ఈ లీజు గలీజేమిటి?

తెలంగాణ, ఆంధ్ర నడుమ సినిమా థియేటర్ల వివాదం కూడా ముదరబోతోందా? ఇద్దరు ఎంపీలు, ఒక మంత్రి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. టాలీవుడ్ లో సినిమా థియేటర్ల లీజు అన్నది ఇప్పుడు సమస్యగా…

తెలంగాణ, ఆంధ్ర నడుమ సినిమా థియేటర్ల వివాదం కూడా ముదరబోతోందా? ఇద్దరు ఎంపీలు, ఒక మంత్రి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. టాలీవుడ్ లో సినిమా థియేటర్ల లీజు అన్నది ఇప్పుడు సమస్యగా మారుతోంది. నిజానికి థియేటర్ల లీజు అన్నది కొత్తగా పుట్టుకువచ్చింది కాదు. పాతికేళ్ల కిందటి నుంచి వున్నదే. అయితే ఇది రాష్ట్ర స్థాయిలో వుండేది కాదు. స్థానికంగా డిస్ట్రిబ్యూటర్లు అక్కడికక్కడి థియేటర్లను లీజుకు తీసుకునేవారు,. ఎందుకంటే వారు హక్కులు కొనుక్కున్న సినిమాలు వుంటాయి కాబట్టి, పర్సంటేజీ విధానంతో కన్నా, లేదా లోకల్ గా అమ్మడం కన్నా, తామే ప్రదర్శించుకుంటే కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయని. అంతే తప్ప గుత్తాధిపత్యం అన్న ఆలోచన అప్పట్లో లేదు. 

విజనరీ అయిన రామోజీరావు మయూరి పంపిణీ సంస్థను ప్రారంభించిన కొత్తలో అన్ని జిల్లాల్లో థియేటర్లను తీసుకుని, పాత విధానంలో రిప్రజెంటీటీవ్ లను నియమించి, భారీ ఎత్తున వ్యూహరచన చేసారు. కానీ ఆరంభంలో సాగినంత విజయవంతంగా తరువాత సాగలేదు. దాంతో లీజు ముగిసిన తరువాత చాలా వాటిని వదిలేసారు. అప్పుడు ప్రారంభమైంది. కొద్దిమంది ఈ వ్యవహారంలో ముందుచూపును పసిగట్టడం. ముఖ్యంగా పంపిణీ వ్యవహారాలు, నిర్మాణంలో సమస్యలు, అవసరాలు తెలిసినవారు ఆ దిశగా అడుగుముందుకు వేసారు. దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, ఎన్ వి ప్రసాద్, అల్లు అరవింద్ లాంటి ఉభయచరాలు, అంటే ఇటు పంపిణీ వ్యవహారాలు, అటు నిర్మాణ వ్యవహారాలు వున్నవారు..ఆ దిశగా అడుగేసారు. మళ్లీ ఒకరికి ఒకరు పోటీ కాకుండా, వీలయినంత సామరస్యంగా సర్దుకున్నారు. 

ఇది చాలా వరకు కలిసి వచ్చింది. ఇక్కడ ఒక సంగతి ఆలోచించాలి. వ్యాపారం అన్నాక లాభం కోసమే చేస్తారు. ఇప్పుడు మాల్స్, చైన్ షాపులు, వచ్చేసాయి. ఆన్ లైన్  షాపింగ్ మొదలైంది. ఇందువల్ల చిన్న వ్యాపారులు కుదేలైపోతున్నారు. తప్పదు కాలధర్మం. వీళ్ల వ్యాపారం కోసం వాళ్ల వ్యాపారం మూసేయాలి అంటే కుదరదు. అసలు థియేటర్ యజమానులు తమ థియేటర్లను ఎందుకు లీజుకు ఇస్తున్నారు. వాళ్లకు లాభసాటిగా వుంటే వాళ్లే నడుపుకుంటారు కానీ లీజుకు ఎందుకు ఇస్తున్నారు. అంటే అక్కడ వాళ్లకి ఏదో సమస్య.,.ఇవ్వడం వల్ల ఏదో లాభం వుండి వుండాలి. బలవంతంగా లీజుకు తీసుకోలేరు కదా? 

అయితే లీజుకు తీసుకున్నవాళ్లు చేస్తున్న వ్యవహారాలు కొన్ని మాత్రం పలు సమస్యలకు దారి తీస్తున్నాయి. తమకు కావాల్సిన సినిమాల కొసం నడుస్తున్నవాటిని తీసేయడం, లేదా అద్దె పెంచేయడం లాంటివి. ఇక్కడ మాత్రం ప్రభుత్వం జోక్యం అవసరం. థియేటర్ల లీజుకు సంబంధించి ఎబిసి సెంటర్లుగా విభజించి, కొన్ని విధి విధానాలు రూపొందించాలి. అద్దెలు తమ చిత్తానికి అటు ఇటు మార్చే విధానాన్ని కట్టడి చేయాలి. 

సినిమా మొదటి వారం ఒక అద్దె, రెండో వారం ఇంకో రకం అన్నది కొన్ని సినిమాలను ఇబ్బంది పెట్టడానికి పనికివస్తోంది.. చిన్న సినిమాలు సాధారంణంగా ఒక వారానికి థియేటర్ ను తీసుకుంటాయి. ఉదాహరణకు రోజుకు 50వేలు అనుకుందాం. సినిమా బాగా ఆడుతుంటే మరోవారం అడుగుతారు. వెంటనే లీజు దారుడు.. 'కుదరదు..వేరేవాళ్లకు ముందే రిజర్వు అయింది. మీరు మీ వారం అయ్యాక తీసేయాలి అంటారు. కాదు అంటే వాళ్లు 75వేలు ఇస్తామన్నారు..మీరు ఇవ్వండి అంటారు..' ఆ విధంగా దోపిడి ప్రారంభమవుతుంది. ఇలాంటి వ్వవహారాలకు బ్రేక్ వేయాలి. అదే విధంగా భారీ సినిమాలను ఇన్ని స్క్రీన్లకు మించి విడుదల చేయకూడదని పెట్టాలి. ఎందుకంటే శాటిలైట్ సినిమాలకు ప్రకటనలను నియంత్రిస్తున్నపుడు, హోల్ సేల్ చైన్ స్టోర్లపై నిబంధనలు విధిస్తున్నపుడు, వీటికి మాత్రం ఎందుకు విధించకూడదు. 

ఇప్పుడు తెరాస నాయకులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు కాబట్టి, వివాదం ముదిరేలాగే వుంది. మెదక్, భువన గిరి ఎంపీలు, మంత్రి మహేందర్ రెడ్డి నేరుగా దగ్గుబాటి సురేష్ బాబు పేరు ప్రస్తావించడం, కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తాం అనడం ఇక్కడ గమనించాలి. పైగా దగ్గుబాటి సురేష్ బాబు నేరుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు వర్గమే. ఆయన తండ్రి తెలుగుదేశం ఎంపీగా చేసారు. వారు తెలుగుదేశం లో కీలకపాత్ర వహించే సామాజికవర్గానికి చెందినవారే. అందువల్ల కెసిఆర్ జోక్యం చేసుకున్నా చేసుకోవచ్చు. 

అయితే ఇక్కడ దగ్గుబాటి సురేష్ బాబుకు పోయిందేమీ వుండదు. ఎందుకంటే ఆయన లీజులు తెలంగాణలో కన్నా ఆంధ్రలో ఎక్కువ. తెలంగాణలో దిల్ రాజు కు ఎక్కువ వున్నాయి. ఆయన తెలంగాణ కు చెందిన వారే. పైగా తెలంగాణలోని బలమైన  రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. దిల్ రాజు తరువాత ఆసియన్ సంస్థ ఎక్కవ థియేటర్లు కలిగివుంది. అది కూడా తెలంగాణకు చెందిన వారిదే. తెలంగాణ ఏకైక హీరో తండ్రికి ఇందులో భాగస్వామ్యం వుంది. 

ఇదిలా వుంటే అసలు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదన్నది ఒకప్పుడు వుండే సమస్య అని ఇప్పుడు మాత్రం కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పుడు థియేటర్లలో ఆడడానికి సినిమాలే వుండడంలేదని అంటున్నారు. మరోపక్క థియేటర్ల వాళ్లు కూడా తమ సైకిల్ స్టాండ్ లు, పార్కింగ్ లు, క్యాంటీన్లు లీజులు చూసుకోవాలని, జనం రాని సినిమా వేస్తే, వాళ్లు తమ వ్యాపారంపోయిందని, డబ్బులు ఇవ్వలేమని గోల పెడతారని, అదో సమస్య అన్న వాదన కూడా వినవస్తోంది. మొత్తానికి ఇంతటి చిక్కుముడులు వున్న లీజు గలీజులు కెసిఆర్ వేళ్లు పెడతారా అన్నది అనుమానమే.

చాణక్య

[email protected]