అధికార పార్టీలకు ముందుంది ముసుర్ల పండుగ

ఎన్నికలు ముగిసిపోయాయి..ఎవరికి మెజారిటీ వస్తున్న దానిపై, ఏ పార్టీ ధీమా ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఏ పార్టీ కూడా పైకి ఎలా మాట్లాడినా లోలోపల భయం భయంగానే వున్నాయన్నది వాస్తవం. తొలిసారి…

ఎన్నికలు ముగిసిపోయాయి..ఎవరికి మెజారిటీ వస్తున్న దానిపై, ఏ పార్టీ ధీమా ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఏ పార్టీ కూడా పైకి ఎలా మాట్లాడినా లోలోపల భయం భయంగానే వున్నాయన్నది వాస్తవం. తొలిసారి 175 స్థానాలకు తగ్గిపోయిన ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అదృష్టం ఒక్కటే కాంగ్రెస్ బలంగా లేకపోవడం, భారతీయ జనతా పార్టీ పోయి పోయి తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్ధం కావడం. ఇలా కాకుండా ఆ రెండు పార్టీలు కూడా తగినంత బలం సమకూర్చుకుని, వైకాపా, తేదేపాలకు దీటుగా పోటీ చేసి వుంటే పరిస్థితి ఏమిటి? ప్రజల ఆలోచనా ధోరణి ఏ ఒక్క పార్టీ వైపు కాకుండా, విభిన్నంగా మారిపోతే ఏం జరిగేది. హంగ్..హంగ్..హంగ్..
ఇదే పరిస్థితి ముఖ్యమైన పార్టీ సింగిల్ లార్జెస్ట్ పేరిట అధికారంలోకి వచ్చేది. తరచు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కోవడం తధ్యమయ్యేది. ఇప్పుడు వైకాపా, తేదేపా రెండే కాబట్టి ఆ ప్రమాదం తప్పిందనే భావించాలి. కానీ అంత మాత్రం చేత ఆనందించే పరిస్థితి వుంటుందా అంటే అనుమానమే. 

తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైకాపా కావచ్చ, తమ తమ అంతర్గత చర్చల్లో 90 సీట్లు వస్తే చాలు అధికారం అధిరోహించేస్తామన్న ధీమాతో వున్నాయి. మరోపక్క పార్టీ ఫిరాయింపు చట్టం వుండనే వుంది అన్న ధీమా వుంది. కానీ ఇది ఒక్కటి రాష్ట్రంలో అస్థిర పరిస్థితి రాకుండా ఆపగలదా అంటే అనుమానంగానే వుంది. దీనికి కీలక కారణం ఒక్కటే. రాజకీయాల్లో నీతి నిజాయతీల మాట దేవుడెరుగు, సిద్ధాంతాల మాట నాయకులెరుగు? అసలు విశ్వసనీయత అన్నది కానీ, పార్టీల పట్ల నిబద్ధత అన్నది కానీ పూర్తిగా కరువైపోయింది. కొద్ది రోజుల క్రితం ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి వారం రోజులు అటు ఇటుగా జరిగిన బాగోతాలే ఇందుకు సాక్ష్యం. జంక్షన్లో నుంచుని, ఎటు నుంచి ఆటో వస్తుందా, ఎక్కుదామా అని చూసినట్లుగా, ఎవరు టికెట్ ఇస్తారా? అని చూసారు నాయకులంతా, కాంగ్రెస్ నుంచి తేదేపాలోకి, తేదేపా నుంచి వైకాపాలోకి గెంతిన గెంతులు ఇన్నీ అన్నీ కావు. ఇప్పుడు వైకాపాలో వున్న తేదేపా వారైనా, తేదేపాలో వున్న వైకాపా వారైనా మడికట్టుకు కూర్చునే రకాలైతే కాదు. టికెట్ కోసమే ఇన్ని గెంతులు గెంతిన వారు రేపు అధికారం కోసం లేదా మంత్రి పదవి కోసం గెంతడానికి ఒక్క నిమషం కూడా ఆలోచించరన్నది  వాస్తవం. 

డజనో, అరడజను మందో ఉపఎన్నికలకు తెగించి మరీ గెంతులు గెంతరనీ గ్యారంటీలేదు. ఆ సంగతి అలా వుంచితే కార్పోరేట్ రాజకీయాలు భయంకరంగా పెరిగిపోయాయి. కోట్ల డబ్బులు అన్నవి ఏ మాత్రం లెక్కలోకి కానే కావు. ప్రభుత్వం తమ మాట వినకుంటే కోట్లు విరజిమ్మయినా కిందకు దింపడానికి వెనుకాడవు. అయ్యో, ఇలా చేస్తే, ప్రజలు ఏమన్నా అనుకుంటారా అన్నీ మీమాంస పార్టీలకు లేదు. ఏ పార్టీకి ఆ పార్టీకి గ్గోబెల్ ప్రచారం సాగించడానికి ఎవరి సాధనాలు వారికి వుండనే వున్నాయి. జనం కూడా అసలు కారణం మరిచిపోయి, ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధంగా వుంటారు. ఈ ఎన్నికల్లో సమైక్య ఉద్యమ ఛాయలు, కానీ, రాష్ట్రం చీలడానికి, వైకాపా, తేదేపా కూడా ఉత్తరాలు ఇవ్వడం కారణమని కానీ, భాజపా తన వంతు సాయం చేసి మరీ రాష్ట్రాన్ని చీల్చిందని కానీ జనం గుర్తుంచుకున్నారా? ఒక్క కాంగ్రెస్ దే నేరంగా ముద్రవేసి, శిలువ వేసారు. అందువల్ల పార్టీలు తమ చిత్తానికి, కార్పొరేట్లు తమ ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రంలో అస్థిరిత సృష్టించడానికి వెనుకాడవు అన్నది కఠోర వాస్తవం. ఇలా జరగకుండా వుండాలంటే జనం కనీసం 130 సీట్ల మెజారిటీ ఇవ్వాలి ఏ పార్టీకైనా. లేదా, పాలించే పార్టీలు తమ అధికారం సింహాసనం కిందకు నీళ్లు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. నిజానికి బలమైన ప్రతిపక్షం వుండడం ఒకందుకు మంచిదే. కానీ అది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వ్యవహరించినపుడు. అలా కాకుండా, తమ పార్టీ ప్రయోజనాలు, కార్పొరేట్ శ్రేయస్సు చూసుకుంటే మాత్రం అన్యాయమైపోయేది ప్రజలే. 

ఈ ఎన్నికల వరకు సీమాంద్రకు ఈ సమస్య కాస్త తక్కువ వుండే అవకాశం వుంది. కానీ తెలంగాణకు మాత్రం ఈ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. వంద సీట్లకు లోపే అక్కడి శాసన సభ కెపాసిటీ. మరి అలాంటపుడు అస్థిరిత ఏమేరకు పొంచి వుంటుందో ఊహించుకోవచ్చు. పైగా అక్కడ కాంగ్రెస్, తెరాసలతో పాటు, భాజపా, తేదేపా కూడా రంగంలో వున్నాయి. అదీ కాక సీమాంధ్ర, తెలంగాణ సమస్య తెరవెనుక పోంచే వుంటుంది. గడచిన అయిదారేళ్ల కాలంగా ఎన్ని ఉపఎన్నికలు చూసిందో ఈ పాంతం. అయితే నలభై సీట్లతో గోవా, 60 సీట్లతో అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్ (90), హిమాచల్ ప్రదేశ్ (68), మణిపూర్, మేఘాలయ (60)  ఇంకా అనేక రాష్ట్రాల బలం 90 లోపే అని అనడం సహజం. కానీ అలా వున్న చాలా రాష్ట్రాలు చిరకాలంగా అస్థిరితను ఎంతో కొంత ఎదుర్కొంటూనే వున్నాయి. కొన్ని సార్లు కాస్త సుస్థిరత వస్తే వచ్చి వుండొచ్చు కానీ ఈ ప్రమాదాన్ని కూడా అవి చవి చూసినవే. 

మన రాష్ట్రానికి సంబందించినంత వరకు రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమైపోయాయి. బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, అందరూ రాజకీయ రంగప్రవేశం చేసేసారు ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి.. ఇక కాంగ్రెస్ వ్యవహారం తెలిసిందే. అధిష్టానం సదా అసంతృప్తుల్ని వెనకేసుకుని వచ్చి ముఖ్యమంత్రులను మార్చడం. ఎక్కేవాడు ఎక్కుతుంటే లాగే వాడు లాగడం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక ఇదే పరిస్థితి. 

ఇదంతా పరిస్థితిని భూతద్దంలో చూసిన చందంగా వుందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ గతకాలపు రాజకీయాలు, వర్తమాన పార్టీల వ్యవహారాలు, తెరవెనుక కుట్రలు కుతంత్రాలు అన్నీ గమనిస్తే, ఇది వాస్తవ దూరమైన ఆలోచన అని అనుకోవడానికి లేదు. పైగా ఇక్కడ మరో విషయం కూడా వుంది. తెలంగాణ కావచ్చు, సీమాంధ్ర కావచ్చు, ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితుల్లో వున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే, ఉమ్మడి కుటుంబం వున్నపుడు రాబడి హెచ్చు, ఖర్చ తక్కువ . కానీ చీలిన తరువాత అన్నీ రెండు రెండుగా భరించాలి. పైగా అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఈ ఇంట వున్నది ఆ ఇంట వుండదు..ఆ ఇంట వున్నది ఈ ఇంట వుండదు. అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. పైగా లెక్కా జమా లేకుండా ఇచ్చుకుంటూ పోయిన ఎన్నికల వాగ్దానాలు వుండనే వున్నాయి. వీటన్నింటిని తట్టుకుంటూ రాష్ట్రాలను అభివృద్ధి దిశగా నడిపిస్తూ, ప్రతిపక్షాలను, కనిపించని వైరి పక్షాలు సంతృప్తి పరచడం అంటే అంత సులువైన పని కాదు. ఇదంతా గెలిచే పార్టీలు ఏవైనా వాటికి కత్తిమీద సామే. 

చాణక్య

[email protected]