జాతీయ భద్రతా సలహాదారుగా ఒక ఉద్దండుడు

మోదీ ప్రభుత్వం జాతీయ భద్రతా సలహాదారుగా ఎంపిక చేసుకున్న అజిత్‌ దోవల్‌ గతంలో ఇంటెలిజెన్సు బ్యూరో (ఐబి)కు చీఫ్‌గా పనిచేసినవాడు. పాకిస్తాన్‌, లండన్‌లలో కూడా పనిచేశాడు. సలహాదారు పదవిలో గతంలో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసుకు…

మోదీ ప్రభుత్వం జాతీయ భద్రతా సలహాదారుగా ఎంపిక చేసుకున్న అజిత్‌ దోవల్‌ గతంలో ఇంటెలిజెన్సు బ్యూరో (ఐబి)కు చీఫ్‌గా పనిచేసినవాడు. పాకిస్తాన్‌, లండన్‌లలో కూడా పనిచేశాడు. సలహాదారు పదవిలో గతంలో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసుకు చెందిన రాయబారులూ పనిచేశారు, ఐపియస్‌కు చెందిన పోలీసు అధికారులూ చేశారు. దేశభద్రత విషయంలో పోలీసు పద్ధతులు పనికిరావని, యితర దేశాలతో వ్యవహరించేటప్పుడు లౌక్యం వుపయోగించి, మెళకువతో పనులు చక్కబెట్టాలని మొదటి సలహాదారు బ్రజేష్‌ మిశ్రా అభిప్రాయపడేవారు. ఆయన తన పదవీకాలంలో ఐబితో పేచీ పడ్డాడు. అయితే అప్పటి హోం మినిస్టర్‌ ఆడ్వాణీ ఐబిని వెనకేసుకుని వచ్చాడు. బ్రజేష్‌ తర్వాత ముగ్గురిలో యిద్దరు డిప్లోమాట్లే, ఎం కె నారాయణన్‌ ఒక్కరే ఐబికి చెందినవాడు. అతనే దోవల్‌ను 2004లో ఐబికి చీఫ్‌ చేశాడు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పటినుంచీ మోదీతో దోవల్‌ సన్నిహితంగా మెలిగాడు. పాకిస్తాన్‌పై, టెర్రరిజంపై యిద్దరివీ ఒకే అభిప్రాయాలు. ఇష్రాత్‌ జెహాన్‌ ఎన్‌కౌంటర్‌ వివాదంలో అతను టెర్రరిస్టే అని మోదీతో పాటు దోవల్‌ అభిప్రాయం కూడా. దాన్ని బహిరంగంగా చెప్పడానికీ అతను వెఱవలేదు. పోలీసు వాడైన అతనికి మిలటరీ అవార్డు ఐన కీర్తి చక్ర కూడా యిచ్చారు. అది అరుదైన సన్మానం. అయితే తన కీర్తి పెంచుకోవడానికి అతనే కొన్ని కథలను సృష్టిస్తాడన్న అపప్రథా వుంది.

దోవల్‌ వయసు 69. కేరళ క్యాడర్‌కు చెందిన ఐపియస్‌. భారతీయ గూఢచారుల్లో అగ్రగణ్యుడు. సాహసి. అతన్ని మిజోరాంలో వేసినపుడు అక్కడ తీవ్రవాదులు చాలా బలంగా వున్నారు. ఐజ్వాల్‌ నుండి కచిన్‌ ద్వారా చైనా సరిహద్దుల్లోకి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి వాళ్లకు స్నేహహస్తం చాచాడు. తరచుగా తన యింటికి భోజనానికి పిలిచి భార్య చేత పందిమాంసం వండించి పెట్టించేవాడు. మిజో లిబరేషన్‌ ఆర్మీ అధినేత లాల్‌డెంగాకు సన్నిహితంగా వుండే 7గురిలో 6 గుర్ని తనవైపు తిప్పుకోవడంతో, యిక గత్యంతరం లేక లాల్‌డెంగా ఆయుధాలు విడిచి భారత్‌తో శాంతి ఒప్పందానికి అంగీకరించవలసి వచ్చింది.

ఖలిస్తాన్‌ తీవ్రవాదుల ఉద్యమం బలంగా సాగుతున్నపుడు 1988లో ఐబివారు ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్‌ అని ప్లాన్‌ చేశారు. స్వర్ణదేవాలయంపై హఠాత్తుగా దాడి చేసి, అక్కడ దాగున్న తీవ్రవాదులను నిర్వీర్యం చేయాలని పథకం వేశారు. అయితే వారు తమ వద్దనున్న బాంబులతో దేవాలయాన్ని పేల్చేస్తామని బెదిరిస్తే..? అని భయం వేసింది. అప్పుడు దోవల్‌ రంగంలోకి దిగాడు. తనను తాను పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ ఐయస్‌ఐ ఏజంటుగా పరిచయం చేసుకుని స్వర్ణదేవాలయంలోని ఖలిస్తానీయులకు చేరువయ్యాడు. కొన్ని వారాలపాటు వాళ్లతోనే కలిసి నివసించాడు. తర్వాత 'నా దగ్గరున్న బాంబులను మనం దేవాలయం గోడల చుట్టూ గోతులు తీసి పాతిపెడదాం, భారతసైన్యం దాడి చేస్తే మనమే గుడిని పేల్చేసి, వాళ్లే అలా చేశారని ప్రచారం చేద్దాం' అని ప్రతిపాదించాడు. భేష్‌ అనుకున్నారు వాళ్లు. ఇతను తనతో తెచ్చిన ఉత్తుత్తి బాంబులను వాళ్లచేత పాతి పెట్టించి వచ్చేశాడు. ఆ తర్వాత భారతసైన్యం దాడి చేయబోయినప్పుడు ఖలిస్తాన్‌లు మా దగ్గరకు వస్తే మేం పాతిపెట్టిన బాంబులతో గుడి పేల్చేస్తాం జాగ్రత్త అని బెదిరించినప్పుడు సైన్యం పగలబడి నవ్వుకుంది! మోసపోయామని గ్రహించిన ఖలిస్తానీలు లొంగిపోయారు.

పంజాబ్‌లో ఖలిస్తాన్‌లను అణచివేసిన పోలీసు అధికారి జూలియో రిబెరో రుమేనియాలోని బుఖారెస్టులో రాయబారిగా వున్నపుడు ఖలిస్తానీలు ఆయనపై దాడి చేశారు. రుమేనియన్‌ పోలీసులు దాడి చేసినవారని ఖైదు చేశారు. వాళ్లను విడుదల చేయించుకోవడానికి ఖలిస్తానీలు ఇండియాలోని రుమేనియన్‌ రాయబారి లివియూ రాడూను కిడ్నాప్‌ చేశారు. దోవల్‌ అతని టీము రాడూని విడిపించడానికి బయలుదేరారు. వీరిని తప్పించుకోవడానికి  కిడ్నాపర్లు ప్రతి పది గంటలకు స్థావరం మార్చసాగారు. దోవల్‌ టీము ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వచ్చింది. చివరకు వాళ్లు అతన్ని వదిలేశారు. కొందరు యీ కథను కొట్టి పారేస్తారు. 'తాము కిడ్నాప్‌ చేసిన సంగతి అంతర్జాతీయ మీడియాలో వార్తగా రాలేదని గ్రహించిన ఖలిస్తానీలు యింకెందుకీ ప్రయాస అనుకుని రాడూను తామే వదిలేశారు' అంటారు. తాలిబన్లు ఇండియన్‌ ఎయిర్‌లైన్సు విమానాన్ని హైజాక్‌ చేసి కందహార్‌కు తీసుకెళ్లినపుడు వారితో బేరసారాలు ఆడడానికి పంపిన యిద్దరు అధికారులలో దోవల్‌ ఒకడు. భారత జైళ్లల్లో వున్న 36 మంది ఉగ్రవాదులను విడుదల చేయాలని, లేకపోతే 160 మంది ప్రయాణీకులను చంపేస్తామని హైజాకర్ల డిమాండ్‌. 110 గంటల పాటు చర్చలు సాగాయి. చివరకు 3గ్గురు ఉగ్రవాదులను విడుదల చేస్తే చాలని హైజాకర్లను ఒప్పించారు. మధ్యవర్తులు ఆ మేరకు విజయం సాధించినట్లే. 

2005లో దావూద్‌ ఇబ్రహీరను మట్టుపెట్టడానికి భారత యింటెలిజెన్సు ఒక పథకం రచించింది. దావూద్‌ కూతురికి, పాకిస్తాన్‌ క్రికెటర్‌ జావేద్‌ మియాందాద్‌ కొడుక్కి పాకిస్తాన్‌లో పెళ్లయింది. పెళ్లి తాలూకు విందు దుబాయ్‌ ఎయిర్‌పోర్టు వద్దనున్న గ్రాండ్‌ హయాత్‌ హోటల్‌లో జరిగింది. ఆ విందుకు దావూద్‌ వచ్చి తీరతాడు కాబట్టి అక్కడే అతన్ని షూటర్లచేత కాల్పించి చంపాలని ఐబి ప్లాన్‌. ఇది అఫీషియల్‌గా చేయలేరు కాబట్టి ఐబి చీఫ్‌గా పనిచేసిన రిటైరైన ఆయన్ని యీ ఆపరేషన్‌ను పర్యవేక్షించమన్నారు. అతను దావూద్‌ శత్రువైన ఛోటా రాజన్‌ అనుచరుడు విక్కీ మల్‌హోత్రాను దువ్వాడు. అతను ఫరీద్‌ తనాషా అనే మరో షూటర్‌ను పరిచయం చేశాడు. ఇద్దర్నీ ఢిల్లీకి రప్పించి, వాళ్ల శక్తియుక్తులు పరీక్షించి, తర్ఫీదు యిప్పించి, యిక వాళ్లను దుబాయి విమానం ఎక్కించబోతూ వుండగా యింతలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ నుండి డిసిపి ధనంజయ్‌ కమలాకర్‌ వచ్చి మీ అందర్నీ అరెస్టు చేస్తున్నానన్నాడు. వాళ్లు తనాషా ఫోన్‌ ట్యాప్‌ చేసినపుడు అతని ఆనుపానులు తెలిశాయి. ఇక్కడేదో నేరం జరుగుతోందని గ్రహించి వాళ్లు వీళ్లున్న చోటుకి వచ్చిపడ్డారు. ఐబి మాజీ అధినేత కమలాకర్‌పై మండిపడ్డాడు, చిందులు వేశాడు. 

ఇదంతా సీక్రెట్‌ ఆపరేషన్‌ కాబట్టి కమలాకర్‌కు ఓ పట్టాన బోధపడలేదు. బోధపడి, సరే అనేసరికి అక్కడ దుబాయి విమానం వెళ్లిపోయింది. మొత్తం ప్లాను నాశనమైంది. ఇది పొరబాటున జరిగింది కాదనీ, దావూద్‌కు తనపై దాడి విషయం తెలిసి, ముంబయి పోలీసు వ్యవస్థలో తన మిత్రుల ద్వారా కమలాకర్‌కు ఉప్పందేట్లా చేశాడనీ అంటారు. ఆ విందుకు దావూద్‌ హాజరు కాకపోవడం చేత, యీ అనుమానం బలపడింది. ఆనాటి యీ సంఘటనలో అక్కడున్న ఐబి చీఫ్‌ దోవల్‌ అని ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'' రాసింది. అతన్ని అడిగితే 'అబ్బే నేను కాదు, ఆ వేళకి నేను యింట్లో వుండి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తున్నా'' అన్నాడు. గూఢచారులు చెప్పినవన్నీ నిజాలు కానక్కరలేదు.

ఈ కథను తక్కినవారు నమ్మినా నమ్మకపోయినా మోదీ నమ్మినట్టు కనబడుతోంది. దావూద్‌ను పట్టి భారత్‌కు తీసుకురావడమే నా లక్ష్యం అని మోదీ ప్రకటించాడు కాబట్టి ఆ పని చేయగల ఉద్దండుడు దోవల్‌ మాత్రమే అనుకుని అతనికి భద్రతా సలహాదారు పదవి యిచ్చినట్లు తోస్తోంది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]