రివ్యూ: గోవిందుడు అందరివాడేలే
రేటింగ్: 2.75/5
బ్యానర్: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
తారాగణం: రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, జయసుధ, కమలిని ముఖర్జీ, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, ఆదర్శ్, పోసాని తదితరులు
రచన: పరుచూరి బ్రదర్స్
సంగీతం: యువన్ శంకర్ రాజా
కూర్పు: నవీన్ నులి
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: బండ్ల గణేష్
కథ, కథనం, దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల తేదీ: అక్టోబర్ 1, 2014
ఒకే తరహా కథలు ఎంచుకుంటున్నాడని, ప్రతి సినిమాలో ఒకేలా కనిపిస్తున్నాడని విమర్శలు ఎదుర్కొంటోన్న రామ్ చరణ్ మొనాటనీకి స్వస్తి పలికి.. కుటుంబ కథా చిత్రాన్ని ఏరి కోరి ఎంచుకున్నాడు. పది పదిహేనేళ్ల క్రితం అద్భుతమైన చిత్రాలని తీసిన రికార్డ్ ఉన్నా కానీ గత అయిదారేళ్లలో కృష్ణవంశీ వరుసగా డిజప్పాయింట్ చేస్తూ వస్తున్నాడు. మొగుడులాంటి కళాఖండాలతో నిరాశ పరిచాడు. అయినప్పటికీ కృష్ణవంశీ గత చరిత్రని మాత్రమే పరిగణనలోకి తీసుకుని రామ్ చరణ్ అతనితో జత కట్టాడు. నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ వంటి చిత్రాలతో కుటుంబ కథా చిత్రాలు తీయడంలో తనదైన ముద్ర వేసిన కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’కి కూడా తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయిన జోనర్‌నే ఎంచుకున్నాడు. మరి ఈ గోవిందుడు అందరివాడు అనిపించాడో లేదో చూద్దాం పదండి.
కథేంటి?
తండ్రికిచ్చిన మాట కాదని, తన భవిష్యత్తుని వెతుక్కుంటూ విదేశాలకి వెళ్లిపోతాడు కొడుకు. ఊరి బాగుకోసం ఉపయోగపడతాడని కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. అతనేమో ఊరందరి ముందు తాను తల దించుకునేట్టు చేసి వెళ్లిపోతాడు. ఎన్నో ఏళ్ల తర్వాత కానీ ఆ కొడుక్కి తను చేసిన తప్పు తెలిసి రాదు. కానీ పంతం పట్టిన తండ్రి మనసు మార్చడం తన వల్ల కాదని మౌనంగా బాధ భరిస్తుంటాడు. తన తండ్రి బాధని చూసిన అభిరామ్… తండ్రీ కొడుకుల్ని (ప్రకాష్‌రాజ్, రెహమాన్) కలిపే బాధ్యత తన భుజాన వేసుకుని ఇండియాకి వస్తాడు. వ్యవసాయం నేర్చుకునే నెపంతో తాత ఇంట్లోనే చేరతాడు. అక్కడ్నుంచి ఆ ఇంట్లో వారందరి మనసుల్ని గెలుచుకుని అభిరామ్ అందరివాడు ఎలా అయ్యాడనేదే అసలు కథ.
కళాకారుల పనితీరు:
రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు… ఇలా అన్నిట్లోను యాక్షన్ హీరోగా కనిపించి.. ఎక్కువ శాతం సీరియస్‌గానే నటించిన రామ్ చరణ్ హిట్లయితే సాధించాడు కానీ నటుడిగా తనకి ఆ చిత్రాలు ఏ విధంగాను హెల్ప్ కాలేదు. ఎప్పటికప్పుడు వైవిధ్యభరిత పాత్రలని ఎంచుకుని తనని తాను ఛాలెంజ్ చేసుకుంటేనే ఏ నటుడి రేంజ్ అయినా పెరుగుతుంది. ఎవడు తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన రామ్ చరణ్ మరో కమర్షియల్ ఎంటర్టైనర్ చేయకుండా ఈ కుటుంబ కథా చిత్రాన్ని ఎంచుకున్నాడు. ఒక నటుడికి రొటీన్ నుంచి విముక్తి లభిస్తే ఎంత ఓపెన్ అవుతాడో… ఎంత ఈజ్‌తో పాత్రలోకి ఇమిడిపోతాడో ఈ చిత్రంలో చరణ్‌ని చూస్తే తెలుస్తుంది. నిజానికి మగధీరలో ఓపెనింగ్ సీన్లో, ఆరెంజ్‌లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లోనే చరణ్ మంచి యాక్టర్ అనిపించాడు. కానీ ఆ తర్వాత అతనితో పని చేసిన దర్శకులెవరూ అతడిలోని నటుడ్ని ఎలివేట్ చేయడానికి చూడలేదు. వరుస ఫ్లాపులు ఇస్తున్నా కానీ రిస్క్ చేసి మరీ కృష్ణవంశీతో చేయడం చరణ్ తీసుకున్న మంచి నిర్ణయం. అది అతనికి నటుడిగా చాలా హెల్ప్ అయింది. వివిధ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ యాక్టర్‌గా చరణ్‌కి మంచి ఫౌండేషన్ అవుతుంది. ముందు ముందు వివిధ రకాల పాత్రలు చేయడానికి అవసరమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది.
కాజల్ అగర్వాల్ మరోసారి కృష్ణవంశీ కెమెరాలో చందమామలా కనిపించింది. ఆమె గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. అసలు కామెడీ అనేదే లేని ఈ చిత్రంలో శ్రీకాంత్ క్యారెక్టరైజేషన్, అతని డైలాగ్స్ నవ్విస్తాయి. శ్రీకాంత్ క్యారెక్టర్ని ఇంకాస్త వాడుకుని ఉండాల్సింది. రాజ్ కిరణ్‌ని మార్చి ప్రకాష్‌రాజ్‌ని తీసుకుని చాలా సన్నివేశాలు రీషూట్ చేయడం ఎంత అడ్వాంటేజ్ అనేది ప్రకాష్‌రాజ్ కనిపించే తొలి సీన్లోనే అర్థమవుతుంది. అతి కీలకమైన ఈ పాత్రలో మనకి అంతగా తెలియని తమిళ నటుడు ఉంటే అసలు కనెక్ట్ అయ్యే అవకాశమే ఉండేది కాదేమో. ఇలాంటి తరహా పాత్రలు తనకి కొత్త కాకపోయినా కానీ.. ఈ పాత్రకి తన అనుభవం బాగా కలిసి వచ్చింది. అభిరామ్ గురించిన నిజం తెలిసే సీన్లో జయసుధ ఎక్స్ప్రెషన్ ఒక్కటి చాలు ఆమె ఎంత గొప్ప నటి అని చెప్పడానికి. కమలిని ముఖర్జీకి పెద్దగా స్కోప్ లేకపోయినా కానీ ఉన్నంతలో బాగానే చేసింది. కోట, రావు రమేష్‌ల విలనీ డైలాగులకే పరిమితమైంది. పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ కూడా కాస్తో కూస్తో నవ్విస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
పరుచూరి సోదరులు రాసిన సంభాషణలు ట్రెండ్‌కి భిన్నంగా.. ప్రాసలకి, పంచ్‌లకి దూరంగా సహజంగా ఉన్నాయి. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన పాటలకి కృష్ణవంశీ మార్క్ చిత్రీకరణ జత కలిసింది. నీలి రంగు చీర, రారా కుమారా పాటలు స్క్రీన్‌పై బాగున్నాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి నిండుదనాన్ని ఇచ్చింది. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంది. ఎడిటింగ్ బాలేదు. కారణం ఏమిటో కానీ పలు చోట్ల జర్క్లున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
కృష్ణవంశీ మరీ ఒకనాటి క్రియేటివ్ డైరెక్టర్లా అబ్బురపరచలేదు.. అలా అని ఈమధ్య కాలంలో తీస్తున్న సినిమాల మాదిరిగా ఇబ్బందీ పెట్టలేదు. తన బలాల్ని నమ్ముకుని ఒక క్లీన్ ఫ్యామిలీ సినిమా తీసాడు. కథ, కథనంలో కొత్తదనం లేకపోయినా కానీ పాత్రలతో కనెక్షన్ ఏర్పడేట్టు… వాటి ఎమోషన్స్‌తో ట్రావెల్ అయ్యేట్టు చూసుకున్నాడు. మునుపటి మాదిరిగా సినిమాలు తీసే దిశగా ఇవి తొలి అడుగులైతే తననుంచి ముందు ముందు మంచి చిత్రాలు ఆశించవచ్చు. ఇంతకుమించి చేయడం కష్టమనుకుంటే… తననుంచి ఇంతకంటే ఆశించక్కర్లేదు.
హైలైట్స్:
- రామ్ చరణ్ మేక్ ఓవర్
- ప్రకాష్‌రాజ్, జయసుధల పర్ఫార్మెన్స్
- ఎమోషన్స్
డ్రాబ్యాక్స్:
- కథలో కొత్తదనమే లేదు
- స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేదు
విశ్లేషణ:
కథా పరంగా ఈ చిత్రంపై చాలా హిట్ సినిమాల ప్రభావం ఉంది. ఎప్పుడో వచ్చిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ దగ్గర్నుంచి మొన్నీ మధ్యనే వచ్చిన ‘అత్తారింటికి దారేది’ వరకు చాలా చిత్రాల నీడలు ‘గోవిందుడి’పై కనిపిస్తాయి. కృష్ణవంశీ గత చిత్రాలైన మురారి, చందమామ చిత్రాల పోలికలు కూడా ఉండనే ఉన్నాయి. కనుక ఇది కొత్త అనుభూతిని కలిగించే చిత్రమైతే కాదు. కాకపోతే రామ్ చరణ్‌ని మాత్రం కొత్తగా చూపించిన ఘనత ఈ చిత్రానికి, దర్శకుడికి దక్కుతుంది. చరణ్‌తో సేఫ్‌గా కమర్షియల్ సినిమా చేసుకోకుండా రిస్క్ చేసి ఫ్యామిలీ సినిమా చేయడాన్ని మెచ్చుకోవాలి.
కథ పాతదే అయినా కానీ కథనంతో అయినా కొత్తగా చూపించవచ్చు. కానీ కృష్ణవంశీ అలాంటి సాహసం చేయకుండా ఇక్కడ మాత్రం ఫార్ములానే నమ్ముకున్నాడు. కుటుంబాన్ని కలిపే లక్ష్యంతో వచ్చిన హీరో, ఇంట్లో సమస్యలు చక్కదిద్దడం… అందరికీ దగ్గర కావడం… చివర్లో నిజం తెలియడం.. కాస్త అలజడి రేగడం.. ఫైనల్‌గా సుఖాంతం కావడం! ఈ ఫార్ములాని మాత్రం కృష్ణవంశీ విడిచిపెట్టలేదు. ఈ ట్రీట్మెంట్ వల్ల ఇదంతా ఎక్కడో ఇంతకుముందే చూసేసిన అనుభూతి కలుగుతుంది. కాకపోతే లీడ్ క్యారెక్టర్లని తీర్చి దిద్దిన విధానం బాగుండడం వల్ల ఆ రొటీన్ ఫీల్‌ని గోవిందుడు జయిస్తాడు. ప్రకాష్‌రాజ్ ` చరణ్, శ్రీకాంత్ ` చరణ్, కాజల్ ` చరణ్, జయసుధ ` చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు వేటికవే భిన్నంగా ఉంటూ మెప్పిస్తాయి. అయితే వీటన్నిటినీ కలిపి నడిపించే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే మాత్రం కొరవడిరది.
ఫ్యామిలీ డ్రామాల్లో మందకొడి గమనం మామూలే అయినా కానీ స్క్రీన్‌ప్లేలో ఎక్కడా ‘హై పాయింట్స్’ లేకపోవడం ఓ లోపం. సినిమా ఆసాంతం ఒకటే గ్రాఫ్ మెయింటైన్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో సేఫ్‌గా ఒడ్డు చేరిపోదామనే తపన కనిపిస్తుంది. ఎంత ప్రిడిక్టబుల్‌గా సాగుతున్నా కానీ చివర్లో ఎమోషనల్‌గా హై ఇవ్వగలిగే సత్తా ఉన్న కథే ఇది. కానీ అక్కడ కూడా కృష్ణవంశీ ‘కంట్రోల్’ పాటించాడనిపిస్తుంది. చరణ్ ఐడెంటిటీ జయసుధకి, శ్రీకాంత్‌కి రివీల్ చేసే సీన్స్ బాగున్నప్పటికీ కీలకమైన తాత`మనవళ్ల కాన్ఫ్రంటేషన్ మిస్‌ఫైర్ అయింది. అలాగే చరణ్, శ్రీకాంత్ కలిసి విలన్స్‌కి వార్నింగ్ ఇచ్చి వచ్చే సీనొకటుంది. అక్కడ బాబాయ్`అబ్బాయ్‌ల కెమిస్ట్రీ ఎంచక్కా కుదిరింది. అలాంటి సీన్లు ఇంకో రెండు, మూడు వేసి ఉండాల్సింది. పతాక సన్నివేశంలో కాల్పులు, అప్పటికప్పుడే తాత క్యారెక్టర్లో పరివర్తన రావడాలు అంతగా మెప్పించవు.
టైటిల్ నుంచి, పోస్టర్స్ దగ్గర్నుంచి పాటల వరకు అన్నిట్లోను ‘ఫ్యామిలీ సినిమా’ అనే స్టాంప్ నిలువెల్లా వేసుకున్న ఈ చిత్రం జోనర్‌కి కట్టుబడి సాగింది. టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పించగలుగుతుంది. కాకపోతే చరణ్ గత చిత్రాలకి రాజ పోషకులైన మాస్ ప్రేక్షకులు మెచ్చే గుణాలు ఎక్కువ లేవిందులో. ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద మోసే భారం చరణ్ ఫాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్దే అవుతుంది.
బోటమ్ లైన్: ఫ్యామిలీ ఆడియన్స్‌కి గో‘‘విందు’’డు!
-గణేష్ రావూరి