మోహన: రాష్ట్రపతి – రాకుంటే చిక్కు… వస్తే రిస్కు!

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement రాష్ట్రపతి – రాకుంటే చిక్కు… వస్తే రిస్కు! ఒకలా చెప్పాలంటే – రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మగారు 'దగా చేయబోయా'రు! ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్‌…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

రాష్ట్రపతి – రాకుంటే చిక్కు… వస్తే రిస్కు!

ఒకలా చెప్పాలంటే – రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మగారు 'దగా చేయబోయా'రు!

ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌లో జాయింట్‌ సెక్రటరీగా వున్న నేను ప్రగతి మైదాన్‌లో అగ్రి ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి ఆయన చేత ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేశాను. వస్తానని మాట యిచ్చారు.

కార్యక్రమానికి కాస్సేపు ముందు రాష్ట్రపతి కార్యాలయంలో స్టాఫ్‌ కనబడితే పలకరించా. ''రాష్ట్రపతిగారా? ఇవాళా? ఇక్కడేం కార్యక్రమం లేదే!'' అన్నాడతను. గుండెల్లో రాయి పడింది.

ఢిల్లీ పోలీసు వ్యవస్థకి, రాష్ట్రపతి భవన్‌కి మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చి ఆయన రావటం లేదని అర్థమైంది. 

మా శాఖ మంత్రివర్యులు, సెక్రటరీలు అందరూ వచ్చినపుడు రాష్ట్రపతి రాకపోతే ఎలా అని బెంగ పెట్టుకున్నాను.

ఏదోలా సర్దుబాటు చేయగా – చెప్పిన సమయానికి విచ్చేస్తారని సమాచారం వచ్చింది.

అంతలోనే – 'అమ్మో, చెప్పిన సమయానికి వచ్చేస్తే ఎలా?' అని మళ్లీ బెంగ పెట్టుకున్నాను.

'వడ్లగింజలో 'బియ్యపుగింజ'!

xxxxx

చెప్పిన సమయానికి సరిగ్గా హాజరుగా వుండడం చెప్పిన మాట నిలబెట్టుకోవడమంత గొప్పది. దాని వలన ఎంతో సమయం కలిసి వస్తుంది. లేకపోతే అవతలివాళ్ల కోసం మనం గంటల తరబడి వేచి  వుండడమో, లేక మనకోసం అవతలివాళ్లు పనులు మానుకుని వేచి వుండడమో జరుగుతూ వుంటుంది. మాకు  మా సర్వీసంతా రాజకీయ నాయకుల చుట్టూనే పరిభ్రమిస్తుంది. రాజకీయ నాయకులకు, పంక్చువాలిటీకి చుక్కెదురు. ఎందుకంటే వాళ్ల టైము వాళ్ల చేతిలో వుండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వేళాపాళా లేకుండా వూడిపడతారు. అప్పటికప్పుడు తమ గోడు వినమని వెంటపడతారు. కాదనలేని మొహమాటం నాయకుడిది. ఆ మొహమాటాల వలన ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలన్నీ ఆలస్యమై పోతున్నాయనే ఘోష మాది. అందువలన రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా వుండే సభలు, సమావేశాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిజానికి ఇండియాలో పంక్చువాలిటీ పాటించేవాళ్లని కాస్త వింతగా చూస్తారు. వాళ్లంటే భయపడతారు. ఆ బెదురులోనే కొన్ని దారుణమైన పొరబాట్లు చేస్తారు. నేను విన్న ఒక ఉదంతం చెప్తాను –

జనరల్‌ కరియప్ప ఆర్మీ జనరల్‌గా వుండే రోజుల్లో ఆర్మీలో తన కంటె జూనియర్‌ అయిన తిమ్మయ్య గారిని యింటికి డిన్నర్‌కు పిలిచారు. వాళ్లిద్దరూ బంధువులు కూడా. కరియప్పగారు క్రమశిక్షణకు మారుపేరు. ఆయన చెప్పిన సమయానికి ఒక్క సెకను కూడా అటూ యిటూ కాకుండా కరక్టుగా వెళ్లి ఆయన మెప్పు పొందాలని తిమ్మయ్య గారు నిశ్చయించుకున్నారు. ఓ వారం ముందే కసరత్తు మొదలుపెట్టారు. తను డ్రస్‌ చేసుకోవడం ఎంతసేపు పడుతుంది, రాత్రి ఆ వేళలో తన యింటి దగ్గర్నుంచి కరియప్పగారి యింటికి డ్రైవ్‌ చేయడానికి ఎంతసేపు పడుతుంది, గేటు నుండి ఆయన గుమ్మందాకా వెళ్లి కాలింగ్‌ బెల్‌ నొక్కడానికి ఎంతసేపు పడుతుంది – యివన్నీ ముందే రిహార్సల్‌ (వాళ్ల పరిభాషలో 'రెక్కీ' అంటారు) వేసుకుని చూసుకున్నారు. 

చెప్పినరోజున సరిగ్ఘా అనుకున్న సెకన్‌కి కాలింగ్‌ బెల్‌ నొక్కడం, ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న జనరల్‌ కరియప్ప తలుపు తెరవడం కూడా జరిగాయి. తలుపు తెరవగానే కరియప్పగారు పలికిన మొదటి మాట – ''వాట్‌ టిమ్మీ (తిమ్మయ్యగారి ముద్దుపేరు), వేర్‌ యీజ్‌ యువర్‌ క్యాప్‌?'' అని!

జరిగినదేమిటంటే సరిగ్గా టైముకి చేరాలని బాగా వర్కప్‌ అయిపోయి ఆ గందరగోళంలో మిలటరీవారికి అత్యంత ముఖ్యమైన టోపీ మర్చిపోయారు తిమ్మయ్యగారు. చూసీ చూడగానే కరియప్పగారి దృష్టి దానిమీదే పడింది. ఇదే జరుగుతుంది – మనం దేని గురించైనా మరీ టెన్షన్‌ ఫీలయితే…! ఎవరో పెద్దవాళ్ల దగ్గర అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాం, టైముకి వెళ్లకపోతే కొంప మునిగిపోతుంది అని మరీ కంగారు పడ్డాం అనుకోండి, చివరకు టైముకి చేరవచ్చు, కానీ చేతిలో వుండవలసిన ఫైలు యింటి దగ్గరే మరచి రావచ్చు!

ఇంతకీ మనకంటె పెద్దవాళ్లకు పంక్చువాలిటీ వుంటే సంతోషిస్తామా? లేకపోతే సంతోషిస్తామా? ఢిల్లీకి నేను వెళ్లిన కొత్తల్లో నిర్వహించిన ఆగ్రి ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌ నాటి సంఘటన సంగతి విని మీరే చెప్పండి.

రాష్ట్రంలో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ సెక్రటరీగా వున్న నన్ను 1995 లో ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌లో జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. రాష్ట్రంలో ఒక రకమైన పనివాతావరణానికి అలవాటు పడిన నేను ఢిల్లీ వాతావరణం చూసి తబ్బిబ్బు పడ్డాను. ఇదేమిట్రా బాబూ యిలా వుంది పరిస్థితి అనుకుంటూ వుండగా ''ప్రగతి మైదాన్‌లో ఆగ్రి ఎక్స్‌పో అనే ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా లక్షలమంది రైతులు దాన్ని చూడడానికి వస్తారు. అన్ని శాఖలతోను సమన్వయం చేసి చక్కగా ఏర్పాట్లు చేయండి'' అన్నారు. 

ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్‌ అంటే మాటలా? ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌ అని వుంటుంది. దాని ద్వారా ప్రగతి మైదానంలో ఓ స్థలం అద్దెకు తీసుకోవాలి, ఆ స్థలంలో స్టాల్స్‌ అవీ ఎలా ఏర్పాటు చేయాలో ఓ ఏజన్సీ ద్వారా నిర్ణయం చేయాలి, ఆ స్టాల్స్‌ వేరే వేరే శాఖలకు, సంస్థలకు కేటాయించాలి, కేటాయించగానే సరిపోదు, దాన్ని వాళ్లు ఎలా వాడుకుంటారో చూడాలి, ఎందుకంటే ఆ స్టాల్స్‌ అన్నీ వరుసగా చూసుకుంటే వెళ్లే సందర్శకుడికి వాటిలో వైవిధ్యం కనబడాలి, అందంగా కనబడాలి, స్టాల్స్‌లో ప్రమాదకరమైన వస్తువులు ఏవీ వుండకుండా చూడాలి. మొత్తం ఎగ్జిబిషన్‌కు కరెంటు, మంచినీళ్లు, భోజనాల ఏర్పాట్లు, ఇతర ప్రాంతాలనుండి వచ్చేవారికి వసతులు యివన్నీ చూడాలి. ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసిన మొదటిరోజున రాష్ట్రపతిగారితో భారీ ఎత్తున ప్రారంభోత్సవ సమావేశం. దేవుడు చల్లగా చూసి అన్నీ సవ్యంగా, క్షేమంగా జరిగితే ముగింపు ఉత్సవం !

ఇవన్నీ చేయాలంటే స్థానిక పరిస్థితులు తెలిసి ప్లానింగ్‌ చేయడంతో సరిపోదు, అది అమలు చేసే మ్యాన్‌పవర్‌ వుండాలి. చెప్పినది అర్థం చేసుకుని శ్రద్ధగా పని పూర్తి చేసే మనుష్యులుండాలి. ఈ విషయంలో మన రాష్ట్రంలో వున్న అనుభవం వేరు, అక్కడివారితో అనుభవం వేరు. ఎందుకంటే రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌ ఫీల్డ్‌లో వున్నా, హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో వున్నా కూడా,  అదివారంనాడు ఆఫీసుకువెళ్లినా స్టాఫ్‌ వచ్చి సహకరించేవారు. 'ఇవాళ సెలవు కదా, నేనెందుకు రావాలి' అని హక్కు కింద తీసుకునే మనుషులే వుండేవాళ్లు కారు. ఆదివారం రాకపోయినా 'ఏదో అర్జంటు పని పడి రాలేకపోయాను' అని క్షమాపణగా చెప్పే సంప్రదాయం యిక్కడ. 

ఢిల్లీ సెటప్పే వేరు. ఇక్కడ నా సెక్రటరీ అయిదున్నర కాగానే ఠంచన్‌గా చెప్పా పెట్టకుండా మాయమై పోయేవాడు. మనలో మన మాట – అతను ఉన్నా వెళ్లిపోయినా ఒకటే అనుకోండి. ఎందుకంటే అతను ఉన్నప్పుడు కూడా నేను చెప్పేది అతనికి అర్థమయ్యేదికాదు, అతను టైప్‌ చేసేది నాకు అర్థమయ్యేది కాదు. ఇలా యిద్దరం ఒకరితో మరొకరం వేగుతూండేవాళ్లం.

ఇలాటివాణ్ని పెట్టుకుని మా మంత్రిత్వ శాఖలోనే వున్న యితర శాఖలవాళ్లతో వ్యవహరించాలి. ఇతర మంత్రిత్వ శాఖలతోనూ సమన్వయం చేసుకోవాలి –  హెల్త్‌, ఎడ్యుకేషన్‌.. యిలా ! సరే వీళ్లంతా మనవాళ్లే, ఏదోలా పని అవుతుంది అనుకుంటే అన్నిటికంటె గండం – ఢిల్లీ సిటీ ఎడ్మినిస్ట్రేషన్‌వారితో డీల్‌ చేయడం. మునిసిపాలిటీ, హార్టికల్చర్‌ (అక్కడ మొక్కలూ అవీ పెట్టాలి కదా), వాటర్‌ సప్లయి, ఎలక్ట్రిసిటీ. వీళ్లలో ఎవర్నో రమ్మంటాం, వాళ్లు ఓ పట్టాన రారు, చెప్పిన సమయానికి రారు, వచ్చినా మన అడిగిన సమాచారం యివ్వలేక తెల్లమొహం వేస్తారు, చెప్పగా చెప్పగా చేస్తామంటారు, చెయ్యరు, ఎప్పుడో వచ్చి ఓ కాగితం పట్టుకుని వచ్చి పడేసి పోతారు. అది ఎక్కడుందో మా వాడికి కనబడదు. మళ్లీ యివ్వమంటే వాళ్లివ్వరు.

మొత్తానికి ఓ పేద్ధ పెళ్లి చేసినట్టు, ఓ క్రతువు జరిగినట్టు జరిగింది. నన్ను అక్కడకు తీసుకెళ్లిన స్నేహితుడు, సహకార శాఖ కార్యదర్శి జె.సి.పంత్‌ అంటూండేవాడు – 'తంతే బూర్లగంపలో పడ్డాడంటారు. ఢిల్లీ వస్తూనే నువ్వు నిప్పుల కుంపట్లో పడ్డావు. యూ హ్యేడ్‌ బాప్టిజమ్‌ బై ఫయర్‌'  అని. ''వైష్ణవుల్లో చక్రాంకితులు కావాలంటే కాల్చిన ముద్రలు వేయించుకోవాలి. అలాగే ఢిల్లీలో కూడా సమర్థుడనిపించుకోవాలంటే పుఠం వేయించుకోవాలి. అప్పుడుగాని బంగారం మేలిమి బయటపడదు, సీతామ్మవారికి కూడా అగ్నిపరీక్ష జరిగిన తర్వాతనే కదా అంత పేరు వచ్చింది' అనేవాణ్ని.

ఇదంతా ఎందుకు చెప్పానంటే యింత అవస్థపడినా ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రాక గురించి పెద్ద గందరగోళం ఏర్పడింది. మేము రాష్ట్రపతిగారి కార్యాలయానికి కార్యక్రమం గురించి తెలియపరచడం, ఆయన సరేననడం అన్నీ యథావిధిగా జరిగిపోయాయి. ఆయన కార్యాలయం నుండి పోలీసువాళ్లకు కబురు వెళ్లినట్టుంది. వాళ్లు ముందురోజు ప్రగతి మైదాన్‌కి వచ్చి తణిఖీలు చేశారు. భద్రతా ఏర్పాట్లు ఎలా వున్నాయి, ఆయన కారులో ఎటునుంచి వస్తారు, ఎక్కడ దింపుతారు, ఎవరు రిసీవ్‌ చేసుకుని పూలగుచ్ఛం యిస్తారు, లేదా దండ యిస్తారా? కరచాలనం చేసేవారెవరు? ఏయే స్టాల్స్‌కి ఎక్కడెక్కడికి తీసుకెళతారు? చివరిలో ఎక్కణ్నుంచి పంపుతారు? ఇవన్నీ లక్ష యక్షప్రశ్నలు అడిగారు. అన్నీ చూపించాను, చెప్పాను. వాళ్లు సరేనన్నారు. ఇంత జరిగాక మర్నాడు రాష్ట్రపతి రారని ఎవరైనా అనుకుంటారా? 

ఎగ్జిబిషన్‌ ప్రారంభమయ్యేది మంగళవారం నాడు. ప్రగతి మైదాన్‌కు దగ్గరలో ఎపి హౌస్‌ వుంది. అక్కడ ఆంజనేయస్వామి గుడి వుంది. మంగళవారంనాడు ఆంజనేయుడి గుడికి వెళ్లే ఆనవాయితీ ప్రకారం వెళ్లి దర్శనం చేసుకున్నాను. ఆ పక్కనే ప్రగతి మైదాన్‌లో వేరే ఫంక్షన్‌ ప్రారంభోత్సవం వుంది. అది అయిన తర్వాతనే రాష్ట్రపతి శంకర దయాళ్‌ శర్మ గారు వచ్చి ఎగ్జిబిషన్‌ ప్రారంభించాలి. గుడి నుండి బయటకు వచ్చి ఆ కార్యక్రమానికి ఊరికే, సరదాగా వెళ్లాను. అక్కడ రాష్ట్రపతి కార్యాలయంలో స్టాఫ్‌ ఒకతను కనబడ్డాడు. ఇంకాస్సేపట్లో రాష్ట్రపతిగారు వస్తున్నారుగా అన్నాను పలకరింపుగా. 

''రాష్ట్రపతిగారా? ఇవాళా? ఇక్కడేం కార్యక్రమం లేదే!'' అన్నాడు అతను ఆశ్చర్యంగా.

నాకు గుండెల్లో రాయి పడింది. మామూలు రాయి కాదు పెద్ద బండరాయి. ఓ పది నిమిషాల్లో మా వ్యవసాయ శాఖామంత్రి, మా సెక్రటరీ అందరూ వచ్చేస్తున్నారు. వాళ్లందరూ వచ్చాక ప్రెసిడెంటుగారు రాకపోతే ఎంత అభాసుగా, ఎంత అసహ్యంగా వుంటుంది ! ఎక్కడ జరిగింది పొరబాటు? ఏదో ఒకటి చేసి పొరబాటు సరిదిద్దుకుని రాష్ట్రపతిగారిని సమయానికి వచ్చేట్లా చేయకపోతే మన పరువు పోతుంది అనుకుని వెంటనే రాష్ట్రపతిభవన్‌కి ఫోన్‌ చేసి మిలటరీ సెక్రటరీ టు ది ప్రెసిడెంటుకు ఫోన్‌ చేశాను.

''అదేమిటండీ, మేము మీకు యివాళ్టి కార్యక్రమం గురించి చెప్పడం, మీరు ఢిల్లీ పోలీసు స్టేషన్‌వాళ్లకు చెప్పడం, వాళ్లు వచ్చి అన్ని రకాల శల్యపరీక్షలు చేసి ఓకే అనడం – యివన్నీ జరిగాక యివాళ ప్రెసిడెంటు ప్రోగ్రాం లేదంటారేమిటి?'' అని అడిగాను ఆందోళన పడుతూనే.

ఆయనతో మాట్లాడగా తెలిసినదేమిటంటే – ఢిల్లీ పోలీసుకి, రాష్ట్రపతి భవన్‌కి మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చింది. ఓ కాగితం ఏదో అక్కడో యిక్కడో పడి వుంది. మీరు వచ్చి తీసుకెళ్లాల్సిందని వీళ్లు, మీరే పంపివుండాల్సిందని వాళ్లు.. చెప్పానుగా ఢిల్లీలో పని జరిగే పద్ధతి యిలాగే వుంటుంది – ఆయన ''మొత్తానికి యివన్నీ సార్ట్‌ అవుట్‌ చేసి మీ ఎగ్జిబిషన్‌కు రాష్ట్రపతిగారిని ఏడెనిమిది నిమిషాల్లో తీసుకువస్తాను'' అని మాట యిచ్చారు.

అమ్మయ్య అనుకుని రాష్ట్రపతిగారిని అన్న టైముకి రప్పించి, చెప్పిన సమయానికి ఎగ్జిబిషన్‌ ప్రారంభం అయ్యేట్లు చేస్తున్నాం అనుకుని నుదుటి చెమట తుడుచుకుని, టై సర్దుకుని ప్రవేశద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ మరో ప్రమాదం పొంచి వుంది. ఇక అప్పణ్నుంచి రాష్ట్రపతిగారు అన్న టైముకి వచ్చేస్తారేమోనన్న బెంగ!

కొన్ని వేల సంవత్సరాల నుంచి మ్యూజియంలో దాచిన ఒక చిన్న బియ్యపుగింజను పట్టుకొచ్చాం – ఎగ్జిబిషన్‌లో పెట్టడానికి. ప్రవేశద్వారం పక్కనే ఓ స్టాల్‌లో తిరిగే చిన్న ప్లాట్‌ఫారం మీద గ్లాసు డోమ్‌ కింద దాన్ని ప్రదర్శనకు పెట్టాం. ఆ వృత్తాకారపు బల్ల గుండ్రంగా తిరగడానికి కింద చిన్న మోటారు పెట్టాం. దానిమీద బియ్యపుగింజ ఓ చిన్న వెల్వెట్‌ గుడ్డపై పెట్టి దానిమీద గాజు గిన్నె బోర్లించినట్టు పెట్టాం. స్విచ్‌ వేయగానే ఆ బియ్యపుగింజ తిరుగుతూ కనువిందు చేస్తుందన్నమాట. 

ఇంకాస్సేపట్లో ఎగ్జిబిషన్‌ ప్రారంభం కాబోతోంది కదాని మా వాళ్లు స్విచ్‌ వేశారు. ఎగ్జిబిషన్‌లో అన్నీ తాత్కాలిక ఏర్పాట్లే కదా. ఎక్కడో షార్ట్‌ సర్క్యూట్‌ అయినట్టుంది. టప్‌ అని చప్పుడు వచ్చి, కాస్త పొగా, మంటలూ వచ్చి ఆ అది తిరగడం మానేసింది. సరిచేయడం మొదలు పెట్టారు కానీ ఎంత సేపు పడుతుందో అని భయం. సరిగ్గా 30 సెకన్లు కూడా లేదు రాష్ట్రపతిగారు రావడానికి! రాష్ట్రపతి కార్యక్రమం సరిగ్గా ఎనిమిది గంటలంటే ఎనిమిది గంటలకే వస్తారు. ఒక్క సెకను కూడా అటూ యిటూ అవదు. సెకను ముల్లు పన్నెండు దగ్గరకు చేరేసరికి ఆయన వచ్చేస్తారు. 'ప్రథమ కబళే మక్షికాపాతః' (మొదటి ముద్దలోనే ఈగ పడ్డట్టు) అన్నట్టు మొదటి స్టాల్‌లోనే పనిచేయని యంత్రాలతో ఆయనను స్వాగతిస్తే ఏం బాగుంటుంది? వీళ్ల నిర్వాకం యిలా అఘోరించింది అనుకోరూ!

అప్పుడనిపించింది – ఇంతసేపు ఆయన రావట్లేదని బాధపడ్డాను. ఇప్పుడు ఆయన ఓ రెండు నిముషాలు అలస్యంగా వస్తే ఎంత బాగుంటుందని అనుకుంటున్నా. అది సాధ్యమా? అనుకున్నా. సాధ్యం చేశాడు ఆంజనేయుడు. తను నిర్వహించిన లంకాదహనాన్ని కాస్సేపు గుర్తు చేసినా, ఆ షార్ట్‌ సర్క్యూట్‌ మంటలార్పేసి, తిరిగే ప్లాట్‌ఫాం ఆశలు వదిలేసుకుని, వచ్చిన విఐపిలు చూడడానికి ఏ లోపం కనబడని విధంగా సరిచేయడానికి టైమిచ్చాడు. అంతేకాదు, అవేళ ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతిగారిని రెండున్నర నిమిషాలు లేటుగా పంపించాడు. ఆయన వచ్చేసరికి అంతా సర్దుకున్నాం. బాగా చేశారన్న ప్రశంసలు అందుకున్నాం.

ఈ కథలో నీతి ఏమిటంటే – పంక్చువాలిటీ ఎల్లవేళలా అభిలషణీయం కాదు, దాని క్కూడా వేళాపాళా వుండాలి ! 

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version