మోహన : ప్రభుత్వానికి ‘గిట్టని’ చేపల వ్యాపారం

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement ప్రభుత్వానికి 'గిట్టని' చేపల వ్యాపారం ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లి ఎంతో కష్టపడి జాలరులు చేపలు తెస్తే, దళారులు చాలా తక్కువ ధరకు కొనేసేవారు.…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

ప్రభుత్వానికి 'గిట్టని' చేపల వ్యాపారం

ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లి ఎంతో కష్టపడి జాలరులు చేపలు తెస్తే, దళారులు చాలా తక్కువ ధరకు కొనేసేవారు.

ఆ ధరకు అమ్మకపోతే కుళ్లిపోతాయన్న భయంతో జాలరులు అమ్మి నష్టపోయేవారు.

దళారుల బారి నుండి రక్షించడానికి మేం రేవులోనే ఫిష్‌ డిపో ఏర్పరచాం.

జాగ్రత్తగా కాస్టింగ్‌ లెక్కలు కట్టి, కేజీ చేపలకు యింత అని ఒక కనిష్ట ధరను ఫిక్స్‌ చేశాం. 

జాలర్లకు కష్టానికి తగిన ఫలం దక్కేట్టు చేశాం.

కానీ ఆర్నెల్ల తర్వాత ఫైనాన్సు డిపార్ట్‌మెంట్‌ ఆ డిపోను మూసేయమంది. 

xxxxxx

మనలాగే ఆలోచించని ఎదుటివాళ్ల మీద మనకు సాధారణంగా చికాకు వస్తుంది. అది క్లయింట్‌ కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి కావచ్చు వేరే డిపార్టుమెంటు కావచ్చు, భార్య కూడా కావచ్చు. ''మై ఫెయిర్‌ లేడీ'' సినిమాలో ప్రొఫెసర్‌ హిగ్గిన్స్‌ ఆశ్చర్యపడినట్లు ''వై కాన్‌ట్‌ ఎ ఉమన్‌ బి లైక్‌ ఎ మ్యాన్‌?'' అని ఆశ్చర్యపడే సందర్భాలూ వుంటాయి. 

ఇలా అనిపించుకునేవాళ్లలో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంటు వాళ్లు ముందువరసలో వుంటారు. వాళ్లు పాపం ఎప్పుడూ ఎలాగైనా సరే కాస్త డబ్బు అదా చేద్దామనే ప్రయత్నంలో వుంటారు. పాపం మరి వాళ్ల  బాధ్యతలే అవి, వాళ్ళు నిర్వర్తించవలసిన విధులే అవి! ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా దానికి ఆర్థికంగా తనంతట తానే నిలదొక్కుకోగల సత్తా వుందా లేదా అని చూస్తారు. 

1980-81లో నేను ఫిషరీస్‌ కార్పోరేషన్‌లో వైస్‌-చైర్మన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ గా వుండగా జాలర్ల పరిస్థితి దీనంగా వుండేది. సముద్రం నుండి జాలరులు చేపలు పట్టి తేగానే ఓడరేవులో దళారులు వచ్చి కూర్చుంటారు. వీళ్ల దగ్గర్నుంచి చేపలు కొనుక్కుని పట్టుకుని వెళతారు. ఈ దళారులు చాలా అన్యాయమైన మనుష్యులు. వాళ్లలో వాళ్లు కుమ్మక్కయి చాలా తక్కువ రేటుకి, గట్టిగా మాట్లాడాలంటే అధ్వాన్నమైన రేటుకి, చేపలు కొనేసేవారు. వాళ్లు చెప్పిన రేటుకి అమ్మక తప్పని పరిస్థితి జాలర్లది. ఎందుకంటే చేపలు నిలవవుండేవి కావు. నిలవ వుంచాలంటే ఐస్‌ ప్లాంట్‌ లాటిదేదో వుండాలి. లేదా వాటిని ప్రాసెస్‌ చేసి, డబ్బాలో నిలువచేసి వుంచి, వేల్యూ యాడ్‌ చేసి అమ్మే పద్ధతి ఏదో వుండాలి. అవేవీ లేనప్పుడు అప్పటికప్పుడు అమ్మాలి. వాళ్లు చెప్పిన రేటుకి అమ్ముకోకపోతే కుళ్లబెట్టుకోవాలి. 

జాలర్లను ఈ దుర్మార్గాల నుండి, యీ దోపిడినుండి తప్పించి వాళ్ల శ్రమకు తగ్గ ఫలితం యిప్పించాలన్న ధ్యేయంతో నేనూ, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా వుండే కె.వి.రావు గారు కలిసి ఓ ఐడియా వేశాం. ఐస్‌ ప్లాంట్‌ కట్టడం, సీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యిలాటి వాటికి అనుమతులు తెచ్చుకోవడం, కట్టడం ఓ పట్టాన తెమిలే పనులు కావు. సులభంగా, త్వరగా అమలు చేసేలా పథకం ఆలోచించాలి. అందుకని రేవులోనే ఓ చిన్న కొట్టు పెడదాం అనుకున్నాం. 

అంటే ఫలానా చేపలకైతే ఇంత, ఫలానా చేపలకైతే ఇంత అని ఒక ఫ్ల్లోర్‌ ప్రైస్‌ (కనిష్ట ధర) పెట్టి అమ్ముదాం అనుకున్నాం. మరి గవర్నమెంట్‌లో ఇటువంటి నియమనిబంధనలన్నీ పారదర్శకంగా, ఓపెన్‌గా జరిగాల్సిన అవసరముంది కదా. రోజుకు ఒక వెయ్యికెేజీలు అమ్మాలి. కేజీకి ఒక రూపాయి చొప్పున మార్జిన్‌ పెట్టుకుంటే రోజుకు వెయ్యి కేజీలు అమ్ముడుపోతే రోజుకి వెయ్యిరూపాయలు మిగులుతుంది. అంటే నెలకి ముఫ్పై వేలు. ఆ ఆదాయం అక్కడి సరంజామాకి, జీతాలకి, భత్యాలకి తర్వాత అక్కడ వరకు వచ్చే ట్రాన్స్‌పోర్ట్‌కి యిలా వేటికి వాటికి శాస్త్రీయంగా కాస్టింగ్‌ వేసి ధర ఫిక్స్‌ చేశాం. ఓ శుభముహూర్తాన ఫిష్‌ డిపో తెరిచాం.

 మేము తెరవగానే ఏమి జరిగిందో తెలుసా? దళారులు ఎలర్ట్‌ అయిపోయారు. వాళ్లు మాలా శాస్త్రీయమైన లెక్కలు అవీ వేయలేదు. 'ప్రభుత్వం వారు ఎంత పెట్టి కొంటారో దాని కంటె ఒక రూపాయి ఎక్కువిచ్చి మేమే కొంటాం' అన్నారు. ఎందుకంటే వాళ్లు యిన్నాళ్లూ దీనిమీదే బతుకుతున్నారు. ఈ వ్యాపారం ఆగిపోతే వాళ్లకు భుక్తికి వేరే మార్గం చూసుకోవాలి. అందుకని మా కంటె ఓ రూపాయి ఎక్కువ పెట్టవలసినదే! ఆ అదనపు ఖర్చు భారం వినియోగదారుడిపై వేయగలరో లేదో అది వేరే విషయం. ఇక్కడనుండి సరుకు తీసుకోకపోతే మాత్రం వ్యాపారం మూసుకోవలసినదే. ఆ మాత్రమేనా ఎక్కువ యివ్వకపోతే జాలరులు ప్రభుత్వానికి అమ్మేస్తారు. ఇదీ వాళ్ల లాజిక్‌. అందువలన జాలరులు రాగానే వాళ్లు మాకంటె ఎక్కువ ధర యివ్వజూపి సరుకంతా కొనేసేవారు. జాలర్లను మా షాపుదాకా రానిచ్చేవారే కాదు.

ఆర్నెల్లు యిలా జరిగింది. నాకూ, మా కె.వి.రావుకి పట్టలేనంత ఆనందం. 'జాలర్లకు న్యాయం జరుగుతోంది. గట్టిగా మాట్లాడితే న్యాయం కంటె ఎక్కువే జరుగుతోంది. ఎందుకంటే మేం ఫిక్స్‌ చేసినది న్యాయమైన ధర. దళారులు న్యాయమైనదాని కంటె కేజీకి రూపాయి చొప్పున అదనంగా యిస్తున్నారు. దోపిడీ ఆగిపోవడమే కాదు, శ్రమకు మించిన ఫలితం దొరుకుతోంది. ఈ అదనపు ఆదాయం వలన జాలర్ల స్థితిగతులు బాగుపడతాయి. వాళ్ల గుడిసెల్లో దీపం వెలుగుతుంది, పొయ్యి మండుతుంది. వాళ్ల పిల్లలు బళ్లకు వెళతారు. అతి కొద్దికాలంలోనే వాళ్ల జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరిస్తాయి. ఉజ్జ్వలంగా వెలుగుతాయి' అనుకుంటూ.

అంతలోనే ఫైనాన్సు డిపార్డ్‌మెంట్‌ నుండి ఆడిట్‌ అబ్జక్షన్‌ వచ్చింది. 'ఏమయ్యా, మీరు రేవులో డిపో అంటూ పెట్టారు.  దానికి నెలకు యింత అని ఖర్చు పెడుతున్నారు. ఆర్నెల్లనుంచీ చూస్తున్నాం. ఒక్క చేప కొన్నదీ లేదు, ఒక్క చేప అమ్మినదీ లేదు. వ్యాపారం చేస్తున్నామంటారు. వ్యాపారం అన్నాక సరుకు కొనాలి, అమ్మాలి. మధ్యలో లాభం రావాలి. ఖర్చులు ఎత్తిపోవాలి. అసలు సరుకే రాకుండా మీరు చేసే వ్యాపారం ఏమిటో అర్థం కాకుండా వుంది. అక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కంటూ ఖర్చులు పెట్టి ఏ బిజినెస్సూ చేయకుండా డబ్బు ఎలా వ్యర్థం చేస్తారు? వెంటనే మూసేయండి' అని. 

వాళ్ల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో వాళ్లదీ కరెక్టే. అబ్జక్షన్‌ వచ్చింది కాబట్టి మూసేశాం.

ఇక్కడ మనం పరిగణించవలసిన అంశం ఒకటుంది – సోషల్‌ కాస్ట్‌ బెనిఫిట్‌ థియరీ అని. జాలర్ల శ్రమ దోపిడీ ఆగిపోయి వాళ్ల ఆర్థిక స్థితిగతులు పెరగడం వలన జరిగిన మార్పులు, దానివలన పెరిగిన ఆదాయం, లేదా మిగిలిన ఖర్చులు – వీటిని లెక్కలోకి తీసుకోవాలి.  

మేము ఆ డిపో పెట్టలేదనుకోండి. జాలర్లకు ఆదాయం పెరగదు. వాళ్లు దారిద్య్రరేఖకు దిగువనే వుండిపోతారు. వాళ్లకు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంలో తక్కువ రేటుకి యివ్వాలి. ఇళ్లు కట్టుకునేందుకు డబ్బు లేదు కాబట్టి ఏదో పథకంలో యిళ్లు కట్టి యివ్వాలి. వాళ్లకు మందులకు డబ్బు లేదు కాబట్టి, రోగాలు అవీ వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితవైద్యం చేయించాలి. వాళ్ల ద్వారా యితరులకు వ్యాధులు సంక్రమిస్తే వాటిని అరికట్టడానికి మరింత ప్రజాధనం వెచ్చించాలి. దారిద్య్రం కారణంగా వాళ్ల పిల్లలు సంఘవ్యతిరేకశక్తులుగా మారితే వాళ్లను అదుపు చేయడానికి శాంతిభద్రతల రీత్యా చాలా ఖర్చు పెట్టాలి.

కేవలం మేము డిపో పెట్టినంత మాత్రాన యివన్నీ యిప్పటికిప్పుడే మిగిలిపోయాయి అని అనను. మా డిపో కారణంగా వాళ్ల స్థితిగతులు మెరుగుపడితే ఈ ఖర్చులు ఏదో ఒక మేరకు తగ్గుతాయా లేదా చెప్పండి. వాళ్ల శ్రమకు తగ్గ ఫలితం లభించి, వాళ్లు ఆర్థికంగా మెరుగుపడితే తమ అవసరాలకోసం ప్రభుత్వంపై ఆధారపడడం తగ్గిపోయి, డబ్బు ఆదా అవుతుంది కదా. ఏదైనా పథకాన్ని మూల్యాంకనం (ఇవాల్యుయేట్‌) చేసినపుడు యిటువంటి అనేక అంశాలు లెక్కలోకి తీసుకునే సమగ్రమైన దృక్పథం (హోలిస్టిక్‌ వ్యూ) అలవర్చుకోవాలి ప్రభుత్వం. కానీ శాఖల పరంగా చూసినపుడు యిది జరగదు. ఎవరికి వారు వారి దృక్కోణంలో చూస్తాం. 

నగర కార్పోరేషన్‌ రోడ్లు వెడల్పు చేస్తాం, దాని వల్ల ట్రాఫిక్‌ తగ్గుతుంది, పెట్రోలు ఆదా అవుతుంది అనుకుంటుంది. అయితే అలా వెడల్పు చేయడంలో ఓ చోట రైల్వేవారి స్థలం వచ్చిందనుకోండి. పని ఆగిపోతుంది. రైల్వేవారి దృక్పథంలో మన విలువైన స్థలాన్ని మనం కాపాడుకోవాలి. కార్పోరేషన్‌వారు మార్కెట్‌ రేటు ప్రకారం నష్టపరిహారం యివ్వరు. అందుకని ఒప్పుకోకూడదు అంటారు. అక్కణ్నుంచి అనుమతి రాదు. నిర్ణయానికి ఏళ్లూ, పూళ్లూ పడతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్నో విషయాల్లో తగాదాలుంటాయి. అలాటప్పుడు శాఖల మధ్య దృక్కోణవైరుధ్యం వుండడంలో ఆశ్చర్యరం లేదు. 

ప్రతీదీ వయబిలిటీ కోణంలోనే చూస్తూ కాస్ట్‌-రిటర్న్‌ బేసిస్‌లోనే తూకం వేస్తూ పోతే అందరూ ఫైనాన్సువాళ్లలాగానే తయారవుతారు. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, రైల్వేస్‌, ఆయిల్‌ అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కమీషన్‌, పుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యకలాపాలను కూడా యీ విధమైన ప్రైవేట్‌ సెక్టర్‌ ఎప్రోచ్‌లో చూడడం దురదృష్టకరం. ప్రభుత్వంలో వుంటే కొన్ని చిక్కులు తప్పవు. ఎందుకంటే ప్రతిపనికి మేము జస్టిఫికేషన్‌ యివ్వాలి. ఎందుకు చేస్తున్నామో చెప్పి ఒప్పించాలి. దానికి గాను ప్లానింగ్‌, బడ్జెటింగ్‌ తప్పనిసరి. రెస్పాన్సిబిలిటీ విషయం నిర్ధారణ అయ్యాక ఎకౌంటబిలిటీ కూడా ఫిక్స్‌ చేసుకుని అప్పుడు పథకం తయారుచేయాలి. 

ప్రతీ చిన్న విషయానికీ యింతింత ప్రాధాన్యం యిచ్చే ఈ క్రమంలో ఏమవుతుందో తెలుసా? పెద్దవిషయం మరుగున పడుతుంది. దీన్నే ఇంగ్లీషువాడు 'మిస్సింగ్‌ ది వుడ్‌ ఫర్‌ ద ట్రీస్‌' అన్నాడు. అంటే కళ్లముందున్న ఒక్క చెట్టు మీదే విపరీతమైన దృష్టి పెట్టడంతో అలాటి అనేక చెట్లున్న అడవి మన కంటికి ఆనకుండా పోతుందన్నమాట. చెట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని నుండే ఉదాహరణ చెప్తాను. పేదలకు యిళ్లు కట్టించే ఓ పథకం రూపొందించాం అనుకోండి. పక్కనే బోల్డు చెట్లు కనబడుతున్నాయి. ఎక్కణ్నుంచో సిమెంటు తెప్పించే బదులు, యిక్కడే యీ చెట్లనే పడగొట్టేసి, ఆ కలపతో చెక్క యిళ్లు కట్టించేసి యిచ్చేస్తే పని సులభం, పెద్ద ఖర్చూ కాదు అని సూచిస్తే ఫైనాన్సు డిపార్టుమెంటు వారికి ముద్దొస్తాం – ఎంత డబ్బు మిగిల్చావురా నాయనా అని.

కానీ భావితరాల గురించి ఆలోచించండి, గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి ఆలోచించండి. అలా చెట్లు కొట్టేయడం  సమంజసమా? పర్యావరణంలో చేసిన మార్పు వలన వానలు పడకో, వరదలు వచ్చో ఎంత ఆస్తినష్టం, ఎంత ప్రాణనష్టం జరగవచ్చు? దాన్ని లెక్కలోకి వేసుకోనక్కరలేదా? ఈ చెట్లను మళ్లీ నాటించడానికి, పెంచడానికి, సంరక్షించడానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి దాన్ని పరిగణనలోకి తీసుకోనక్కరలేదా?

భావితరాలకై మనం యిప్పుడే చేయవలసిన పనులు కొన్ని వుంటాయి. వాటిని తలపెట్టకపోతే చాలా డబ్బు ఆదా అవుతుంది. కానీ భవిష్యత్తులో దానివలన ఎంత ఖర్చవుతుంది? అని కూడా ఆలోచించాలి. 'కాస్ట్‌ ఆఫ్‌  డూయింగ్‌ నథింగ్‌' అని ఒకటుంది. ఏమీ చేయకపోతే ఖర్చవుతుందా? అని ఆశ్చర్యపడకండి. అవుతుంది. ఇప్పుడు ఖర్చు పెట్టకుండా మిగిల్చినదానికి ఎన్నో వందల రెట్లు భవిష్యత్తులో ఖర్చు పెట్టవలసి వుంటుంది. 

ప్రయివేటు సెక్టార్‌లో కూడా కాస్ట్‌ కటింగ్‌ పేరుతో యీ రోజుల్లో చాలా అవివేకమైన, దూరదృష్టి రహితమైన పనులు జరుగుతున్నాయి. ఈ ఉదాహరణలు వాళ్లకీ ఉపయోగపడతాయనే యింత విపులంగా చెప్పాను.

మా ఫిష్‌ డిపో కథకు ముగింపు చెప్పాలేమోగా – ఫైనాన్స్‌ అభ్యంతరాల మేరకు మేము డిపో మూసేశాం. వెంటనే దళారులు వాళ్ల ధరలు తగ్గించేశారు. జాలర్లు ఎప్పటిలాగా దోపిడీకి గురవుతూనే పోయారు. ప్రభుత్వం వాళ్లకు తెల్లకార్డు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ యిళ్లు – యిత్యాది పథకాలద్వారా ఆనాటి మా డిపో కంటె ఎక్కువ ఖర్చే పెడుతోంది.  

కొసమెరుపు – ఫైనాన్సు డిపార్టుమెంటు ధోరణి ఒక్కోప్పుడు శ్రుతి మించుతుంది అనడానికి ఓ ఉదాహరణ – మా ఆపరేషన్‌ థియేటర్‌కి ఎయిర్‌ కండిషనర్‌ కావాలి అని ఒకసారి ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌నుంచి ఒక ప్రపోజల్‌ వస్తే ఆరోగ్యశాఖ వారు ఫైనాన్సు వారికి రాశారు. ఫైనాన్సువారు ప్రశ్న లేవనెత్తారు. – ఏమి ఎయిర్‌ కూలర్‌ వాడుకోకూడదా అని ! ఇది చదివి ఆరోగ్యశాఖవారు, ఆసుపత్రివారు ఎంత పళ్లు నూరుకుని వుంటారో వూహించవచ్చు.     

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version