ఖుశ్వంత్ సింగ్ మరణించాక అన్ని పత్రికలూ దాదాపుగా ఒకే సమాచారాన్ని యిచ్చాయి. కొందరు మాత్రమే ప్రత్యేక వ్యాసాలు రాశారు. ''సాక్షి''లో సాహిత్యం పేజీ చూసే ఖదీర్‌బాబు 'మామూలు పాఠకుడిగా మీరు ఆయన్ని ఎలా చూస్తారో పెర్శనల్ టచ్‌తో రాయండి.' అని కోరితే యీ వ్యాసం పంపాను. స్థలాభావం వలన కొంత ఎడిటింగ్‌కు గురై 22 03 2014 సంచికలో ప్రచురితమైంది. ''సాక్షి'' సౌజన్యంతో పూర్తి పాఠం యిక్కడ యిస్తున్నాను.
ఖుశ్వంత్ సింగ్ అంటేనే ఒక సంచలనం
ఖుశ్వంత్ సింగ్‌కు నివాళి అనగానే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఎవరైనా చనిపోగానే అందరూ ఆకాశానికి ఎత్తేస్తూ రాస్తారు కదా, ఖుశ్వంత్ మాత్రం ఆ వ్యక్తిలో లోపాలన్నీ ఏకరువు పెడుతూ ఎలిజీ (సంతాపరచన) రాసేవాడు. ఇవన్నీ అతను బతికుండగా రాయలేదేం అంటే 'పరువునష్టం దావా వేస్తారని భయం' అనేవాడు ఏ మాత్రం సిగ్గు లేకుండా. ఇలాటతను మరణిస్తే అతని ఎలిజీ ఎలా వుంటుంది అని వూహిస్తూ ధీరేన్ భగత్ అనే జర్నలిస్టు, కుటుంబస్నేహితుడు కొన్నేళ్ల క్రితం ఓ పత్రికలో రాశాడు. దానిలో 'ఖుశ్వంత్ సింగ్ పెద్ద రసికుడిలా పోజు పెట్టేవాడు కానీ అదంతా వుట్టిది, ఒళ్లు నొప్పులు తగ్గడానికి పెట్టుకున్న వేడినీళ్ల బాటిల్ తప్ప అతని పక్కను పంచుకోవడానికి వేరే ఎవరూ వుండేవారు కారు…' అంటూ యిలా సరదాగా రాశాడు. (అది చదివి ఖుశ్వంత్ కోపం తెచ్చుకోలేదు సరికదా మెచ్చుకున్నాడు. విధివిలాసం ఏమిటంటే – అది రాసిన కొన్నాళ్లకే 1988లో ధీరేన్ యాక్సిడెంటులో మరణించాడు. తన కంటె 42 ఏళ్లు చిన్నవాడైన ధీరేన్ ఎలిజీని ఖుశ్వంత్ అమితబాధతో రాయవలసి వచ్చింది!) ఈ రోజు ఖుశ్వంత్ నిజంగా చనిపోయాక ఎవరూ అలా రాస్తారనుకోను – విఎకె రంగారావుగారు పూనుకుంటే తప్ప! మళ్లీ ఆయనకే ఆ ధైర్యం వుంది.
ఖుశ్వంత్కు అనేక విషయాలపై లోతైన పరిజ్ఞానం వుంది. ప్రఖ్యాతుల మంచీ చెడూ రెండూ కక్షుణ్ణంగా తెలుసు. మంచి కంటె చెడుపై పాఠకులకు ఆసక్తి వుంటుందని గ్రహించి దాన్ని బయటపెట్టేవాడు, దాన్నే తన యుఎస్పి (విలక్షణ ఆకర్షణీయాంశం) చేసుకున్నాడు. అది కూడా ఏదో సంఘసంస్కర్తలా, మేధావిలా పోజు పెట్టి కాదు, ఉబుసుపోక ధోరణిలో కబుర్లు చెప్పినట్టుగా చెప్పేవాడు. అందుకే అతనిలో తప్పులు వెతికేవాళ్లు కూడా అతని ఆ సరదా శైలికి ముగ్ధులై చదువుతారు. ఎక్కణ్నుంచో దిగివచ్చినట్టు కాకుండా తనలోనూ రాగద్వేషాలున్నాయని, ఫలానా ఫలానా లోపం వుందని జరిగిందని చెప్పుకుంటూ రాయడం వలన పాఠకులతో ఆత్మీయత పెరిగింది. బాగా తెలిసున్న వ్యక్తిగా అనిపించసాగాడు.
నిజానికి ఖుశ్వంత్ ఎక్కణ్నుంచో దిగివచ్చినవాడే. అరిస్టోక్రాటిక్ కుటుంబం. న్యూ ఢిల్లీ కట్టిన కాంట్రాక్టర్లలో వాళ్ల నాన్న ఒకరు. విద్యాభ్యాసం విదేశాల్లో కూడా సాగింది. అతనికి పిల్లనిచ్చినవారు కూడా కులీనులే. ఫారిన్ సర్వీసుల్లో పనిచేసి చివరకు రచనావ్యాసంగానికి మొగ్గు చూపాడు. 'ట్రెయిన్ టు పాకిస్తాన్' నవలతో చాలా ఖ్యాతి గడించాడు. అతనికి అభిమాన విషయాల్లో దేశవిభజన, పంజాబ్, శిక్కుమతం, ఢిల్లీ, ఉర్దూ భాష, చరిత్ర, ఆంగ్లభాష, పాకిస్తాన్, సురాపానం, సుందరీమణులు.. యివి ముందువరసలో నిలుస్తాయి. తన రచనల్లో శృంగారమే కాదు, అనేక విషయాలు పచ్చిగా, ఒక్కోప్పుడు జుగుప్సాకరంగా రాసేవాడు. ఢిల్లీ నగరం అంటే వ్యామోహంతో దాని చరిత్రను గ్రంథస్తం చేస్తూనే హీరో ఒక నపుంసకుడితో సంబంధం పెట్టుకున్నట్లు రాశాడు. రోడ్డు పక్కన మలవిసర్జన చేసేవారి గురించి విపులంగా రాశాడు. టాయిలెట్ విషయాలపై వెర్రి(అబ్సెషన్)లో కమలహాసన్‌తో పోలిక కనబడుతుంది. అతని దృష్టిలో అంటరాని అంశం అంటూ సృష్టిలో లేదు.
మామూలుగా ట్రావెలాగ్లు బోరు కొడతాయి. కానీ అతను అవి కూడా ఆసక్తికరంగా రాస్తాడు. అంతర్జాతీయ సదస్సుకి వెళ్లి అక్కడ మైక్ టెస్టింగ్‌లో జరిగిన చిన్న తమాషా కూడా కవర్ చేస్తాడు. ఖుశ్వంత్ సింగ్ అనగానే చాలామందికి జోక్ బుక్సే గుర్తుకు వస్తాయి. అవన్నీ అతను సేకరించి, మెరుగులు దిద్దినవే. అతను ధరించిన అనేక టోపీల్లో అది కూడా ఒకటి. అతన్ని ఏ టోపీలో చూడాలని వుందని నన్నడిగితే – ఖుశ్వంత్ సింగ్, ద ఎడిటర్‌ను ఎంచుకుంటాను. 'ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా'ని అతను తీర్చిదిద్దిన తీరు అమోఘం. అప్పటిదాకా అది పెద్దవాళ్ల పత్రికలా, మడిగట్టుకుని వుండేది. కొంతమంది మర్యాదస్తులే చదివేవారు. 1969లో అతను రాగానే మడే కాదు, బట్టలూ విప్పేసినంత పని చేశాడు. దేని గురించైనా ఎవరైనా, ఏ స్థాయిలోనైనా వాదించగల, విభేదించగల వేదికగా తయారుచేశాడు. తనను తిడుతూ రాసిన లేఖలు కూడా ప్రచురించేవాడు. సంపాదకీయాలంటే గంభీరంగా వుంటాయని, సంపాదకులు విద్వత్తుతో దుర్నిరీక్ష్యంగా వుంటారని అనుకునే రోజుల్లో యిలాటి మాస్-ఎడిటర్ ఒక సంచలనం. వీక్లీ చదవడానికైనా ఇంగ్లీషు నేర్చుకోవాలనే తపన యువతరంలో కలిగింది. పన్నెండో క్లాసు దాకా తెలుగుమీడియంలో చదివిన నాకు కాలేజీ రోజుల్లో ఇంగ్లీషు
మ్యాగజైన్లు చదివేందుకు ప్రేరణ కలిగించినది ఖుశ్వంత్ సారథ్యంలోని వీక్లీయే! రాజకీయాలు, క్రికెట్, సినిమాలు, సినిమా, సంగీతం, కథలు, సమాజం, జోక్స్.. అది స్పృశించని అంశం వుండేది కాదు. సిద్ధాంతరీత్యా తనతో విభేదించేవారిచేత కూడా తన పత్రికలో రాయించుకునేవాడు. విరుద్ధభావాలున్న రాజకీయవేత్తలు అక్కడ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవచ్చు. ఇవన్నీ చక్కటి ఫోటోలతో, వాటి కింద యింకా చక్కని వ్యాఖ్యలతో, రేఖాచిత్రాలతో, వ్యంగ్యచిత్రాలతో అందించేవారు.
ఖుశ్వంత్ టీమ్‌లో వున్నవారి పేర్లు చూస్తే ఇంగ్లీషు జర్నలిజంలో వాసి కెక్కిన పేర్లన్నీ కనబడతాయి. అనేకమందిని ప్రోత్సహించి, గుర్తింపు తెచ్చాడు. అనేక రకాల శీర్షికలు నడిపేవాడు. భారతదేశంలోని వివిధ వర్ణస్తుల గురించి నడిపిన సీరియల్ ఎన్నదగినది. 'చిత్పవన్స్ ఆఫ్ మహారాష్ట్ర' అని తీసుకుంటే వారి మూలాలేమిటి, వారి ప్రత్యేకతలేమిటి, వారిలో ప్రసిద్ధులెవరు.. యిలా ఆరేడు పేజీల వ్యాసం వేసేవారు. ఎంత పరిశోధన, ఎంత ఓర్పు, ఎంత నేర్పు! భారతదేశం ఎంత వైవిధ్యభరితమో యిటువంటి శీర్షికల వలనే కాదు, కథల వలన కూడా తెలిసేది. వివిధ భాషల్లోంచి రచనలు ఏరి అనువాదాలు వేసేవారు. ఖుశ్వంత్కి పంజాబీ, ఉర్దూ రావడం ఆ రచయితల అదృష్టం. అతని అనువాదాల వలన వారి రచనలు ఇంగ్లీషు ద్వారా యావద్భారతీయులకు చేరేవి. అతనికి తెలుగు వస్తే ఎంత బాగుండేదో అనుకునేవాణ్ని. వీక్లీ శ్రద్ధగా చదవడం కోసం రోజుకో ఇంగ్లీషు పదం నేర్చుకునేవాణ్ని. ఎందుకంటే ఇన్ని గంభీరమైన విషయాలున్నా దాని ప్యాకింగ్‌లో ఖుశ్వంత్ సెన్సేషనలిజాన్ని నమ్ముకున్నాడు. ''సిద్దార్థ'' సినిమా వచ్చినపుడు శశి కపూర్‌తో సిమి గరేవాల్ దిగంబరంగా దిగిన దృశ్యాన్ని ముఖచిత్రంపై వేసేశాడు. వీక్లీ విడుదల కాగానే సంచలనం. ఒక్కరోజులో కాపీ
లు అయిపోయాయి. తను స్టిల్ యివ్వకపోయినా, సినిమాలోంచి దీన్ని తీసి వీక్లీకి యిచ్చినందుకు ఆమె నిర్మాతపై, వీక్లీపై, సంపాదకుడిపై కేసు పెట్టింది. నిజానికి సిమి ఖుశ్వంత్కు మేనకోడలి వరుసట. వ్యాపారమే తప్ప అతనికి వావివరసలు పట్టవు అని తిట్టిపోశారు కొందరు.
ఖుశ్వంత్ ఆధ్వర్యంలో వీక్లీ విపరీతంగా అమ్ముడుపోయింది. 65 వేల నుండి 4 లక్షల కాపీలకు చేరింది. అయినా 1977లో ప్రభుత్వం మారి జనతా పార్టీ అధికారంలోకి రాగానే కొత్త నాయకులు అతనికి బుద్ధి చెప్పదలచారు. ఒత్తిళ్లకు లొంగి 1978 జులైలో రిటైర్ కావడానికి ఒక వారం ముందుగా యాజమాన్యం ఖుశ్వంత్‌ను తీసేసింది. కాంగ్రెసేతర నాయకుల పగకు కారణం ఖుశ్వంత్ ఇందిరా గాంధీని, సంజయ్‌ను, అతని చిన్న కారు ప్రాజెక్టును వెనకేసుకుని రావడం. అతనికి నెహ్రూ కుటుంబం అంటే ఆరాధనే కాదు, పక్షపాతం కూడా. సంజయ్ తయారు చేసిన చిన్నకారు కదలకుండా మొరాయించినా, తను దానిలో ప్రయాణించినట్లు, అద్భుతంగా వున్నట్లు అసత్యాలు రాసి ప్రచారం చేశాడు. పత్రికా స్వేచ్ఛను, వ్యక్తిస్వాతంత్య్రాన్ని హరించిన ఎమర్జన్సీని సమర్థించాడు. అందుకు ఫలితం అనుభవించాడు. వీక్లీ తర్వాత ఖుశ్వంత్ సంపాదకుడిగా మళ్లీ ఆ స్థాయికి చేరలేదు. ఇందిర కుటుంబం ఆదుకోవడం వలన కాంగ్రెసు పార్టీ నడిపే ''నేషనల్ హెరాల్డ్''కి సంపాదకుడిగా, ఇందిర కోరికపై మేనకా గాంధీ స్థాపించిన ''సూర్య'' పత్రికకు కన్సల్టింగ్ ఎడిటర్‌గా వున్నాడు. జగజీవన్ రామ్ కొడుకు సురేష్, సుష్మ అనే స్నేహితురాలితో కలిసి తీసుకున్న బూతుఫోటోలు చరణ్ సింగ్
అనుచరుల సహాయంతో సంపాదించి ''సూర్య''లో, ''నేషనల్ హెరాల్డ్''లో వేసి జనతా పార్టీలో కలకలం రేపాడు. ఆ తర్వాత ''హిందూస్తాన్ టైమ్స్'' పత్రికకు, ''న్యూ ఢిల్లీ'' అనే మాసపత్రికకు కూడా సంపాదకుడిగా వున్నాడు కానీ మళ్లీ వీక్లీ అంత పేరు రాలేదు. ఎన్నో పుస్తకాలు రాశాడు, మరెన్నో పుస్తకాలకు సంపాదకుడిగా వున్నాడు, విమర్శకుడిగా, సిండికేటెడ్ కాలమిస్టుగా వున్నాడు. కానీ ఇలస్ట్రేటెడ్ వీక్లీలో నడిచినదే స్వర్ణయుగం.
ఖుశ్వంత్‌ను తీసేసిన తర్వాత వీక్లీ ప్రభ తగ్గిపోయింది. 1923 నుండి 93 దాకా 70 ఏళ్లపాటు నడిచిన ఆ పత్రిక అతను వున్నపుడే తారస్థాయికి చేరింది. వారసుడిగా వచ్చిన సంపాదకుడు తెలుగాయన – ఎ.ఎస్. రామన్. ఆయన వివాదాల జోలికి పోకూడదంటూ కర్ణాటక సంగీతం, భారతీయ కళలు, వేదాంతం అంటూ బోరు కొట్టించేశాడు. నేను వీక్లీ చదవడం మానేశాను. అప్పటికే ఖుశ్వంత్ శిష్యుడు ఎంజె అక్బర్ సారథ్యంలో ''సండే'' దూసుకుపోతోంది. దానికి ఫిరాయించేశాను. ఖుశ్వంత్ వైరుధ్యాల పుట్ట. తను అజ్ఞేయవాదిని (ఎగ్నోస్టిక్) అంటూనే సంప్రదాయ శిక్కులా వుండేవాడు. నచ్చినవాళ్లను ఉత్తిపుణ్యాన ఆకాశానికి ఎత్తేసేవాడు, నచ్చనివాళ్లను దింపేసేవాడు. అతను మెచ్చిన వాళ్లంతా మంచివాళ్లు కాదు, తిట్టినవాళ్లంతా చెడ్డవాళ్లు కారు. అతను సెక్స్ గురించి తెగ మాట్లాడేవాడు, రాసేవాడు కానీ కెపియస్ గిల్లా ఎవరినీ గిల్లిన దాఖలాలు లేవు. కనీసం ఏ మహిళా అతనిపై ఫిర్యాదు చేయలేదు. ఖుశ్వంత్లో జర్నలిస్టు కుండాల్సిన ఎథిక్స్ లేవేమో కానీ సంపాదకుడిగా అతను దిట్ట. రచయితగా కోట్లాది పాఠకులను ఆకట్టుకునే నైపుణ్యం అతనికే సొంతం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2014)