రల మధ్య వేరియేషన్స్‌ ఏమీ లేవు. ఒక పాత్రలో అమాయకంగా, ఒక పాత్రలో కన్నింగ్‌గా ఉంటాడే తప్ప అంతకు మించి తేడా ఏముండదు. అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయం సరదా తీర్చిందనే ఒక్కటీ తప్ప దీని వల్ల అతనికి నటుడిగా యాడ్‌ అయ్యేదేమీ లేదు. ఇషా చావ్లా ఒకటే ఎక్స్‌ప్రెషన్‌తో చాలా సేపు చిరాకు పెడుతుంది. స్వాతి దీక్షిత్‌ నటన కంటే అందాల ప్రదర్శననే నమ్ముకుంది. 

రావు రమేష్‌ పాత్రని బ్యాంగ్‌తో ఇంట్రడ్యూస్‌ చేసి తర్వాత బఫూన్‌ని చేసారు. పోసాని కృష్ణమురళి చేసిన కామెడీ మరీ బి గ్రేడ్‌ లెవల్లో ఉంది. వేణుమాధవ్‌, రఘుబాబు సీన్స్‌ పేలలేదు. ఎమ్మెస్‌ నారాయణ, కోట శ్రీనివాసరావు పాత్రల వల్ల ఒరిగిందేమీ లేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:

కామెడీ సినిమాల్లో కూడా కమర్షియల్‌ చిత్రాల లెక్కన ఇన్ని పాటలుండాలని లెక్క దేనికో అర్థం కాదు. పైగా అవి వినడానికి కూడా పనికి రానపుడు అన్ని పాటలు పెట్టుకోవడం వల్ల సిగరెట్‌ అలవాటున్న వాళ్లకి ఎక్స్‌ట్రా సిగరెట్ల ఖర్చు… అది లేని వాళ్లకి బోనస్‌గా తలపోటు తప్ప సినిమాకి పనికొచ్చేదేం ఉండదు. కితకితలు సినిమాలో పాటలు లేకుండా ఇవివి కానిచ్చేయలేదా… సక్సెస్‌ కొట్టలేదా? అల్లరి నరేష్‌ అడపాదడపా ఆ పద్ధతి ఫాలో అయిపోతే అంతో ఇంతో బెనిఫిట్‌ ఉంటుంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్‌కి పూర్తి స్వేఛ్ఛనిచ్చేసి ఉంటే… అసలు సినిమా కంటే రోలింగ్‌ టైటిల్స్‌లో డిలీటెడ్‌ సీన్లు ఎక్కువ ఉండేవి. 

మాటల రచయిత పంచ్‌ కంటే ప్రాసకే ప్రాధాన్యత ఇచ్చాడు. నిర్మాతలు ఈ సినిమాకి అవసరం అయినంత మేరకు ఖర్చు పెట్టారు. దర్శకుడు ఇ. సత్తిబాబు మాత్రం ఈ పాత చింతకాయతో ఏం చేయాలో తెలీక చేతులెత్తేసాడు. దర్శకుడి నిస్సహాయత సినిమా మొదలైన పావుగంటకే అర్థమైపోతే ఇక ఆ చిత్రాన్ని చివరి వరకు చూడడం ప్రేక్షకులకి పెద్ద శిక్షే. అక్కడక్కడా తన గురువు ఇవివి మార్కు పంచ్‌లు విసిరినా కానీ ఓవరాల్‌గా మాత్రం సత్తిబాబు బాగా ఫెయిలయ్యాడు. 

హైలైట్స్‌:

మొహమాటానికి అవీ ఇవీ అని ఇక్కడో రెండు, మూడు రాస్తే… జంప్‌ జిలానీ టీమ్‌ అది నిజమనుకుంటారు.

డ్రాబ్యాక్స్‌:

నిక్కచ్చిగా ఉన్న మైనస్‌లన్నీ రాస్తూ పోతే… ఓపిక హరించిపోయి ఇక్కడితో ఈ సమీక్ష చదవడం మానేస్తారు. 

విశ్లేషణ:

ఇప్పుడు ఎంత పెద్ద హీరో ఉన్న సినిమాలో అయినా కామెడీ లేకపోతే ఆడియన్స్‌ పెదవి విరిచేస్తున్నారు. హీరో రెండు గంటల పాటు తన హీరోయిజం చూపించినా కానీ చివరి రీలులో అయినా బ్రహ్మానందం వచ్చి నవ్విస్తే కానీ యాభై కోట్లు చదివించుకోడానికి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. రొటీన్‌ సీన్లే అయినా కానీ తమ కామెడీ డోస్‌ తమకి కావాల్సిందే అని బ్రహ్మీకి ఎడిక్ట్‌ అయిపోయిన ఆడియన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఏ సినిమాలో అయినా బ్రహ్మీ కామెడీ ఇరికించేస్తున్నారు. 

పెద్ద హీరోల పరిస్థితే అలా ఉన్నప్పుడు అచ్చంగా కామెడీ సినిమా తీసి నవ్వించలేకపోతే ఇక దానిని ఎందుకు క్షమిస్తారు. గత కొంతకాలంగా అల్లరి నరేష్‌ సినిమాలు వచ్చినవి వచ్చినట్టే టపా కట్టేస్తున్నాయంటే కారణం కామెడీ లేకనే కదా. ఇద్దరు నరేష్‌లని పెట్టి సత్తిబాబు ఓ కామెడీ ఇరగదీసేస్తాడనుకుంటే… ఇంతోటి సినిమాలో నరేష్‌తో డబుల్‌ క్యారెక్టర్‌ వేయించింది ఎందుకో అనిపించేట్టు చేసాడు. కామెడీ హీరో ద్విపాత్రాభినయం చేసినప్పుడు ఆ క్యారెక్టర్ల నడుమ కామెడీని ఆశిస్తారు. కానీ ఈ చిత్రంలో డ్యూయెల్‌ రోల్‌ శుద్ధ దండగ అనిపిస్తుంది. 

కథలో విషయం లేకపోవడంతో దర్శకుడు ముందే హ్యాండ్సప్‌ అనేయడం వల్ల జంప్‌ జిలానీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించుకోడానికి పనికొస్తుంది. ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన ప్రేక్షకులు ద్వితీయార్థం సగంలోకి వచ్చేసరికి ‘జంప్‌ జిలానీ’ అని ‘బయటకు దారి’ ఎటో చూసుకుని జంప్‌ అయిపోతారు. డైరెక్టర్‌ ఎలాగో టైటిల్‌ జస్టిఫికేషన్‌ చేయట్లేదని… ఆడియన్స్‌ అయినా జస్టిఫై చేస్తున్నారనుకోవాలి. 

కామెడీ పుట్టించడానికి దర్శకుడు, నటీనటులు పడే ప్రయాస చూసి నవ్వు రాకపోగా వారిపై జాలేస్తుంది. ఈ సినిమా చూడ్డం తప్పదనుకుంటే… అల్లరి నరేష్‌ పాత సినిమాల్లోని కామెడీ క్లిప్పింగులు మొబైల్‌లో స్టోర్‌ చేసుకుని వెళ్లండి. వాటి అవసరం బాగా ఉంటుంది. కామెడీ షోల్లో వేసే కామెడీ క్లిప్పింగ్స్‌ కోసం ఈ సినిమాని పంపిస్తే పట్టుమని పది నిముషాల విషయమున్న స్టఫ్‌ దొరకదంటే ఇదెంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోండి. ఈ సినిమా వల్ల జంప్‌ జిలాని అనే క్యాచీ టైటిలు… అల్లరి నరేష్‌ డ్యూయల్‌ రోలు అడ్డంగా వేస్టయిపోయింది. నరేష్‌ ఇప్పటికైనా ఆడియన్స్‌ పల్స్‌ పట్టుకునే పనిలో ఉంటే బెటరు. లేదంటే తన సినిమాలొచ్చినపుడు ఆడియన్స్‌ తమ పర్స్‌కి పని పెట్టుకోవడం మానేస్తారు. 

బోటమ్‌ లైన్‌: జిలానికి దొరక్కుండా జంప్‌ అయిపోండి!

-జి.కె.