విశాఖపట్నం.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అతి పెద్ద నగరం ఇది. భిన్న సంస్కృతుల మేళవింపు నగరంలో కన్పిస్తుందిక్కడ. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద దిక్కు ఏదన్నా వుందంటే అది విశాఖ నగరం మాత్రమే. స్టీల్ ప్లాంట్, హార్బర్.. ఇలా ఒకటేమిటి.. విశాఖకు వున్న అనేకానేక ప్రత్యేకతలు విశాఖను ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద దిక్కుగా మార్చేశాయి. ఓ దశలో రాజధాని కోసం పోటీ పడ్డ నగరం విశాఖపట్నం. అన్ని ప్రాంతాలకూ సమదూరం లెక్కన విజయవాడ – గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అయితేనేం విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా ఏపీ సర్కార్ అనేకానేక ప్రణాళికలు రచిస్తోంది.
సరిగ్గా టైమ్ చూసి ప్రకృతి దెబ్బ కొట్టింది. విభజనతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి కలిగిన నష్టంతో పోల్చగలమా.? లేదా.? అన్న విషయం పక్కన పెడితే, ఆ స్థాయిలో తుపాను బీభత్సం ఆంధ్రప్రదేశ్‌ని అతలాకుతలం చేసింది. విశాఖ దెబ్బతినడంతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సి వచ్చింది. అంతగా విశాఖపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలేమవుతాయిప్పుడు.? రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితేంటి.? ఐటీ రంగం విశాఖలో వృద్ది చెందుతుందా.? ఒకప్పటిలా విశాఖ పర్యాటక రంగంలో ముందుకు దూసుకుపోతుందా.? సవాలక్ష ప్రశ్నలిప్పుడు సగటు సీమాంధ్రుడి మదిలో గింగరాలు తిరుగుతున్నాయి.
ఇక్కడ జపాన్ పేరుని ప్రస్తావించక తప్పదు. జపాన్‌పై అణు దాడి జరిగిన తర్వాత, ఇక జపాన్ ఎప్పటికీ కోలుకోదని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు జపాన్ పరిస్థితేంటి.? అక్కడి అభివృద్ధి మాటేమిటి.? అని అడిగితే ప్రతి ఒక్కరికీ సమాధానం తేలిగ్గానే దొరుకుతుంది. జపాన్ అభివృద్ధి చెందిన దేశం. అంతలా జపాన్ అభివృద్ధి చెందడానికి కారణం ‘సంకల్పం’. సంకల్పం, పట్టుదల వుంటే సాధించలేనిది అంటూ ఏదీ వుండదని జపాన్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు విశాఖకు కావాల్సింది కూడా అదే.. సంకల్పం, పట్టుదల.
విశాఖను ఉక్కు నగరం అంటుంటారు.. ఇప్పుడు విశాఖకు ఉక్కు సంకల్పం తోడైతే కనీ వినీ ఎరుగని రీతిలో విశాఖ అభివృద్ధి చెందుతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. విశాఖ ఎంపీ.. బీజేపీ నేత. ఆయనే కంభంపాటి హరిబాబు. విశాఖ మీద అమితమైన ప్రేమాభిమానాలు తనకున్నాయంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. తుపాను తర్వాత విశాఖకు వెళ్ళిన చంద్రబాబు కంట్లో నీళ్ళు సుడులు తిరిగాయి. విశాఖ ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదని చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాననీ, విశాఖకు వస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడిరచారు.
విశాఖ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దేశ ప్రధాని.. ఈ ముగ్గురూ ఇప్పుడు ఉక్కు సంకల్పంతో విశాఖను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి.. అదే విశాఖ ప్రజల కోరిక. ‘జరిగిందేదో జరిగిపోయింది.. ఉత్పాతాన్ని ఆపలేం కదా.. ఇప్పుడు కావాల్సింది గతం గురించి ఆలోచించుకుని బాధ పడటం కాదు..’ అంటూ గుండె నిండా బాధతో వున్నా, భవిష్యత్ గురించి కసిగా నినదిస్తున్నారు విశాఖ వాసులు. నిర్మాణం.. పునర్నిర్మాణం.. పేరేదైనా సరే.. ఇప్పుడు సరికొత్త విశాఖ ఆవిష్కృతమవ్వాల్సిందే.
రియల్ రంగం ఏమవుతుందన్న ఆనుమానాల్ని పటాపంచలు చేస్తూ, అభివృద్ధి దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే.. రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు.. అన్ని రంగాలూ విశాఖ వైపు పరుగులు పెడ్తాయి. ప్రకృతి కాటేసినా.. ప్రభుత్వాలు ప్రయత్నిస్తే, ఇప్పుడు భయానకంగా మారిపోయిన ఒకప్పటి సుందర నగరం విశాఖ.. మునుపటికన్నా మరింత సుందరంగా తయారవుతుందన్నది నిర్వివాదాంశం. రాజకీయాల్ని పక్కన పెట్టి, విశాఖ.. ఆ మాటకొస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రాజకీయ నాయకులంతా జరిగిన నష్టాన్ని పూడ్చే దిశగా ప్రయత్నిస్తే.. సాధ్యం కానిదేమీ వుండదు. అదే సమయంలో.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ.. సర్వం కోల్పోయిన ఉత్తరాంధ్రకు మానసికంగా, ఆర్థికంగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జరగాల్సింది మహా యజ్ఞం.. అదే ఉత్తరాంధ్ర.. యావదాంధ్ర పునర్నిర్మాణం. ఆ యజ్ఞానికి అందరూ కలిసి వస్తారని ఆశిద్దాం.