మహనీయుల వ్యక్తిత్వాలను కొద్దిరేఖల్లోనే ప్రతిఫలింపచేసిన బాపు సుప్రసిద్ధ కాల్పనిక పాత్రలను ఎలా రూపుదిద్దారో చూడండి.
గురజాడ సృష్టించిన గిరీశం ఎలా ఉండి ఉంటాడు? 'ఈ తురకెవడోయ్?' అన్న అగ్నిహోత్రావధాన్లు మాట పట్టుకుని గిరీశం తలపై ముస్లిం టోపీ పెట్టారు కొందరు. ఆరుద్రగారితో కూడా కూలంకషంగా చర్చించి గిరీశం వయస్సు, వేషధారణ నిర్ణయించి బాపు ఈ బొమ్మ గీశారట. ఇక అదే స్టాండర్ట్ అయిపోయింది. చుట్టపొగలోంచి వచ్చిన ప్రేమ గుర్తులు గిరీశం నడిపిన రాసలీలల్ని గుర్తుకు తెస్తాయి.
మొక్కపాటి సృష్టించిన 'బారిష్టర్ పార్వతీశం' తీసుకోండి. ముందులో డి.రామలింగంగారు వేసిన బొమ్మ ఆ పుస్తకం కవర్‌పై ఉండేది. పొడుగుచేతుల చొక్కా వేసుకున్న పల్లెటూరి యువకుడి రూపంలో పార్వతీశం ఉండేవాడు. పార్వతీశానికి ఉన్న ప్రత్యేకలక్షణం – లండన్ చదువుపై వ్యామోహం! అది ప్రతిఫలించేట్లు బొమ్మగీశారు బాపు.
అలాగే చిలకమర్తివారి గణపతిని తీసుకోండి. పొట్టకోస్తే అక్షరమ్ముక్క లేకపోయినా షోకులకు తక్కువ చేయని గణపతిని కళ్లక్కట్టించారు బాపు. బానబొజ్జ, మరుగుజ్జు రూపం- ఇవన్నీ చిలకమర్తి వర్ణనకు దగ్గరగానే వేస్తున్నా ఆయన వర్ణించినంత వికృతాకారంగా మాత్రం 'ప్రెజెంట్' చేయలేదు పెద్దమనసున్న బాపు.
ఇవన్నీ బాపుకు ముందునుండి తెలుగు సాహిత్యంలో స్థిరపడిన పాత్రలయితే సహచరుడు రమణ కొన్ని సృష్టించిన అనేక పాత్రలకు బొమ్మలతో ఆయన రూపురేఖలు దిద్ది కళ్లక్కట్టించారు. ఉదాహరణకి 'అప్పారావు'ను తీసుకోండి. రమణగారి వర్ణన ఇది-
'అప్పారావు కొత్తరూపాయి నోటులా ఫెళఫెళ లాడుతూ ఉంటాడు. కాలదోషం పట్టిన దస్తావేజులాంటి మాసిన గుడ్డలూ, బడిపంతులు గారి చేబదుళ్లులా చిందర వందరగా ఉండే జుట్టూ, అప్పు తెచ్చిన విచ్చు రూపాయిలా మెరిసే పత్తికాయలాంటి కళ్లూ, అప్పులివ్వగల వాళ్లందరినీ చేపల్లా ఆకర్షించగల యెరలాటి చురుకైన చూపులూ! అతను, బాకీల వాళ్లకి కోపిష్ఠివాడి జవాబులా పొట్టిగా టూకీగా వుంటాడు. మొత్తం మీద అతని మొహం ముప్పావలా అర్థణాలా వుంటుందనీ, అతనికి ఎప్పుడూ అంతే అప్పు ఇచ్చే మిత్రుడు అభివర్ణించాడు.'
దానికి బాపు కట్టిన బొమ్మ ఇది. చిత్రకారుడి స్వేచ్ఛ నుపయోగించుకుని, కాస్తముందుకెళ్ళి ఇంకో అరడజను చేతులా అప్పు చేసుకునే సదుపాయం ఏర్పాటు చేశారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఆంగ్ల సాహిత్యంలో ఎన్నో థాబ్దాలుగా వినుతికెక్కిన పాత్రను తెలుగులోకి తర్జుమా చేయడంలో బాపు చూసిన నేర్పు మరో ఎత్తు. జీవ్స్, పి.జి. ఉడ్హవుస్్ సృష్టించిన అద్భుతమైనపాత్ర. అతను ఊస్టర్ అనే బద్దకస్తుడైన కుర్ర జమీందార్కు వేలే – సహాయకుడుగా పనిచేస్తూంటాడు. సర్వజ్ఞుడు (ఇంటర్నెట్లో ఓ సెర్చ్ ఇంజన్ పేరు ఆస్క్ జీవ్స్ డాట్‌కామ్). జీవ్స్ను అచలపతిగా, ఊస్టర్ను అనంతశయనంగా మలచి 'అచలపతి కథలు'గా రాద్దామని నేను సంకల్పించి, లోగోకై బాపుగారిని అర్థించటం జరిగింది. 'వేలే' ఉద్యోగం తెలుగునాట లేదు. ఇంగ్లండులో 'వేలే'లు వేసుకునే 'టక్సెడో'లు మనకు నప్పవు. అందువల్ల బాపుగారు జీవ్స్ స్ఫూర్తితో అచలపతికి ప్రత్యేకంగా రూపం కల్పించారు. చొక్కా పైబొత్తం కూడా పెట్టుకొన్నట్టు చూపడంతో అచలపతి పద్ధతిగా ఉంటాడని చెప్పకనే చెప్పారు బాపు. ఇంగ్లీషు బొమ్మల్లో కనబడే డ్రింక్స్‌కు బదులుగా దేశవాళీయంగా కాఫీ యిప్పించారు బాపు!
ఇక ఊస్టర్ బద్ధ్ధకాన్ని కాలికింద మెత్తటి కుషన్ పీటతో సహా ప్రదర్శిస్తూనే మరో అద్భుతం చేశారు బాపు. ఈ జీవ్స్ కథలన్నీ ఊస్టర్ రచించిన 'జ్ఞాపకాలు'గా అందించారు ఉడ్‌హవుస్. కానీ ఏ జీవ్స్ పుస్తకం కవరైనా చూడండి – ఊస్టర్ రాస్తున్నట్టు ఎక్కడా కనబడదు. కానీ బాపు గీసిన లోగోలో ఊస్టర్ను రచయితగా ప్రదర్శించారు. దటీజ్ వేర్ హీ స్కోర్స్ ఓవర్ ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్స్! (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)