విశాఖపై పునరాలోచన

ఇది సమయం..విశాఖపై పునరాలోచించాల్సిన సమయం. లేదంటే, ఇప్పుడు సంబంధించిన విలయం, విశాఖ ప్రగతిని దెబ్బతీస్తుంది. అడ్డగోలుగా నిబంధనలను తోసి రాజని విశాఖ సముద్ర తీరంలో జరగుతున్న నిర్మాణాలు, సముద్రతీరంలో మాయమైన వన సంపద గురించి…

ఇది సమయం..విశాఖపై పునరాలోచించాల్సిన సమయం. లేదంటే, ఇప్పుడు సంబంధించిన విలయం, విశాఖ ప్రగతిని దెబ్బతీస్తుంది. అడ్డగోలుగా నిబంధనలను తోసి రాజని విశాఖ సముద్ర తీరంలో జరగుతున్న నిర్మాణాలు, సముద్రతీరంలో మాయమైన వన సంపద గురించి ఆలోచించాల్సిన సమయం. లేదంటే విశాఖకు తరలి వస్తాయనుకున్న కంపెనీలు, అభివృధ్ది దూరంగా జరిగే ప్రమాదం వుంది. టెక్నాలజీని వాడామంటూ జోక్ ల్లాంటి కబుర్లు చెప్పడం కాదు ఇప్పుడు కావాల్సింది..సంప్రదాయ విధానాల ద్వారా తుపాను ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం.

భారీ పరిశ్రమలకు, కంపెనీలకు గంట వృధా అయితే కోట్లలో నష్టాలు వస్తాయి. అందుకే ఇప్పుడు ఐటి కంపెనీలు విశాఖపై పునరాలోచించే పరిస్థితి కనిపిస్తోంది. విడివిడన ఆంధ్రకు ఐటి రాజధానిగా విశాఖే ఇంతవరకు కనిపించింది. ఆంధ్రకు బలం, బలహీనత రెండూ కోస్తా తీరమే. ఇటు నెల్లూరు నుంచి దక్షిణ కోస్తా ప్రారంభమై శ్రీకాకుళంలో ఉత్తర కోస్తా వరకు ఆదాయ మార్గం, అపాయం రెండూ అదే. అయితే దీనికి అతీతంగా కాస్మాపాలిటన్ కల్చర్ వున్న విశాఖ ఐటి కేంద్రంగా మారుతూంది. ప్రభుత్వం కూడా అదే దిశగా చర్యలు తీసుకుంటోంది. 

అయితే ఇప్పటిదాకా దేశంలో ఐటి అభివృద్ధి చెందిన ఒక్క ముంబాయి, చెన్నయ్ తప్పిస్తే, మిగిలినవి అన్నీ ఎటువంటి వాతావరణ ఇబ్బందులు లేనివే. బంగళూరు, ఢిల్లీ, పూనే, ఇత్యాది వన్నీ.  ముంబాయిని తగ్గించి పూనేను పెంచుకుంటూ వచ్చాయి కంపెనీలన్నీ. చెన్నయ్ సముద్ర తీరంలోవున్న ఇంతవరకు భారీ తుపాన్ల బారిన పడి అల్లకల్లోలం అయింది తక్కువ. గతంలో తమిళనాడును సునామీ తాకినా అది కోస్తాతీరంలో ఇబ్బంది పెట్టింది తప్ప, చెన్నయ్ తీరంలో కాదు. 

ఇప్పుడు విశాఖ పరిస్థితి చూస్తే దమయనీయంగా వుంది. ఇప్పటికి 24 గంటల నుంచి విశాఖ నగరంలో కమ్యూనికేషన్ సదుపాయాలు లేవు..విద్యుత్ లేదు..నీళ్లు లేవు..రవాణా సదుపాయాలు లేవు…ఈ పరిస్థితి కనీసం మరో 24గంటలు వుండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే నలభై ఎనిమిది గంటల పాటు సాఫ్ట్ వేర్ కార్యకలాపాలు నిలిచిపోతే నష్టం ఏమేరకు వుంటుంది. బంగళూరు, హైదరాబాద్ ల మాదిరిగా విశాఖ మారితే, ఆ నష్టం మరీ ఘోరంగా వుంటుంది.

టెక్నాలజీతో అడ్డుకున్నాం..గూగుల్ మ్యాప్ లు వాడాం..ఇలాంటి కబుర్లు చెప్పడం కాదు ఇప్పుడు కావాల్సింది. 19 ఏళ తరువాత విశాఖ తీరానికి తుపాను తాకింది. పూడిమడక ప్రాంతంలో తుపాను తీరం దాటడం అన్నది నలభై యాభై ఏళ్లలో ఇది తొలిసారి కావచ్చు. అసలు తుపాను ప్రభావం ఈసారి ఎందుకింత ఉధృతంగా వుందన్నది కూడా ఆలోచించాలి. 

ఒక్కప్పుడు విశాఖ బీచ్ తీరం పొడవునా దట్టంగా చెట్లు వుండేవి. రాను రాను బీచ్ తీరం అన్నది విలాసానికి చిరునామాగా మారడంతో, ఈ చెట్లు అన్నీ మాయమవుతూ వస్తున్నాయి. దీంతో తుపాను ప్రభావం రెట్టింపు అయిందని నిపుణలు అంటున్నారు. ఇప్పటికైనా విశాఖ నుంచి భీమిలి వరకు దట్టమైన అడవులు పెంచాలి సముద్రతీరం పొడవునా. దాని వల్ల కొంత వరకు ప్రభావాన్ని నివారించడానికి కుదురుతుంది. 

విశాఖ నగరంలోనే గతంలో బెస్తవారికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు, మెలమెల్లగా పరహస్తం అయ్యాయి. నిజానికి బీచ్ తీరంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు వున్నాయి. కానీ ఇటీవలి కాలంలో నిబంధనల్లో లొసుగులను అడ్డం పెట్టకుని, విశాఖ పట్టణ పరిథిలోనే హోటళ్లు, రిసార్టులు వచ్చేసాయి. అసలు వాళ్లకి స్థలం ఎలా సంక్రమించింది అన్నది కూడా ఆరా తీసే వారు లేరు. ఎందుకంటే వారంతా కూడా వివిధ పార్టీలకు చెందిన రాజకీయనాయకులే. విశాఖ స్పెషాలిటీ ఏమిటంటే దాదాపు అన్ని పార్టీల రాజకీయనాయకులు తెరవెనుక వ్యాపార సంబంధాలు కలిగినవారే. 

అందువల్ల విశాఖలో కూర్చుంటానన్న చంద్రబాబు ఈ విషయాలను పరిశీలించి, విశాఖ సమగ్ర పునర్నిర్మాణానికి, భద్రతకు అవసరమైన మాస్టర్ ప్లాన్ తయారుచేయాలి. ఇందులో రాజకీయాలను, సామాజిక సమీకరణలను దూరంగా వుంచాలి. లేదంటే మళ్లీ నష్టం విశాఖకే.

చాణక్య

[email protected]