మోహన : ‘ఆంధ్ర’ విద్యార్థులకూ-అగ్నిజ్వాలలకూ మధ్య…

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా  Advertisement 'ఆంధ్ర' విద్యార్థులకూ-అగ్నిజ్వాలలకూ మధ్య… ఒంగోలు నుండి మెసేజ్‌ వచ్చింది – 'ఫైరింగ్‌ జరిగింది. వెంటనే నీతో వున్న బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ వెంటపెట్టుకుని…

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా 

'ఆంధ్ర' విద్యార్థులకూ-అగ్నిజ్వాలలకూ మధ్య…

ఒంగోలు నుండి మెసేజ్‌ వచ్చింది – 'ఫైరింగ్‌ జరిగింది. వెంటనే నీతో వున్న బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ వెంటపెట్టుకుని రా' అని.

చీరాల నుండి ఒంగోలు వస్తూంటే శివార్లలో విద్యార్థులు ఆపేశారు. నన్ను వాహనం నుండి దింపేసి ''జై ఆంధ్ర'' అనమని పట్టుబట్టారు.

దూరంగా చీకట్లో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు… 

పోస్టాఫీస్‌, కలక్టరేట్‌, కలక్టర్‌ బంగళా, యింకా ఎన్నో ఆఫీసులు దగ్ధమవుతున్నాయి. 

'ఊరు తగలబడుతోంది, వెళ్లనీయండి' అంటే '..ప్రత్యేకరాష్ట్రం వస్తే యిలాటివి లక్ష కట్టుకుంటాం. మేం చెప్పినట్టు వినకపోతే యిక్కణ్నుంచి కదలనీయం' అంటున్నారు విద్యార్థులు.

అక్కడ కలక్టర్‌, ఎస్‌.పి. దగ్గర చాలినంత ఫోర్స్‌ లేదనే కదా నన్ను రమ్మన్నది. త్వరగా వెళ్లకపోతే ఎలా?

నా వెంట ఫోర్స్‌ వుంది. ఊఁ అంటే చాలు, ఫైర్‌ ఓపెన్‌ చేస్తారు.

ఊఁ అనాలా? వద్దా? ఎప్పటివరకు అనకుండా వుండాలి? సహనానికి హద్దు ఎక్కడ?

వీళ్ల మీద జాలి చూపిస్తూ యిక్కడే వుండిపోతే అక్కడ అధికారుల, ప్రభుత్వ ఆస్తుల భద్రత మాటేమిటి?

xxxxxx

విద్యార్థులతో వ్యవహరించినప్పుడు ప్రభుత్వాధికారులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. సంఘవ్యతిరేకశక్తులతో ఎంత కఠినంగా డీల్‌ చేసినా ఫర్వాలేదు కానీ విద్యార్థులు ఎంత అలజడి చేసినా వారిపై చర్య తీసుకోవడానికి వెనుకాడుతాం. ఒక్కోప్పుడు విద్యార్థులు ఆందోళన చేస్తూ వుంటే కొన్ని అసాంఘిక శక్తులు వాళ్లలో చేరిపోయి ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్తులు ధ్వంసం చేస్తారు. కేసులు పెడితే మధ్యలో విద్యార్థుల చదువులు నాశనం అవుతాయి. అందువలన కాస్త చూసీ చూడనట్లు పోవాలని ప్రజలూ కోరతారు, ప్రభుత్వమూ ఆ ధోరణిలో ఆలోచిస్తుంది. 

ఈ సింపతీ ఫ్యాక్టర్‌ను గ్రహించే కొన్ని శక్తులు విద్యార్థులను రెచ్చగొడతాయి. వాళ్లను ముందు వరుసలో నిలబెడతాయి. విద్యార్థులలో ఉడుకురక్తం ఉరకలెత్తుతూ వుంటుంది. వ్యవస్థ పై అసంతృప్తి ఉబుకుతూ వుంటుంది. ఎదిరించాలని వుంటుంది. ఏదో చేసేయాలని, ఏదో ఒకటి చేసి తమ కోపాన్ని వెళ్లగక్కాలని వుంటుంది. ఆ కోపంలో వాళ్లు విచక్షణ కోల్పోతారు. ప్రాణాలకైనా తెగిస్తారు. నిజానికి అదే విద్యార్థులను మరో పదేళ్లు పోయాక 'అవేళ మీరు చేసినది సరైనదేనా?' అని అడిగితే సిగ్గుపడతారు. ఏదో కుర్రతనం, ఆవేశం అని నవ్వేస్తారు. కానీ ఆ రోజుకి మాత్రం అది జీవన్మరణ సమస్యగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఆవేశం మరింత పెరిగి, నిరాశానిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కూడా. ఇది అత్యంత దురదృష్టకరం. 

విద్యార్థుల కోపం పాలపొంగు లాటిది. వాళ్లు మర్యాదలు, హోదాలు గణించరు. గుంపుగా వచ్చి మీద పడిపోతారు. వాళ్లతో వాదించడం కూడా చాలా కష్టం. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో నాకు బాగా అనుభవం అయింది. 

జై ఆంధ్ర ఉద్యమం సమయంలో నేను ఒంగోలులో సబ్‌ కలక్టరుగా (1971-73)  వుండేవాణ్ని. 

ఐయేయస్‌  ఏడాది ట్రెయినింగ్‌ ముస్సోరీలో పూర్తయాక జులై 1969 నుండి 1971 ఫిబ్రవరి దాకా కృష్ణాజిల్లాలో అసిస్టెంటు కలక్టర్‌గా తర్ఫీదు యిచ్చారు. ట్రైనింగ్‌ అయిపోయి సబ్‌కలెక్టర్‌గా కొత్త డివిజన్‌కి వెళ్లాలన్నమాట. ఎక్కడ వేస్తారా అని ఎదురు చూస్తూవుండేవాళ్లం. పోస్టింగుల్లో ఎన్నో రకాలున్నాయి. కొన్నిటికి ఒక్కో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ వుండేది. కొన్నింటికి వుండేదికాదు. 

నన్ను ఫిబ్రవరి 1971లో ఒంగోలులో సబ్‌ కలక్టర్‌గా వేసేటప్పటికి నిరుత్సాహ పడ్డాను. కారణం-అక్కడే కలెక్టర్‌ వుంటాడు. బ్రిటిష్‌కాలం నుంచి అలవాటు ఏమిటంటే సబ్‌ కలెక్టర్‌, కలెక్టర్‌కు వీలైనంత దూరంగా వుండేవాడు. ఎందుకంటే పని నేర్చుకోవాలి కదా! రోజు కలెక్టర్‌ అందుబాటులో వుంటే ఎంతైనా ఆయనమీద ఎక్కువ ఆధారపడే ఆవకాశం వుంటుంది. ఆధారపడకపోయినా ఊళ్లో ఏ పని జరిగినా, ఏ సంఘటన జరిగినా  కలెక్టర్‌కి తెలిసిపోతుంది. వెంటనే అతను పిక్చర్‌లోకి వచ్చేస్తాడు.

కనుకనే కృష్ణాజిల్లాలో కలక్టరు మచిలీపట్నంలో, సబ్‌ కలక్టర్‌ విజయవాడలో ! తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో కలక్టరు, సబ్‌ కలక్టరు రాజమండ్రిలో ! ఆదిలాబాదు జిల్లాలో ఆదిలాబాదులో కలక్టరు, సబ్‌ కలక్టరు ఆసిఫాబాద్‌లో ! చిత్తూరుజిల్లాలో చిత్తూరులో కలక్టరు, సబ్‌ కలక్టరు మదనపల్లిలో ! ఇలా దూరదూరంగా వుండేవారు. కాని ఒంగోలు (ప్రకాశం) జిల్లా విషయంలో ఏమైందంటే దాన్ని గుంటూరు జిల్లానుండి విడగొట్టారు. అప్పట్లో గుంటూరులో కలక్టరు వుంటే సబ్‌ కలక్టరు ఒంగోలు డివిజన్‌లో వుండేవాడు. ఇప్పుడు ఒంగోలు స్వతంత్రంగా జిల్లాగా అయినా అక్కడే కలక్టర్ని, సబ్‌ కలక్టర్ని వుండమన్నారు. పైగా సబ్‌కలెక్టర్‌ బంగ్లాని కలెక్టర్‌కి ఇచ్చేశారు.

దాంతో ఒంగోలు సబ్‌ కలక్టరంటే బంగళా లేని సబ్‌ కలెక్టర్‌ అన్నమాట. అదో పెద్దవిషయం కాకపోయినా  కాస్త ఇబ్బందికరంగా తప్పకుండా వుండేది. అందుకే ఒంగోలు సబ్‌ కలక్టర్‌ పోస్టు ఎవరూ కోరుకోరు. అది మాత్రం నన్నే వరించింది. సరే అనుకుని వెళ్లాను. అప్పట్లో మా కలక్టర్‌ దొరైస్వామిగారు. ఆయన తర్వాత చంద్రయ్యగారు వచ్చారు. టి.ఆర్‌.ప్రసాద్‌ గారని దరిమిలా క్యాబినెట్‌ సెక్రటరీ చేసి రిటైరయిన ఆయన మూడో కలక్టరు. ఆ ముగ్గురితోను సబ్‌కలెక్టర్‌గా చేశాను. 

ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌లో వున్న ఎంతో సక్సెస్‌పుల్‌ అధికారుల్లో ఒకరు అనిపించుకున్న రాఘవేంద్రరావు గారు నా ముందర పనిచేసిన సబ్‌కలెక్టర్‌. ఆయన టైమ్‌లో వరదలు వస్తే కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడాయన. కనుక ఎంతో కష్టపడితేగాని పేరు వచ్చే ఆవకాశంలేని పరిస్థితి ఒంగోలు సబ్‌ కలక్టరుది. ఇవన్నీ చాలనట్టు అదే టైములో వచ్చింది జై ఆంధ్ర వుద్యమం.

xxxxxx

అప్పట్లో టైమంతా చీరాలలోనే గడపాల్సి వచ్చింది. ఎందుకంటే చీరాల చాలా సెన్సిటివ్‌ ప్లేస్‌. కలెక్టర్‌ గారు ''నువ్వు చీరాలలోనే వుండవయ్యా'' అంటే అక్కడే వుండిపోయాను. మొత్తానికి ఏ అవాంఛనీయ సంఘటన లేకుండా 1972 అక్టోబరు నుండి నవంబర్‌ 21దాకా లాక్కొచ్చాం. 

కానీ అప్పుడు ఉద్యమం తారస్థాయికి చేరింది. ఓ రోజు నేను చీరాలలో వుండగా ఒంగోలులో ఫైరింగ్‌ జరిగింది. ఎస్‌.పి. (పోలీసు సూపర్నెంట్‌) గా రామస్వామి అని నా బ్యాచ్‌మెటే (అంటే 1968 ఐ.పి.ఎస్‌.బ్యాచ్‌ అన్నమాట) వున్నారు. ఉన్నట్టుండి ఒంగోలునుంచి మెసేజ్‌ వచ్చింది – 'ఫైరింగ్‌ జరిగింది, వెంటనే నీతో వున్న బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ వెంటపెట్టుకుని రా' అని! ఆ రోజుల్లో ఇన్ని కమ్యూనికేషన్స్‌ సౌకర్యాలు వుండేవి కావు. సెల్‌ఫోన్స్‌ వూహకు కూడా అందని కాలమది. వైర్‌లెస్‌ వుండేది. అందులో కూడా కమ్యూనికేషన్‌కి చాలా పరిమితమైన అవకాశం. అందువలన అసలు అక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతోందో తెలియదు. 

వెంటనే చీరాల నుండి ఒంగోలుకు బయలుదేరి వెళ్ళాం. ఒంగోలు శివార్లకు చేరేసరికి చీకటి పడింది. నాతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ వుంది. ఒంగోలు చేరబోతూండగా కొన్ని కిలోమీటర్ల యివతలే విద్యార్థులు కారు ఆపేసి చుట్టుముట్టేశారు. బాగా రాత్రి అయింది. నన్ను దింపేసి జై ఆంధ్ర అనమని పట్టుబట్టారు. ముందుకు వెళ్లనియ్యమని పట్టుబట్టారు. నా వెనకాల ఫోర్స్‌వుంది. కాని ఫోర్స్‌ ఉపయోగించి మన స్టూడెంట్స్‌ను, మన పబ్లిక్‌ను డీల్‌ చేసే ప్రసక్తేలేదని నేనెప్పుడూ నమ్మేవాణ్ణి. 

ఆ చీకట్లో దూరం నుంచి చూస్తే ఊరంతా మంటలు కనబడుతున్నాయి. ప్రభుత్వం జరిపించిన ఫైరింగ్‌కు నిరసనగా ఆందోళనకారులు పబ్లిక్‌, ప్రయివేటు ఆస్తులను దగ్ధం చేస్తున్నారన్నమాట. ఇక్కణ్నుంచి చూస్తే అసలు ఏది కాలుతోందో ఎంత యిదిగా కాలుతోందో కూడా తెలియని పరిస్థితి. ఇటువంటప్పుడు విద్యార్థుల అలజడి.

ఒకవైపు అక్కడ ఏం జరుగుతోందోనని అదుర్దా.  ఊళ్లో పరిస్థితి ఎలా వుందో ఏమో! అసలు నన్ను రమ్మన్నదే సహాయం కోసం. నా దగ్గర వున్న కొద్దిపాటి ఫోర్స్‌ అవసరం కూడా పడబట్టే కదా కలెక్టర్‌, ఎస్‌.పి. నన్ను వెంటనే రమ్మన్నది. వాళ్లకు ఉపయోగపడకుండా యిలా ఊరి బయటే నిలిచిపోతే ఎలా అని ఆందోళన. 

ఆ పరిస్థితిలో నిజం చెపితే నమ్మాలి (మా ఆవిడ నమ్ముతుంది లెండి) నాకు ఊరిగురించి ధ్యాసే తప్ప నా క్షేమం గురించి గాని, మా ఆవిడ క్షేమం గురించి గాని ఆలోచనే రాలేదు. కలక్టరు బంగళాకు పక్కన నాలుగు యిళ్లు వుండేవి. వాటిల్లో ఒక దానిలో నేనూ, మా ఆవిడా వుండేవాళ్లం. మాకు ఓ వంటవాడు వుండేవాడు. మేము వుండవలసినది ఒంగోలులో అయినా కలక్టరు ఆదేశాల మేరకు  నేను చీరాలలో వుండేవాణ్ని. రోజంతా తిరుగుతూనే వుండేవాణ్ని. ఆందోళన కారణంగా అక్కడ బస్సాపేశారనీ, యిక్కడ రైలాపేశారనీ, ఫలానా చోట రాళ్లు పడ్డాయనీ.. వినగానే అక్కడకు పరుగులు పెట్టడం, చెయ్యగలిగినది చేసి రావడం. 

ఒంగోలులో ఇంటి దగ్గర మా ఆవిడ బిక్కుబిక్కుమంటూ వుండేది. ఎవరికైనా చెప్పి ఏమైనా చేయించుకోవాలంటే సమ్మెలో వున్నారందరూ. కానీ ఆ రోజుల్లో కూడా పాపం కొందరు వుద్యోగులు – జవానో, తాసిల్దారో, మరొకరో –  మనమీద వ్యక్తిగత అభిమానం చేత, గౌరవం చేత, చీకటిపడ్డాక వచ్చి బాగోగులు కనుక్కుని, ఏవైనా చిన్న చిన్న పనులు – స్వంత పనులు కానీయండి, అఫీషియల్‌వి కానీయండి – కావలసి వస్తే చేసి పెట్టి వెళ్లేవారు.

ఆవిడ ఎలా వుంది, ఇల్లు ఎలా వుంది, ఇల్లు వుందా కాలిందా? ఇంట్లో పరిస్థితి ఎలా వుంది? ఆలోచించాలి కదా కానీ ఎందుకనో అసలు అటువైపు దృష్ట్టి పోనేలేదు. ఎంత త్వరగా ఊళ్లోకి వెళ్లి శాంతిభద్రతలు నెలకొల్పడానికి  కలక్టరుగారికి సహాయపడే చర్యల్లో పాలుపంచుకోవాలన్న ఆదుర్దా తప్ప వేరేదీ తోచలేదు. 

ఇటు చూస్తే ఈ కుర్రాళ్లు. వాళ్లకు నచ్చచెప్పబోయాను. ''బాబూ, ఊళ్లో జరుగుతున్న పరిస్థితి మీకు తెలుసు. నన్ను చాలా రోజులుగా చూస్తున్నారు.  నేనంటే మీకు నమ్మకముంది. మర్యాద వుంది. నేను కొన్ని విలువలు పాటిస్తానని తెలుసు. వాటిని మీరు గౌరవిస్తారనీ నేను అనుకుంటున్నాను. ఆ మాటే నిజమైతే ముందర నన్ను వెళ్లనివ్వండి. అది మన ఊరు. తగలబడుతోంది. అక్కడేదో జరుగుతోంది. నన్ను వెళ్లి పరిస్థితి మెరుగుపరచనీయండి. తర్వాత మనం మనం కూర్చుని లక్ష వ్యవహారాలు మాట్లాడుకుందాం.'' 

''మా ఊరి క్షేమం మాకూ తెలుసండి. కానీ ప్రస్తుతం ఉద్యమమే మాకు ముఖ్యం. మాకు ప్రత్యేక ఆంధ్ర వస్తే యిలాటి వూళ్లు లక్ష కట్టుకుంటాం. ఇంతకంటె గొప్పగా కట్టుకుంటాం. మీరు 'జై ఆంధ్ర' అనాలి. మాకు అదే కావాలి. ఆ మాట అననిదే మీరు యిక్కణ్నుంచి అంగుళం కూడా ముందుకు కదలలేరు'' అన్నారు వాళ్లు ముక్తకంఠంతో.  

''ఈ నినాదాలిమ్మనడం యిది మొదటిసారి కాదు కదా, ఈ టాపిక్‌ అనేకసార్లు మన మధ్యకు వచ్చింది. ఇకముందూ రాబోతుంది. ఇప్పటికిప్పుడు ఏం తేలుస్తాం? నేను తెలుగువాణ్ణి. ఆంధ్రావాణ్ని అవునో కాదో మీరే తేల్చాలి. నేను పుట్టినది మద్రాసులో. ఆంధ్రలో హైస్కూలు చదువు. తెలంగాణాలో హైస్కూలు చదువు. డిగ్రీ ఢిల్లీలో. పోస్ట్‌ గ్రాజువేషన్‌ తెలంగాణాలో. ఉద్యోగం ఆంధ్రలో. అంతలో ఐయేయస్‌కు సెలక్టయ్యాను. ఎక్కడవేస్తే అక్కడే పనిచేస్తాను. ఎక్కడ సెటిలవుతానో తెలియదు. హైదరాబాదులోనే కావచ్చు. పూర్వీకులు కోస్తావారు కాబట్టి  ఆంధ్రావాడనుకోవచ్చు, పెరిగింది తెలంగాణా కాబట్టి తెలంగాణా వాడనుకోవచ్చు, పుట్టినది, బాల్యం గడిపినది మద్రాసులో కాబట్టి అరవ్వాడనుకోవచ్చు. మీ యిష్టం. లేదా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సక్సెసయి ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే నేను యిక్కడ పుట్టలేదు, పెరగలేదు  కాబట్టి ఆంధ్రుణ్ని కాదనవచ్చు.

''రెండేళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణా వుద్యమం అన్నారు. ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర వుద్యమం అంటున్నారు. రేపు మళ్లీ యింకో ఉద్యమం రావచ్చు. నినాదాలు అవీ చేస్తున్నారు కనుక మీరు దాన్ని ఉద్యమం అంటారు. ఉద్యమం చేసి నినాదాలు యిచ్చే హక్కు నేను సర్వీస్‌లో జాయినయినప్పుడే కోల్పోయాను. 'ఫలానా ఫలానా కొన్ని పనులు చేసి తీరుతాను. ఫలానా ఫలానా కొన్ని పనులు ఛస్తే చేయను' అని మా చేత శపథం చేయిస్తే కాని, అసలు మాకు ఉద్యోగమివ్వరు. కనుక దానికి విరుద్ధంగా నేను ప్రవర్తించాలంటే ఎలా? మీకు ఉద్యమం అంటే ఎటువంటి అనుబంధం, ఎటాచ్‌మెంట్‌ వుందో నా ఉద్యోగధర్మమంటే నాకూ అలాగే వుంది. మీ ఉద్యమం మీరు చేసుకోండి, నన్ను వెళ్లనివ్వండి. నా పని చేయనివ్వండి.'' అన్నాను.

కొంతమంది విద్యార్థులు నా వాదన విని ఆలోచనలో పడి కాస్త ఒక్కడుగు వెనకడుగు వేశారు. నేను అవకాశం అంది పుచ్చుకున్నాను. 

''మనం యీ ఎకడమిక్‌ డిస్కషన్‌లో పడిపోయాం కానీ అటు చూడండి, ఊరు కాలిపోతోంది. కావాలంటే రేపు విశదంగా మాట్లాడుకుందాం'' అన్నాను. నా వెంటనున్న ఫోర్సు ఉపయోగించకపోవడం వలన వాళ్లూ మెత్తబడ్డారు. నన్ను వెళ్లనిచ్చారు.  

ఊళ్లోకి వెళ్లి చూస్తే అంతా బీభత్సం. పోస్టాఫీస్‌, కలక్టరేట్‌, కల్టెకర్‌ బంగళా, రకరకాల పబ్లిక్‌ ఆఫీసులు – ఎన్నో మంటల్లో కాలుతున్నాయి. ఊరంతా కర్ఫ్యూ విధించారు. వీధులన్నీ నిర్మానుష్యం. కాని అక్కడక్కడ కర్ఫ్యూని ధిక్కరించి అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయి. పట్టుకోబోయేటంతలో పారిపోతున్నాయి. ఎవరు ఎటువైపునుండి ఎటాక్‌ చేస్తారో తెలియదు. ఎస్‌.పి.బంగ్లాకు రమ్మనమని నాకు ఆదేశాలున్నాయి కనుక అక్కడకు చేరాను. నన్ను చూడగానే వాళ్లకు ప్రాణం లేచి వచ్చింది. వాళ్ల రక్షణకు కాస్త ఫోర్సు తీసుకుని వచ్చాననే కాదు. అసలు విద్యార్థుల బారినుండి తప్పించుకుని ఎలా వచ్చావ్‌? అని ఆశ్చర్యపడ్డారు. నేను క్షేమంగా వస్తానన్న ఆశ విడిచేసినట్టున్నారు. 

నేను జరిగినది యిది అని చెప్పి నా వాదన వినిపించాను. పోన్లే, సమయస్ఫూర్తితో వ్యవహరించి నెగ్గుకొచ్చావ్‌ అని కలక్టరుగారు నన్ను అభినందించారు. అందరూ కలిసి పరిస్థితిని ఎలా అదుపులోకి తేవాలా అన్న సమాలోచనల్లో పడ్డాం.

xxxxxx

నేను ఢిల్లీ హిందూ కాలేజీలో బియస్సీ చదివేటప్పుడు డిఫెన్సు కాలనీ అని ఒకచోట వుండేవాళ్లం. మాకు యూనివర్శిటీదాకా ఓ స్పెషల్‌ బస్‌ వుండేది. అందరూ కాలేజీ వాళ్లమే. ఇప్పుడు ప్లానింగ్‌ కమిషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా వున్న మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా, రెండు మూడు దేశాల్లో ఇండియన్‌ అంబాసిడర్‌గా చేసిన అరుణ్‌ బెనర్జీ వీళ్లందరూ నా బస్‌ మేట్సే. కాలేజీనుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే బస్సులో వెనక్కి రావాలి. అయితే ఓ రోజు వేరే బస్సులో రెడ్‌ ఫోర్టు కెళ్లి ఆ స్టాప్‌లో మా స్పెషల్‌ బస్సు ఎక్కబోయాను. అయితే అవేళ రెడ్‌ ఫోర్టు స్టాప్‌లో దిగేవాళ్లు ఎక్కువమంది లేరు. బస్సులో ఎక్కడానికి వీల్లేనంతమంది జనం గుమ్మం దగ్గర కిక్కిరిసి వున్నారు. మా ఫ్రెండ్స్‌ సాయం పట్టి నన్ను కిటికీలోంచి బస్సులోకి తోసేశారు.  సరిగ్గా ఎవరిదో ఒళ్లో చేరాను.

ఎవరాని చూడబోతే మా ఫిజిక్సు లెక్చరర్‌. ఆయనింటికి ట్యూషన్‌కి వెళ్లేవాణ్ని. నేనంటే చాలా సదభిప్రాయం ఆ మానవుడికి.  చూసి ఉలిక్కిపడి జనంలో కలిసిపోయాను. అవేళ ట్యూషన్‌కి వెళ్లడానికి మొహం చెల్లలేదు. వెళ్లవలసి వచ్చింది. ఆయన నన్ను చూసి ''ఊఁ! ఇటువంటి పనులుకూడా చేెస్తావన్నమాట, చాలా విద్యలే వచ్చే!'' అన్నాడు వ్యంగ్యంగా. తల కొట్టేసినట్టు అనిపించింది. కానీ ఏం చేస్తాం? విద్యార్థి థే అలాటిది!

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by
kinige.com
please click here for audio version