సమైక్య ఉద్యమ చివరి ఘట్టం?

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మరో కొన్ని గంటల్లొ పోలింగ్ జరగబోతోంది. ఇలాంటి దశలో నెల రోజుల కిందటే ముగిసిపోయిన సమైక్య ఉద్యమ వైనం ఏమిటి అన్నఅనుమానం రావడం సహజం. కానీ ముగిసిపోలేదు.…

తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మరో కొన్ని గంటల్లొ పోలింగ్ జరగబోతోంది. ఇలాంటి దశలో నెల రోజుల కిందటే ముగిసిపోయిన సమైక్య ఉద్యమ వైనం ఏమిటి అన్నఅనుమానం రావడం సహజం. కానీ ముగిసిపోలేదు. ఇంకా సజీవంగానే వుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలే సమైక్య ఉద్యమంలో చివరి ఘట్టం అనుకోవచ్చు. ఎందుకంటే  తెలంగాణలో తొలిసారి అధికారం కోసం పోటీ పడుతున్న పార్టీలో టీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ ప్రాంతీయ పార్టీ. భాజపా, కాంగ్రెస్ జాతీయ పార్టీలు. తేదేపా, వైకాపా లు రాష్ట్రస్థాయి పార్టీలు. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ప్రాంతంలో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నవారు చాలా ఆసక్తిగా వున్నారు. ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా వుంటే వీరి వైఖరి ఒకలా వుంటుంది. లేకుంటే మరోలో వుంటుదని తెలుస్తోంది. ఆ మధ్య ప్రముఖ సినిమా నిర్మాత సురేష్ బాబు విశాఖలో మాట్లాడుతూ, విశాఖ లేకుంటే, సినిమా పరిశ్రమ మళ్లీ మద్రాసు తరలిపోవాల్సిన పరిస్థితి అన్నారు. సందట్లో సడేమియా అన్నట్లు ఎన్నికల హడావుడిలో పెద్దగా పట్టించుకోలేదు.  కానీ ఆలోచిస్తే సురేష్ బాబు ఎందుకలా అన్నట్లు? అంటే భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారనేగా. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే, వచ్చే మంచి చెడ్డల గురించి సీమాంధ్రకు చెందిన పారిశ్రామిక వేత్తలు అంతా ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, సమస్యలు లేని వాతావరణాన్ని వారు  కోరుకుంటున్నారు. 

అందుకోసం వీలయితే సీమాంధ్ర పార్టీలు లేదా, జాతీయ పార్టీలతో కూడిన ప్రభుత్వం తెలంగాణలో వస్తే బాగుండుననుకుంటున్నారు. ఈ రోజు భాజపా-తేదేపా-లోక్ సత్తా-జనసేన కలిసి మూకుమ్మడిగా పోరు సాగించడానికి ఇది ఏకైక కారణంగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చాలా బహిరంగంగానే చెబుతున్నారు. టీఆర్ఎస్ రాకుండా చూడడం తన ధ్యేయమని. ఎందుకని? తెలంగాణ రావడం తనకు ఇష్టమే అని చెబుతున్నపుడు, ఆ ఉద్యమాన్ని నిర్మించిన టీఆర్ఎస్ ఎందుకు అధికారంలోకి రాకూడదని పవన్ కోరుకుంటున్నారు? దీనికి బహుశా ఆయన కుటుంబం అంతా అధికారం పంచేసుకుంటున్నాయన్న ఒకే కారణం చెపుతారేమో? కాదంటే, టికెట్ లు అమ్ముకున్నారని. ఆ పని అందరూ చేసారుగా..గతంలో ప్రజారాజ్యమే ఈ తరహా వ్యవహారానికి శ్రీకారం చుట్టింది. కుటుంబంలో నలుగురు అధికారం కోసం పోటీ చేస్తున్నంత మాత్రాన కేసిఆర్ ను ఆ లెవెల్లో ద్వేషించనక్కరలేదు. అంటే వీటన్నింటికి మించి, వెల్లడించని కారణం మరేదో వుంది. అదే పవన్ ను, చంద్రబాబును దగ్గర చేసింది. అదే కిషన్ రెడ్డి మెడలు వంచి, తేదేపా-భాజపా పొత్తు కలిసేలా చేసింది. అదే లోక్ సత్తా కూడా మోడీ కి దన్నుగా నిలిచేలా చేసింది. 

ఇప్పటికే కెసిఆర్ గడచిన రెండు రోజులుగా మరోసారి సీమాంధ్రుల వ్యవహారాన్ని తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అది సీమాంధ్రులకు అమ్ముడు పోతుందని ఆరోపిస్తున్నారు.అంటే సమైక్య ఉద్యమ చిగుర్లు ఇంకా వాడిపోలేదని అర్థమవుతోన్నట్లే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడినా, భాజపా-తేదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడినా తెలంగాణ ప్రగతికి వచ్చిన నష్టం వుండదు. అయితే మరీ మోటుగా, సీమాంధ్ర వ్యతిరేక ధోరణి కనబర్చడం మాత్రం వుండదు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే. ఇప్పటికే కెసిఆర్ అన్నారు. ఫలితాలు వచ్చాక పవన్ పని చూస్తామన్న రీతిలో మాట్లాడారు. కెసిఆర్ కూతురు కవిత సినిమా వాళ్ల దగ్గర వసూళ్లకు పాల్పడ్డారని పలువురు ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యోగుల సమస్య వుండనే వుంది. నదీ జలాల కిరికిరి వుండనే వుంటుంది. అదే కనుక టీఆర్ఎస్ మినహా మరే ప్రభుత్వం ఏర్పడినా, ఇటు తెలంగాణ వాళ్లకు ఇబ్బంది కలుగకుండా, సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేసే అవకాశం వుంది. 

అందుకే ఇది సమైక్య ఉద్యమ చివరి ఘట్టంగా అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఇంటిలిజెన్స్ నివేదికలు టీఆర్ఎస్ కు ఎడ్జ్ వున్నట్లు పేర్కొంటున్నాయని వార్తలు వినవస్తున్నాయి.కానీ కెసిఆర్ గెలుపుపై ధీమాతో మాత్రం లేరని ఆయన మాటలే చెబుతున్నాయి. మోడీకి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వమని ఆయన మరోసారి స్పష్టం చేసారు.తనతో కలిసిన ఎమ్ఐఎమ్ కోసం లేదా, తెలంగాణలో కాస్త గణనీయంగా వున్న ముస్లిం ఓట్ల కోసం ఆయన అలా అన్నారు అని అనుకోవచ్చు. కానీ ఆయన అక్కడితో ఆగలేదు. కేంద్రంలో సోనియాకే మద్దతు ఇస్తామన్నారు. సోనియానే తెలంగాణ ఇచ్చిందన్నారు. ఈ కీలక సమయంలో ఆయన ఇలాంటి ప్రకటన చేయడం అంటే ఆత్మహత్యాసదృశ్యమే. దీనివల్ల కాంగ్రెస్ మరింత ఊపు తెచ్చుకుంటుంది. అయినా దానికైనా కెసిఆర్ ఇప్పుడు రెడీ అవుతున్నారన్నమాట. అంటే కేంద్రంలో మీకు నేను, రాష్ట్రంలో నాకు మీరు అన్న ప్రణాళికను బయటకు తీస్తున్నారన్నమాట.అంటే విజయం తన గుమ్మంలో లేదని ఆయనకు అర్థమై వుండాలి. టికెట్ ల కేటాయింపు, వాటి లోగుట్టు అయిపోయింద కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ తొ అధికారం పంచుకునేందుకు కెసిఆర్ కు  పెద్దగా ఇబ్బంది వుండకపొవచ్చు. ఎమ్ఐఎమ్, వైకాపాలు సింగిల్ డిజిట్లు తెచ్చుకున్నా, కెసిఆర్ కు ఎలాగూ మద్దతు ఇస్తాయి. అయితే ఇవన్నీ కలిసి కెసిఆర్ కు సరిపడా బలాన్ని ఇస్తాయా అన్నది చూడాలి.  కాదూ..తేదేపా కూటమి వస్తే, బాబు తన రెండు కళ్ల సిద్దాంతంతో రెండు ప్రాంతాలు ఓకె అనేలా ముందుకెళ్లిపోతారు. అది గ్యారంటీ. కానీ ప్రజలు ఎటువైపు వున్నారన్నది తేలితే కానీ, ఈ సమైక్య ఉద్యమ చివరి ఘట్టం ఫలితం తెలియదు.

చాణక్య

[email protected]