మోహన మకరందం
అనుభవాలూ – జ్ఞాపకాలూ
డా|| మోహన్ కందా
నిజాయితీకి నిర్వచనం…?
ఆ మధ్య నా తోటి ఐయేయస్ ఆఫీసరు అవినీతి గురించి ఉపన్యాసమిస్తూ గొంతు చించుకుంటున్నాడు. నేను అతన్ని మధ్యలో ఆపి ''మీ ఆవిడకు యివాళ ఫోన్ చేశావా?'' అన్నాను. ఏమిటీ అప్రస్తుత ప్రసంగం అని విసుక్కోబోయినా పట్టుబట్టాను.
చివరకి ''చేశానులే.. యింతకీ..'' అని ఏదో చెప్పబోయాడు.
''ఏ ఫోన్ నుండి చేశావ్?'' మళ్లీ అడిగాను.
''ఇది'' అని టేబుల్ మీద ఫోన్ చూపించి మళ్లీ ఏదో చెప్పబోతూ వుంటే అడ్డుపడి ''అది గవర్నమెంట్ ఫోన్ కదా, స్వంత పనికి ఎలా ఉపయోగించావ్?'' అని అడిగాను.
అతను అవాక్కైపోయి ''ఇంతకీ ఏమిటంటావ్?'' అన్నాడు.
''రూల్సు పెరిగిన కొద్దీ యీ ధర్మసందేహాలు పెరుగుతాయి. నేను యింటికోసం కారు తెప్పిస్తే నా పర్శనల్ పని అని బుక్ చేసేవాణ్ని. అది ఎప్పుడో వారానికో, పదిరోజులకో కాబట్టి. హైదరాబాద్‌లో ఒకాయన యిల్లు ఆఫీసుకి పదిమైళ్ల దూరం. రోజూ ఆఫీసు కారు వుపయోగించక తప్పేది కాదు. ఇంటికెళుతున్నానని ఎలా రాస్తాడు? అందుకని రోజూ ఆ పక్కనే వున్న ఓ ఆఫీసుకి డిస్కషన్‌కి వెళ్లేవాడు. ఈయన తప్పనిసరి డిస్కషన్లు కాదు కానీ అవతలివాడికి తల వాచిపోయేది. అందుకే కాస్త వెసులుబాటు యివ్వాలి. ఈ మధ్య కాస్త రిలాక్సు చేశారు కదా. అలాటివి యింకా వస్తే ఈ మీమాంసలుండవు'' అన్నాను.
–
అవినీతి అంటే ఏమిటో మనం సులభంగా కనుక్కోవచ్చు. కానీ నిజాయితీని నిర్వచించడం కష్టమని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ నిర్వచనం ఏమిటో ఖచ్చితంగా తెలియకపోవడం వలన కొందరు దాన్ని పట్టించుకోరు, మరి కొందరు దాన్ని అతిగా పట్టించుకుంటారు. ఎంతవరకు పట్టించుకోవాలి, ఎంతవరకూ వదిలేయాలి, ఏ పరిస్థితుల్లో వదిలేయాలి.. యిలాటివి ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.
మహాభాగవతంలో ఓ కథ వుంది. ఒకడు మరొకడికి భూమి అమ్మాడు. కొన్నవాడు దాన్ని తవ్వుతూంటే లంకెబిందెలు బయటపడ్డాయి. వాడు అవి పట్టుకుని వచ్చి అమ్మినవాడితో 'ఇవి నీవే తీసుకో' అన్నాడు. 'అబ్బే, నేను నీకు అమ్మేశాను కాబట్టి అవి నీకే చెందుతాయి' అని వీడు వాదించాడు. 'నేను భూమినే కొన్నాను కానీ లోపలున్న నిధినిక్షేపాల్ని కాదు కదా' అన్నాడు వాడు. (ఇలాటి గొడవలు వచ్చాకనే దస్తావేజుల్లో 'వాపీకూపతటాకములతో.., నిధినిక్షేపములతో..' అని రాయడం మొదలుపెట్టారనుకుంటా) ఇద్దరూ 'నీదంటే నీదే' అనుకుని రాజు వద్దకు వెళ్లారు.
మీరే రాజైతే ఏం చేస్తారు చెప్పండి. ఇద్దరూ నిజాయితీపరులే. ఒకవేళ నిధి దొరికినవాడు తనే వుంచేసుకుంటే వాడు నిజాయితీ పరుడు కాడనగలమా? అలాగే అమ్మినవాడు కొన్నవాడి ప్రతిపాదన ఆమోదించి నిధిని తీసుకుంటే వాడికి నిజాయితీ లేదని అనగలమా? ఇలాటి ధర్మసూక్ష్మం మా ఐయేయస్‌లలో అడుగడుగునా ఎదురవుతుంది. వాటి గురించి చెప్పేముందు ఈ కథకు ముగింపు చెప్పేస్తా.
ఈ తగాదాకు రాజుగారు కూడా తీర్పు చెప్పలేక వాయిదా వేశాడు. అంతిమనిర్ణయం చెపుదామని పిలిచే లోపున కలికాలం వచ్చింది. ఇద్దరి మనస్తత్వాలలోను మార్పు వచ్చింది. ఇద్దరూ నాదంటే నాది అనసాగారు. ఈ సారి వాదనా కరక్టే. ఒప్పందంలో భూమిలోని గుప్తధనాల ప్రస్తావన లేదు కదా! కలిప్రభావం ప్రజలపై ఎలా పడుతుందో చూపడానికి యీ కథను వాడుకున్నారు కానీ మరోలా ఆలోచిస్తే ఏది నిజాయితీ, ఏది కాదు అనే మీమాంసను యీ కథ మనముందు ఉంచుతోంది కదా.
అలాగే ఇంకో కథ వుంది. పొలాల మధ్య వెళుతుంటే ఒకతనికి దాహం వేసింది. పక్కనే చెఱుకు తోట కనబడింది. ఓ చెఱుకుగడ పీక్కుని తిని, దాహం తీర్చుకుని కాస్త డబ్బు అక్కడ పెట్టి వెళ్లిపోబోయాడు. అంతలో రైతు వచ్చాడు. అదేమిటన్నాడు. ఇతను చెప్పినది విని, ఆ చెఱుకుగడ అమ్మకానికి పెట్టింది కాదు, నువ్వు దొంగతనం చేయలేదు, దాహం తీర్చుకోవడానికి ఒక్కటంటే ఒక్కటే తిన్నావ్. మరో రెండు కోసుకుని ఇంటికి పట్టుకుపోలేదు, నువ్వు అతిథి వంటి వాడివి. నీ దగ్గర డబ్బు పుచ్చుకుంటే పాపం, పట్టుకుపో అన్నాడు. లేదు లేదు నువ్వు తీసుకోకపోతే నీకు నేను ఋణపడిపోతాను, తీసుకోవలసినదే అని పట్టుబట్టాడు బాటసారి. ఇద్దరూ కొట్టుకున్నారు. మీరే మధ్యవర్తి అయితే ఏం చెప్తారు? ఇటువంటి వాటినే డైలమాలంటారు.
–
ఒంగోలు సబ్‌కలెక్టర్‌గా వున్నప్పుడు (1971-73) ఇంకొల్లు అనే గ్రామానికి ఇన్‌స్పెక్షన్‌కి వెళితే భోజనం టైముకి ఆ ఊళ్లో వుండాల్సి వచ్చింది. అక్కడ హోటళ్లు అవీ ఏమీ వుండవు కదా, ఏం చేయాలో తెలియలేదు. ఆ వూరి కరణంగారు వచ్చి 'మా యింటికి వచ్చి భోజనం చేయండి' అని ఆహ్వానించారు.
'అబ్బే వద్దండి' అని నేను మొహమాటపడ్డాను. నా అవస్థ చూసి ''పోన్లెండి! మా యింటికి వచ్చి తింటే బాగుండదనుకుంటే మీరున్న గ్రామ చావిడికి క్యారేజీలో పంపిస్తాను లెండి'' అన్నాడు. నేను మరిన్ని మెలికలు తిరిగిపోతూ ''అబ్బెబ్బె ఇలాటివి నా కలవాటు లేదండి!'' అంటూ ఏదేదో చెప్పాను.
ఆయన మనసు గాయపడినట్టుంది, అతి నిష్కర్షగా కొన్ని మాటలన్నాడు – ''అయ్యా! అడ్డమైన వాళ్లందరికి మేం భోజనాలు పెడతాం. ఏదో పెద్దవారు, మాకు కావల్సినవారు, మా పనిమీద మా వూరు వచ్చారు. మనిషన్నాక ఆకలి వేస్తుంది. అన్నంతినే వేళ కాబట్టి ఏదో కాస్త ఎంగిలిపడమన్నాం. మా కున్న దానిలోనే పెడతాం తప్ప మీ గురించి విశేషంగా పిండివంటలు అవీ చేయించి పెట్టం. ఈ నాలుగు మెతుకులు తిన్నంత మాత్రాన మీరు మాకేదో ఒరగబెడతారని మేం అనుకోవడం లేదు. అభోజనంగా వుందామనుకుంటే మీ యిష్టం. మాకు కలిగే నష్టం ఏమీ లేదు'' అని.
కటువుగా చెప్పినా ఆ మాటల్లో వాస్తవం వుంది. 'ఈ మాత్రానికి మీరు లంచగొండి అయిపోరు, మేము లంచాలు తినిపించేవాళ్లం అయిపోము' అని చెప్పినట్టుంది. ఆపద్ధర్మానికి యిస్తున్న ఆతిథ్యం కాదనడం 'నేను నిజాయితీపరుణ్నొహో' అని చాటుకోవడానికే అనిపించింది. కాస్త మజ్జిగాన్నం తింటే నిజాయితీపరుణ్ని కాకుండా పోతానా? ఆయన మాటలకు తల కొట్ట్టేసినట్టు అనిపించినా, నోరు మూసుకున్నాను. నోరు కట్టేసుకున్నాను కూడా. సరే అన్నం పెట్టండి అని కూడా అనలేదు. ఎందుకంటే అంతా అయ్యాక అప్పుడు భోంచేస్తే ఏమి బాగుంటుంది అనుకున్నాను. ఆ పూటకు పస్తే.
ఇలాటి పస్తులు శంకరన్‌గారితో అయితే చాలానే వస్తాయి. ఇటీవలే దివంగతులైన ఎస్.ఆర్. శంకరన్‌గారు మహానుభావులు. అత్యంత సమర్థులైన అధికారి. మా అందరికి గురుతుల్యుడు, రోల్ మోడల్. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి. ముఖ్యంగా నెల్లూరుజిల్లాలో ఆంధ్రరాష్టంలోనూ, దేశంలోనూ కూడా, పేదవాళ్లు, బడుగువర్గానికి చెందినవాళ్లూ, వెనకబడినతరగతి వాళ్లకి ఆయన దేవుడు. నెల్లూరుజిల్లాలో అయితే ఇప్పటిదాకా కూడా ఆయన ఫోటో పూజగదిలో పెట్టుకుని పూజచేసుకునే వాళ్లు చాలామంది వుంటారని చెప్పుకుంటుంటారు. ఇటీవలి కాలంలో పద్మభూషణ్ ఇస్తామని ఆఫర్ చేస్తే వద్దు అన్నాయన ఒక్కరే అనుకుంటా. ఆ పద్మభూషణ్ కూడా ఆయన ఏదో సాంకేతిక పరిజ్ఞానంలో గొప్పవాడనో లేకపోతే అణుశాస్త్రంలో పరిశోధన చేసాడనో లేకపోతే విద్య, వ్యవసాయం, పబ్లిక్ హెల్త్ యిలాటి రంగంలో ప్రత్యేక కృషికి అని కాదు. ఒక మాటలో చెప్పాలంటే సేవ ! ప్రజలకు సేవ చేశారని యివ్వబోయారు. ఈయన తీసుకోలేదు.
ఆయన నిజాయితీ ఎటువంటిదంటే – ఎవరి దగ్గరా డబ్బులు మాట అటువుంచండి, కనీసం భోజనమైనా తినకూడదు. అది కూడా కరప్షనే అయినట్టు. ఆయన తినేవాడుకాదు, ఇంకొకర్ని తిననిచ్చేవాడు కాదు. అది వినడానికి సబబుగానే అనిపించినా, ఆయనతో బాటు తిరిగి టైముకి తినకపోవడం వలన అవస్థలు పడినవాళ్లు వున్నారని చెప్పుకొంటూ వుంటారు. శంకరన్ గారిది కొంచెం 'అతి' అనుకున్నవాళ్లూ వున్నారు. పనిచేసే వాతావరణంలో యిటువంటి అంశాలు తమకు తామే బ్యాలన్స్ అవుతాయని, వాటి మానాన వాటిని వదిలిపెట్టేస్తే చాలని, మనం వాటిలో చొరబడి మరీ చేయనక్కరలేదనీ వారి అభిప్రాయం. కానీ ఆయన పట్టుదలలు ఆయనవి. అటువంటి మహానుభావులలో ఎన్నో గొప్పగుణాల మధ్య యిటువంటి లక్షణాలు వుండడం కూడా ఒకలా బాలన్సింగ్ ఫ్యాక్టరే! అవే వాళ్లని మనమధ్య తిరుగాడే మనుష్యుల్లా చేస్తాయి.
అయితే ఆయనలో ఈ 'నిజాయితీతత్వం' మరీ ఎక్కువ. అది చాలా యిబ్బంది పెట్టేది. నేను గుంటూరు జిల్లా కలెక్టరుగా వున్నప్పుడు (1977) అయన ఓ సారి వచ్చారు. నాకు తెలిసి ఈయనతో తిరగడమంటే మనం ఆకలికి మాడిపోతాం. మనమేకాదు ఆయనతో వున్న అంధరూ మాడిపోతారు. అంత గట్టిగా ఎందుకంటున్నానంటే అప్పట్లో ఆయన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ. ఆయనతో బాటు ఒక నలభై మంది వుండేవాళ్లం. అందరం మలమల మాడాం.
జిల్లాలలో ఇటువంటి వాటికి కామన్ గుడ్‌ఫండ్ అనో ఏదో పెడతారు. నిజం చెప్పాలంటే నాక్కూడా అది పెద్దగా తెలిసేదికాదు. ఎందుకంటే పోనుపోను లోకంపోకడ తెలిసివచ్చి నాకు స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి కానీ అప్పట్లో నేనూ మరీ శంకరన్‌గారి లెవెల్లో కాకపోయినా చాదస్తంగానే వుండేవాణ్ని. ఇంకొల్లు వ్యవహారం చెప్పానుగా….
క్యాంప్ కెళితే డ్రైవర్‌కి, ప్యూన్‌కూడా జేబులోంచి డబ్బులిచ్చి 'భోజనం చేసి రండి' అని చెప్పి పంపేవాణ్ని. అలా అయితే వాళ్లు తిండికి యింకోళ్ల మీద వాలకుండా వుంటారు. మనవరకూ మనం తినకుండా కడుపు మాడ్చుకుని వుండవచ్చు. లేదా ఇంటినుంచి బిస్కట్లు తెచ్చుకోవచ్చు. వాళ్లేం చేస్తారు? బిస్కట్లు తెచ్చుకునే అలవాటు వాళ్లకుండదు. అవి తిన్నా కడుపు నిండినట్టుండదు. అందుకని మనం డబ్బులిచ్చి పంపాలి. మనం డబ్బులిచ్చినా అక్కడ హోటళ్లు లేకపోతే…? అటువంటి విపత్కర పరిస్థితులలో మనం చూసీ చూడనట్టు వుండాలి. వాళ్ల తంటాలు వాళ్లు పడతారు. ఏం తిన్నారు? ఎక్కడ తిన్నారు? అంటూ మనం లోతుగా తవ్వి వాళ్లను యిరకాటంలో పెట్టకూడదని నా ఫిలాసఫీ.
–
ఏదైనా ఊరెళితే సబార్డినేట్ ద్వారా భోజనం తెప్పించుకోవడం చాలా తప్పని నా ఉద్దేశం. ఓ సారి అది సాగని పరిస్థితి వచ్చింది. ఒంగోలు సబ్ కలక్టరుగా వున్న రోజుల్లోనే ఆంధ్రా ఉద్యమం వచ్చింది. చీరాలలో శాంతిభద్రతల పరిస్థితి బాగా లేక చాలా రోజులు అక్కడే వుండిపోయాను. మా ఆవిడ రోజూ ఫైల్స్‌తో బాటు భోజనం క్యారేజీ ట్రెయిన్‌లో పంపించేది.
ఓ రోజు ఒంగోలులో బంద్. ట్రెయినే రాలేదు. ఫైళ్ల మాట సరే భోజనం కూడా రాలేదు. చీరాలలో కూడా బంద్. ఏ హోటలూ లేదు. షాపూ లేదు. బిస్కట్లో, బిళ్లలో కొందామన్నా కిళ్లీకొట్టు కూడా లేదు. ఉన్నదేమిట్రా అంటే కరకరమని నమిలేసే ఆకలి! పరిస్థితిని ఎదుర్కొని తీరాల్సిన నిస్సహాయత!
అప్పుడు నా దగ్గరకి నరసయ్య నాయుడు అని చీరాల తాసిల్దారు వచ్చారు. చాలా నిజాయితీపరుడు, నిర్మొగమాటి. ఆ స్థాయిలో అటువంటివాళ్లు వుండడం చాలా అరుదన్నమాట. ఓ చట్టం రావడానికి యీయన కారణభూతుడని మేం సరదాగా చెప్పుకునేవాళ్లం. ప్రజాధనాన్ని తన ప్రయోజనాలకు వాడుకున్నవారిని దండించే చట్టం – ఆర్ ఎమ్ ఆర్, రెవెన్యూ మాల్‌వర్సేషన్‌్ రెగ్యులేషన్ – అది. అది వచ్చేముందు యీయన ఒక గ్రామాధికారి తప్పుచేశాడని తెలిసి వీధిలో వెంటాడి వెంటాడి చావచితక కొట్టేసాడు. అదేమిటయ్యా అంటే 'ప్రజల డబ్బు తినేశాడండీ వెధవ' అన్నాడు. ఓ చట్టం అంటూ పెట్టకపోతే యీయన యిలా డైరక్టు మెథడ్‌లో డీల్ చేసేట్టున్నాడని భయపడి పై అధికారులు చట్టం తెచ్చారని జోక్!
ఆయన ఆవేళ ఏదో చుట్టపుచూపుగా వచ్చినట్టు వచ్చి, ''ఎలా వున్నారు సార్'' అంటూ పలకరించి అవీ ఇవీ కబుర్లు చెప్పి, ఆ తర్వాత పాయింటులోకి వచ్చేశాడు. ''సర్ మీకు అభ్యంతరం లేకపోతే మా యింటి నుంచి భోజనం పంపిస్తానండి.'' అన్నాడు.
నేనేం చేయాలి? వెళ్లి తింటే నా నిజాయితీకి విఘాతం కలుగుతుందా? కాదు పొమ్మంటే నిలబడుతుందా?
పంపమని అడగడానికి నోరు రాలేదు. వద్దని అనడానికి సాహసం చాలలేదు. ఇంకొల్లు కరణం కళ్లముందు కదలాడుతున్నాడు. ఏమీ అనకుండా ఊరుకున్నాను. ఆయన భోజనం పంపించేశాడు. నేను తినేశాను!
—
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version