మోహన మకరందం: లేనిపోని రిస్కెందుకు బ్రదర్‌…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement లేనిపోని రిస్కెందుకు బ్రదర్‌… 'లేనిపోని రిస్కెందుకు బ్రదర్‌..' అనేది మనకు తరచుగా తగిలే ఉచిత సలహా! ఏమీ చేయకుండా, యథాతథస్థితిని కొనసాగించడం మేలు అనే…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

లేనిపోని రిస్కెందుకు బ్రదర్‌…

'లేనిపోని రిస్కెందుకు బ్రదర్‌..' అనేది మనకు తరచుగా తగిలే ఉచిత సలహా! ఏమీ చేయకుండా, యథాతథస్థితిని కొనసాగించడం మేలు అనే ఫిలాసఫీని మన మనసుల్లో చొప్పించే అందమైన పదబంధం యిది. 

ప్రభుత్వయంత్రాంగమే కాదు, చాలాకాలంగా పనిచేసే సంస్థలన్నిటిలోనూ ఒక పద్ధతి అలవాటుగా, ఆనవాయితీగా వచ్చేస్తుంది. ఒక రూలుని ప్రవేశపెట్టినపుడు వుపయోగించిన తర్కానికి క్రమేపీ కాలదోషం పట్టినా, అది ప్రస్తుత పరిస్థితికి అన్వయించ నక్కరలేకపోయినా దానినే పట్టుకుని వేళ్లాడుతూ ఆ కాలంచెల్లిన రూల్సుని రూళ్లకర్రలా వాడుకుంటారు ఉద్యోగులు. కొందరు మితవాదులు దాన్ని ఆధారంగా చేసుకుని గీతలు గీచుకుని ఆ పరిధిలోనే తచ్చాడుతూ వుంటారు. కొందరు అతివాదులు దాన్ని యితరులను దడిపించడానికి దండంగా వాడతారు. ఎవరైనా కొత్తవాడు వచ్చి 'ఇలాగే ఎందుకు చేయాలి? మరోలా ఎందుకు చేసి చూడకూడదు..?' అని వాదించబోతే వారిస్తూ చెప్పే మాట 'ఊరుకున్నంత ఉత్తమం లేదు, కొత్తగా ఏదో చేయబోయి… లేనిపోని రిస్కెందుకు..?' 

అంటే చేయకపోతే రిస్కుండదా? ప్రభుత్వోద్యోగాలూ అవీ పక్కన పడేయండి. ఒక సాధారణ వ్యక్తిగా చూసినా ఏమీ చేయకుండా వుంటే ఏ రిస్కూ లేకుండా హాయిగా బతకవచ్చా? అసలు రిస్కులేని జీవితం వుందా? అడుగడుగునా పలకరించే ఆత్మబంధువు అదే కదా! పొద్దుట్నించీ జరిగేవి ఓ సారి నా మనసులో సినిమారీలులా తిప్పి చూసుకున్నాను –

xxxxxx

ఇదివరకు నా దగ్గర మామూలు బై-ఫోకల్‌ కళ్లజోడు వుండేది. సైన్సు ప్రగతిఫలాలు అందుకోవడంలో నేనెక్కడ వెనకపడిపోతానో అని బాధపడిపోయిన ఓ మీడియా మిత్రుడు ఓ బలహీనక్షణంలో నా చేత ఓ పాటి పెద్దమొత్తాన్నే ఖర్చు చేయించి 'ప్రోగ్రెసివ్‌ లెన్సు'ల కళ్లజోడు కొనిపించాడు. అవి వేసుకున్నాక సుఖపడిపోయాను అని చెప్పలేను కానీ అవి అలవాటు పడ్డాక అవి లేకుండా యిబ్బంది పడడం మొదలెట్టాను. లేచీ లేవగానే వాటిని తగిలించుకోకపోతే అదోలా వుంటుంది. తెలతెలవారే సమయంలో చీకట్లు యింకా విచ్చుకోకముందే వాటికోసం తచ్చాడడం ఎంత రిస్కో వూహించండి. ఏ స్టూలో తన్నేస్తే కాలివేళ్లు పచ్చడవడమే కాదు. 'అర్ధరాత్రి' మద్దెలదరువుతో లేపేసి, బంగారం లాటి నిద్ర చెడగొట్టి తనకు కాస్త నడుం వాల్చే భాగ్యం కూడా దక్కనివ్వనందుకు మా ఆవిడ లేచి నన్ను ఏమంటుందో చెప్పాలంటారా?

రెండో రిస్కు హజామత్‌కి సంబంధించినది. చిన్నప్పటినుండి నేను షేవ్‌ చేసుకున్నప్పుడల్లా మా యింట్లో అందరూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని చూసేవారు, వీడు ఆ రేజర్‌తో ఎక్కడ పీక కోసేసుకుంటాడా? అని. (క్లోజ్‌ షేవ్‌ విత్‌ డెత్‌ అనే మాట ఎందుకు పుట్టిందో నిన్ను చూశాకే అర్థమైంది అనేవాడు అన్నయ్య) ఆ సమయంలో పోలీసులు యింట్లో చొరబడితే ఆత్మహత్యానేరం కింద నన్ను అరెస్టు చేయవచ్చని, అటువంటి సందర్భం వచ్చినపుడు నన్ను బయటకు తీసుకురావడానికి న్యాయవాదవృత్తిలో తన దీర్ఘానుభవం ఏ మూలకూ రాకపోవచ్చునని మా నాన్నగారు హెచ్చరిస్తూ వుండేవారు.

'కొత్త', 'సరికొత్త', 'ఆధునీకరించిన సాంకేతిక పరిజ్ఞానంతో', 'రివైజ్‌డ్‌ అండ్‌ టెక్నాలజికల్లీ అవ్డాన్స్‌డ్‌' యిత్యాది విశేషణాలతో తడవతడవకు మార్కెట్‌ను ముంచెత్తే రేజర్లు వచ్చిపడ్డాయి. దేన్నీ వదలకుండా అన్నిటితోనూ ప్రయోగాలు చేస్తూనే వున్నాను. పరిస్థితిలో మార్పు రాలేదు. రోజూ మృత్యువు గడపదాకా వెళ్లి వస్తున్నానని మా ఆవిడ అంటుంది. పోలీసులు వస్తే వాదించడానికి నాన్నగారూ లేరు. వెళ్లిపోయారు. నా 'డైలీ బ్రష్‌ విత్‌ డేంజర్‌' కొనసాగుతోంది. ఈ రిస్కు మాటేమిటి?

xxxxxx

నా సాహసభరిత జీవితంలో తరువాతి ఘట్టానికి తయారవుతున్నపుడు గులేబకావళి పుష్పం తెచ్చే ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కోవడానికి జంకని రాకుమారుడి స్ఫూర్తిని గుర్తు చేసుకుని నన్ను నేనే ప్రేరేపించుకుంటాను.  ఇంతటి దూరాలోచనలు చేయని కొందరు ఆ ఘట్టాన్ని అతి సింపుల్‌గా 'కాఫీ పెట్టుకోవడం' అనేస్తారు. ఇంకోళ్లకు పురమాయించినపుడు 'కాఫీ తగలేయడం' అని కూడా అంటారు. ఆ తగలేయడం దగ్గరే నాకు సమస్య ఎదురవుతుంది. గ్యాస్‌ స్టవ్‌ మీద తగలేయడమా, లేక మైక్రో అవన్‌లోనా? అన్నది తక్షణం తేల్చుకోవలసిన సమస్య. దేనిలోనైనా వేళ్లు చుర్రుమనక తప్పదు. గ్యాస్‌ స్టవ్‌ అయితే అగ్గిపుల్ల వెలిగించినపుడు కాలుతుంది. అవన్‌లో నైతే గిన్నె బయటకు జాగ్రత్తగా తీయబోయినపుడు కాలుతుంది. దెయ్యాలుండే ఊడలమర్రి చెట్టు ఎక్కుదామా? రాక్షసుడు నిద్రిస్తున్న గుహలోకి దూరదామా? అని రాకుమారుడు ఆలోచించినంత దీర్ఘంగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. 

గ్యాస్‌- అవన్‌ల మధ్య ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఒక అనుబంధ చర్య మాత్రం తప్పదు. అది పంచదారకు సంబంధించినది. డబ్బాలోంచి చెంచాతో వేసుకున్నపుడు ఆ పంచదార – తస్సదియ్య, ఎవడు కనిపెట్టాడో కానీ – ఒలికిపోక మానదు. నేలమీద పడ్డాక ఆ రేణువులు అటూ యిటూ దొర్లిపోయి నేలంతా పరుచుకోక మానదు. మా ఆవిడ లేచేలోపున ఆధారాలన్నీ మటుమాయం చేయాలి కాబట్టి తడిగుడ్డ పెట్టి నేలంతా తుడవాలి, ఆ తడి ఆరేందుకు పొడిగుడ్డ పెట్టీ తుడవాలి. ఈ లోపున కాఫీ చల్లారి పోయే రిస్కు ఎలాగూ వుంది.

ఆవిరి పట్టుకోవడం నా నిత్యచర్యలలో ఓ భాగం. పాతకాలంలో ఓ గిన్నెడు నీళ్లు, ఓ గ్యాస్‌ స్టవ్‌, ఓ పెద్ద తువ్వాలు వుంటే యీ పని దిగ్విజయంగా ముగిసిపోయేది. ఈ ఐటీ, బిటీ యుగంలో జీవితాన్ని సుఖమయం, వేగవంతం చేసే ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడకపోతే నామోషీ. అందువలన ఆవిరి పట్టే ఎలక్ట్రిక్‌ వేపరైజర్‌ బయటకు తీయడం తప్పనిసరి. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఎక్కడుందో వెతికే అవసరం పడకపోతే యీ ఘట్టం మాత్రం  పాపం ఆ అవకాశాన్ని సమకూరుస్తుంది. ఇక అది ఆఫర్‌ చేసే రిస్కుల రేంజ్‌ చాలా విస్తృతమైనది. ఉన్నట్టుండి గుప్పుగుప్పున మొహాన్న కొట్టే వేడి వేడి ఆవిరి తుంపర్లతో మొహం కాల్చుకోవడం (ఫస్ట్‌ డిగ్రీ బర్న్‌స్‌) నుండి అసలు అక్కడిదాకా రాకుండానే ప్లగ్‌ను సాకెట్‌లో పెట్టగానే షాక్‌ కొట్టి మాడిపోవడం వరకు ఎన్నో రిస్కులున్నాయి.

xxxxx

ఇది షాక్‌ కొట్టకపోయినా బాత్‌రూమ్‌లో గీజర్‌ కొట్టవచ్చు. షవర్‌లో వచ్చే నీళ్లు ఒక్కసారిగా వేడెక్కిపోయి వీపు చుర్రుమనిపించవచ్చు. ఒక్కోప్పుడు వేణ్నీళ్లు కాదు కదా చన్నీళ్లు కూడా రాకుండా షవర్‌ వట్టిపోవచ్చు. అప్పుడు సబ్బుపట్టిన శరీరంతోనే యింట్లోవాళ్లకు దర్శనం యివ్వరావలసి వచ్చు. నీళ్లు ధారాళంగా వచ్చిన సందర్భాలలో కూడా షాంపూతో ప్రమాదం వుండనే వుంది. జుట్టులోకి చుండ్రు పట్టనివ్వమని గ్యారంటీ (!?!) యిచ్చే షాంపూ కంపెనీ షాంపూ కళ్లలోకి వెళితే మాత్రం చూపుకి అస్సలు గ్యారంటీ యివ్వం అంటుంది. మరి దాని సంగతి ఏమిటి?

గొంతు శుభ్రం చేసుకోవడానికి పుక్కిలించే లోషన్‌ వలన ఇరవై నిమిషాల దాకా ఏదీ తినకూడదు కదా, అందువలన మా ఆవిడ చేసిచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌ నేను కారులో తింటూ వుంటాను. ఆఫీసుకి వెళ్లి కుదురుగా కూర్చుని తినవచ్చు కదా అంటారు మీరు. కానీ యిలా ముగించేసి మిగిల్చిన టైములో ఆఫీసులో యాంటీ-రూమ్‌లోని కంప్యూటర్‌లో పేకాడుకుంటూ నా స్కోర్‌ నేనే అధిగమిస్తూ ఆనందించవచ్చు కదా అంటాను నేను. ఈ గబగబా తినడంలో రిస్కు లేదా చెప్పండి. బ్రేక్‌ఫాస్టులో ఘనపదార్థాలుంటే గొంతుకడ్డం పడే రిస్కుంది. ద్రవాలు, కారప్పొడులు వున్నప్పుడు బట్టలమీద పడే రిస్కుంది. అదేమిటో గాని యీ ద్రవాలూ, పొడులూ వున్నాయి చూశారూ, పాంటు మీద చొక్కామీద పడరాని చోట్ల పడడంలోనూ, నీటితో కడగబోతే మరింత చిక్కగా, గాఢంగా, వర్ణమయంగా వ్యాప్తి చెందడంలోనూ ఒకదానితో మరొకటి పోటీ పడతాయి.

ఇవన్నీ ఆఫీసుకి వెళ్లేవరకూ జరిగేవి. ఇక ఆఫీసుపనిలో వుండే రిస్కుల సంగతి చెప్పనే అక్కరలేదు. మన స్వయంకృతాల మాట సరేసరి – సీనియర్లు చేసిన దానికి, జూనియర్లు చేయనిదానికి మన పేరు చెడిపోవచ్చు, ప్రమోషన్లు తప్పిపోవచ్చు, బదిలీలు తప్పకపోవచ్చు. కోర్టులు, రాజకీయనేతలు, సిబిఐవారు, ఎక్కవుటెంట్‌ జనరల్‌ ఆఫీసువారు – వీరందరూ విడివిడిగా గాని, జమిలిగా గాని మనపై నిప్పులు కక్కవచ్చు, వెంటాడవచ్చు, వేటాడవచ్చు. 

xxxxxx

పగలిలా గడిచిపోయిందికదా ఫర్వాలేదు అనుకోవడానికి లేదు. రాత్రిపూట మరిన్ని ప్రమాదాలు పొంచి వున్నాయి. కరంటు పోయినప్పుడు ఎవరో వచ్చి తలుపు కొట్టవచ్చు. తలుపు తీసే అడావుడిలో మెట్లమీద నుండి కాలు జారవచ్చు, నిద్రపోతే కష్టాలు ఖతమ్‌ అనుకోవడానికీ లేదు. నిద్ర పట్టక అటూ యిటూ దొర్లి అవస్త పడవచ్చు. పట్టినా అటూ యిటూ దొర్లి మంచం మీద నుండి కిందికి దొర్లి పడవచ్చు. 

ఇక సిగరెట్టు, మద్యం – వీటిలో మొదటిది కాని, రెండోది గాని, రెండూ గాని తాగితే వచ్చే కష్టనష్టాల గురించి, ఆరోగ్యానికి కలిగే రిస్కుల గురించి సలహాలిచ్చే వారందరి గురించి పట్ల ప్రగాఢ సానుభూతితో అవి మరింత సేవించవలసి వస్తోంది. రిస్కులు మరింత పెరుగుతున్నాయి.

xxxxx

రిస్కుల గురించి చెబుతూన్న సందర్భంలో – ఐయేయస్‌లకు ఆఫీసులో కూర్చుని ఫైళ్లపై సంతకాలు పెట్టడమే పని అని, అందువలన  'ఆక్యుపేషనల్‌ హజార్డ్‌స్‌' (వృత్తిపరమైన ఆపదలు) వుండవనుకుంటారు కొందరు. కలక్టరుగా వుండగా అనేక ఫంక్షన్‌లకు పిలుస్తారు. కొబ్బరికాయలు కొట్టమంటారు.  అది మొదటి దెబ్బకు పగలకపోతే వాళ్లు అపశకునం అనుకుంటారన్న భయంతో ఊపిరి బిగబెట్టి గట్టిగా కొడతాం. ఒక్కోప్పుడు ఠాప్‌ మని పగిలి కొబ్బరిముక్క ఎగిరి వచ్చి కళ్లజోడుని పగలకొట్టవచ్చు. కొబ్బరినీళ్లు ప్యాంటుపై చిందవచ్చు. వేళ్లు నలగవచ్చు. శంకుస్థాపన చేయమన్నపుడు తాపీ చేతికిచ్చి ఇటుకల మీద సిమెంటు పోయమంటారు. అది పల్చగా వుంటే జారి మన సూటు మీద, బూటుమీదో పడవచ్చు. వనమహోత్సవాలలో మొక్కలు పాతినప్పుడు, బోరు కొట్టవలసి వచ్చినపుడు, స్విచ్చి వేసి మోటార్‌ ఆన్‌ చేసినపుడు రకరకాల ప్రమాదాలకు ఆస్కారాలున్నాయి. అంతెందుకు అతి సాధారణమైన రిబ్బన్‌ కటింగ్‌ టైములో కూడా కత్తెర పదునుగా లేకపోతే అభాసుపాలు కాకతప్పదు. మరీ పదునుగా వుంటే వేళ్లు కోసుకునే ప్రమాదం వుంది. ఈ సందర్భాల్లో బాధ పెట్టేది గాయం కాదు, ఆ సమయంలో కూడా చిరునవ్వు చిందించవలసి రావడం !

ఏతావాతా తేలేదేమిటంటే రిస్కు లేని క్షణం లేదు. రిస్కుకి భయపడి మానేస్తూంటే జీవించడమే మానేసినట్టవుతుంది. కొత్తగా ఆలోచిస్తే, కొత్త దారి తొక్కితే కొంప మునిగిపోతుందని భయపడడం అర్థరహితం. కొలంబస్‌ కొత్త దారి పట్టడం చేతనే మనకు అమెరికా దక్కింది. వాస్కోడిగామా కొత్తదారి పట్టడం బట్టే ఇంగ్లండువారికి ఇండియా దక్కింది. ఇకపై ఎవరైనా మీతో 'లేనిపోని రిస్కెందుకు బ్రదర్‌..' అంటే అసలు రిస్కు నీలాటి ఛాందసులతోనే వుంది అని చెప్పండి.

తా.క. భార్యాభర్తల పోట్లాట సమయంలో చోటు చేసుకునే భౌతికపరమైన, మానసికపరమైన, భావోద్వేగ పరమైన రిస్కుల గురించి చెప్పడం జరగలేదని వివాహితులు గమనించే వుంటారు. అవివాహితులు, సున్నితమనస్కులు ఐన పాఠకులకు మనసు నొప్పించే రిస్కు తీసుకోవడానికి వెఱచి మాత్రం కాదు. వీటికి వెఱచి వాళ్లు పెళ్లి చేసుకునేందుకు వెనకాడి ఎక్కడ సుఖపడిపోతారోనన్న దుగ్ధ చేత మాత్రమే ఆ వివరాలను వెల్లడించడం లేదని మనవి.

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version