హుద్‌హుద్ తుపాను ధాటికి విశాఖ ఎయిర్పోర్ట్ అతలాకుతలమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో వున్న ఏకైక అతి పెద్ద విమానాశ్రయం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఈ ఎయిర్‌పోర్ట్‌ని ఎవరన్నా చూస్తే, దాన్ని గుర్తు పట్టడమే కష్టం. అంతలా ఎయిర్‌పోర్ట్‌ని విధ్వంసం చేసింది తుపాను. తుపాను దెబ్బకి అత్యంత దారుణంగా దెబ్బతిన్న నిర్మాణాల్లో విశాఖ విమానాశ్రయం ముందు వరుసలో వుంటుంది.
‘సుమారు ఆరు నెలల సమయం పడ్తుంది..’ ఇదీ విశాఖ విమానాశ్రయం మునుపటి అందాల్ని సంతరించుకోవడానికి పట్టే సమయమని అధికారులే అంచనా వేస్తున్నారు. అంత దారుణమైన విధ్వంసానికి విశాఖ ఎయిర్పోర్ట్ గురయ్యింది. రేపటినుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఈ రోజు వెల్లడించారు. కీలక పరికరాలు దెబ్బతినకుండా చేయడంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది తెగువ ప్రశంసనీయమన్న అశోక్‌గజపతిరాజు, తుపాను విధ్వంసం సృష్టించినా ఎయిర్‌పోర్ట్‌లో ప్రాణ నష్టం సంభవించలేదన్నారు.
‘విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చాలా సమస్యలున్నాయిప్పుడు.. ఒక్కోదాన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం.. ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పవు. ఏసీ పనిచెయ్యదు.. కూర్చోవడానికి ప్లాస్టిక్ కుర్చీలే వేయాల్సిన పరిస్థితి.. అయినా సరే చిత్తశుద్ధితో పనిచేసి ఎయిర్‌పోర్ట్‌ని మునుపటిలా కాదు కాదు మునుపటికన్నా ఘనంగా తీర్చిదిద్దుతాం..’ అని అన్నారు అశోక్‌గజపతిరాజు. కేంద్రం నుంచి ఏమేం సహాయ సహకారాలు కావాలో అన్నీ అందిస్తామని చెప్పారాయన.
నవంబర్ 1 నుంచి విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాలు వస్తాయని చెబుతున్నారు అశోక్ గజపతిరాజు. వసతుల పునరుద్ధరణకు సమయం పడ్తుంది కాబట్టి, ప్రయాణీకులు అర్థం చేసుకోవాలని ప్రయాణీకులకు అశోక్ గజపతిరాజు విజ్ఞప్తి చేశారు.