ఎమ్బీయస్‌ : టిడిపి గ్రాఫ్‌ పెరుగుతోందా?

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైకాపా గ్రాఫ్‌ పడిపోతోందని, టిడిపిది పెరిగిపోతోందని సర్వే ఫలితాలు వస్తున్నాయి. వీటిని ఎంతవరకు నమ్మాలో తెలియకుండా పోయింది. మూడేళ్లగా ఆంధ్ర ప్రాంతంలో వైకాపా దున్నేస్తుందని, తెలంగాణలో తెరాస దున్నేస్తుందనీ సర్వేలు…

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైకాపా గ్రాఫ్‌ పడిపోతోందని, టిడిపిది పెరిగిపోతోందని సర్వే ఫలితాలు వస్తున్నాయి. వీటిని ఎంతవరకు నమ్మాలో తెలియకుండా పోయింది. మూడేళ్లగా ఆంధ్ర ప్రాంతంలో వైకాపా దున్నేస్తుందని, తెలంగాణలో తెరాస దున్నేస్తుందనీ సర్వేలు ఘోషిస్తూ వచ్చాయి. అవి బేస్‌ చేసుకుని ఆ యిద్దర్నీ కలుపుకుని మళ్లీ అధికారంలోకి రావచ్చనే ఉద్దేశంతోనే కాంగ్రెసు విభజనకు ఒడిగట్టిందని కూడా చాలామంది తీర్మానించారు. ఇప్పుడు ఎన్నికలు వారాల్లోకి వచ్చాయి. వైకాపా, తెరాసలు కచ్చితంగా అధికారంలోకి వస్తాయని ఎవరైనా చెప్పగలరా? కాంగ్రెసు వాళ్లతో కుమ్మక్కయిందని కూడా అనగలరా? ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఎంతమంది పార్టీలు ఫిరాయించారో చూడండి. పొత్తులు, విపత్తులు ఎన్ని వచ్చాయో గమనించండి. ఈ స్థితిలో ఫలితాలు చెప్పడం కష్టం. మరి అలాటప్పుడు ఎప్పుడో ఏళ్ల క్రితమే సర్వేలు చేయడమెందుకు? రాబోయే ప్రభుత్వాల గురించి అంచనాలు ఎందుకు? అయినా సరే సర్వేలు చేయిస్తూనే వుంటారు, పత్రికలు ప్రముఖంగా వేస్తూనే వుంటాయి, మనం చర్చిస్తూనే వుంటాం. వాటిని ఏ పార్టీనాయకులూ నమ్మరు. తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చినవారు కూడా! 'ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి' అంటారు ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఎన్నికల ఫలితాల తర్వాత సర్వే ఫలితాలపై సర్వేలు వస్తాయి. ఎవరిది కరక్టు, ఎవరిది కాదు అని విశ్లేషణ. ఎందుకు కరక్టు కాదో మాత్రం చెప్పరు.

సర్వే సరదాలు

 మీరు సరదాకి ఏదైనా సర్వే చేయిద్దామని ఎవరినైనా సంప్రదించి చూడండి, ఎంత ఖర్చుతో, ఎంత సమయంతో కూడుకున్న వ్యవహారమో తెలుస్తుంది. ఒక్క వూళ్లో, కొన్ని వందల మందిని ప్రశ్నించి, విశ్లేషించడానికి వేలాది రూపాయలవుతుంది. చాలా రోజులు పడుతుంది. పత్రికల వాళ్లు అంత ఖర్చు ఎందుకు పెడతారు? పార్టీల వాళ్లు మాత్రం..? అయినా ఎన్నికలు దగ్గరకు వచ్చేవరకు అధికశాతం ఓటర్లు ఎటూ తేల్చుకోరు. 'చెప్పలేం' అనేవారే కీలకం. వాళ్లే ఫలితాలను తారుమారు చేస్తారు. అందుకని చివరివారంలో జరిపే సర్వేలే కొంతవరకైనా కరక్టు ఫలితాలను యివ్వగలవు. అప్పటిదాకా ఎవరూ ఆగరు కదా. ఏదో ఒక హంగు చేసి పత్రికలు అమ్ముకోవాలి. టీవీ రేటింగ్‌ పెంచుకోవాలి. నిజాయితీగా ఫలితాలను వెలువరిస్తే హర్షించేవారు తక్కువ. అందువలన పత్రికలు, టీవీలు వారివారి ప్రయోజనాలకు అనుగుణంగా సర్వేలను తీర్చిదిద్దుతున్నాయన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకే వారంలో ఒకే నియోజకవర్గంలో మూడు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలలో వేర్వేరు ఫలితాలు వస్తున్నాయంటే ఏమిటి అర్థం? పైగా ఫలితాలను ప్రభావం చేయడానికి కార్పోరేట్లు వేలు పెడుతున్నారు కాబట్టి వాళ్ల స్పాన్సర్‌షిప్‌తో సర్వేలు  జరుగుతున్నాయన్న అనుమానం వుంది కాబట్టి వీటిని నమ్మలేకుండా వున్నాం.

మొన్నటికి మొన్న ఢిల్లీ ఎసెంబ్లీ ఎన్నికలలో సర్వే అంచనాలు చూశాం. ఒక్క సర్వే కూడా ఆమ్‌ ఆద్మీ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. అందరూ బిజెపికే పట్టం కట్టారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ డా|| హర్షవర్ధన్‌కు టీవీవాళ్లు కంగ్రాట్స్‌ చెప్పారు. ఆయన చిరునవ్వు నవ్వి వూరుకుంటే 'అదేమిటి? నీకు నమ్మకం లేదా?' అంటూ కవ్వించారు. జోస్యాలు ఎంతవరకు నిజమవుతున్నాయో, యీ సర్వేలూ అంతే మేరకు నిజమవుతున్నాయి. దీనికి కారణం – 'నిజం చెప్తే నాకేంటి లాభం?' అనే సగటు మనిషి ఆలోచనే. సామాన్యుడి మనోభావం అంటూ ఏ టీ కొట్టువాడి నోటి ముందు టీవీ మైకు పెడితే ఏం చెప్తున్నాడు? పేపర్లో ఏం వస్తోందో అదే వల్లిస్తున్నాడు. మా నియోజకవర్గంలో ఏ పనీ జరగలేదు అని తిడుతున్నాడు. సరే, ఓటు ఎవరికి వేస్తావ్‌? అంటే చూడాలి అంటాడు. ఎవరు నెగ్గుతారని అనుకుంటావ్‌? అంటే రకరకాలుగా చెప్తున్నారు, ఫలానాది వస్తుందని మీబోటి వాళ్లు అంటున్నారు అంటాడు తప్ప తనేమనుకుంటున్నాడో చెప్పడు. చెప్తే అవతలి పార్టీవాళ్లు వచ్చి తన్నవచ్చు, ఎందుకొచ్చిన గొడవ? భారతీయులు గడుసువాళ్లు. హిపాక్రసీ ఎక్కువ. అందువలన పాశ్చాత్య దేశాల్లో సర్వేలు ఫలించినట్లు యిక్కడ ఫలించవు. 

గ్రాఫ్‌ ఎందుకు మారింది?

ఇలాటి పరిస్థితుల్లో ఫలానా సర్వే యిలా వచ్చింది అంటూ చర్చించడం వలన ఏమైనా లాభం వుంటుందా? ఏమో! వైకాపా గ్రాఫు పడిపోయింది, టిడిపి గ్రాఫు పడిపోయిందనేవాళ్లు దానికి కారణం ఏమైనా చెప్తున్నారా? ఎక్స్‌-యాక్సిస్‌, వై-యాక్సిస్‌ హఠాత్తుగా మారిపోయాయా? అప్పటికీ యిప్పటికీ హఠాత్తుగా వచ్చిన మార్పు ఏమిటి? 'మార్పు ఏమిటంటే – విభజన జరిగింది. అందువలన సమైక్యమా? విభజనా? అన్నది ఎన్నికల అంశంగా కాకుండా పునర్నిర్మాణం, నవ నిర్మాణం అనేవి ముఖ్యాంశాలుగా మారాయి. వాటిల్లో చంద్రబాబుది అందె వేసిన చేయి కాబట్టి ఆయనదీ మోదీది కలిస్తే డెడ్లీ కాంబినేషన్‌ కాబట్టి టిడిపి గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది' ఇదీ కొందరి వాదన. సమైక్యమా? విభజనా? అనేది ఎన్నికల అంశం కానప్పుడు తెలంగాణలో తెరాసకు, కాంగ్రెసుకు ఓట్లు ఎందుకు పడాలి? విభజన చేశాం, కొత్తరాష్ట్రం తెచ్చాం/యిచ్చాం అనే కదా వాళ్లు కాన్వాస్‌ చేసుకుంటున్నది, ఓట్లు వస్తాయని ఆశిస్తున్నదీ, సీట్లు వస్తాయని సర్వేలు చెపుతున్నదీ…! పునర్నిర్మాణం, పాలనానుభవం అనే ఫ్యాక్టర్లపై టిడిపికే ఎక్కువ సీట్లు రావాలి కదా. వస్తాయని టిడిపియే అనుకోవడం లేదు. అందుకే కృష్ణయ్యగారే ముఖ్యమంత్రి అని ప్రకటించేశారు. టిడిపి కాకపోతే పాలనానుభవంలో కాంగ్రెసుకు మార్కులు పడాలి. మరి కాంగ్రెసు తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అనగలమా? టి-కాంగ్రెసు నేతలకే ఆ నమ్మకం లేదు. విభజన అనేది అంశమే అయితే రెండు రాష్ట్రాలలోనూ దాని ప్రభావం వుండితీరుతుంది. ఆ అంశంపై టిడిపి పట్ల తెలంగాణలో వ్యతిరేకత వుంది అని అందరూ ఒప్పుకుంటున్నపుడు, సమైక్యం గురించి నిలబడలేదన్న కోపం సీమాంధ్రులలో టిడిపిపై కూడా వుండాలి కదా. అలాటప్పుడు గ్రాఫ్‌ ఎలా పెరుగుతుంది?

టిడిపి విజయావకాశాలు

మామూలుగా చూస్తే ఆంధ్రలోని 175 సీట్లలో 150 సీట్లు టిడిపి, వైకాపా పంచుకుంటాయనుకోవచ్చు. తక్కిన 25 సీట్లలో వివిధ పార్టీలు అంటే కాంగ్రెసు, జెఎస్పీ, బిజెపి, లెఫ్ట్‌, రెబెల్స్‌, యిండిపెండెంట్స్‌ గెలుస్తారనుకుందాం. ఇక యీ 150ను యివి ఏ నిష్పత్తిలో పంచుకుంటాయి? ఉరామరిగా సగం, సగం అనుకుందాం. వైయస్సార్‌ యిమేజి వుంది, జగన్‌ ఓదార్పు యాత్ర పేరుతో తిరిగినది వుంది, మొదట్లోనే సమన్యాయం, చివరినైనా సమైక్యం అన్నందుకు కాస్త ఫలితం వుంటుంది. ఇన్ని వున్నాయి కాబట్టి సగం కంటె ఎక్కువే రావాలి కదా అనవచ్చు. జగన్‌కు వ్యతిరేకంగా విపరీతంగా జరుగుతున్న ప్రచారానికి ఎంతోకొంత ప్రభావం వుండి తీరుతుంది. అందువలన ఓటర్లలో సగం మంది జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోను రానీయకుండా చేయాలని అనుకోవచ్చు. గతంలో కాంగ్రెసు బలంగా వున్నపుడు, కాంగ్రెసు, టిడిపి, వైకాపా సమాన స్థాయిలో వుంటాయనుకునే వాణ్ని. కానీ యిప్పుడు కాంగ్రెసు బలహీనపడింది. జెయస్పీ పుంజుకోలేదు. టిడిపి సమైక్యానికి సరిగ్గా నిలబడక మద్దతు పోగొట్టుకుంది. అన్నీ బలహీనపడ్డాయి. 

అయినా టిడిపి ఒక్కటే వైకాపాకు బలమైన ప్రత్యర్థిగా నిలిచింది కాబట్టి జగన్‌ వ్యతిరేక ఓట్లకు గుత్తగా టిడిపికి పడే అవకాశం వుంది. అందువలన టిడిపి, వైకాపాకు చెరి 75 వస్తాయనుకుని లెక్క ప్రారంభించడం సబబు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ 3-5% ఓట్ల స్వింగ్‌ వస్తే 10-15 సీట్లు అటూ యిటూ అవుతాయి. అంటే 85-90 సీట్లతో ఒకరు అధికారంలోకి వచ్చే అవకాశం వుంది. మరొకరికి 55-60 వచ్చి తీరతాయని లేదు. మధ్యలో వున్న రెబెల్స్‌ కొన్ని పట్టుకుని పోవచ్చు. అంటే చాలా సున్నితమైన వ్యవహారంగా వుంది. 5% స్వింగ్‌ మేనేజ్‌ చేయాలంటే తమకు సాంప్రదాయకంగా వేసే ఓటర్లలో విశ్వాసాన్ని నిలుపుకోవడమే కాదు, కొత్త ఓటర్లను తమవైపు తిప్పుకోవాలి. చంద్రబాబు యిటీవలి చర్యలు యీ దిశగా వున్నాయా? వాటి కారణంగా టిడిపి గ్రాఫ్‌ నిజంగా పెరిగిందా అనేది చూదాం. 

వలసలు ప్రోత్సహిస్తున్న టిడిపి

గ్రాఫ్‌ పెరిగిందని అనుకోవడానికి ముఖ్య కారణం – కాంగ్రెసు నాయకులందరూ టిడిపిలోకి జట్లుజట్లుగా వచ్చి పడడం. ప్రజలందరూ టిడిపివైపు వున్నారని గ్రహించారు కాబట్టే వాళ్లు పార్టీ ఫిరాయించారనుకోవాలి. కాంగ్రెసుపై ప్రజలు విముఖత చూపుతున్నారన్నది ప్రస్ఫుటంగా తెలుస్తోంది. పిసిసి అధ్యకక్షుడి నియోజకవర్గంలో అభ్యర్థే పారిపోయాడంటే యింకేం చెప్పాలి? విజయవాడ వంటి నియోజకవర్గంలో కాంగ్రెసు టిక్కెట్టు యిస్తే అతను మర్నాడు బిజెపిలో చేరాడంటే ఏమనుకోవాలి? కాంగ్రెసులోంచి బయటకు వచ్చాక వైకాపాలోకి వద్దామని కొందరు ప్రయత్నించారు. అక్కడ కౌంటరు క్లోజయింది. టిక్కెట్ల కసరత్తు ఎప్పుడో ప్రారంభం కావడం చేత కాబోలు దాదాపు అన్ని సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. తిరుగుబాటు అభ్యర్థులు కూడా చాలా తక్కువ. టిడిపి ఓపెన్‌ డోర్‌ పాలసీతో అందర్నీ రప్పించుకుంది. తన పార్టీలో చేర్చుకోలేని వారిని దగ్గరుండి బిజెపిలో చేర్పించింది. ఈ విధంగా ఆంధ్రలో కాంగ్రెసును దివాలా తీయించానని బాబు అనుకున్నారు. 

1977లో జనతా పార్టీ ప్రభవించినపుడు కూడా యిలాగే పార్టీలు మారారు. అంతకుముందు ప్రజాపార్టీ, కృషికార్‌ లోక్‌ పార్టీ, స్వతంత్ర పార్టీ, సోషలిస్టు పార్టీ, రిపబ్లికన్‌ పార్టీ.. కొంతకాలానికి పాత కాంగ్రెసు, కొత్త కాంగ్రెసు, కాంగ్రెసు (ఆర్‌), కాంగ్రెసు (ఐ), కాంగ్రెసు (టి) యిలా అనేక పార్టీలు వుండేవి. కాంగ్రెసు వాళ్లే అటూయిటూ దుముకుతూ వుండేవారు. కమ్యూనిస్టు వాళ్లు విడిగా వుండేవాళ్లు. జనసంఘ్‌వాళ్లు ఒకళ్లూ యిద్దరూ నామమాత్రంగా వుండేవారు. కమ్యూనిస్టులు, జనసంఘ్‌వాళ్లూ తప్ప యీ కాంగ్రెసు వాళ్లందరూ మళ్లీ మెయిన్‌ కాంగ్రెసులోకి వచ్చేస్తూ వుండేవారు. టిడిపి ఆవిర్భావం తర్వాత బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడింది. థాబ్దం క్రితం తెలంగాణలో తెరాస ప్రభవించింది. అయితే టిడిపినుండి, తెరాస నుండి కాంగ్రెసులోకి, కాంగ్రెసులోంచి ఆ పార్టీల్లోకి దూకడాలు కూడా జరిగాయి. ఈ ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులు సైతం పార్టీ ఫిరాయిస్తున్నారు. కాంగ్రెసువారు బిజెపిలోకి కూడా వెళుతున్నారు. సిద్ధాంతాల బెడద లేకుండా సాగుతున్న యీ ఫిరాయింపులకు లక్ష్యం పదవి మాత్రమే. రేపు ఎన్నికలలో ఎవరు గెలిస్తే వారి వైపు అందరూ పొలోమని వెళ్లిపోతారు. అందువలన ఏదైనా పార్టీని – ముఖ్యంగా కాంగ్రెసును- దివాళా తీయించడం కష్టం. దేశం మొత్తం మీద ఓ 100 ఎంపీ సీట్లు గెలుచుకుని, ఢిల్లీలో తృతీయ ఫ్రంట్‌ మద్దతుదారుగానో లేక మరొక రూపంలోనో ఒక శక్తిగా వుండక మానదు కాబట్టి, దానికి అనుబంధంగా యిక్కడ కార్యకలాపాలు నిర్వహించేవాళ్లు వుంటూనే వుంటారు. ఈ తాత్కాలిక ప్రయోజనం కోసం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి టిడిపి పొందేది ఎంత? పోగొట్టుకునేది ఎంత?

కార్యకర్తల్లో అసంతృప్తి

కాంగ్రెసు ఫిరాయింపుదారుల వలన తమ అవకాశాలు చెడిపోయాయని తొలినుండీ వున్న టిడిపి కార్యకర్తలు, నాయకులు నిస్పృహ చెందడం సహజం. కాంగ్రెసు నుండి వచ్చినవారిలో 7 గురికి ఎంపీ స్థానాలు, 28 మంది అసెంబ్లీ స్థానాలు యిచ్చారట. బాబే చెప్పిన ప్రకారం ఒక్కో పార్లమెంటు అభ్యర్థి 7 ఎసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేస్తాడు. ఆ విధంగా చూస్తే 49 ప్లస్‌ 28 స్థానాల్లో 77 స్థానాల్లో అసంతృప్తి వుందన్నమాట. కొన్ని కామన్‌ వుండవచ్చు కాబట్టి 70 అనుకుందాం. ఇక పొత్తులో భాగంగా బిజెపికి యిచ్చిన స్థానాల్లో కూడా అసంతృప్తులుంటారు. అవి 4 పార్లమెంటు, 12 అసెంబ్లీ స్థానాలు, అంటే 40 స్థానాలన్నమాట. ఇలా చూస్తే దాదాపు 100 స్థానాల్లో టిడిపి కార్యకర్తలు నిరాశలో, నిస్పృహలో వున్నారని అనుకోవాలి. 14 చోట్ల ఓపెన్‌గా తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎంతమందికి ఎమ్మెల్సీ పదవులిస్తామని, రాజ్యసభకు పంపిస్తామనీ ఆశపెట్టి ఆపగలరు? అలాటి వాగ్దానాలు బాబు నెరవేర్చలేకపోవడం కూడా ఆయన ముఖ్య సహచరులు చూశారు. 

ఫిరాయింపులను ప్రోత్సహించడం ఒక పొరబాటైతే బిజెపితో పొత్తు మరొక పొరబాటు కాబోతోంది. మోదీ హవా దేశమంతా వీస్తోందని, బిజెపికి ఓటు శాతం పెరిగిందని, దాన్ని తనతో కలుపుకోకపోతే గతంలో జెపి, పిఆర్పీ ఓట్లు చీల్చినట్లు యీ సారి బిజెపి చీలుస్తుందని బాబు లెక్క వేసి బిజెపితో పొత్తుకోసం ఆరాటపడ్డారు. ఎంత హవా వున్నా, సీమాంధ్రలో బిజెపికి కార్యకర్తలెవరున్నారు? పార్టీ నిర్మాణం ఎక్కడుంది? పీఆర్పీ సంగతి వేరు. చిరంజీవి యింటింటికీ తెలిసిన పేరు. కమలం గుర్తు అనేది గ్రామీణుల్లో సగానికి సగం మందికి తెలియనే తెలియదు. ఈ ఓట్ల చీలిక టిడిపి ఓట్లే చీలుస్తారన్న గ్యారంటీ లేదు కదా. జగన్‌కు కూడా ఆ భయం వుండాలి కదా. అయినా బాబు మాత్రమే పొత్తు పెట్టుకోకపోతే లాభం లేదనుకుని చిక్కులు తెచ్చుకున్నారు. మరి పొత్తు యీ విధంగా తెల్లార్చారు కాబట్టి ఓట్ల బదిలీ సవ్యంగా సాగుతుందా? సాగకపోతే యీ కసరత్తు ప్రయోజనం ఏమిటి? సొంతపార్టీ వాళ్లను మండించడం తప్ప!

పట్టువిడుపు ఎందుకు చూపలేదు?

టిడిపి బిజెపి పొత్తు వివాదం యిద్దరికీ శోభ నివ్వలేదు. బిజెపి బలహీన అభ్యర్థులను నిలబెట్టిందని బాబు బహిరంగంగా చెప్పారు. వాళ్లు యిద్దరు, ముగ్గుర్ని మార్చారు. బస్‌, అంతా ఓకే అన్నారు. ఆ యిద్దరి కోసమా, యింత రగడ! దాని వెనుక కారణం ఏదో వుందని అందరికీ అనిపించింది. రఘురామ కృష్ణంరాజును బాబే బిజెపిలోకి పంపారని, పురంధరేశ్వరి విషయంలో బాబు భార్య పంతం పట్టడం వలననే పొత్తు చిక్కుల్లో పడిందని వార్తలు రావడం టిడిపికి శ్రేయస్కరం కాదు. కుటుంబ వ్యవహారాలతో రాజకీయాలు నడపడం కష్టం. జాతి ప్రయోజనాల కోసం, దేశప్రయోజనాల కోసం ఒకప్పుడు యీసడించిన మోదీతో చేతులు కలుపుతున్నానంటున్న బాబు తన భార్యకు కాస్త నచ్చచెప్పుకుని పురంధరేశ్వరి విషయంలో కాస్త పట్టు సడలించి వుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఈ విషయంలో వెంకయ్య నాయుడు కూడా అసంతృప్తి చెందినట్లు పేపర్లలో వచ్చింది. బిజెపి తరఫున ఆంధ్రలో గ్లామరున్న నాయకురాలిగా ఆమెను ప్రొజెక్టు చేద్దామనుకుంటే యిలా జరిగిందేమిటని ఆయన విసుగు చెందారట. మహాకూటమి రోజుల్లో తెలంగాణలో తెరాసతో యిలాటి పేచీలే యిద్దర్నీ దెబ్బ తీశాయి. అయినా బిజెపి బలమైన అభ్యర్థులను పెట్టలేదని బాబు ప్రకటించడం వింతగా వుంది. ఎవరు బలమైనవారో, ఎవరు కాదో తూచే వెయింగ్‌ మెషిన్‌ ఆయన వద్ద వుందా? ఉంటే 2004లో, 2009లో అన్ని చోట్లా బలమైన అభ్యర్థులనే పెట్టలేకపోయారా? 

తెలంగాణ బిసి సిఎం ప్రకటన ఏకపక్షమా?

తెలంగాణలో కూడా పొత్తు సరిగ్గా సాగడం లేదని అందరికీ తెలిసిపోయింది. కిషన్‌ రెడ్డి విముఖత స్పష్టంగా కనబడుతోంది. హైదరాబాదు సభలో టిడిపి భాగస్వామ్యం లేకపోవడం చేత సభ అనుకున్న రీతిలో విజయవంతం కాలేదని విమర్శలు వచ్చాయి. పైగా కృష్ణయ్యను టిడిపి తమ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రకటించడమేమిటి? టిడిపి-బిజెపి కూటమి కదా పోటీ చేస్తున్నది! కృష్ణయ్యను కూటమి తరఫు ముఖ్యమంత్రిగా ప్రకటించాలి తప్ప తన పార్టీ తరఫున మాత్రమే అనకూడదు. 45 సీట్లు బిజెపికి యిచ్చిన తర్వాత వీళ్లు గెలిచేవెన్ని? ఆ సీట్లతోనే కృష్ణయ్యను సిఎం చేస్తారా? కూటమి గెలిస్తే బిజెపి తరఫున సిఎం ఎవరూ కావడానికి వీల్లేదన్న సంకేతం దానిలో వుందా? ఇలా ప్రకటించడానికి బిజెపి ఆమోదం వుందా? ఇవన్నీ పొత్తు సవ్యంగా నడవడానికి వీల్లేకుండా చేస్తున్న చర్యలు. కిషన్‌ రెడ్డి, ఆరెస్సెస్‌ కలిసి బాబును ఒక ఆటాడించాయని, బిజెపి నాయకత్వం కూడా బాబును ఖాతరు చేయకుండా పెద్ద నాయకులెవరూ పలకకుండా కౌన్సిలరుగా కూడా ఎన్నిక కాలేని జావడేకర్‌ను బాబుతో సంప్రదింపులకు పంపిందని చెప్పుకుంటున్నారు. 

జాతీయ స్థాయి రాజకీయాలు చేసిన బాబుకి యిప్పుడు యీ పరిస్థితి దాపురించింది. విడిపోతే బలహీనపడతాం అన్నదానికి యిదే నిదర్శనం. మన తెలుగువాళ్ల మొహానికి జైరాం రమేశ్‌లు, జావడేకర్‌లు చాలనుకుంటున్నారు ఢిల్లీ నాయకులు. బిజెపిలో వెంకయ్య నాయుడు ఒక్కరే బాబుకి అండగా నిలిచారని స్పష్టమవుతోంది. దానికి కారణం ఒకటే కులం కావడం అని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. బాబు స్థాయి నాయకుడు పవన్‌ యింటికి మాట్లాడడం కూడా టిడిపి అభిమానులను కలవర పరచే అంశమే. పవన్‌కున్న కెపాసిటీ ఏమిటో యిప్పటిదాకా తెలియదు. అయినా పోజుకి తక్కువ లేదు. మోదీ అంటే గౌరవం అంటూనే మోదీ కంటె లేటుగా సభకు వచ్చాడు. జూనియర్‌ను దూరం చేసుకుని, పవన్‌ వెంట పాకులాడడం టిడిపి అభిమానులకు – ముఖ్యంగా కమ్మ ఫీలింగ్‌ వున్నవారికి చేదుగా తోస్తుంది. 

ఎందుకీ తడబాట్లు?

ఇవన్నీ బాబు యిమేజిని మసకబార్చి, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు కదా! బాబు ఎందుకిలా చేస్తున్నారని ఆలోచిస్తే ఒకటే సమాధానం తోస్తోంది. బాబు పాతికేళ్లపాటు నిరంతరంగా పాలిస్తారని టిడిపి అభిమానులు, సమర్థకులు అనుకున్నారు. పదేళ్లు కాకుండానే విఘాతం కలిగింది. పదేళ్లగా ప్రతిపక్షంలో వున్నారు. రెండు వరుస ఓటములు. ఈలోగా ఎవరూ ఎదురుచూడని విధంగా విభజన జరిగింది. బాబు కూడా మానసికంగా దానికి సిద్ధపడలేదు. విభజన పట్ల బాబు ద్వంద్వ వైఖరి కారణంగా ఒకప్పుడు టిడిపికి పట్టు వుండే తెలంగాణ భాగమంతా చేజారింది, ముఖ్యంగా హైదరాబాదు. టిడిపి సానుభూతిపరులకు హైదరాబాదులో వున్న ఆస్తుల పట్ల భయాందోళనలు కలగసాగాయి. ఏ ప్రభుత్వం ఏర్పడినా అది టిడిపి పట్ల సానుభూతి చూపించేది ఐతే కాదు. తెలంగాణలో టిడిపి అధికారంలో వస్తుందని ఎంతటి ఆశావాదీ అనుకోడు. 

ఇక మిగిలినది ఆంధ్రప్రాంతం మాత్రమే. దానిలో జగన్‌ గెలిస్తే టిడిపి సానుభూతిపరులకు దక్కేది ఏముంది? ఎటువంటి వేధింపులకు గురికావాలో ఏమో! ఒకసారి అధికారంలోకి వస్తే జగన్‌ వంటి యువకుడు ఎన్నాళ్లు పాలిస్తాడో ఏమో! ఈ సారి ఏదో ఒకటి చేసైనా సరే టిడిపి గెలవాలి, లేకపోతే బాబు నాయకత్వంపై టిడిపి సానుభూతిపరులకు నమ్మకం పోతుంది. టిడిపి పార్టీ సజీవంగా వుంచుతూనే బాబు నాయకత్వం మారాలన్న డిమాండు రావచ్చు. అందువలన యీ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరాలన్న టెన్షన్‌లో చంద్రబాబు వుండవచ్చు. ఆ టెన్షనే యిన్ని పొరబాట్లు చేయిస్తోందేమో! ఇవన్నీ నాబోటి వాడి అశాస్త్రీయమైన ఊహాపోహలు. రాజకీయ నాయకుల మానసిక విశ్లేషణలో దిట్ట అయిన 'రేపు' నరసింహారావుగారిని అడిగితే కరక్టుగా చెప్పగలరు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]