రివ్యూ: దిక్కులు చూడకు రామయ్య
రేటింగ్: 3/5
బ్యానర్: వారాహి చలనచిత్రం
తారాగణం: అజయ్, నాగశౌర్య, సనా మక్బూల్, ఇంద్రజ, బ్రహ్మాజీ, అలీ తదితరులు
కథ: పి.వి. గిరి
మాటలు: రమేష్ ` గోపి
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: ఎస్. రాజశేఖర్
నిర్మాత: రజని కొర్రపాటి
కథనం, దర్శకత్వం: త్రికోటి
విడుదల తేదీ: అక్టోబర్ 10, 2014
‘తండ్రీ కొడుకు ఒకే అమ్మాయితో ప్రేమలో పడితే?’.. వినడానికే షాకింగ్‌గా ఉన్న ఈ పాయింట్‌తో సినిమా తీయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆలోచన దశలోనే ఆగిపోయే అవకాశాలెక్కువున్న ఈ కథ సినిమాగా రూపొంది విడుదలైందంటే విశేషమే అనుకోవాలి. అయితే ఇలాంటి ఓ థాట్‌ని యాక్సెప్ట్ చేసేంత పెద్ద మనసు మన ప్రేక్షకులకి ఉందా అనేదే తేలాలి.
కథేంటి?
చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు వంటి బరువు బాధ్యతలతో యవ్వనం అంతా వృధా పోవడంతో… ఒక అమ్మాయిని ప్రేమించాలి… ఆ ప్రేమ అనే అనుభూతిని ఆస్వాదించాలి అనే కోరికలు అలాగే మిగిలిపోతాయి గోపాలకృష్ణకి (అజయ్). బ్యాంక్ ఉద్యోగి అయిన గోపాలకృష్ణ తన వద్దకి లోన్ కోసం వచ్చే అమ్మాయిల్ని ట్రాప్ చేయాలని చూస్తుంటాడు. అలానే అతనికి ఒక లిటిగేషన్‌లో ఇరుక్కున్న సంహిత (సన) తారసపడుతుంది. ఆమెకి సాయం చేసే నెపంతో దగ్గరవుతాడు. తన వయసుకి ఇంకా ముప్పయ్యేనని, పెళ్లి కాలేదని నమ్మబలికి… ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. ఇదిలావుంటే… గోపాలకృష్ణ పెద్ద కొడుకు మధు (నాగ శౌర్య) కూడా సంహితని చూసి మనసు పడతాడు. తనకంటే వయసులో రెండేళ్లు పెద్దదే అయినా కానీ ఆమెని ప్రేమించేస్తుంటాడు. తను ప్రేమిస్తున్న అమ్మాయినే తన తండ్రి కూడా ఇష్టపడుతున్నాడని తెలుసుకున్నాక మధు ఏం చేస్తాడు?
కళాకారుల పనితీరు:
చాలా టాలెంట్ ఉన్నా కానీ అజయ్‌కి తన ప్రతిభకి తగ్గ గుర్తింపు రాలేదింతవరకు. విక్రమార్కుడు, ఇష్క్‌లాంటి చిత్రాల్లో ఆకట్టుకున్నా కానీ తనలోని నటుడికి పరిపూర్ణ న్యాయం అయితే జరగలేదింతవరకు. అతడిలోని నటుడికి పూర్తి న్యాయం చేసిన చిత్రమిదే అని చెప్పాలి. ‘కథానాయక’ పాత్రలో అజయ్ వంక పెట్టలేని నటనతో ఆకట్టుకున్నాడు. ఏమాత్రం తేడా అయినా కానీ తన పాత్రపై అసహ్యం పుట్టే అవకాశం ఉన్న క్లిష్టమైన పాత్రలో అజయ్ చాలా బాగా నటించాడు. అతని టాలెంట్‌కి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇందులోని క్లయిమాక్స్ సీన్. కేవలం హావభావాలతోనే తన పాత్ర తాలూకు మానసిక సంఘర్షణని కళ్లకి కట్టినట్టు చూపాడు. ఇంకా పాపులర్ యాక్టర్ ఎవరైనా చేసి ఉంటే ఈ చిత్రానికి ‘వాణిజ్య విలువ’ పెరిగి ఉండేదేమో కానీ… ఈ పాత్రకి ఇంతటి న్యాయం అయితే జరిగుండేది కాదేమో అనేంతగా అజయ్ తన పాత్రకి ప్రాణం పోసాడు.
నాగశౌర్య తన వయసుకి తగ్గ పాత్రలో అతికినట్టు సరిపోయాడు. తన తండ్రి గురించి నిజం తెలిసాక ఆ సంఘర్షణని బాగా అభినయించాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ తలకిందులు అయిపోయేలా ప్రేమ మైకంలో పడిపోయేట్టు చేసే హీరోయిన్ క్యారెక్టర్‌కి సనా మక్బూల్ సూట్ కాలేదు. అందం సంగతి అటుంచితే కనీసం నటన కూడా ఆకట్టుకోదు. చాలా కాలం తర్వాత కనిపించిన ఇంద్రజ తల్లి పాత్రలో రాణించింది. భార్యా బాధితుడి పాత్రలో బ్రహ్మాజీ నవ్వులు పంచాడు. అలీ కామెడీ ఫర్వాలేదు.
సాంకేతిక వర్గం పనితీరు:
గిరి రాసిన కథ చాలా కొత్తగా, కాంప్లికేటెడ్‌గా ఉంది. అజయ్ క్యారెక్టరైజేషన్‌కి హాలీవుడ్ క్లాసిక్ ‘అమెరికన్ బ్యూటీ’లోని కెవిన్ స్పేసీ క్యారెక్టర్ స్ఫూర్తి అనిపిస్తుంది. గులాబీ రేకుల్లో హీరోయిన్‌ని ఊహించుకోవడం కూడా ఆ సినిమాలోని షాటే. రమేష్ ` గోపి రాసిన సంభాషణలు ఫర్వాలేదనిపిస్తాయి. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచింది. పాటలన్నీ సందర్భోచితంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలని, ఎమోషన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. ఇంటర్వెల్ సీన్‌లో ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీరవాణి గ్రేట్‌నెస్ తెలియజేస్తుంది. సినిమాటోగ్రఫీ సింపుల్‌గా, నీట్‌గా ఉంది. సెకండ్ హాఫ్‌ని బెటర్‌గా ఎడిట్ చేసి ఉండాల్సింది.
సంక్లిష్ట కథాంశంతో జనామోదం పొందేలా కథనం రాసుకోవడం, ఎక్కడా గాడి తప్పకుండా దానిని నడిపించడం ఈజీ వ్యవహారం కాదు. దర్శకుడు త్రికోటికి దర్శకత్వ శాఖలో అపారమైన అనుభవం ఉండడంతో తొలి సినిమాలోనే ఇంత క్లిష్టమైన కథ తీసుకున్నా కానీ తొణకకుండా తెరకెక్కించగలిగాడు. ద్వితీయార్థంలో అక్కడక్కడా అపశ్రుతులు ఉన్నా కానీ మొత్తమ్మీద మెచ్చుకోతగ్గ పనితనమే చూపించాడు.
హైలైట్స్:
- కీరవాణి సంగీతం
- అజయ్ అభినయం
- కథాంశం
డ్రాబ్యాక్స్:
- హీరోయిన్
- సెకండాఫ్‌లో ఎక్కువైన మెలోడ్రామా
విశ్లేషణ:
ముందే చెప్పినట్టు… ఆలోచన దశలోనే ఆగిపోయే అవకాశమున్న కథ ఇది. మన తెలుగు వారి సెన్సిబులిటీస్‌కి, మన సెంటిమెంట్స్‌కి ఒకే అమ్మాయితో తండ్రీ కొడుకు ప్రేమలో పడడమనే కాన్సెప్ట్‌ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. కత్తి మీద సాములాంటి ఇలాంటి కథాంశాన్ని ఎంచుకున్నప్పుడు ఎక్కడ తప్పటడుగు వేసినా కానీ మొదటికే మోసం వచ్చే ప్రమాదముంటుంది. ఈ విషయాన్ని దర్శకుడు పూర్తిగా అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా ఆచి తూచి అడుగులు వేసాడు. ఈ క్రమంలో అతను ద్వితీయార్థంలో మెలోడ్రామా రూట్‌ని ఎంచుకున్నాడు. కథానాయక పాత్రలో పరివర్తన తీసుకురావడానికి కామెడీగా ప్రయత్నించవచ్చు… లేదా సెంటిమెంట్ దారిలో వెళ్లవచ్చు. ప్రథమార్థాన్ని వీలయినంత వినోదాత్మకంగా మలచిన వారే… ద్వితీయార్థంలో ఎందుకో మెలోడ్రామాపై మొగ్గు చూపారు.
దీని వల్ల కథనం వేగం మందగించి… చాలా సేపు నత్త నడకన నడుస్తుంది. అలాగే ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుని, యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ ముగింపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు కానీ దీనిని అస్సలు అంగీకరించలేని వారు ఆదిలోనే డిస్‌కనెక్ట్ అయిపోతారు. అందుకే ఈ చిత్రానికి భిన్నమైన రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ పాయింట్‌ని ఎంతవరకు ఆమోదించడమనే దానిపైనే ఈ చిత్రాన్ని ఆస్వాదించడమనేది బేస్ అయి ఉంటుంది. కథలో వైవిధ్యం ఉన్నట్టే… కథనంలో కూడా కొత్తదనం చూపించారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో ప్రేక్షకుల అంచనాలకి అతీతంగా స్క్రీన్‌ప్లే నడుస్తుంది. కాకపోతే అజయ్‌ని ఫోన్‌లో బ్లాక్‌మెయిల్ చేసే సీన్స్, ఇంద్రజ చేసే డ్రామా సీన్‌కి విలన్‌లో ఒక్కసారిగా వచ్చేసే మార్పు వంటివి పండలేదు. ఆ సీన్స్‌ని బెటర్‌గా డీల్ చేసి ఉండాల్సింది.
అయితే ద్వితీయార్థంలో చాలా లోపాలు దొర్లినా కానీ పతాక సన్నివేశాన్ని రక్తి కట్టించారు. అజయ్, నాగశౌర్య, ఇంద్రజ అభినయం, కీరవాణి నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణలుగా నిలిచాయి. పేపర్‌పై ఏమి రాసుకున్నా కానీ తెరపై కన్విన్సింగ్‌గా తెరకెక్కించడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. నాగశౌర్య, సన మధ్య రిలేషన్ విషయంలో బ్యాలెన్స్ పాటించడం వల్ల స్టోరీలోని కాన్‌ఫ్లిక్ట్‌కి జస్టిఫికేషన్ జరిగింది. ఈ చిత్రాన్ని ఎంత మంది యాక్సెప్ట్ చేస్తారనే దానిపైనే కమర్షియల్ అవుట్‌కమ్ ఆధారపడుతుంది. కమర్షియల్‌గా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందనే విషయం అటుంచితే ఈ ఎటెంప్ట్ చేసినందుకు… నమ్మిన పాయింట్‌ని వీలయినంత కన్విన్సింగ్‌గా మలచినందుకు మాత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’ టీమ్‌ని అప్రీషియేట్ చేయాలి.
బోటమ్ లైన్: కొత్త దిక్కు చూపిన రామయ్య!
-గణేష్ రావూరి