వీధిలో నవ్వు..ఇంట్లో దు:ఖం

సినిమా నిర్మాతల వింత వైఖరి Advertisement కమెడియన్ కు జీవితంలో ఎన్ని కష్టాలున్నా తెరపై నవ్వులు పూయించాల్సిందే. ఇప్పుడు నిర్మాతల పరిస్థితి కూడా అలాగే వుంది. మడత నలగని చొక్కాలు, పెద్ద పెద్ద కార్లు,…

సినిమా నిర్మాతల వింత వైఖరి

కమెడియన్ కు జీవితంలో ఎన్ని కష్టాలున్నా తెరపై నవ్వులు పూయించాల్సిందే. ఇప్పుడు నిర్మాతల పరిస్థితి కూడా అలాగే వుంది. మడత నలగని చొక్కాలు, పెద్ద పెద్ద కార్లు, ఆఫీసులు, జనాలు..హంగామా..అంతా ఓకె. కానీ లెక్కలు తీస్తే మాత్రం చింకి చొక్కాల మాదిరిగా వుంది పరిస్థితి. ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. పెద్ద పెద్ద నిర్మాతలంతా ఏనాడో దుకాణం సర్దేసుకుని కూర్చున్నారు. పెద్ద పెద్ద సినిమాలు తీసి, ముఫై కోట్ల వసూళ్లు, నలభై కోట్లు వసూళ్లు, ఇండస్ట్రీ రికార్డు అంటూ లెక్కలు చెప్పుకున్న నిర్మాతలు ఇప్పుడు ఎక్కడ వున్నారు. నిర్మాతలు అంటే ఇప్పుడు కేవలం హీరోలను పెంచి పోషించడానికి బలైపోయే కామధేనువుల్లా మారిపోయారు. చిన్న నటులు, సాంకేతిక నిపుణులు సరే. వారికిచ్చేది గుంపగత్తగా ఇచ్చినా, లెక్కలు వేసుకుంటే, నెలజీతాలే కిట్టుబాటవుతాయి. కానీ హీరోల వ్యవహారం అలా కాదు. సినిమా పడిందంటే కనీసం అయిదు కోట్లు. గరిష్టంగా 18 కోట్లు. పైగా పది మంది నిర్మాతల అడ్వాన్సులు. ఒక టాప్ హీరో దగ్గరే దాదాపు 60 కోట్ల అడ్వాన్సులు వున్నాయని సమాచారం. కనీసం పదిమంది నిర్మాతల సొమ్ము అయివుంటుంది అది. ఎంత వడ్డీ..ఎంత బాధ.రెండేసి మూడేసి ఏళ్లు వడ్డీలు కట్టుకుంటూ పళ్ల బిగువున వేచి వుండాలి హీరో దయాదాక్షిణ్యాల కోసం. 

ఎన్ని కష్టాలో..

సినిమా కష్టాలు ఇన్నీ అన్నీ కాకుండా పోతున్నాయి. జనాల దృష్టిలో సినిమా అద్భుతంగా ఆడేస్తోంది. నిర్మాత ఖజానా నిండిపోతోంది. కానీ కేసు గెలిచినవాడు ఇంట్లో ఏడ్చిన చందంగా వుంది నిర్మాత పరిస్థితి. పెద్ద సినిమా అయితేనే జనాలు వెంటనే థియేటర్ కు వస్తున్నారు. చిన్న సినిమా అంటే వారం మౌత్ టాక్ వచ్చిన తరువాతే వస్తారు. అందుకే పెద్ద సినిమాల వైపు మొగ్గుతున్నారు పెద్ద నిర్మాతలు. కానీ పెద్ద సినిమా అంటే చాలు అన్నీ భారీనే. టాప్ లైన్ పెద్ద హీరోల పారితోషికమే ఇప్పుడు కనీసం అయిదు కోట్ల నుంచి పద్దెనిమిది కోట్లుకు చేరింది. టాప్ లైన్ డైరక్టర్లు కూడా అయిదు నుంచి పది వరకు పిండేస్తున్నారు. హీరొయిన్లు కోటి నుంచి కోటిన్నర. అంటే ఓ మాదిరి పెద్ద సినిమాకు స్టార్ కాస్ట్ ,టెక్నికల్ కాస్టే 15 కోట్ల వరకు చేరిపోతోంది,. ఇంత చేసినా హిట్ గ్యారంటీ లేదు కాక లేదు.  

పైగా సినిమా విడుదలైన తరువాత ఫ్యాన్స్, పరువు సమస్యలు ఒకటి. దీంతో ఇంత వసూళ్లు అంత వసూళ్లు అని హడావుడి. అవి విని తెలిసిన వారు ఫోన్ చేస్తే, వీలయినంత వరకు అక్కర లేని నవ్వు..మరీ దగ్గరవాళ్లయితే భోరు మని, అసలు సంగతి చెప్పడం. సినిమా హిట్ అయితే, ఎప్పుడూ బయటకు రాని హీరోలెందుకు బజారులో కూర్చుని, పని మాలి ఇంటర్వూలు ఇస్తారంటూ ఎదురు ప్రశ్నించడం.

కలెక్షన్ల మాయాజాలం

ఏ నిర్మాత అసలు కలెక్షన్లు చెప్పడు. ఆయనకుంటే సమస్యలు వుండనే వుంటాయి. పైగా హీరో పరువు సమస్య ఒకటి. అందుకే అధికారికంగా కలెక్షన్లు ఎవరూ ప్రకటించరు. ఇది ఫ్యాన్స్ కు పండగ లాంటిది. ఎవరికి తోచిన లెక్కలు వాళ్లు ప్రచారం చేసుకుంటారు. అది మహేష్ కైనా, చరణ్ కైనా, పవన్ కైనా ఒకటే వ్యవహారం. పక్కాగా మేం అందిస్తున్న ఫిగర్స్ నికార్సయినవి, అంకెల సాక్షిగా ఇవి నిజం అని ఎవర్నయినా చెప్పమనండి చూద్దాం. నిర్మాతలు మాత్రం ఈ ఫిగర్స్ అలా చూసి చూడనట్లు వదిలేసి తమ బాధలు తాము పడుతుంటారు. 

ఈ కలెక్షన్లు ఫిగర్లు ముందుగా సినిమాకు సంబంధించిన సినిమా ఫేస్ బుక్ పేజీల్లో పుడతాయి. చాలా వరకు వీటిని పీర్వోలు లేదా సినిమా కంపెనీ సిబ్బంది నిర్వహిస్తారు.  'అసలు ఫిగర్లు మాకు తెలుసు..కానీ మాకు వుండే ఆబ్లిగేషన్లు మాకు వుంటాయి. అందుకే పది నుంచి ఇరవై శాతం కలిపి ఫేస్ బుక్ పేజీలో పెడతాం..వాటినే వెబ్ సైట్లు తీసుకుంటాయి… అలా కాకుంటే మాకు హీరోలతో సమస్యలు వస్తాయి..' అన్నారో సినిమా పీర్వో. ఈ మధ్య విడుదలైన ఓ పెద్ద సినిమాకు కలెక్షన్లు ఇలాగే మ్యానిపిలేట్ చేసి ప్రచారం సాగించారు. దాంతో అసలు కలెక్షన్లకు, ప్రచారానికి కనీసం పన్నెండు కోట్ల తేడా వస్తోంది.అలాగే ఆ సినిమా శాటిలైట్ రేటులో కూడా కనీసం మూడు కోట్లు పెంచి చూపించారు. అప్పుడే సినిమాకు ఓ రేంజ్ వచ్చింది…అన్నారు. 

కొన్నాళ్ల క్రితం తెలుగు పరిశ్రమ లెక్కలను తిరగరాసిందనుకున్న సినిమా సంగతి కూడా ఇలాంటిదే. ఆ సినిమా నిర్మాత మళ్లీ ఇప్పటి వరకు సినిమా నిర్మాణం చేపట్టలేకపోయారు. ఓ టీవీ చానెల్ ఈ లెక్కలు, ప్రచారం చూసి, ఏకంగా కనీ వినీ ఎరుగని భారీ మొత్తానికి హక్కులు కొనుక్కుంది. తొలి విడతలో కొన్న మొత్తంలో మూడో వంతు రావడం కష్టమైంది. దాంతో ఇంక తరుచు ఆ సినిమా ప్రసారం చేసి, డబ్బులు వసూలు చేసుకునే పనిలో పడింది. ఇక అక్కడి నుంచి శాటిలైట్ హక్కులు కొనడం తగ్గించిందా చానెల్. 

నో బయ్యర్స్

మరోపక్క సికిందర్, రభస, ఆగడు, వంటి సినిమాల ప్రభావం ఇప్పుడు మిగిలిన సినిమాలను పట్టిపీడిస్తోంది. గడచిన రెండు వారాలుగా బయ్యర్లు సినిమాలు కొనడం, నో గ్యారంటీపై తీసుకోవడం, ఇలాంటి వ్యవహారాలను వదిలేసారు. అడ్వాన్స్ లు కూడా ఇచ్చే స్థితిలో లేరు కొన్ని సినిమాలకు. మరీ టాక్ వచ్చిన సినిమాలకు బొటాబొటీ రేటుచెబుతున్నారు. దీంతో నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారయింది. గత నెల చివరిలో వచ్చిన గోవిందుడు అందరి వాడేలే లాంటి పెద్ద సినిమా కూడా చాలా ఏరియాలు నిర్మాతే విడుదల చేసుకోవాల్సి వచ్చింది. 

ఈ నెలలో విడుదలవుతున్న మీడియం రేంజ్ సినిమాలు దిక్కులు చూడకు రామయ్యా, కరెంటుతీగ, నిర్మాతలే విడుదల చేసుకుంటున్నారు. 24న వచ్చే కార్తికేయ కూడా చాలా వరకు అడ్వాన్సులపైనే విడుదలవుతోంది. మీడియం రేంజ్, బ్యానర్ వాల్యూ వున్న సినిమాల పరిస్థితే ఇదయితే ఇక చిన్న సినిమాల సంగతి చెప్పకనక్కరలేదు. 
మరోపక్క పెద్ద సినిమాల తాకిడి తగ్గిందని చిన్న, మీడియం సినిమాలు అన్నీ ఒకేసారి క్యూ కడుతున్నాయి. దీంతో థియేటర్లు లీజు వున్నవారికి చాన్స్ దొరికింది. స్వంతంగా విడుదల చేసుకోవడానికి సిద్దపడినా కూడా నిర్మాత థియేటర్ల కోసం వెదుకులాడాల్సి, బతిమలాడాల్సి వస్తోంది. సినిమా ఇంకో రెండు మూడు రోజులు విడుదల పెట్టకుని కూడా థియేటర్ల కోసమే టెన్షన్ పడాల్సిన పరిస్థితి. అందులోనూ థియేటర్లను బట్టి కూడా సినిమా రీచ్ ఆధారపడి వుంటుంది. అందువల్ల ఆ తరహా థియేటర్లకు మరీ డిమాండ్. 

ఇప్పుడు సినిమా తీయడం ఏ మాత్రం కష్టం కాదు. కాస్త డబ్బులుంటే చాలు..ఫైనాన్స్ దొరుకుతుంది. సినిమా రెడీ అయిపోతుంది. కానీ ఆ తరువాతే మొదలవుతుంది నిర్మాత కష్టాల కహానీ. వీటన్నింటిని భరించలేక, వున్న ఇద్దరు ముగ్గురు హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్ల చేతిలో సినిమా పెట్టేద్దామనుకుంటే అక్కడ ఇంకో తరహా సమస్య. నిత్యం డిసిఆర్ లు బాగానే ఇస్తారు. డైలీ కలెక్షన్ రిపోర్టులు చూసుకుని, ఫరవాలేదని నిర్మాత ఆనందపడుతూ వుంటాడు. అన్నీ అయిపోయి, నెల దాటాక పైసలేమైనా ఇస్తారా అని వెళ్తే అసలు లెక్కలు వస్తాయి. మైదా పిండి ఖర్చు నుంచి, థియేరట్ల రెంట్ వరకు సవాలక్ష లెక్కలు తీసి,వసూళ్ల నుంచి మైనస్ చేసి, మిగిలిన పావలా వుంటే చేతిలో పెడతారు. లేకుంటే తిరిగి పట్రా అంటారు. అందుకే ఇక సినిమా మనది కాదు. జనాల ముందుకు వెళ్తే చాలు అనుకున్న నిర్మాతలే ఈ హోల్ సేల్ పంపిణీ దారులను ఆశ్రయిస్తున్నారు. 

ఫైనాన్స్ దందాలు

ఆ నలుగురు అన్న పదం తరచు సినిమా వ్యవహారాల్లో వినిపిస్తుంటుంది. థియేటర్ల గుత్తాధిపత్యం గురించి ఈ పదం వాడుతుంటారు. కానీ నిజమైన ఆ నలుగురు వేరే వున్నారు. వాళ్లు బడా ఫైనాన్షియర్లు. మూడు రూపాయిలు కనీస వడ్డీ. పావలా తగ్గరు. సినిమా అట్టర్ ఫ్లాపయింది మహాప్రభో. ఆ కలెక్షన్లు, ఆ రికార్డులు అన్నీ వాళ్లా వాళ్ల అభిమానులు, పరువు కోసం. అన్నా వినరు. అణా పైసలతో చెల్లించాల్సిందే. నెలావారీ వడ్డీ ఆలస్యమైతే దానికి మళ్లీ మూడు రూపాయిల వడ్డీ కట్టాల్సిందే. పోనీ లక్షల్లో ఫైనాన్స్ అంటే వేరు అయిదు నుంచి ఇరవై వరకు తీసుకునే పెద్ద ప్రొడ్యూసర్లు కూడా మూడు రూపాయిల లెక్కన వడ్డీ ఇవ్వాల్సిందే. 'రూపాయి వడ్డీ తగ్గితే చాలు పెద్ద ప్రొడ్యూసర్లకు భారీగా కలిసి వస్తుంది..కానీ వాళ్లు తగ్గరు..నిర్మాతల రక్తం తాగేస్తున్నారు..' అన్నారు ఆవేదనగా ఓ పెద్ద ప్రొడ్యూసరు. 

గతంలో పెద్ద హీరో సినిమా ప్రకటిస్తే చాలు జిల్లాల నుంచి సూట్ కేసులు అడ్వాన్స్ గా వచ్చేవి. వడ్డీలేని అప్పు. నిర్మాతలు వాటితో చెలరేగిపోయేవారు. కానీ ఇప్పుడు అడ్వాన్స్ కాదు కదా ఫైనల్ ప్రొడక్ట్ వచ్చినా కోనేవాడు లేదు. అప్పుడు కూడా కాస్త అడ్వాన్స్ ఇచ్చి ఆడిస్తాం అంటున్నారు. దాంతో ఫైనాన్షియర్ల బారిన పడక తప్పడంలేదు. 

టీవీ మాయాజాలం

శాటిలైట్ వ్యవహారం కూడా మాయాజాలమే అని వదంతులు వున్నాయి. ఓ చానెల్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పెద్ద హీరోల శాటిలైట్ రేట్లు పెంచేసారని టాలీవుడ్ లో టాక్. ఆ తరువాత ఆ చానెల్ సైలెంట్ అయిపోయింది. ఆ రేట్లనే ఖరారు చేస్తూ మిగిలిన చానెళ్లకు సినిమాలను అమ్ముతున్నారు. తొమ్మిది కోట్లకుపైగా మొత్తానికి ఓ సినిమా కొన్న చానెల్ కు ఇప్పటికి కనీసం ఆరు కోట్లు కూడా రాలేదని వినికిడి. తొలి ప్రదర్శనకు మూడు కోట్లు వచ్చాయట. దాంతో రిపీటెడ్ గా అదే సినిమాను వేసేస్తోంది. మరోపక్క ట్రాయ్ నిబంధనలు కూడా నిర్మాతల పాలిట శాపంగా మారాయి. గతంలో శాటిలైట్ ను నమ్ముకుని సినిమాలు తీసే నిర్మాతలంతా ఇప్పుడు చేతులు ముడుచుకున్నారు. ఇంకోపక్క పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా టీవీలు తమ ప్రకటనల టారిఫ్ లు పెంచేసాయి. దీంతో నిర్మాతలకు రెండు వేపుల దరువు తప్పలేదు. 

చేతులెత్తాల్సింది నిర్మాతలే

అసలు బయ్యర్లు కాదు చేతులు ముడుచుకు కూర్చోవాల్సింది. పెద్ద హిరోలతో కొన్నాళ్ల పాటు సినిమాలు చేయకండి..అని ఓ నిర్ణయం తీసుకొవాలి. అయిదు కోట్లు లోపల పారితోషికం తీసుకునే వారితోనే సినిమాలు చేయాలి అన్న నిర్ణయం తీసుకున్ననాడు హీరోలు దిగివస్తారు. ఎన్ని సినిమాలని స్వంత బ్యానర్ పై చేస్తారు? చేయగలరు? బయ్యర్లు మొండికేయడం మొదటి ప్రమాద హెచ్చరిక అని నిర్మాతల మండలి గుర్తించింది. అందుకే సమావేశాలు ప్రారంభించింది. నిర్మాతలు కూడా మొండికేస్తే అప్పుడు 'మా' సంఘం కూడా కదుల్తుంది. హీరోలు కిందకు దిగుతారు. అప్పుడే మళ్లీ టాలీవుడ్ గాడిలో పడుతుంది.

​చాణక్య

[email protected]