సిని‘మా’ గోల గోల.!

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సగటు సినీ ప్రేక్షకుడ్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఆవేదనకి గురిచేస్తున్నాయి. తమ అభిమాన నటీనటులు, గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటోంటే,…

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సగటు సినీ ప్రేక్షకుడ్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఆవేదనకి గురిచేస్తున్నాయి. తమ అభిమాన నటీనటులు, గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటోంటే, ‘అంతా సినిమా కులమే అన్నారు కదా.. ఇదేంటీ ఈ గందరగోళం.?’ అని సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోవడంలో వింతేముంది.?

మొన్నటికి మొన్న ‘మా’ ఎన్నికలు.. ఇప్పుడేమో నిర్మాతల మధ్య విభేదాలు.. కారణమేదైతేనేం.. సినీ రంగం నిత్యం వివాదాస్పదంగా వార్తల్లోకెక్కుతోంది. దొరికిందే సందు.. అన్నట్టు, ఇన్నాళ్ళూ ఆవేదనతో గడుపుతున్నవారు, అవకాశం కోసం చూస్తున్నవారూ.. తమకు తోచిన రీతిలో సినీ రంగంపైనా, అందులోని వ్యక్తులపైనా విమర్శలు చేస్తుండడం సినీ పరిశ్రమను కలవరపాటుకు గురిచేస్తోంది.

వాస్తవానికి సినీ రంగంలో రాజకీయాలు ఇప్పుడు కొత్తగా చూస్తున్నవేమీ కాదు. అయితే ఈసారి బాగా ఫోకస్‌ అవుతున్నాయంతే. అంతా ‘మా’ ఎన్నికల వివాదం మహిమే. మీడియాని కంట్రోల్‌ చేయాలన్న సినీ రంగ ప్రముఖుల ఆలోచనతో, ఒక్కసారిగా మీడియాలో సినీ రంగానికి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు, చర్చలు, ఇంటర్వ్యూలు షురూ అవుతున్నాయి. 

ఒకప్పటి పరిస్థితులు వేరు. సినిమాకి మీడియా కావాలి.. మీడియాకీ సినిమా కావాలి. ఇప్పుడేమో సినీ రంగం, మీడియాని పక్కన పెట్టాలనుకుంటోంది. కాదు కాదు, మీడియాలో తమకు నచ్చిన వారికే పట్టం కట్టాలన్న సినీ ప్రముఖుల ఆలోచన ఎంతవరకు సబబు.? అన్న చర్చ సామాన్యుల్లోనూ జరుగుతోందిప్పుడు. అదెంతవరకు కార్యరూపం దాల్చుతుందన్నది వేరే విషయంగానీ, ఈలోగా జరగాల్సినంత రచ్చ అయితే జరిగిపోతూనే వుంది.

నిన్నటితే ‘మా’ అధ్యక్ష ఎన్నికల రాజకీయం ఓ కొలిక్కి వచ్చింది. తాజాగా నిర్మాతల మండలిలో విభేదాలు తెరపైకొచ్చాయి. అగ్గిపుల్ల గీసింది నిర్మాత నట్టికుమార్‌. చాలా చిన్న సినిమాలు తీసిన ఈయన, పెద్ద నిర్మాతగా లైమ్‌లైట్‌లోకి వచ్చి, ఆ తర్వాత మళ్ళీ సైలెంటయిపోయారు. నిర్మాతల మండలిని కొందరు శాసించాలనుకుంటున్నారనీ, 14 మంది కూర్చుని, మొత్తం 1400 మందిని కంట్రోల్‌ చేయాలని కుయుక్తులు పన్నుతున్నారంటూ ఆరోపించేశారు నట్టికుమార్‌. అంతే ఒక్కసారిగా టాలీవుడ్‌ షేక్‌ అయ్యింది.

‘ఆ నలుగురు’ అంటూ సినీ రంగంపై విమర్శలు చేసేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఆ మాటకొస్తే, తెలుగు సినిమా పెద్ద తలకాయ, దాసరి నారాయణరావు కూడా ఈ మాట పదే పదే ఉపయోగించేస్తుంటారు. ఆయనే, ‘ఆ నలుగురు’కి చెందిన సినిమా కార్యక్రమాలకు అటెండ్‌ అయి, అక్కడ సాఫ్ట్‌గా మాట్లాడేస్తారు. ఆ నలుగురు కాదిప్పుడు ఆ పధ్నాలుగు మంది.. అంటూ కొత్త, వింత వాదన తెరపైకొచ్చింది.

నిజమేంటి.? అన్నది సినీ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. పైగా ఇప్పుడు కొత్తగా వెలుగు చూసిన వ్యవహారం కానే కాదు. నిర్మాతల మండలిలో విభేదాలైనా, ‘మా’ గొడవలైనా.. ఇంకే ఇతర తగాదాలైనా సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఒక కుటుంబంలోనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలున్నప్పుడు, సినీ పరిశ్రమలో జరిగే గొడవల్లో వింతేముందంటారు కొందరు. దీన్ని మీడియా బూతద్దంలో చూపిస్తోందని మీడియీ మీద కస్సుమనేవారు చాలామందే వున్నారు. అయినాసరే, సినిమా జనాలకి సాధారణ ప్రజానీకంలో వున్న క్రేజ్‌ వేరు. అందుకే సినీ రంగంపై ఏ చిన్న వార్త వచ్చినా, దానిపై పెద్ద ఫోకస్‌ తప్పదు.