వారసుడొచ్చాడండీ…

తెలగుదేశం పార్టీ పుట్టి ముఫై ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు చంద్రబాబు కాకుండా రాష్ట్రస్థాయిలో ప్రచారం చేయడానికి ఓ నాయకుడి పేరు చెప్పండి? జిల్లా నాయకులు, మహా అయితే రెండు మూడు జిల్లాల నాయకులు తప్ప…

తెలగుదేశం పార్టీ పుట్టి ముఫై ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు చంద్రబాబు కాకుండా రాష్ట్రస్థాయిలో ప్రచారం చేయడానికి ఓ నాయకుడి పేరు చెప్పండి? జిల్లా నాయకులు, మహా అయితే రెండు మూడు జిల్లాల నాయకులు తప్ప రాష్ట్రస్థాయి నాయకుడు ఎవరున్నారు? పార్టీలో చక్రం తిప్పే సుజనా చౌదరి, సిఎమ్ రమేష్ ఎంత మందికి తెలుసు? పత్రికా ప్రకటనలు చేసే నాయకులు వుండనే వున్నారు. ఎందుకంటే, ఏ పార్టీకైనా అధికార ప్రతినిధి ఒకరే వుంటారు. కానీ బాబుకు కులానికి ఒకరు కావాలి. 

ఎవర్నివిమర్శించాలనుకుంటే, ముందు అతగాడి కులమేమిటో తెలుసుకుంటారు. అప్పుడు తన దగ్గరున్న గ్రూప్ ఆఫ్ స్పోక్స్ పర్సన్స్ లోంచి, ఆ కులపోడిని ముందుకు తోస్తారు. బాబు రాజకీయాల్లో నిక్కర్లేసుకున్నప్పటి నుంచి ఇదే స్ట్రాటజీ. గతంలో ఎర్రంనాయుడు కొంతవరకు పనికి వచ్చారు. సీమాంధ్ర అంతా కాకున్నా, కాస్త ఆంద్రలో ఆయన ప్రచారం సాగించగలిగారు. ముఖ్యంగా ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర మొత్తం అయిదు జిల్లాల్లో ఆయన ప్రచారం చేయగలిగేవారు. జనం గుర్తు పట్టేవారు. ఇప్పుడు ఆయన లేరు. 

నిజానికి నాయకులు లేరు అనే కన్నా, బాబు వుండనివ్వలేదు అన్నది వాస్తవం. ఈ సంగతి రాజకీయాల్లో వున్నవారందరికీ తెలుసు. ఉపేంద్ర, రేణుకాచౌదరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇలా ఎంతమందినని పొగపెట్టి బయటకు పంపలేదు. దేవేందర్ గౌడ్, నన్నపనేని రాజకుమారి, తమ్మినేని సీతారాం, కెసిఆర్ ఇలా ఎంతమంది బయటకు వెళ్లి, బాబు రాజకీయాలను తూర్పార పట్టలేదు? తప్పక వెనక్కు వచ్చినవారు వచ్చారు. రాని (వ్వని)వారు రాలేదు. 

బాబు జెండా ఎజెండా ఒకటే, తను తప్ప పార్టీలో మరెవ్వరు ఎదగకూడదు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు షర్మిల గురించి అంటుంటారు. జగన్ వదిలిన బాణం ఏమయిందని ఎద్దేవా చేస్తుంటారు. జగన్ రెండో పవర్ సెంటర్ ను ఎదగనివ్వడం లేదని బాధపడుతుంటారు. నిజమే. అది పూర్తి వాస్తవమే కావచ్చు. కానీ తెలుగుదేశం సంగతేమిటి? 

నందమూరి వంశానికి చెందిన హరికృష్ణ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు చంద్రబాబు తన పార్టీ తరపున రాష్ట్రస్థాయి ప్రచారానికి పంపగల నాయకుడు ఒక్కరున్నారా? సినిమా క్రేజ్ వున్న బాలకృష్ణ తప్పితే. అసలు పంపే ఆలోచన బాబుకు వుందా?  కానీ ఇప్పుడో నాయకుడు పుట్టు కొచ్చాడు. ఎమ్మెల్యే కాదు. ఎంపీకాదు, కనీసం సర్పంచ్, మండల ప్రెసిడెంట్ అంతకన్నా కాదు. దేశ రాజకీయాలను ఔపాసన పట్టాడా? లేదా రాష్ట్రం నలుమూలలతో పరిచయం వుందా అంటే అదీ కాదు. మరేమిటి క్వాలిఫికేషన్?

ఒక్కటే. ఆయన బాబుగారి తనయుడు. ఈయన చంద్రబాబు. ఆయన చినబాబు. చాలదా ఆ మాత్రం క్వాలిఫికేషన్. జగన్ అంటే వారసుడు అని దుయ్య బడతాం. రాహుల్ అంటే వారసత్వ రాజకీయాలను చెండాడుతాం. కెసిఆర్ పిల్లలు విదేశాల నుంచి వచ్చి రాజకీయాల్లో దోచేసుకుంటున్నారని గగ్గోలు పెడతాం.  కానీ చినబాబు కూడూ ఇలా విదేశాల నుంచి నేరుగా పార్టీలకి దిగుమతే, ఏ పదవీ, ఏ అధికారం, ఏ హోదా లేకుండానే పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నారని కనీసం గమనించం. 

ఇప్పుడు చినబాబు ఏకంగా సీమాంధ్ర పర్యటన ప్రారంభించేసారు. ఓపెనింగ్స్ బాగుంటే, తరువాత అదే లైన్లో జనాలు వెళ్లతారని, తమకు అండా దండా అయిన కృష్ణాజిల్లా నుంచి మొదలెట్టారు. పాపం, రాయపాటి లాంటి సీనియర్ నాయకుడు కూడా చినబాబు కు ఎదురేగి స్వాగతం పలకాల్సి వచ్చింది. హతవిధీ..వారసత్వమెంత బలీయమైనది?
ఇప్పుడు చినబాబు అంతులేని అధికారాలున్న నాయకుడు. ఏ పదవి లేకున్నా, ఏమైనా మాట్లాడగలవాడు. జూనియర్ ఎన్టీఆర్ కు కనీసం గత ఎన్నికల్లో ప్రచారం చేసిన అనుభవం అన్నా వుంది. కానీ ఈయన ఆయననే కామెంట్ చేయగలరు. ఆ మాట కొస్తే బాలకృష్ణనే పిలవలేదు, ఈయనో లెక్కా అనే టైపులో మాట విసిరేయగలరు. 

ఏమైతేనేం తెలుగుదేశం శ్రేణులకు శుభవార్త. రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేసేందుకు ఓ నాయకుడు పుట్టుకోచ్చాడు. వారసుడని విమర్శకులంటేనేం..అలా విమర్శించే హక్కు ఒక్క తెలుగుదేశం వారికే వుంది కదా..వేరొకరు అనరాదు..మరొకరు వినరాదు.

చాణక్య

[email protected]