వెంకన్న సేవలో తరిస్తూ, ఎప్పుడూ మీడియాలో కన్పించే డాలర్ శేషాద్రికి గుండెపోటు వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన తీవ్ర గుండెపోటుకు గురవడంతో, ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాలర్ శేషాద్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో డాలర్ శేషాద్రి సెంటరాఫ్ ఎట్రాక్షన్. ఆయన అనేక వివాదాలకు కేంద్ర బిందువు. ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నారాయన. శ్రీవారి బంగారు డాలర్ల కుంభకోణంలోనూ, పలు ఇతర వివాదాల్లోనూ అప్పట్లో ఆయన పేరు ప్రముఖంగా విన్పించింది.
పదవీ కాలం ముగిసినా డాలర్ శేషాద్రి తనకున్న రాజకీయ పరిచయాలతో ఏదో ఒక పదవితో తిరుమల తిరుపతి దేవస్థానంలో హల్చల్చేస్తుంటారనే విమర్శ వుంది. ఎన్ని విమర్శలు తనపై వస్తున్నా, తాను మాత్రం వెంకటేశ్వరస్వామి భక్తుడిననీ, తానంటే గిట్టనివారు చేస్తోన్న దుష్ప్రచారంతో తనకు సంబంధం లేదని అంటుంటారు డాలర్ శేషాద్రి.
కాగా, డాలర్ శేషాద్రి ఆరోగ్య పరిస్థితిపై పలువురు రాజకీయ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. టీటీడీ అధికారులు కొందరు ఆయన చికిత్స పొందుతోన్న ఆసుపత్రికి చేరుకుని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు.