సీఐ అంటే పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవే. కానీ, ఆ సీఐ కాస్తా దిగజారిపోయాడు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంటే, బందోబస్తు నిర్వహించాల్సిన ఆ సీఐ ఎంచక్కా తన మొబైల్‌లో నీలి చిత్రాలు చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా మీడియాకి చిక్కాడు.
‘నేను ఫేస్ బుక్ చూస్తున్నా..’ అని బుకాయించాడుగానీ, విషయం అంతా మీడియా వద్ద రికార్డెడ్‌గా వుండడంతో ఆయనగారి బుకాయింపులు పనిచేయలేదు. పవిత్రమైన దేవాలయం కొలువున్న ఇంద్రకీలాద్రిపై ఇవేం పాడుపనులంటూ భక్తులు సీఐకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వ్యవహారం ముదిరి పాకాన పడ్డంతో ఉన్నతాధికారులు స్పందించి, ‘పోకిరీ సీఐ’ ప్రసాద్‌ని సస్పెండ్ చేశారు.
అందరికీ అందుబాటులో ఇంటర్నెట్ పుణ్యమా అని ఇలాంటి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయి. సీఐ మొబైల్‌లోనే కాదు, కాలేజీ విద్యార్థులు, స్కూలుకెళ్ళే విద్యార్థులు కూడా స్మార్ట్ ఫోన్లు వాడేయడం సర్వసాధారణమైపోయింది. దేశంలో బూతు వెబ్‌సైట్లపై నియంత్రణ లేకపోవడం, ఇంటర్నెట్‌ని అందిస్తోన్న మొబైల్ కంపెనీలూ వాటిని బ్యాన్ చేయలేకపోవడంతో.. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే వున్నాయి. కర్నాటక అసెంబ్లీలో అప్పట్లో ఇదే తరహా ఘటన కలకలం రేపిన విషయం విదితమే.