భాజపా-తేదేపాలపై కేసిఆర్ గురి?

కెసిఆర్ మదిలో ఏముంది? అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఆలోచిస్తున్నారా..సంపూర్ణ మెజారిటీ కావాలని చూస్తున్నారా? ఈ ఆలోచన ఇప్పుడు ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కలవర పెడుతోంది. రాష్ట్రం విడిపోయింది. దానికి కెసిఆర్ బాస్. మరో రెండు…

కెసిఆర్ మదిలో ఏముంది? అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఆలోచిస్తున్నారా..సంపూర్ణ మెజారిటీ కావాలని చూస్తున్నారా? ఈ ఆలోచన ఇప్పుడు ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కలవర పెడుతోంది. రాష్ట్రం విడిపోయింది. దానికి కెసిఆర్ బాస్. మరో రెండు మూడు రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయిపోతారు. ఆ తరువాత ఏంటి? ఇదే అసలు సమస్య. ఒక పక్క తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు పదే పదే తాము ఎప్పటికైనా తెలంగాణలో అధికారంలోకి వస్తామని పదేపదే చెబుతున్నారు. మరోపక్క కుటుంబ పాలన అన్న విమర్శలు ఎలాగూ వస్తాయి. ఎక్కడ ఎవరు వెన్నుపోటు పొడుస్తారో, మూకుమ్మడిగా గెంతుతారో అన్న భయం. 

అందుకే ఆయన చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.  ఇందుకోసం ఆయన ఒక బహుముఖ ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది.  అందులో కీలకమైనది ఇటు  భాజపా-అటు తేదేపాలను తెలంగాణ వ్యతిరేకులన్న ముద్ర వేయడం. కేంద్రం లో వున్న భాజపా ప్రభుత్వం, తెలుగుదేశంలో కుమ్మక్కై తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తోందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగచేయడం. దీని వల్ల ఆయా పార్టీల విజయావకాశాలను తెలంగాణలో దెబ్బ తీయడం. అదే సమయంలో మరెవరు ఆ పార్టీల వైపు తన పార్టీ జనాలు వెళ్లకుండా చూసుకోవచ్చు. అదే సమయంలో అట్నుంచి రప్పించుకోవచ్చు. అంతకు మించి ఇంకో ప్రయోజనం వుంది. తెలంగాణ జెఎసి ఇక తెరాసతోనే వుండేలా చేయచ్చు. 

ఇక మరో ప్రయోజనం ప్రజల దృష్టి మరల్చడం. ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఢమాల్ అంది, హైదరాబాద్ లో వ్యాపారాలు తరలిపోతున్నాయి. అవకాశాలు తగ్గిపోతున్నాయి. అన్న ప్రచారం ప్రారంభమైంది. సహజంగా ఇది కెసిఆర్ పట్ల కొంత ప్రతికూల ప్రభావం కనబరుస్తుంది. కేసిఆర్ చేసిన ఎన్నికల వాగ్దానాలు ఇన్నీ అన్నీ కావు. రుణాల మాఫీ. 10లక్షల రూపాయిల వంతున మహిళలకు రుణాలు ఇవ్వడం, రెండేసి బెడ్ రూమ్ ల ఇళ్లు కట్టించి ఇవ్వడం, ఇంకా ఇంకా చాలా వున్నాయి,. ఇవేవీ అంత సులువుగా సాధ్యమయ్యేవి కాదని కెసిఆర్ కు తెలుసు. మరోపక్క తన కుటుంబ సభ్యులకు కీలక పాత్రలు కట్టబెట్టాల్సి వుంది. 

ఇవన్నీ సహజంగానే కెసిఆర్ పట్ల జనాల్లో అసంతృప్తిని రగిలిస్తాయి. వీటి నుంచి వారి దృష్టి పక్కకు తిప్పాలంటే, మళ్లీ ఉద్యమ బాటే శరణ్యం. మోడీ మహా మొండి మనిషి అని తెలుసు. ఒక సారి నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గరనీ తెలుసు. అలాంటపుడు పోలవరం లాంటి జటిల సమస్యను పట్టుకుంటే, అంత సులువుగా తెగదు.  కెసిఆర్ కు కావాల్సిందీ అదే. కెసిఆర్ ఎంపీగా వున్నపుడు ఏం చేసారు. అసలు పోలవరం టెంటర్లు తనకు కావాల్సిన వారికి వచ్చేలా చేసినపుడు ఏం చేసారు. అప్పుడు డిైజన్, ముంపు గ్రామాలు గుర్తు రాలేదా అని ఇప్పుడు ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. కేసిఆర్ వీటన్నింటిని ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నారు. వీలయినంత వరకు తెగేదాకా లాగేద్దామన్నది ఆయన పథకంలా కనిపిస్తోంది. 

ఇదిలా వుంటే తప్పు తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్న కేసిఆర్ వైఖరితో తెలుగుదేశం,  భాజపా నాయకుల్లో కలవరం మొదలయింది. పైగా డాంబికాలు పోతూ, కెసిఆర్ పై విమర్శలు కురిపిస్తున్నా, భాజపా ప్రభుత్వం ఇప్పటికిప్పడు ఆర్టినెన్స్ తేవడం అన్నది వాటికి కాస్త ఇబ్బందికరంగానే వుంది. దానిపై తమ తమ పార్టీ వేదికలపై ఏమీ అనలేక, అలా అని మౌనంగా వుండలేక, ఎదురుదాడికి దిగుతున్నాయి. అదే సమయంలో మోడీ తన మంత్రి వర్గంలో తెలంగాణ ప్రాంతానికి చోటు కల్పించకపోవడం కూడా కేసిఆర్ కు కలిసి వచ్చింది. భాజపా తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తోందని డప్పేయడానికి ఆయనకు ఇదో అవకాశం. 

కానీ చిత్రంగా తాను ముఖ్యమంత్రిని, ఆ హోదా స్వీకరించగానే ప్రభుత్వం తరపున కోర్టుకు వెళ్లే అవకాశం వుందని ఆయన చెప్పడం లేదు. ఈ మాట హరీష్ రావు నోట మాత్రం వచ్చింది. కోర్టుకు వెళ్లే అవకాశం వున్నపుడు, ఆ దిశగా పోరాటం సాగించడం మాని, బంద్ లు నిరసనలు ఎందుకు అంటే, మళ్లీ ఈ వ్యాసం మొదట్నించీ చదవడమే. కెసిఆర్ పని కూడా అదే. ఏ సమస్య వచ్చిన మళ్లీ ఉద్యమం మొదటి దశకు వెళ్లిపోవడమే. కానీ ఒకటే అనుమానం. ఇలా ఈ చిట్కా వైద్యంతో ఆయన ఎన్నాళ్లు ప్రజలను మభ్య పెట్టి వుంచగలరన్నది?

చాణక్య

[email protected]