రెండు రాష్ట్రాలలో అన్ని పార్టీలు పొత్తులకై ఆరాట పడుతున్నాయి. పోరు పొక్కూ, పొత్తూ లేకుండా నిశ్చింతగా తన పని తను చేసుకుంటూ పోతున్నది వైకాపా ఒక్కటే. కిరణ్ పార్టీకీ ఆ బెంగ లేదు. దానితో చేతులు కలపడానికి వేరే పార్టీలే కాదు, నాయకులే ముందుకు రావడం లేదు. తక్కినవన్నీ బేరాలు కుదరక ఏ స్థానమూ తేల్చలేకుండా వున్నాయి. తెలంగాణ కాంగ్రెసు సిపిఐతో బహిరంగ పొత్తు, మజ్లిస్‌తో లోపాయికారీ పొత్తు కుదుర్చుకుంది. సీమాంధ్ర కాంగ్రెసు కూడా సిపిఐతో ఆ రకమైన సర్దుబాటు చేసుకుంటుందేమో యిప్పటిదాకా తెలియలేదు. చేసుకుందామనుకున్నా సిపిఐ ముందుకు వస్తుందో రాదో తెలియదు. రెండు రాష్ట్రాలలో బిజెపి ఏం చేస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గత ఎన్నికల ద్వారా బిజెపి ఏం చేసినా, ఎలాటి మానిఫెస్టో విడుదల చేసినా, ఏ హామీ యిచ్చినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ యీసారి మోదీ ప్రధాని కాబోతున్నాడని దేశమంతా హోరెత్తిపోతూండడంతో పార్టీలు కూడా బిజెపితో పొత్తు కోసం తహతహ లాడుతున్నాయి. అది చూసి బిజెపి హెచ్చులకు పోతోంది. తెలంగాణలో కాస్తో కూస్తో బలం వుందనుకోవచ్చు కానీ సీమాంధ్రలో ఏముందని అంత బెట్టు? సీమాంధ్రలో బిజెపి అధ్యకక్షుడిగా నియమింపబడిన హరిబాబుగారి గురించి నాకు ఏమీ తెలియదు. విభజన చివరి ఘట్టంలోనే ఆయన టీవీ చర్చల్లో కనబడ్డారు.
సాధారణంగా టీవీ చర్చల్లో బిజెపి నాయకులు కనబడేవారు కాదు. ఒక ఏడాదిగా వారానికి ఒకరిద్దరు కనబడుతూ వచ్చారు. వారంతా తెలంగాణ వారే. విద్యాసాగరరావుగారు స్వయంగా స్టూడియోకు రావడం తక్కువ. ఫోన్లోనే మాట్లాడేవారు. అలాటిది యిప్పుడు సీమాంధ్ర బిజెపి వారు తామూ ఒక రాజకీయశక్తి అంటూ తయారవుతూంటే వింతగా వుంది. వీళ్ల గొప్పకు కారణమేమిటి అంటే – రాజ్యసభలో వెంకయ్యనాయుడు బిల్లులో లోపాల గురించి, సీమాంధ్ర సమస్యల గురించి ప్రస్తావించారట! సరే ప్రస్తావించారు, ఆ తర్వాత ఏం చేశారు? కాంగ్రెసు వాళ్లకు తాళం వేశారు. లోకసభలో ఆ లోపభూయిష్టమైన బిల్లును నోరెత్తకుండా పాస్ చేయించిన సుష్మ కూడా బిజెపి నాయకురాలేగా! దానికేమంటారు? ఇలాటి ప్రశ్నలు అడిగితే వాళ్లకు కోపం వస్తుంది. మోదీ ప్రధానిగా వచ్చి సీమాంధ్ర సమస్యలన్నీ చిటికెలో పరిష్కరించేస్తాడని చెప్తున్నాంగా అంటారు. మోదీ ఆజ్ఞ లేకపోతే బిజెపిలో యిప్పుడు చీమైనా కుట్టదని ప్రతీతిగా వుంది. ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, జశ్వంత్ సింగ్.. యిలాటి మోదీ వ్యతిరేకులందరికీ శిక్ష పడుతోంది. ఇంతటి సర్వశక్తిమంతుడైన మోదీ 'తెలంగాణ బిల్లు పాస్ కాకుండా చూడండి, మనం వచ్చాక న్యాయబద్ధంగా విభజన చేద్దాం' అని తన అనుచరులకు చెప్పలేకపోయాడా? ఓ పక్కనుండి అన్యాయాన్ని సాగనిస్తూ పైకి తల్లి హత్య అంటూ డైలాగులు చెపితే ఏం లాభం?
ఈ విషయంలో సీమాంధ్ర బిజెపి నాయకులకున్న యిబ్బంది తెలంగాణ బిజెపికి లేదు. తెలంగాణలో వారి స్టాండ్ మొదటినుండి క్లియర్‌గా వుంది. మోదీ తెలంగాణకు సహకరించాడు, అతన్ని ప్రధానిని చేద్దాం అని చెప్పి ఓట్లు అర్థించవచ్చు. బిజెపి నాయకులందరూ తెలంగాణలోనే వున్నారు. ఉన్న రెండు (మూడు) ఎసెంబ్లీ సీట్లు తెలంగాణలోనే వున్నాయి. అందువలన సీమాంధ్రను తిడుతూ ప్రచారం చేసినా వాళ్లకు వచ్చే కష్టం లేదు. సీమాంధ్ర బిజెపి నాయకులు మొత్తుకుంటారన్న కాస్త జంకు వుంటుందంతే. ఇన్నాళ్లూ బిజెపి తరఫున ఏదైనా ఉద్యమాలు, నిరసనలు, ప్రదర్శనలు జరిగాయంటే అవన్నీ తెలంగాణలోనే జరిగాయి. సీమాంధ్రలో ఉండీఉడిగీ ఎప్పుడైనా జరిగాయంతే. చివర్లో భద్రాచలం డివిజన్ గురించి కాస్త హంగు చేశారు, ఏదీ సాధించలేకపోయారు. వీళ్ల గురించి తెలంగాణ బిజెపి యూనిట్ తన కటింగ్ ఎడ్జ్ ఎందుకు పోగొట్టుకుంటుంది? 'తెలంగాణ పునర్నిర్మాణానికి నిధులు కావాలి, కేంద్రంలో అధికారంలో రాబోయే పార్టీకి తెలంగాణలో ఓ నాలుగు సీట్లు వస్తేనే అది విదిలిస్తుంది. అధికారంలోకి వచ్చేది బిజెపియే. తెరాస ఏం చేయగలదు? ఒత్తిడి తేగలదు. నీ ముక్కు ఎక్కడుందంటే మెడచుట్టూ తిప్పి చూపించినట్టు తెరాస ఓటు వేయనేల? వాళ్లు బిజెపిని అర్థించి తేనేల?
అంతకంటె మాకే డైరక్టుగా ఓటేయండి, మీకు నిధులు లోటు రాకుండా చూస్తాం' అని ప్రచారం చేసుకుంటారు. బిజెపికి యీ సావకాశం వుంది కాబట్టే తెరాస బిజెపితో పొత్తుకై లోపాయికారీగా ప్రయత్నిస్తోందనే పుకారు వినబడుతోంది.
అయితే బిజెపి, తెరాస రెండు పార్టీలలోనూ అత్యుత్సాహవంతులు 'పొత్తులు పెట్టుకుంటే సగం సీట్లు అడుగుతారు. ఒంటరిగా పోరాడి తడాఖా చూపిద్దాం' అంటున్నారు. కానీ బిజెపికి, తెరాసకు ఒకే ప్రాంతంలో బలం వుంది. అందుకే యిద్దరూ ఒకరితో ఒకరు గతంలో తలపడ్డారు. ఒకరికి ఒక ప్రాంతంలోనో, వర్గంలోనో బలం వుండి, మరొకరికి వేరే ప్రాంతంలో, వర్గంలో బలం వుంటే అప్పుడు ఆ పొత్తు ఫలిస్తుంది. ఇప్పుడు బిజెపి-తెరాస పొత్తు చర్చల్లో యిద్దరూ కరీంనగర్, వరంగల్ అడుగుతారు. ఖమ్మం, హైదరాబాదు ఎదుటివాళ్లకు ఆఫర్ చేస్తారు. అందువలన పొత్తు కుదరడం అంత యీజీ ఏమీ కాదు. పైగా కెసియార్ కాంగ్రెసుకు చుక్కలు చూపించిన వైనం బిజెపి కేంద్రనాయకత్వం కూడా గమనించి వుంటుంది. మన గతి ఏమవుతుందో అన్న భయంతో చంద్రబాబు వంటి సీజన్‌డ్ రాజకీయవేత్తతో పొత్తు కుదిరితే బాగుండునని చూస్తోంది. కానీ బిజెపి స్థానిక నాయకత్వానికి టిడిపితో పొత్తు సుతరామూ యిష్టం లేదు. అందువలన టిడిపికి అతి తక్కువ సీట్లు ఆఫర్ చేసి, వాళ్ల చేతనే 'నో' అనిపిద్దామని చూస్తున్నారు. 'గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే మీకంటె మాకే ఎక్కువ పార్టీనిర్మాణం వుంది కదా' అని చంద్రబాబు అంటే, 'నేల కేసి కాదు, ఆకాశం కేసి చూడండి, సోషల్ వెబ్‌సైట్ల నిండా మోదీ జపమే, అది గుర్తెరిగి బేరాలాడండి' అంటున్నారు వెంకయ్యనాయుడు. టిడిపి-బిజెపి పొత్తు ఏమైనా కుదిరితే సీమాంధ్రలో కుదరాలి తప్ప తెలంగాణలో కుదురుతుందని, కుదిరినా సవ్యంగా సాగుతుందని అనుకోలేం.
ఇలా ఆలోచిస్తూ పోతే బిజెపి తెలంగాణలో ఒంటరి పోరు చేయబోతోందని తోస్తుంది. అలాటప్పుడు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వాళ్లు చెప్పాలి కదా. ప్రధాని అభ్యర్థిగా మోదీని చూపడమే కాదు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా తమ ముఖ్యమంత్రి అభ్యర్థులెవరో బిజెపి ముందే చెప్పేసింది. తెలంగాణకు వచ్చేవరకు యిప్పటివరకు మౌనంగా వున్నారు. ఇప్పుడు బిసిల హవా నడుస్తోంది కాబట్టి ఏ బండారు దత్తాత్రేయగారినో ముఖ్యమంత్రి పదవి ఎనౌన్సు చేయవచ్చు కదా. ఎందుకు చేయలేదు?
కాంగ్రెసు పార్టీ తెలంగాణ పిసిసి అధ్యకక్షుడిగా పొన్నాలను పెట్టింది. అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి కావచ్చు అనే సూచన వుంది. తెరాసకు వెలమలకు ప్రాధాన్యత యిచ్చే పార్టీగా గుర్తింపు వుంది కాబట్టి కాంగ్రెసులో తమకు ప్రాధాన్యత వుంటుందని రెడ్లు ఆశ పెట్టుకున్నారు. వైకాపా వచ్చాక కొందరు అటు మళ్లారు. వైకాపా సమైక్యవిధానం వలన వెనక్కి వచ్చేసి కాంగ్రెసులోనే కొనసాగుతూ ఆశలు పెంచుకున్నారు. తీరా చూస్తే కాంగ్రెసు తెలంగాణలో, సీమాంధ్రలో బిసిలనే ప్రొజెక్టు చేస్తోంది. జానారెడ్డిని పక్కన పడేసింది. రెడ్లకు కోపం రాకుండా బాలన్సింగ్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంటు చేసింది. ఈ పదవి సీమాంధ్రలో లేదు కానీ యిక్కడ పెట్టినది రెడ్ల కోసమే అనుకోవాలి. తెలంగాణ బిసిలు చాలాకాలంగా టిడిపిని అంటిపెట్టుకుని వున్నారు. ఇప్పుడు టిడిపి బలహీనపడింది కాబట్టి వారిని తనవైపు తిప్పుకోవడానికి కాంగ్రెసు యిదంతా చేస్తోందని గ్రహించి చంద్రబాబు యింకా పై ఎత్తు వేశారు. మా పార్టీ గెలిస్తే బిసియే ముఖ్యమంత్రి అని ప్రకటించేసి, బిసి నాయకుడు కృష్ణయ్యను అర్జంటుగా పార్టీలో చేర్చేసుకుని, ఆయన్ని కాబోయే ముఖ్యమంత్రిగా చూపిస్తూ, తెలంగాణ కమిటీకి ఎర్రబెల్లిని కాకుండా రమణను నేతగా పెట్టి.. బిసి- టిడిపిని విడరాని జంటగా చూపిస్తున్నారు. ఇక తెరాస వద్దకు వస్తే వాళ్లు బిసి కార్డు నమ్ముకోలేదు. దళిత ముఖ్యమంత్రి, ముస్లిం ఉపముఖ్యమంత్రి అంటున్నారు. తక్కినవాళ్లంత దూకుడుగా వీళ్లు ప్రచారం చేయడం లేదు ఎందుకంటే వాళ్లంతా గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం బాపతుగా ప్రకటిస్తున్నారు. అధికారానికి చేరువలో వున్న తెరాసవారు అంత తెగువ చూపలేరు. ఫైనల్‌గా పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు అంటూ కెసియారో, కెసియార్ కుటుంబసభ్యులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోలేదు కాబట్టి దళిత సిఎం గురించి మరీ ప్రచారం చేయకుండా చూసుకుంటున్నారు.
తక్కిన పార్టీలన్నీ బిసిలను, దళితులను ముందుకు పెడుతూ వాళ్ల ఓట్లు ఆకర్షించడానికి చూస్తూ వుంటే యీ విషయంలో బిజెపి ఎందుకు వెనకబడి వుంది? పైన చెప్పినట్లు దత్తాత్రేయను అభ్యర్థిగా ప్రకటించకపోవడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం కాంగ్రెసుపై అలిగివున్న రెడ్లను ఆకర్షించడానికా? ప్రస్తుత నాయకుల్లో కిషన్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, కొత్తగా వచ్చిన జనార్దనరెడ్డి మంచి పదవుల్లోనే వున్నారు. జనార్దనరెడ్డి టిడిపి నుండి నాయకులను లాక్కుని వస్తారనుకుంటే ఆ పని చేయలేకపోయారు. ఇప్పటిదాకా పార్టీతో ఏ సంబంధం లేని కృష్ణయ్యను కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో టిడిపిలోని రెడ్లు హతాశులై వుంటారు. ఇప్పుడు బిజెపి నాయకులు కులం కార్డు వుపయోగించి టిడిపి, కాంగ్రెసు పార్టీల నుండి అసంతృప్త రెడ్లను తీసుకుని వస్తారా? అలా తీసుకుని రావాలంటే ఫలానా వ్యక్తి సిఎం అని ముందే చెప్పకూడదు. ఎవరికైనా, ఏ కులానికైనా ఛాన్సుంది అనే ఆశ కల్పించాలి. అందుకే బిజెపి తన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించడం లేదని అనుకోవాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2014)