ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్. ప్రస్తుతం సదరు రాజరిక వైభోగాన్ని మాజీ పోలీసు బాస్ నరసింహన్ వెలగబెడుతున్నారు. స్వతహాగా తమిళుడు అయిన నరసింహన్.. విపరీతమైన భక్తి ప్రపత్తులు ఉన్నవారు. ప్రత్యేకించి గవర్నరుగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆయన తిరగని ఆలయం లేదంటే అది అతిశయోక్తి కాదు. పైగా గవర్నర్ నరసింహన్ సనాతన సాంప్రదాయ నిష్టాగరిష్టుడు. ఆలయ ధర్మాలను, నిబంధనలను తూచ తప్పకుండా పాటించే వారు. అలాంటి గవర్నర్ నరసింహన్ తిరుమల దర్శనానికి శనివారం నాడు వెళ్లినప్పుడు చిన్న వివాదం రేగింది.
గవర్నర్ దర్శనానికి వెళ్లినప్పుడు తిరుపతి అర్బన్ ఎస్పీ గా ఉన్న అధికారి ఆయన వెంట ప్యాంటు షర్ట్‌తో వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే స్వామివారి సన్నిధిలోకి వెళ్లాలంటే పంచ ధరించి మాత్రమే వెళ్లాలని.. పంచ లేకుడా సన్నిధిలోకి వెళ్లడానికి వీల్లేదని ఈవో గోపాల్ ఆయనను వారించారు. గవర్నర్ భద్రత విధుల్లో ఉన్నందున పంచ ధరించడం వీలు కాదంటూ అర్బన్ ఎస్పీ ఆయనకు సమాధానం ఇచ్చారు. అయినా సరే పంచలేకుండా సన్నిధిలోకి అనుమతించేది లేదని లేదని ఈవో చెప్పారు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. గవర్నరు అయితే ఆయన దేవదేవుని సన్నిధానంలో కూడా తనకు కొమ్ములు ఉన్నాయనే సంగతిని ప్రదర్శించాలనుకుంటే ఎలాగ? దేవుడి ముందు అందరూ సమానులే అని మనమే నీతులు ప్రవచిస్తూ ఉంటాం. ఇప్పటికి అనుభవిస్తున్న వీఐపీ వైభోగాలే.. మిగిలిన భక్తులకు చేస్తున్న ద్రోహం… అని కొన్ని భద్రత ఏర్పాట్ల పరంగా అవసరం అని సరిపెట్టుకుంటుండగా,.. గవర్నరు సెక్యూరిటీ అనే మిషపై ఆలయ ఆచారాల్ని కూడా తుంగలో తొక్కాలనుకుంటే ఎలాగ?
త్రివేండ్రంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో వేల కోట్ల రూపాయల విలువైన స్వర్ణాభరణాల నిలవ ఉన్నట్లు అందరికీ తెలుసు. దానికి తగినట్లుగానే అక్కడ పోలీసు మరియు మిలిటరీ భద్రత కూడా ఉంటుంది. అయితే వారందరూ కూడా.. పంచలు ధరించి.. ఆలయ ప్రాంగణంలో భద్రత విధుల్లో నియుక్తులై ఉంటారు. చొక్కా కూడా ఉండదు. కేవలం పంచ, పైపంచ మాత్రం ధరించి నడుముకు రివాల్వర్ లు, గన్‌లు పెట్టుకుని పోలీసు వారు విధుల్లో ఉంటారు. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు.. నేను గవర్నరు సెక్యూరిటీ గనుక.. ఆలయ నిబంధనల్ని సవరించుకోవాలనుకున్నట్లుగా పోలీసులు ప్రవర్తించడం చిత్రం. గవర్నరు అయినా దేవుడిముందు ఆయన సామాన్యుడే అనే ప్రాథమిక ఆధ్యాత్మిక సూత్రాన్ని వారు తెలుసుకోవాలి.