హైద్రాబాద్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో ఏడాదిగా ఓ యువతి వెంట పడ్డ ప్రదీప్ అనే యువకుడు, కళాశాలలో ఆమెపై దాడికి దిగాడు. అయితే కళాశాల సిబ్బంది తక్షణం స్పందించేసరికి, తప్పించుకోవాలని యూసిన ప్రదీప్, తప్పించుకునేందుకు వీలు కుదరక తనతో తెచ్చుకున్న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
బాధితురాలు రవళి, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కోలుకుంటుండగా, ప్రదీప్ మాత్రం మృతిచెందాడు. రవళి తల్లిదండ్రులు ఇదివరకే ప్రదీప్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు, రవళి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రదీప్‌కి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. దాంతో ప్రదీప్, రవళిపై మరింత కసి పెంచుకున్నాడు. రవళి కళాశాలకు వెళుతుండగా, ఆమె చదువుతున్న కళాశాల వద్దకు చేరుకుని ఆమెపై తనతో తెచ్చుకున్న కత్తితో దాడికి దిగాడు.
హైద్రాబాద్ శివార్లలోని బండ్లగూడలోగల అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ పక్క మహిళలపై దాడులు చేసినా, వేధింపులకు గురిచేసినా కళ్ళు పీకేసే చట్టాల్ని తీసుకొస్తామని తెలంగాణ సర్కార్ హెచ్చరిస్తోంటే.. మరోపక్క మహిళలపై దాడులు మాత్రం యధాతథంగా కొనసాగుతుండడం దురదృష్టకరం.