రివ్యూ: కొత్త జంట
రేటింగ్: 2.75/5
బ్యానర్: గీతా ఆర్ట్స్
తారాగణం: అల్లు శిరీష్, రెజీనా, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రావు రమేష్, రోహిణి, మధురిమ తదితరులు
సంగీతం: జె.బి.
కూర్పు: ఉద్ధవ్
ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాస్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: మే 01, 2014
హీరోగా అదృష్టం పరీక్షించుకుంటోన్న అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్‌కి మొదటి చిత్రంతో ‘గౌరవం’ దక్కలేదు. చిన్న సినిమాలకి సేఫ్ బెట్ అనిపించుకుంటోన్న మారుతి చేతికి శిరీష్‌ని అప్పగించాడు అల్లు అరవింద్. శిరీష్‌కి సక్సెస్ ఇచ్చే బాధ్యతతో పాటు తనపై ‘అడల్ట్ కామెడీలు తీసే దర్శకుడు’ అని పడ్డ ముద్ర కూడా చెరుపుకోవడానికి ‘కొత్తజంట’ తెరకెక్కించాడు మారుతి.
కథేంటి?
చిన్నప్పట్నుంచీ స్వార్థపరుడిగా పెరిగిన శిరీష్ ప్రతి దానినీ స్వార్థానికే వాడుకునే వ్యక్తిగా ఎదుగుతాడు. శిరీష్ అంత కాకపోయినా సువర్ణ (రెజీనా) కూడా స్వార్థపరురాలే. అయితే ఒక్కసారి శిరీష్ ప్రేమలో పడిన తర్వాత ఆమె తన స్వార్ధాన్ని పక్కన పెట్టేస్తుంది. కానీ శిరీష్ మాత్రం ప్రేమని కూడా తన స్వార్ధానికే వాడుకోవాలని చూస్తాడు. దీంతో సువర్ణ మనసు గాయపడుతుంది. శిరీష్‌ని ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని అనుకుంటుంది కానీ అతను స్వార్ధానికి అంతే లేదని తెలుసుకుంటుంది. మరి శిరీష్‌లో మార్పు ఎలా వస్తుంది?
కళాకారుల పనితీరు!
అల్లు శిరీష్ మొదటి సినిమాలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ చిత్రంలో కాస్త మెరుగైన నటన కనబరిచాడు కానీ ఇంకా చాలా మెరుగవ్వాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అతని బలహీనతల్ని ‘కవర్’ చేయడానికి ప్రయత్నిస్తున్నారనిపించింది. శిరీష్ చెప్పే డైలాగుల్ని వేరే క్యారెక్టర్స్ ఫేస్‌పై పోస్ట్ చేయడం, కొన్ని సీన్స్ లాంగ్ షాట్స్‌లో కానిచ్చేయడం లేదా వెనుక బ్రైట్ లైటింగ్‌తో కప్పిపుచ్చడం వగైరా కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్స్ పరంగా చాలా బెటర్ అవ్వాలి. డైలాగ్ డెలివరీలో ఆ స్పీడ్ తగ్గించుకోవాలి. మరీ రెండో సినిమాకే రంధ్రాన్వేషణ తగదు కానీ నటుడిగా నిలదొక్కుకోవడానికి ఇంకా హార్డ్ వర్క్ అవసరం మరి. అల్లు అర్జున్ అంత ఎనర్జీ, నటనలో ఈజ్… డాన్స్‌లో ఆ గ్రేస్ లేవు కాబట్టి!
రెజీనా మొదటి సినిమాతోనే నటిగా తనని తాను నిరూపించుకుంది. హీరోయిన్లలో ఇంత ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ చాలా అరుదు. అందం, అభినయం కలగలిసిన రెజీనాకి నటిగా తన టాలెంట్ చూపించే స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది. ఆమె దానిని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంది.
సప్తగిరి కమెడియన్‌గా ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. నెల్లూరు యాసలో మాట్లాడే సప్తగిరి ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో కడుపుబ్బ నవ్విస్తాడు. పోసాని సహా మిగిలిన వారంతా తమ పరిధుల్లో మెప్పించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
సాంగ్స్ వినడానికి బాగున్నాయి. ‘ప్రేమ రాక్షసి’ చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. ‘అటు అమలాపురం’ రీమిక్స్ మాస్‌ని అలరిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ వగైరా అన్నీ కూడా స్టాండర్డ్స్‌కి తగ్గట్టు ఉన్నాయి. మారుతి తీసిన సినిమాల్లో టెక్నికల్‌గా బెటర్ ప్రోడక్ట్ ఇది. బడ్జెట్‌కి తగ్గట్టు క్వాలిటీ కూడా తీసుకొచ్చాడు.
మారుతి ద్వందార్థ సంభాషణల్ని పక్కనపెట్టి క్లీన్ కామెడీ అందించడానికి మాగ్జిమం ట్రై చేశాడు. అక్కడికీ ఒకటీ అరా డబుల్ మీనింగ్ డైలాగులు దొర్లి ఉండొచ్చు కానీ ఓవరాల్‌గా ఫ్యామిలీస్ చూడదగ్గ క్లీన్ మూవీని రూపొందించాడు. తన గత సినిమాలు చూస్తే నేటి ప్రేమల మీద, ముఖ్యంగా అమ్మాయిల మీద మారుతికి సదభిప్రాయం లేదేమో అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో లవ్‌ని క్లీన్‌గా చూపించిన వైనం, హీరోయిన్ క్యారెక్టర్ని ఎమోషనల్‌గా తీర్చిదిద్దిన విధానం మారుతిలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. అయితే క్లీన్ కామెడీ అందించడంలో భాగంగా మారుతి చేతులు కట్టేసుకోవడం వలనో ఏమో… ఇందులో కామెడీ శాతం బాగా తగ్గింది. దాని ప్రభావం ఫలితంపై కూడా ఉంటుంది మరి.
హైలైట్స్:
- కామెడీ సీన్స్
- హీరో క్యారెక్టరైజేషన్
- రెజీనా పర్ఫార్మెన్స్
డ్రాబ్యాక్స్:
- రొటీన్ స్క్రీన్‌ప్లే
- వీక్ క్లైమాక్స్
విశ్లేషణ:
‘కొత్తజంట’ పేరు చూసి ఈ జంట కొత్తగా ఉంటుందేమో, వీరి ప్రేమ ఇంతకుముందు చూసి ఉండమేమో అనుకోకండి. పేరులో ఉన్న కొత్తదనం జంటలో లేదు. ఆరంభ సన్నివేశాలు కొత్తగానే అనిపిస్తాయి. ఇదేదో వెరైటీ లవ్‌స్టోరీ అనిపిస్తాయి. కానీ ఒక్కసారి హీరోతో హీరోయిన్ లవ్‌లో పడగానే అంతా రొటీన్ వ్యవహారం అయిపోతుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఆధారంగా అల్లుకున్న లవ్‌స్టోరీ ఇది. స్వార్ధపరుడికి ప్రేమ విలువ తెలిసిరావడం అనేది కాన్సెప్ట్. ఇది కొత్తగానే ఉన్నా కానీ దానిని నడిపిన విధానం మాత్రం రొటీన్‌గానే ఉంది.
హీరోయిన్ని టీజ్ చేయడానికి మరో అమ్మాయికి హీరో క్లోజ్‌గా ఉండడం, మళ్లీ హీరోకి బుద్ధి చెప్పడానికి హీరోయిన్ ఇంకొకరికి క్లోజ్ అవడం, ఆ తర్వాత ఆ ప్రేమ బ్రేకింగ్ పాయింట్‌కి చేరుకోవడం, హీరో చివర్లో రియలైజ్ కావడం… ఇదంతా ఫక్తు ఫార్ములా వ్యవహారం. దాదాపుగా రొమాంటిక్ కామెడీలన్నీ ఇదే గ్రాఫ్‌లో, ఇవే సీన్స్‌తో తెరకెక్కుతుంటాయి. కొత్తజంట ఏదైనా కొత్త దారిలో వెళుతుందేమో అనుకుంటే నిరాశ తప్పదు.
అసలు కథలో కొత్తదనం లేకపోవడంతో కామెడీ సీన్లు పెట్టి పైసా వసూల్ ఫీలింగ్ ఇవ్వాలని దర్శకుడు చూసాడు. అందుకే ప్రథమార్థంలో సప్తగిరి కామెడీ సీన్, ద్వితీయార్థంలో ఓంకార్ ఛాలెంజ్ షో స్పూఫ్, పోసానితో పార్క్‌లో సీన్ పెట్టాడు. వీటితో కొంతవరకు కాలక్షేపం అయిపోయినా కానీ మిగతాదంతా రొటీన్ లవ్‌స్టోరీ కావడంతో కొత్తజంట సెకండాఫ్ అంత ఇంట్రెస్ట్ పుట్టించదు. అంత సెల్ఫిష్ హీరో తల్లి కొట్టిన ఒక్క చెంపదెబ్బతో రియలైజ్ అయిపోవడం కూడా కన్విన్సింగ్‌గా లేదు.
అయితే కమర్షియల్‌గా పాస్ అయిపోవడానికి కావాల్సిన కామెడీ సీన్స్ ఉన్నాయి కాబట్టి, బడ్జెట్ కూడా లిమిట్‌లోనే ఉంది కాబట్టి.. కొత్తజంట బాక్సాఫీస్‌ని సేఫ్‌గా ఈదేయవచ్చు. గౌరవం కంటే బెటర్ సినిమా చేసానని చెప్పుకోవడానికి శిరీష్‌కి, క్లీన్ సినిమా నేనూ తీయగలను చూపించుకోవడానికి మారుతికీ పనికొచ్చే కొత్తజంట ప్రేక్షకులకి మాత్రం కేవలం కాలక్షేపానికి పనికొస్తుంది. ‘చూడాల్సిన అవసరం లేదు… చూస్తే నష్టం లేదు’ అన్నట్టున్న ఈ చిత్రం కొత్తదనం ఆశించే వారిని మాత్రం నిరాశపరుస్తుంది.
బోటమ్ లైన్: ‘కొత్త జంట’తో పాత రొమాన్స్!
-జి.కె.