మోదీ గుజరాత్‌ను అభివృద్ధి చేయడం అయిపోయింది, యిక దేశాన్ని అభివృద్ధి చేస్తాడు అన్న ప్లాంక్ మీదే యీ సినీతారలూ, పెట్టుబడిదారులూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆ ప్రచారంలో ఎంతవరకు నిజముందో వేరే సీరీస్‌లో రాస్తాను. పవన్ అంతటితో ఆగలేదు. అవినీతిపై పోరాటం గురించి మాట్లాడాడు. యెడ్యూరప్పను, గాలి జనార్దనరెడ్డి పార్టీ నాయకులను బిజెపిలో చేర్చుకుని వాళ్లందరికీ టిక్కెట్లు యిప్పిస్తున్న మోదీ యీయనకు పరిశుద్ధాత్మగా ఎలా కనబడుతున్నాడో నాకైతే అర్థం కాదు. జస్వంత్ సింగ్‌ను పార్టీలోంచి తరిమేశారు. అతనిపై అవినీతి ఆరోపణలు లేవు. కానీ మోదీకి యిష్టుడు కాడు. కాంగ్రెసులో వుండగా అవినీతిపరులని నిందపడినవారందరూ బిజెపిలోకి దూకగానే పవన్ దృష్టిలో పునీతులయిపోతున్నారు. వారందరి తరఫున యీయన వకాల్తా పుచ్చుకుని ప్రచారం చేయబోతున్నాడా? ఇంత గందరగోళపు మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కవిత అన్నట్టు కాస్సేపు 'చె గువేరా' వంటి లెఫ్టిస్టును, మరో పక్క మోదీ వంటి రైటిస్టును పొగిడితే ఎలా చూడాలి? ఆయన రాసిన 'ఇజం' పుస్తకాన్ని నేను చదవలేదు. చదవదలచుకోలేదు. (కొందరు దాన్ని చదివి సమీక్షించమని కోరారు. అందుకని యీ వివరణ) దాన్ని ఇంగ్లీషులో ఎందుకు రాశారో కూడా నాకు బోధపడలేదు. హిట్లర్ డాక్యుమెంటరీ చూడండి బాగుంటుంది అంటే దాన్ని వ్యాఖ్యానం తెలుగులో యివ్వండి అని నెటిజన్లే అడుగుతున్నారు. (నేనూ అంతే తెలుగు అనువాదం కనబడితే ముందు అదే చదువుతాను) అలాటి సమాజంలో ఆ ఇంగ్లీషు పుస్తకం ఎంతమందికి అర్థమవుతుందని యీయన వూహ?
నిన్న ''ఈనాడు'' ఆయనతో పేజీన్నర యింటర్వ్యూ వేసింది. చూడబోతే పూర్తి టిడిపి భాషే. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడానికే రంగంలోకి దిగినట్లుంది. అందర్నీ తిడితే మనకు మజాగా వుంటుంది. జగన్ ఒక్కడే పాపాత్ముడు, తక్కినవాళ్లందరూ పునీతులు అంటే 'చాల్లే' అనబుద్ధేస్తుంది. తెలంగాణవాదం బలపడటానికి వైయస్ కారణం అంటే మరి తెలంగాణవాదులు వైయస్ విగ్రహాలకు దండలు వేయటం లేదేం? వైయస్ ఆరేళ్ల పాలన వలన భూమిధరలు పెరిగిపోయి, సామాన్యులకు అందుబాటులో లేక తెలంగాణవాదం వచ్చిందట. హైదరాబాదులో భూమి రేట్లు ఎప్పణ్నుంచి పెరుగుతున్నాయో మా అందరికీ తెలుసు. పవన్‌కి తెలియకపోవడం విచిత్రం. కావాలంటే చంద్రబాబును అడిగితే చెప్తారు – నేనే హైదరాబాదుకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి, అందరూ యిక్కడ పెట్టుబడి పెట్టి, ధరలు పెరిగేట్లు చేశాను అని. ఇక అభియోగాలకు పాలనాపటిమకు సంబంధం వుందా? కరుణానిధి, జయలలిత యిద్దరూ సమర్థులైన పాలకులే. కానీ అభియోగాలు చూడబోతే గదిలో కాదు, యిల్లు పట్టేటన్ని వున్నాయి. ఎన్టీయార్‌పైన, చంద్రబాబుపైన, అనేకమంది బిజెపి నాయకులపైన అభియోగాలున్నాయి. ఎవరైనా ఎవరిపైనైనా అభియోగాలు చేస్తారు. వాటి గురించి బయటపడ్డాకే ఎన్నికల్లోకి రావాలంటే ఒకదాని తర్వాత మరొక ఆరోపణ చేస్తూనే వుంటారు.
బాబు హయాంలో శాంతిభద్రతలు భేష్ అంటున్నాడీయన. నక్సలైటు సమస్య అతి తీవ్రంగా వున్నది బాబు హయాంలోనే! సాక్షాత్తూ ముఖ్యమంత్రిపై అలిపిరిలో దాడి చేసిన ఘటన పవన్‌కు తెలియదా? ఇక పారిశ్రామికవేత్తలను ఎంపీలుగా చేయడం కాంగ్రెసులోనే కాదు, టిడిపి, బిజెపిలలో కూడా వుంది. సిఎం రమేష్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి వీళ్లంతా ఎవరు? కొత్తగా బిజెపిలో చేరిన రఘురామ కృష్ణంరాజు ఎవరు? అందర్నీ ప్రశ్నిస్తాం అని పాతకాలపు లోకసత్తాలా వుంటే యిబ్బంది లేదు. కొందర్ని మెచ్చుకుంటాం, తక్కినవారిని తిడతాం అంటే మాత్రం అనేక సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తుంది. ఆ మేరకు జనసేన ప్రభావం తగ్గిపోతుంది. ఆలోచనాపరుణ్నని చెప్పుకునే పవన్‌కు యీ పాటి ఆలోచన రాలేదా?
ఈయన తిక్కకు లెక్క వుందని కొందరన్నారు. తెలుగు సినిమావాళ్లందరూ బిజెపిని ఆదరించడానికి ముఖ్యకారణం – హైదరాబాదులో వున్న ఆస్తులను కాపాడుకోవడం అనే ప్రతీతి వుంది. కావచ్చు. ఎందుకంటే తెలంగాణ నాయకుల దృష్ట్టి సినిమావాళ్ల స్థిరాస్తులపై వుంది. కొన్నిటికి అనుమతులు లేవని అందరికీ తెలుసు. పైగా సినిమావాళ్లు సాఫ్ట్ టార్గెట్స్. షూటింగు సమయంలోనే కాదు, సినిమా ప్రదర్శన సమయంలో కూడా గొడవలు చేసి ఆపేయవచ్చు. రాష్ట్రప్రభుత్వం తలచుకుంటే 'తెలంగాణ సంస్కృతికి విరుద్ధంగా వుంది, వారి భాషను కించపరిచారు' అంటూ నిషేధించవచ్చు. నిషేధం లేకపోయినా కొందరు వచ్చి ఆందోళన చేస్తే సినిమాహాలుకి పోలీసు రక్షణ కల్పించకపోవచ్చు. పదేళ్లపాటు హైదరాబాదు శాంతిభద్రతలు కేంద్రం చేతిలో వుంటాయి కాబట్టి కేంద్రంలో వున్న ప్రభుత్వంతో మంచిగా వుంటే ఆస్తులు, సినిమాలు కాపాడుకోవచ్చు. కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం వస్తుందంటున్నారు కాబట్టి బిజెపితో సఖ్యంగా వుండాలని పెట్టుబడిదారులు, మీదు మిక్కిలి సినిమావాళ్లు చూస్తున్నారు. చిరంజీవి కుటుంబానికి హైదరాబాదులో ఆస్తులు చాలా వున్నాయి. చిరంజీవి సామాజిక తెలంగాణ నుండి సమైక్యం నినాదం ఎత్తుకున్నాక తెలంగాణలో ఆయన పట్ల విముఖత పెరిగింది. విభజన బిల్లు పెట్టినపుడు సాధించినది ఏదీ లేకపోయినా చివరిదాకా హైదరాబాదు యూటీ అంటూ పాట పాడడంతో తెలంగాణవాదులకు యింకా కోపం పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం వస్తే ఏమో కానీ, తెరాస ప్రభుత్వం వస్తే ఆయన ఆస్తులకు ప్రమాదమే. అలా అని ఆయన వాటిని హఠాత్తుగా అమ్ముకోలేడు.
అందువలన ఆయన కుటుంబం నుండి పవన్ కళ్యాణ్‌ను బిజెపి వైపుకి పంపి వుండవచ్చు కదా అని ఒక ఆలోచన. ఇలా జరగడం వింతేమీ కాదు. అనేక కుటుంబాలు యీ టెక్నిక్ వుపయోగించాయి. తండ్రి-కొడుకు, అన్న-తమ్ముడు, భార్య-భర్త వేర్వేరు పార్టీల్లో వుండి ఎవరు అధికారంలోకి వచ్చినా వారి ప్రయోజనాలకు భంగం కలగకుండా చూశారు. ఇప్పుడు యుపిఏ వస్తే చిరంజీవి కుటుంబప్రయోజనాలు కాపాడతారు. బిజెపి వస్తే పవన్ కాపాడతారు.
కాంగ్రెసుకు వ్యతిరేకంగా టిడిపి-బిజెపిలను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి పవన్‌ను కలపడానికి ఈనాడు రామోజీరావు ప్రయత్నించారని పుకారు వచ్చింది. పవన్ హైదరాబాదు ఉపన్యాసం తర్వాత జరిగిన సంఘటనలన్నీ పేర్చి చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ప్రజల్లో చైతన్యం రగిలించడానికి పవన్ చాలా సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నారని అనిపించింది కాబట్టి ఆ సీరీస్ రాశాను. ఆయన అదీ యిదీ చెప్పి చివరకు 'మోదీని సమర్థిస్తాను తప్ప యింకేమీ చేయను. ఎన్నికలలో నిలబడితే ఓట్లు చీలిపోయి వైకాపా లాభపడుతుంది' అనడంతో యీ చిరంజీవితో నెక్సస్ ఐడియా, కాంగ్రెసు, వైకాపాను తిట్టి బిజెపికి బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్న ఐడియా కరక్టే అనిపిస్తోంది. గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు తరహాలో మాట్లాడుతూంటే యింకెందుకు యితన్ని పట్టించుకోవడం? 'ఇతను ప్రజలను చైతన్యపరుస్తాడు, ఉత్తేజపరుస్తాడు, వారి ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టి క్రియాశీలకమైన, నిర్మాణాత్మకమైన పనులకు ప్రేరేపిస్తాడు' అనుకోవడం నా పగటికల అని ఒప్పుకుంటున్నాను. ప్రస్తుతానికి యిదీ నా ఆలోచనా ధోరణి. రేపు పవన్ వేరే రకంగా మారి, నిజంగా మేలు కలిగే పని చేస్తే అప్పుడు మళ్లీ ఆలోచన మార్చుకుంటాను. అప్పుడలా అన్నావు కదా, మాట మారుస్తావేం అని మళ్లీ వ్యాఖ్యలు చేయకండి. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2014)