మోహన మకరందం: ఎవరి పని వారు చేయాలి

మోహన మకరందం Advertisement అనుభవాలూ – జ్ఞాపకాలూ డా|| మోహన్‌ కందా ఎవరి పని వారు చేయాలి ఎన్‌డిఎమ్‌ఏలో తక్కిన సభ్యులన్నారు – ''మనం ఇండియన్‌ ఆర్మీ వంటి ఒక ఆర్గనైజేషన్‌. ఎక్కడైనా ఏదైనా…

మోహన మకరందం

అనుభవాలూ – జ్ఞాపకాలూ

డా|| మోహన్‌ కందా

ఎవరి పని వారు చేయాలి

ఎన్‌డిఎమ్‌ఏలో తక్కిన సభ్యులన్నారు – ''మనం ఇండియన్‌ ఆర్మీ వంటి ఒక ఆర్గనైజేషన్‌. ఎక్కడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగినపుడు మనం వెంటనే అక్కడికి ఓ సైన్యంలా వెళ్లి పని చేసేసి శభాష్‌ అనిపించుకుని వచ్చేయాలి'' అని.

నేను అక్కడే వాళ్లతో విభేదించాను. ''మనం చేయకూడని పనే అది. ఏదైనా వస్తే ఆ విధంగా చేయవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. మనకు నేరుగా సంఘటనలతో సంబంధం లేదు. విపత్తు జరగకుండా చూడడం, జరిగితే జరిగినప్పుడు, ఆ తర్వాత ఏం చేయాలో వాళ్లకు చెప్పి చేయించడం.. అంతే!'' అన్నాను.

''అంటే ఆ విపత్తు జరిగినప్పుడు మనం ఎక్కడా కనబడమా?'' అని అడిగారు ఆశ్చర్యంగా.

''కనబడం. కనబడకూడదు. క్రికెట్‌ మ్యాచ్‌ జరిగేటప్పుడు ఆ టీము మేనేజర్‌ కానీ, కోచ్‌ గానీ మైదానంలో కనబడతాడా? అతని పని వాళ్లను తయారుచేయడం, ఆట అయిపోయాక జరిగిన లోపాలోపాలను సమీక్షించి తదుపరి ఆటకు సన్నద్ధం చేయడం. అంతేగాని, మ్యాచ్‌ అవుతూంటే మధ్యలో వెళ్లి ఫీల్డర్లను నువ్వు అటు వెళ్లు, నువ్వు యిటు రా అని ఆదేశాలిస్తారా? ఆ పని కెప్టెన్లది. ఇక్కడ కెప్టెన్లంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.'' అని సోదాహరణంగా చెప్పాను.

మా వాళ్లు దిగాలు పడ్డారు. ఎందుకంటే యిలా చేస్తే ప్రజల దృష్టిలో వీళ్లెప్పటికీ పడరు.

అదేమి చిత్రమో కానీ మనుష్యులు వాళ్లకు చెప్పిన పని కాకుండా వేరేది చేయడంలో ఎక్కువ వుత్సాహం చూపుతారు. తమ పని పాతర వేసి ఎదుటివాడి పని సవరించబోతారు. డైరక్టర్లవుదామనుకుని ధైర్యం చాలక ఆగిపోయిన సినిమా స్టార్లు డైరక్టరుని డైరక్టు చేయాలని చూస్తారు. యాక్టర్లు కావాలని రంగానికి వచ్చి వెండితెరకు మొహం నప్పకపోవడంతో తెర వెనక్కు వెళ్లి డైరక్టర్లయినవారు అప్పుడప్పుడు తననే హీరోగా పెట్టి సినిమా తీసేసుకుంటారు. హీరోలు హీరోలుగా, డైరక్టర్లు డైరక్టర్లుగా చేస్తే చాలు కదా!

పంచతంత్రంలో పరాధికారము పైన వేసుకున్న గార్దభము కథ మనం ఎప్పుడో చదువుకున్నాం. ఓ యింటికి దొంగ వస్తే కుక్క మొరిగి యజమానిని లేపలేదట. కుక్క తన డ్యూటీ సరిగ్గా చేయలేదని చికాకు పడి గాడిద కుక్క డ్యూటీ చేయబోయిందట. గాడిద ఓండ్రతో నిద్రాభంగం అయిన యజమాని లేచి కోపంతో దుడ్డుకర్రతో దాని నడుం విరక్కొట్టాడట. అదే కుక్క అరిచివుంటే యజమానికి సరైన సంకేతం అంది దొంగకోసం వెతికి వుండేవాడు. గాడిద అరుపు అనేది రాంగ్‌ సిగ్నల్‌. దానివలన యజమానికీ మేలు కలగలేదు, గాడిదకు ముందే కలగలేదు.

మన రాజ్యాంగ నిర్మాతలు మూడు వ్యవస్థలు ఏర్పరచారు. న్యాయవ్యవస్థ, శాసనసభావ్యవస్థ, పాలనా యంత్రాంగం. వేటి విధులు వాటికి ఏర్పరచారు. ఒకదానిని మరొకటి అధిగమించకుండా, దారికి అడ్డురాకుండా నియమాలు ఏర్పరచారు.  మూడిటికి సమాన ప్రాధాన్యత యిచ్చి తూకం చెడకుండా చూశారు. ఎవరు హద్దు మీరుతున్నా మరొకరు వారిని దారిలో పెట్టగలరు.

పాలనా యంత్రాంగంలో కూడా పాలకులుగా వచ్చే రాజకీయ నాయకులకూ  ఓ పాత్ర వుంది. యంత్రాంగం నడపవలసిన అధికారగణానికీ మరో పాత్ర వుంది. తొలిరోజుల్లో పాలకులు యీ విషయాన్ని ఎరిగి ప్రవర్తించేవారు. గతంలో ముఖ్యమైన విషయాల్లో కూడా ముఖ్యమంత్రులు అనవసరంగా జోక్యం చేసుకునేవారు కారు. తమకు కావలసిన విషయాలు ఒకటి రెండు వుంటే చెప్పి వూరుకునేవారు. కాసు బ్రహ్మానందరెడ్డిగారు వంటి అనుభవజ్ఞుల గురించి ఓ ఉదాహరణగా మా సీనియర్లు చెప్తూండేవారు –

అధికారులు ఆయనను కలిసి ''సార్‌, ఎల్లుండి ఢిల్లీ వెళుతున్నామండీ, ప్లానింగ్‌ కమిషన్‌ వద్దకు వెళ్లి రాష్ట్రానికి యాన్యువల్‌ ప్లాన్‌్‌ ఎప్రూవ్‌ చేయించుకుని వస్తాం'' అంటే అని చెపితే ''మంచిదే. ఆఁ చూడండి, నరసరావుపేటలో ఓ స్కూలు ఒకటి కట్టిస్తానని హామీ యిచ్చానండి, దానికి ఫండ్స్‌ చూసుకోండి… తర్వాత.. ఆఁ, ఆ జిల్లాలో ఫలానా ఆయన వున్నాడు కదా.. ఆయన చెప్పినది మాత్రం అవసరమో కాదో ఆలోచించండి.'' అని అనేవారట. ఇది సరదాగానే చెప్పి వుండవచ్చు కానీ పరిస్థితి యించుమించు యిలాగ వుండేదిట.

అంటే ఒక పాజిటివ్‌ కరక్షన్‌, ఒక నెగటివ్‌ కరక్షన్‌. అంతే తక్కినదానితో ఆయనకు సంబంధం లేదు. బాగానే చేస్తారన్న నమ్మకం. అప్పటి రాష్ట్ర బడ్జెట్‌కి, యిప్పటికి బడ్జెట్‌కు హస్తిమశకాంతరం. ఎన్నో రెట్లు పెరిగింది. అందువలన అడ్మినిస్ట్రేషన్‌పై మరింత వదిలేయాలి. కానీ జరుగుతున్నదేమిటి?

కొన్ని రాష్ట్రాలలో కొందరు ముఖ్యమంత్రులు 'ఈ అధికారులు అందరూ పనికిమాలినవాళ్లు. వాళ్ల చేత పలకా బలపం పట్టించి చేత్తో రాయించకపోతే అస్సలు పనిచేయరు. వాళ్లకు ఏమీ తెలియదు. మనం చెప్పకపోతే ఏదో ఒకటి తగలేసి, మనకు చెడ్డపేరు తెస్తారు' అనే మైండ్‌సెట్‌తో వుంటున్నారు. వచ్చిన దగ్గర్నుంచీ హెడ్‌మాస్టర్‌ అవతారం ఎత్తి అధికారులకు 'ప్రెవేటు' చెప్పడంతోనే సరిపోతోంది. వాళ్లు పనిచేస్తూ వుంటే వాళ్ల వెనక్కాలే నిలబడి బుసలు కొడుతూ వాళ్లకు కంపం (వణుకు), కంపరం కలిగించి వాళ్ల సామర్థ్యాన్ని చెడగొడుతూ వాళ్ల 'తాట తీశాన'న్న ఆనందంతో మురిసిపోతున్నారు.

ఈ బులబాటంలో ప్రజలకు, తమ పథకాల అమలుకు సంబంధించి సరైన ఫీడ్‌బ్యాక్‌ (స్పందన) అందించవలసిన పార్టీ కార్యకర్తలకు సమయం కేటాయించలేక పోతున్నారు. చుట్టూ చేరిన వందిమాగధుల పొగడ్తలు నమ్మి, అంతా సవ్యంగానే వుందన్న భ్రమలో పడి, చివరకు ఎన్నికలలో ఓటమి పాలవుతున్నారు.

అందువలననే నేనంటాను – ఎవరు చేయవలసిన పని వాళ్లు చేయాలని. పరాధికారము పైన వేసుకోకూడదని.

నేను యిటీవలిదాకా సభ్యుడిగా వున్న ఎన్‌డిఎమ్‌ఏ (నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) లో కూడా యిటువంటి కన్‌ఫ్యూజనే వుండేది.

అథారిటీకి వైస్‌చైర్మన్‌గా మాజీ ఆర్మీ చీఫ్‌ వుండేవారు. తక్కిన సభ్యులకు కూడా యిటువంటివాటిలో అనుభవం తక్కువ. హోం మంత్రి మూడు రోజుల్లో జాతీయవిధానం తయారుచేసి యిమ్మంటే రైఠో అనేశారు. అప్పుడు నేను దీనిలో యిమిడివున్న అంశాలన్నీ ఏకరువు పెట్టాక కాస్త తగ్గారు. లేకపోతే ఎంత అభాసుపాలయ్యేవారమో తలచుకుంటే యిప్పటికీ నాకు ఒళ్లు జలదరిస్తుంది.   తరువాతి అంశం – మా సంస్థ స్వయంగా ఏం చేయాలి, యితరుల చేత ఏం చేయించాలి అన్న దానిపై బోల్డంత గందరగోళం.

మొదట మార్గదర్శక సూత్రాలు తయారుచేయడం మొదలుపెట్టాం. ప్రకృతి వైపరీత్యాలు – వరదలు, తుపానులు, కరువులు వంటివి. ఈ అంశాలలో కూడా మూడు భాగాలుంటాయి. రాబోయే ఉపద్రవానికి తయారు కావడం, ప్రభుత్వానికి, ప్రజలకు ముందస్తు హెచ్చరిక యివ్వడం,  దాని దుష్ప్రభావాన్ని సాధ్యమైనంత తగ్గించడం. రెండో భాగం – విపత్తు సాగుతూండగా చేపట్టవలసిన చర్యలు మూడో భాగం – వరదల్లాటివి వచ్చి వెళ్లిపోయాక వ్యాపించే అంటురోగాలను అరికట్టడం, సహాయకచర్యలు యిలాటివి. వాటికి తగ్గట్టే పరిష్కారాలు కూడా వుంటాయి.- వాటిని ఎదుర్కోవలసినవారికి తర్ఫీదు యివ్వడం, తట్టుకోగలిగే నిర్మాణాలు చేపట్టడం, ప్రజల్లో అవగాహన పెంచడం, వీటివలన ప్రజారోగ్యానికై సామగ్రి, సిబ్బందిని కూర్చుకోవడం… యిలా వుంటాయి.

మనం సమస్యను రెండు రకాలుగా ఎప్రోచ్‌ కావచ్చు. సమస్య కోణంతో మొదలుపెడితే  ఓ పద్ధతి. అంటే తుపాను  అనుకోండి. అవి వచ్చే తీరప్రాంతాలేమిటి, అవి ఏయే రాష్ట్రాలలో వున్నాయి. అక్కడ యిప్పటికే వున్న సౌకర్యాలేమిటి? మనం కల్పించవలసిన సౌకర్యాలేమిటి? వాటిని వినియోగించుకునే సామర్థ్యం వాళ్లకుందా లేదా? యిలా ఆలోచిస్తూ పోవాలి.

రెండో పద్ధతి రాష్ట్రం పరంగా వెళ్లడం. గుజరాత్‌ వుంది. అక్కడ వచ్చే సమస్యలేమిటి? కరువు, తుపాను, వరదలు, భూకంపం.  కరువు విషయంలో వాళ్ల వద్ద వున్న సాధనసంపత్తి ఏమిటి, స్థానిక ప్రజలకు వాటిపై వున్న స్పృహ ఏమిటి? మరి భూకంపం విషయంలో యీ స్థాయిలో వుందా..? ఇలా! ఇప్పటికే యీ సమస్యలను చాలాకాలంగా భరిస్తున్నారు కాబట్టి వాళ్లకు చాలా ఆచరణాత్మక అనుభవం వుంది. ఏం చేయాలో, ఏం చేస్తే ఏమవుతుందో, ఏది చేయగలమో – యీపాటికే వాళ్ల వద్ద చాలా సమాచారం వుంటుంది కదా. అవన్నీ సేకరించి, ఒకదానితో మరొకదాన్ని పోల్చి చూస్తే అంతిమంగా మనకు కావలసినది తయారవుతుంది.

ఇదీ నా ఆలోచనా ధోరణి. దీన్నే ఓ పవర్‌ పాయింటు ప్రెజంటేషన్‌ ద్వారా మా వాళ్లకు చెప్పాను. వాళ్లకు యిది రుచించలేదు. మనం పోయి వాళ్లనీ, వీళ్లనీ అడగమేమిటి? మనకే కొద్దో, గొప్పో తెలుసు. ఏదైనా తెలియకపోతే గూగుల్‌కి పోయి వెతికితే అదే కనబడుతుంది అనుకున్నారు.

వీళ్లే కాదు. రాష్ట్రాల మధ్య కూడా యిటువంటి సమన్వయలోపం వుండవచ్చు. తుపాను బాధిత రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, బెంగాల్‌ వున్నాయి కదా. తుపానుతో వ్యవహరించే విధానం గురించి మూడు రాష్ట్రాలు సమాచారం యిచ్చిపుచ్చుకుంటే అందరూ లాభపడతారు. కానీ యింకోరిని అడిగేదేమిటి? మనమే తంటాలు పడదాం అనుకుంటే చక్రాన్ని యిప్పుడు మళ్లీ కనిపెట్టినట్టవుతుంది. ఇటువంటి పరిస్థితుల వలన వచ్చిన అనర్థాలకి పరిష్కారాన్ని కనుగొనడానికే మన వ్యవస్థను ఏర్పరచారు అని నా వాదన.

భారీవర్షాలు వచ్చినపుడు ఒక కాలువలో విపరీతంగా నీళ్లు వచ్చాయనుకోండి. దానిలో ఓ పిల్లాడో, ఓ పిల్లో పడిపోయాడు. అప్పుడు ఓ సాహసవంతుడు కాలవలోకి దూకి వాళ్లని రక్షిస్తే అతనికి ఏ పద్మశ్రీయో రావచ్చు. పోనీ ఓ పతకం. చిన్నవయసువాడైతే ఏటేటా యిచ్చే సాహసబాలుడు పురస్కారం దక్కుతుంది.

కానీ ఆ కాలువలోకి ఆ సమయంలో అధికప్రవాహం రాకుండా నదికి ఎగువనే లాకులు ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త  చర్యలు తీసుకున్నారనుకోండి. అప్పుడు ఈ ప్రమాదమూ వుండదు, ప్రమాదం నుండి రక్షించి మెప్పులు పొందడమూ వుండదు. అంతేకాదు, ఆ లాకులు ఏర్పాటు చేసి యీ ప్రమాదం జరగకుండా చూసినవాడిని తలచుకునేవాడూ వుండడు.

ఇప్పుడు ఎన్‌డిఎమ్‌ఏ పాత్ర ఆ లాకులు ఏర్పాటు చేసేవాడి పాత్రన్నమాట. పేరు రాని పనులు ఎవరూ చేయడం లేదనే మన సంస్థ ఏర్పాటు చేశారు. పేరు లేకుండా, ప్రజల కంటికి కనబడకుండా, మనం చేసిందేమిటో ఎవరికీ తెలియకుండా చేయడానికే మనల్ని పెట్టారు. దానికి మానసికంగా మనం సిద్ధపడాలి. మనం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలబడిపోయి పోటాపోటీగా మనం మన ప్రత్యేక రెస్క్యూ టీముతో తయారవుతే వింతగా వుంటుంది. అని వాదించాను.

అదే నిజమైతే యింత మాత్రం దానికి మేమెందుకు? అంటూ మా వాళ్లంతా దిగాలుపడిపోయారు. ఇదంతా నీ ఊహ తప్ప ప్రభుత్వం ఉద్దేశం యిది కాదేమో అని వాదించారు. చివరకు ప్రధానమంత్రి స్థాయిలో ఆ అంశాన్ని చర్చించి దానిపై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది – ఎన్‌డిఎమ్‌ఏ యీ వైపరీత్యాల విషయంలో నేరుగా కలగజేసుకోదు అని !

చెప్పద్దూ, మా వాళ్లందరూ చాలా నిరుత్సాహపడ్డారు. క్రమేపీ సర్దుకున్నారు. అప్పుడప్పుడు మా పనిలో భాగంగా ప్రెస్‌మీట్లు, వర్క్‌షాప్‌లు, టివిలో యాడ్స్‌.. యిచ్చినపుడు మా వాళ్ల చిన్న చిన్న ఫోటోలు, బయోడేటాలు వచ్చేవి. గైడ్‌లైన్సు ప్రచురించినపుడు మా బయోడేటాలు, పరిచయాలు.. యిలాటివి. ఏదో చిలక్కొట్టుడు అంటారు కదా, ఆ స్థాయివి.

ప్రస్తుతానికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిసాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) అనే టీము ఏర్పడి కొన్ని పనులు డైరక్టుగా చేస్తోంది. 2009లో ఆంధ్రలో, కర్ణాటకలో వరదలు వచ్చినపుడు మా వాళ్లే టీముగా వెళ్లి చాలా మంచి పనులు చేశారు. మా సంస్థకు గుర్తింపు, ఖ్యాతి వచ్చాయి. ప్రజలు, ముఖ్యమంత్రులు అందరూ మెచ్చుకున్నారు. మా వాళ్లు సంతోషించారు. కానీ నన్నడిగితే అది సంతోషించదగిన విషయం కాదు.

ఎందుకంటే అది మా డ్యూటీ కానే కాదు. వేరేవాళ్లది. రాష్ట్రస్థాయిలో జరగవలసినది. వాళ్లు చేయకపోతే మేం దగ్గరుండి చేయించాలి తప్ప 'వాళ్లు చెయ్యరు, వాళ్లకేం చేతకాదు' అని వాళ్లని తిట్టిపోసి మేమే రంగంలోకి దిగి స్వయంగా చేసేయకూడదు. అలా అయితే వాళ్లు ఎప్పటికీ నేర్చుకోరు. పైగా మాకున్న పరిమిత వనరులతో మేం ఏ మాత్రం సాధించగలం? అదే రాష్ట్రప్రభుత్వం చేత చేయించగలిగితే వాళ్లకున్న సాధనసంపత్తితో మా కంటె వంద రెట్లు ఎక్కువగా, ప్రభావవంతంగా చేయగలరు.

అందువలన చేయించేవాడు చేయించేవాడుగానే వుండాలి. చేసేవాడి పనిలో తలదూర్చి వాడిని నిరుత్సాహ పరచి, అది కూడా మన నెత్తిన వేసుకోకూడదు. చాలా మంది నాయకులకే కాదు, అధికారులకు కూడా యీ సున్నితమైన అంశం తెలియకపోవడం ఓ విషాదం.

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by 
kinige.com
please click here for audio version