అనుభవాలూ – జ్ఞాపకాలూ
డా|| మోహన్ కందా
సెన్సాఫ్ హ్యూమర్ వుండాలి
ఎన్టీ రామారావుగారు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని గతంలో వున్న బిల్డింగుకే మారుద్దామనుకున్నారు.
చాలాకాలంగా వాడకంలో లేదు కదా యిప్పుడు ఎలా వుందో చూదామని డిప్యూటీ సెక్రటరీ బెనర్జీ, నేను వెళ్లి చూశాం. గోడలన్నీ బీటలు తీసి వున్నాయి.
''దిస్ బిల్డింగ్ యీజ్ ఫుల్ ఆఫ్ క్రాక్స్'' అన్నాడు బెనర్జీ.
''నాట్ యెట్, షిప్టింగ్ యీజ్ యెట్ టు బి టేకనప్'' అని వెంటనే చమత్కరించాను నేను.
క్రాక్ అనే పదానికి రెండు అర్థాలున్నాయి (పగుళ్లు, మూర్ఖులు) కాబట్టి 'పన్'తో జోక్ పండింది. అతను ఫక్కుమన్నాడు.
–
భగవాన్‌దాస్‌గారు చీఫ్ సెక్రటరీగా వుండగా ఆయన విఠల్ గారికి చిన్న నోట్ పంపించారట – 'ఫలానావాళ్లని మీరు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో కాస్త ఎకామడేట్ చేసుకోగలరా?' అని.
ఆ ఫలానావారు యీ డిపార్టుమెంటుకి ఎలాగైనా వద్దామని అనుకుంటున్నారని విఠల్‌గారికి అర్థమైంది.
వద్దని డైరక్టుగా అనేస్తే ''ఏం మీ డిపార్టుమెంటులో వున్నవాళ్లందరూ మేధావులేనా? ఈయన అంత పనికిరాడా?'' అనవచ్చు భగవాన్‌దాస్ గారు.
అందుకని యీయన తమాషాగా ఓ నోట్ రాశారు – ''మా శాఖలో మందబుద్ధులున్నారని ఒప్పుకుంటాను. కానీ యిక్కడకు వచ్చినతర్వాతనే వాళ్ల నలా తయారుచేశాం తప్ప పుట్టుకతో అలా లేరు పాపం..'' అని.
దానిలో తన శాఖమీద తనే వేసుకున్న జోకూ వుంది. మీరు పంపించేవాడి సత్తా యిది అనే ధ్వనీ వుంది.
ఇబ్బందికర పరిస్థితుల్లోంచి బయటపడడానికి హాస్యం ఎంతమంచి సాధనమో చూడండి.
–
ఇప్పుడు ఎటు చూసినా ఆత్మహత్యలు కనబడుతున్నాయి. సైకియాట్రిస్టు వద్దకు పరిగెత్తే జనాలు కనబడుతున్నారు. ఎవర్ని అడిగినా టెన్షన్, డిప్రెషన్ అంటారు. ఎల్.కె.జి. చదివే కుఱ్ఱవాడి తల్లి దగ్గర్నుంచి క్రాస్ ఓటింగ్ జరిగి ఓడిపోతామేమోనని భయపడే నాయకుడి దాకా అందరూ నిత్యం జపించే మాటలివి. వీళ్లే కాదు, ఏ ఎడ్మినిస్ట్రేటర్‌ను చూసినా ఒత్తిళ్లకు గురవుతున్నామనే అంటారు. దానినుండి తట్టుకోవడానికే వ్యసనాలకు అలవాటు పడుతున్నామంటారు. బజార్లో టెన్షన్-బస్టర్స్ పేర రకరకాల వస్తువులు – కోపం వచ్చినపుడు కసితీరా గుద్దమని బొమ్మలు, కసాబిసా నలిపేయమని రబ్బరు బంతులు, ఊహూ తిప్పేయమని గుళ్లమాలలు – అమ్ముతున్నారు.
అసలైన టెన్షన్-బస్టర్ మనలోనే వుంది. దానిపేరే హాస్యప్రియత్వం. సెన్సాఫ్ హ్యూమర్ వుంటే చాలు ఏ సమస్యా మిమ్మల్ని బాధించదు. ఏ కష్టమూ కష్టంగా తోచదు. ఆడుతూ, పాడుతూ పనిచేసినట్టుగా వుంటుంది.
పైన చెప్పిన బి.పి.ఆర్.విఠల్‌గారు మా అందరికీ గురుతుల్యులు. ఫైనాన్షియల్ సెక్రటరీగా, ప్లానింగ్ సెక్రటరీగా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్‌గా కూడా చేసారు. 1991లో నన్ను ఫైనాన్సు డిపార్టుమెంటులో ప్లానింగ్ సెక్రటరీగా ఆయన కింద వేసినప్పుడు నన్ను పిలిచి చెప్పారు. ''నాయనా, నాకు నువ్వు ప్లానింగ్, ఫైనాన్స్ విషయాలలో పెద్ద సహాయం చేసినా, చేయకపోయినా పర్వాలేదుగాని, రోజుకొక మంచి జోక్ చెబుతుండాలయ్యా'' అని! దీన్ని బట్టి పై స్థాయికి ఎదిగిన కొద్దీ హాస్యం ఎంత ఆవశ్యకమో అర్థం చేసుకోండి.
దీన్ని బట్టి మీకు యింకో విషయం కూడా అర్థమవ్వాలి. సర్వీసెస్‌లో వున్నవాళ్లమంతా గజంబద్ద మింగేసినవాళ్లలా, నిఠారుగా, ఠీవిగా నడిచేస్తూ, పొడూగుమొహాలు వేసుకుని (లాంగ్ ఫేసెస్) అందరిమీదా చికాకు పడుతూ వుండమనీ, మాలో మేమే, మా పైనా జోక్స్ వేసుకుంటూ వుంటామనీ !
–
నా మట్టుకు నేనే సాధ్యమైనంతవరకూ నవ్వుతూ వుంటాను. నేను ఢిల్లీలో అగ్రికల్చర్ మినిస్ట్రీలో వుండగా ఎవరో ఒకాయన పనిమాలా వచ్చి అడిగాడు నన్ను – ''అయ్యా మీరు ఎప్పుడు చూసినా అలా చిరునవ్వుతో ఎలా వుండగలుగుతున్నారు?'' అని. (హౌ డూ యూ మేనేజ్ టు కీప్ స్మైలింగ్ ఆల్వేజ్)
నేను చెప్పాను – ''గట్టిగా పగలబడి నవ్వితే బాగుండదు కాబట్టి'..'' అని! ('..బికాజ్ యిట్ ఈజ్ నాట్ ప్రాపర్ టు లాఫ్ ! అన్నాను)
అతను తెల్లబోయి 'అంటే?' అన్నాడు.
''..లేకపోతే ఏమిటయ్యా మీ తాపత్రయాలు? మీ అడావుడిలూ..! ఏదో కొంపలు మునిగినట్టు పరిగెత్తడం, యీ కంగారూ అవసరమా? 'ఈ హంగామా వలన కలిగే ప్రయోజనం ఏమైనా వుందా?' అని బయటనుంచి చూసేవాళ్లకు తప్పకుండా నవ్వు వస్తుంది. వాళ్లు నవ్వేందుకు ముందే మనల్ని చూసి మనమే నవ్వేసుకుంటే బాగుంటుంది. అందుకే నేను నవ్వుతా. ఎటొచ్చీ ఫకాలున నవ్వితే మర్యాదగా తోచదు కాబట్టి చిరునవ్వుతో సరిపెట్టుకుంటున్నాను' అని చెప్పాను.
–
నిజమే, జీవితం గురించి ఊరికే బాధపడేవాళ్లను చూసి నేను ఆశ్చర్యపడుతూంటాను. మా నాన్నగార్ని ఎవరో అడిగారట ''హౌ ఈజ్ లైఫ్?'' అని. నిజానికి ఆయన అప్పుడు సుఖసంతోషాలలో ఏమీ లేరు. కానీ జీవితం ఎలా వుందంటే ఏం చెప్తారు? కానీ చెప్పారు – ''బెటర్ దాన్ ద ఆల్టర్నేటివ్..'' అని. జీవితానికి ప్రత్యామ్నాయం చావే కదా. చచ్చిపోవడం కంటె ఏదోలా బతికి వుండడం మేలు కదా. లేనిబావ కంటె గూనిబావ మేలు అన్నట్టు…! అసలు బతికంటూ వుంటే యివాళ కాకపోయినా రేపైనా మెరుగుపడవచ్చు. అసలు బతుకే లేకపోతే…? సర్వకాల సర్వావస్థలలోనూ ఆశాభావంతో వుండే యీ రకమైన దృక్పథం నాకు నచ్చుతుంది.
మనను చూసి మనం నవ్వుకోగలగడానికి ముందు చేయవలసినది అహంకారాన్ని వర్జించడం. అప్పుడే నవ్వు పుడుతుంది. నా మట్టుకు నేను నేనేదో జీవితంలో పెద్ద ఏదో చాలా సాధించేశాను అని అనుకునే కోవకు చెందిన మనిషిని కానే కాదు. మనద్వారా జరిగినవాటితో నేను తృప్తి చెందుతాను. నా ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదన్న వేదన నన్నెన్నడూ బాధించదు.
చిన్నపుడు మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. కలలు కంటాం. అది సహజం. వయసు వస్తున్నకొద్దీ మన పరిమితులు తెలుస్తూ వస్తాయి. ఇది మన వలన కాదు అనే విషయం బోధపడుతూ వస్తుంది. మనకు యిరవై యేళ్లు వచ్చేసరికి తెలిసిపోతుంది – మనం చిన్నప్పుడు అనుకున్నట్టు పైలట్ కాలేము అని. ముప్ఫై ఏళ్లు వచ్చేసరికి టెస్ట్ క్రికెట్ ఆడం అని.., నలభై ఏళ్లు వచ్చేసరికి మనం ఎవరెస్టు శిఖరం ఎక్కలేం…అని.. .యిలా ఆత్మజ్ఞానం కలుగుతూ వస్తుంది. అదే సమయంలో అవి సాధించలేకపోయాం కానీ మరోటి సాధించాం కదా అన్న యింగితం కూడా కలుగుతుంది. మన చదువు, మన ఉద్యోగం, మన అభిరుచులు, మన ప్రజ్ఞాపాటవాలు, మన కుటుంబం, మన స్నేహితులు.. యివన్నీ సంపాదించుకున్నాం కదా. ఇక దేని కోసం బాధపడాలి?
ఏ ఉద్యోగంలో వుంటే ఆ పరిస్థితుల్లో యిమిడిపోయాను. ఇదో పెద్ద వుద్యోగం దీనివలన మనం ఏదో సాధించేశాం అని అనుకోలేదు. గవర్నరుగారితో కారులో వెళుతూంటే నా పక్కన కూర్చున్న గవర్నరుగారు నా కంటె పెద్ద స్థాయివారనీ అనుకోలేదు, మా ముందు సీట్లో కూర్చుని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ నా కంటె తక్కువస్థాయి వాడనీ అనుకోలేదు. అతన్ని లోకువ చేయవచ్చనీ, గవర్నరుగారి వద్ద చేతులు కట్టుకుని అత్యంత నమ్రంగా జీ హుజూర్ అంటూ వుండాలనీ – రెండూ అనుకోలేదు. అందరూ మనుష్యులమే, ఎవరి పని వాళ్లం చేస్తున్నాం. ఈ చేయడాలలో పొరపాట్లు దొర్లుతాయి. మనం చేసిన తప్పులు చూసి పక్కవాళ్లు నవ్వుకుంటారు. వాళ్లతో బాటే, లేదా వాళ్ల కంటె ముందే మనమే నవ్వేసుకుంటే హాయిగా వుంటుంది. ఇదీ నా ఫిలాసఫీ.
ఈ ఫిలాసఫీ నాకు మా నాన్నగారినుండి వచ్చింది. ఆయన చాలా పేరుప్రఖ్యాతులున్న లాయరు. తన వృత్తిమీదే జోకులు చెప్పేవారు.
అప్పట్లో లాయర్లకి పెద్ద పెద్ద యిళ్లు వుండేవి. పక్క వూళ్లనుండి వచ్చిన క్లయింట్లు వీళ్ల యిళ్లలోనే భోజనాలు చేసి రాత్రి అరుగుల మీద పడుక్కునేవారు. అలా వచ్చినవాడొకడు నోట్లో బొటనవేలు వేసుకుని పడుక్కున్నాట్ట. పొద్దున్న లేవగానే పక్కవాడు తిట్టాట్ట ''ఇన్నేళ్లు వచ్చాయి. చిన్నపిల్లాడిలా ఆ పాడు అలవాటు ఏమిట్రా'' అని.
''అబ్బే, నాకు అలవాటు కాదు. ప్లీడరు యింట్లో వుండగా బొటనవేలు అలా వదిలేయవద్దు. ఏ రాత్రో నువ్వు నిద్రపోతూ వుండగా వాళ్లకి కావలసిన కాగితం మీద వేలిముద్ర వేయించేసుకుంటారు అని చెప్పింది మా ఆవిడ. అందుకే బొటనవేలిని అలా దాచేసుకున్నా…'' అని చెప్పాట్ట. అప్పట్లో నిశానివాళ్లే ఎక్కువ కాబట్టి బొటనవేలుకి అంత విలువ అన్నమాట.
ప్లీడర్ల జీవితాలు ఎలా వుండేవో ఆయన చెప్తూండేవారు – ''ఒకబ్బాయి ప్లీడరీ చదివేడట. ప్రాక్టీసు పెడదామని ఉబలాటపడుతున్నాట్ట. అప్పుడు తండ్రి అతన్ని తనకు తెలిసిన ఓ సీనియర్ లాయరు వద్దకు తీసుకెళ్లాడు. ఆయన అడిగాడట – ''బాబూ, కొత్తలోకంలోకి వస్తున్నావు జాగ్రత్త్త! నువ్వు పూర్తిగా కళ్లు తెరిచి చూడగలుగుతున్నావుకదా! ఇక్కడ మంచి చెడ్డలన్ని అర్థమయ్యాయికదా నీకు! అన్నీ తెలుసుకుని దిగు. ఎందుకంటే కొత్తలో రోజుకి ఇరవైనాలుగు గంటలు పనిచేయాలి. తిండికి, నిద్రకి కూడా తీరిక వుండదు. అటు కేసు త్వరగా తేల్చమని క్లయింట్ అల్లరి చేస్తుంటాడు. ఇటు తేల్చనీయకండా ఎదురువైపు అడ్వకేట్ అల్లరి చేస్తుంటాడు. ఒక్కోసారి జడ్జీలు మనతో తగాదా పడుతుంటారు. చాలా చికాకు చికాకుగా వుంటుంది. పెద్ద సంపాదన అనేది వుండదు. ఏదో పొట్టగడిస్తే గొప్ప! ఇలా ఓ ఐదేళ్ళు చాలా కష్టపడాల్సి వస్తూంది నాయనా'' అన్నారట.
అతడు కుతూహలంగా ''దాని తర్వాత ఏమవుతుంది సార్?'' అని అడిగాడు.
''దాని తర్వాత ఏముందయ్యా అలవాటైపోతుంది…'' అని నోరు చప్పరించేశాడట.
అది ప్లీడర్ లైఫ్ అంటే అని ఆయన చెప్పేవారు.
మా నాన్నగారు చాలాకాలం అడ్వకేట్‌గా వున్న తర్వాత జడ్జి కూడా అయ్యారు. ఆ పదవిమీదా జోకులు వేసేవారు – 'ఒక మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వచ్చింది. ఫలానా కేసు అని పిలిచారు. పిలిస్తే ఎవరూ రాలేదు.
ఆ కేసు తాలూకు క్లయింటు మెల్లగా వెళ్లి, ఆ మేజిస్ట్రేట్ గుమాస్తా చెవిలో ఊదాడట – 'అయ్యా! మా ప్లీడరు గారు సబ్ కోర్టులో వున్నారు. అక్కడ వాదనలు జరుగుతున్నాయి. అందుకని కొంచెం ఈ మాటికి వాయిదా తీసుకోమన్నారు.'' అని.
ఆ సంగతి గుమాస్తా వెళ్లి మేజిస్ట్రేట్‌కు చెబితే, మేజిస్ట్రేట్‌కు కోపం వచ్చింది. ప్లీడరు గురించి వాయిదా వేయడమా? అని. చాలా ఈసడింపుగా ''కోర్టు ఆవరణలో వెతకమనవయ్యా, ఎవడో చెట్టుకింద ప్లీడరు దొరుకుతాడు. పావలా యిస్తే వచ్చి వాదిస్తాడు. ఆ మాత్రం భాగ్యానికి వాయిదా ఎందుకు?'' అన్నారట.
ఈ విషయం గుమాస్తా యథావిధిగా క్లయింటుకి చెప్పడం, క్లయింటు పరుగు పరుగున వెళ్లి సబ్‌కోర్టులో వాదిస్తున్న తన ప్లీడరు చెవిలో వేయడం జరిగాయి. ఆ ప్లీడరుగారు యిది వినగానే ''ఒరేయ్, నువ్వెళ్లి ఆ జడ్జీగారికి చెప్పు – ''చెట్టుకింద మకాం పెట్టి పావలా, పరకా ఫీజు తీసుకుని వాదించే ప్లీడర్లందరూ మేజిస్ట్రేటు లయిపోయారటండీ, తక్కినవాళ్లే యీ రోజుల్లో ప్రాక్టీసు చేస్తున్నారటండి'' అని.
ప్రతిభ లేకపోయినా పరపతితో జడ్జీలై పోయిన లాయర్ల గురించి జోక్ యిది.
–
నిజానికి యీ హాస్యచతురత పిల్లల వద్ద బాగా పనికి వస్తుంది. పదహారేళ్లు దాటాక కొడుకుని స్నేహితుడిలా చూడమంటారు. అలా చూడడం మొదలుపెట్టగానే ఆ కుర్రవాడు తనకే అన్నీ తెలుసనుకుని అడ్డంగా వాదించడం మొదలుపెడతాడు. వాడు నొచ్చుకోకుండా వాడి తోక కోయడం ఎలాగో మా నాన్నగారి నుండే నేర్చుకోవాలి.
మా అన్నయ్యకీ ఆయనకీ చాలా చాలా వాదనలు జరుగుతూ వుండేవి. మా నాన్నగారు ఏం అనబోయినా, మా అన్నయ్య ''అవును, ఊఁ, నాకు తెలుసు కదా..'' అంటూండేవాడు. ఓ సారి యిద్దరి మధ్యా వాదన జరుగుతోంది. మా నాన్న ఏదో చెప్తూంటే ''అలా క్కాదు, నీకు తెలియదు. నాకంతా తెలుసు'' అంటూ వచ్చాడు అన్నయ్య.
ఉన్నట్టుండి మా నాన్నగారు ''ఒరేయ్! మన పక్కింటాయన మూడో అమ్మాయి పేరు చెప్పు'' అన్నాడు.
మా అన్నయ్యకి అర్థం కాలేదు – ఎందుకిలా అడుగుతున్నాడో! ''నాకు తెలియదు నాన్నా'' అన్నాడు.
వెంటనే ''హమ్మయ్య, ఆ అమ్మాయి పేరు సీత. నీకు తెలియని విషయం, ఒకటి నాకు తెలుసని ఒప్పుకున్నావ్ అదే చాలు.'' అన్నారు. అప్పుడు మా అన్నయ్య మొహం చూడాల్సిందే !
—
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version