పవన్ …కాస్త క్లారిటీ ప్లీజ్ ?

ఆలు లేదు..చూలు లేదు..అల్లుడిపేరు సోమలింగం అంటే ఇదేనేమో? మీడియా వండి వారుస్తున్న కథనాలు చూసి, ఇబ్బంది పడి..పడి.. ఆఖరికి ఓ ప్రకటన పడేసాడు పవర్ స్టార్. చిరంజీవితో నో ప్రాబ్లెమ్స్ అని ఒకలైను..మిగతావి, త్వరలో…

ఆలు లేదు..చూలు లేదు..అల్లుడిపేరు సోమలింగం అంటే ఇదేనేమో? మీడియా వండి వారుస్తున్న కథనాలు చూసి, ఇబ్బంది పడి..పడి.. ఆఖరికి ఓ ప్రకటన పడేసాడు పవర్ స్టార్. చిరంజీవితో నో ప్రాబ్లెమ్స్ అని ఒకలైను..మిగతావి, త్వరలో చెబుతాను. అని. అది చాలు..వార్తలు వండి వార్చే నలభీములకు. దాన్ని బట్టుకుని, ఇదిగో పేరు..అదిగో పార్టీ, అల్లదిగో ప్రెస్ మీట్ అంటూ నానా హడావుడి జరిగిపోతోంది. మరోపక్క ఎన్నికలు వచ్చేస్తున్నాయి. పార్టీల్లో ఖాళీలు భర్తీ అయిపోతున్నాయి. గోడ దూకాలనుకున్నవారిలో ఈ పవన్ పార్టీ వ్యవహారం కలవరం రేపుతోంది. గోడదూకాలా వద్దా? అని తెగ మథన పడుతున్నారు. అందునా చంద్రబాబు తన వ్యూహం మార్చి, తన స్వంత సామాజిక వర్గ నేతల మనోభావాలను కూడా పక్కన పెట్టి, పాపం విజయం కోసం తప్పదు అని భావించి ఎక్కడెక్కడి కాపు కుల నేతలకు గాలం వేస్తూ కిందా మీదా పడుతున్నారు. ఇలా ఆ గేలానికి చిక్కిన నేతలంతా ఇప్పుడు పవన్ పార్టీ వస్తుందనేసరికి మళ్లీ తూచ్ అని అనకపోయినా, లోలోపల కాస్త ఆచి తూచి అడుగేయాలనుకుంటున్నారు. ఇదేదో తేలిపోతే, తమ గెంతులు తాము గెంతేయచ్చని వారి బాధ. 

అసలు ఇంతకీ పవన్ పార్టీ పెడతాడా? ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు పలుకుతాడా? రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తాడా? లేదూ, ఇవేవీ కాదు. నా బతుకు నన్ను బతకనీయండి. నిజ జీవితంలో నన్ను డైరక్ట్ చేయాలని ప్రయత్నించకండి అని మీడియాను కోరతాడా అన్నది అనుమానం. 

పైగా పవన్ మీడియా ముందుకు వచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు మీడియా ముందుకు రావాలే కానీ, అబ్బో..ఎన్ని ప్రశ్నలో..జర్నిలిస్టుల తూణీరాలన్నీ ప్రశ్నల బాణాలతో కిటకిటలాడుతున్నాయి. సినిమాలు, రేణూ దేశాయ్ వ్యవహారం, మూడో పెళ్లి, రాజకీయాలు, ఓర్నాయనోయ్..ఒకటేమిటి, చాలా వున్నాయి. పైగా పవన్ పార్టీ పెడతాడన్న వార్తలు వెలువడ్డ దగ్గర నుంచి నెట్ లో చిరు అభిమానులు కామెంట్ ల రూపంలో దాడులు ప్రారంభించేసారు. పవన్ గొప్పేమిటి..చిరు కన్నా మంచి నటుడా..బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్,,అంటూ రకరకాల కామెంట్ లు నెట్ లో దర్శనమిస్తున్నాయి. 

మరోపక్క పవన్ పార్టీ పెడితే బాగుండు..చంద్రబాబు అధికార ఆశలకు బ్రేక్ పడుతుంది అనుకునే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. వీరంతా పవన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ప్రకటన చేస్తాడా అని చూస్తున్నారు. మరొపక్క అమ్ ఆద్మీ పార్టీకి పవన్ మద్దతు ఇస్తాడని వార్తలు వెలువడేసరికి, ఇప్పడిప్పుడే మొగ్గతొడుగుతున్న ఆ పార్టీ నాయకులు సంబర పడుతున్నారు. ఇది తమకు కలిసి వస్తుందని వారి ఆశలు వారివి. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తాడని ఇంకో వార్త. దీంతో ఆ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న జెపి, రేవంత్ రెడ్డి లాంటి వారికి దిగులు. ఇప్పటికే అక్కడ సిటింగ్ అయిన సర్వే సత్యనారాయణకు గుబులు. 

అసలే సీమాంధ్రలో వున్న సీట్లు అరకోర. అందులో నాలుగైదు పార్టీల కోట్లాట,. సందట్లో సడేమియా అని ఇదొటి, ఇంక హంగ్ తప్పదు అని జనం నిట్టూర్పు. 

ఇలా ఎన్ని వ్యవహారాలు..ఎన్నివదంతులు..ఎన్ని ఊహాగానాలు..

ఎందుకొచ్చింది కానీ..పవన్..కాస్త క్లారిటీ ప్లీజ్..

కొందరైనా నిట్టూరుస్తారు..కొందరైనా హ్యాపీ అవుతారు. మరికొందరైనా జెండా పట్టుకునేందుకు రెడీ అవుతారు. ఇంకొందరైనా మన పవన్  మన సినిమాలు అనుకుంటారు. ఇంకెవరైనా,, ఏదైనా అనుకుంటారు.

సో..పవన్ కాస్త క్లారిటీ ప్లీజ్

చాణక్య

[email protected]